హంద్రీ–నీవాపై చర్చకు సిద్ధమా బాబూ? | - | Sakshi
Sakshi News home page

హంద్రీ–నీవాపై చర్చకు సిద్ధమా బాబూ?

May 11 2025 7:30 AM | Updated on May 11 2025 7:30 AM

హంద్రీ–నీవాపై చర్చకు సిద్ధమా బాబూ?

హంద్రీ–నీవాపై చర్చకు సిద్ధమా బాబూ?

అనంతపురం కార్పొరేషన్‌: ‘కృష్ణా జలాలు రాయలసీమ వాసుల కల. ఇందుకోసం మహానేత వైఎస్సార్‌తో పాటు వివిధ రాజకీయాల పార్టీల నాయకులు, మేధావులు ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ పెద్దఎత్తున పోరాటాలు చేశారు. దాని ఫలితమే హంద్రీ–నీవా. ఈ సత్యాన్ని ప్రపంచానికి తెలియనీయకుండా ఇప్పటికీ చంద్రబాబు మరో సారి తన నైజాన్ని బయటపెడుతూ చరిత్రను వక్రీకరిస్తున్నారు. హంద్రీ–నీవాపై చర్చకు సిద్ధమా చంద్రబాబూ’ అంటూ వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సవాల్‌ విసిరారు. శనివారం ఆయన అనంతపురంలోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌ హయాంలో ఏడేళ్లు, చంద్రబాబు హయాంలో 9 ఏళ్లకుపైగా...మొత్తం 16 ఏళ్లపాటు హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు గంపెడు మట్టిని కూడా వేయకుండా జిల్లాకు తీరని ద్రోహం చేశారన్నారు. దివంగత నేత వైఎస్సార్‌ హయాంలోనే హంద్రీ–నీవా పరుగులు పెట్టిందన్నారు. హంద్రీ–నీవా కాలువను సందర్శించి ఛాయాపురం వద్ద చంద్రబాబు మాట్లాడిన తీరు చూస్తే ఎటువంటి మార్పూ ఆయనలో కన్పించలేదని స్పష్టమైందని, ఆయన జీవితమంతా అబద్ధాలకే పరిమితమైందని విమర్శించారు. సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్‌, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు వారు చేయని పనులను కూడా చేసినట్లు ప్రచారం చేసుకున్నారు తప్ప ఇంకేమీ లేదన్నారు. మిర్చి, కంది, శనగ, పత్తి పంటలకు గిట్టుబాటు ధర లేదని, రైతాంగం పరిస్థితి గురించి చంద్రబాబు సభలో ఒక్క ప్రజాప్రతినిధి కూడా మాట్లాడలేదని, మంత్రి కేశవ్‌ చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తేందుకే సమయం కేటాయించారని విమర్శించారు.

ఒక్క అడుగూ ముందుకు వేయలేదు

1983లో అప్పటి సీఎం ఎన్‌టీఆర్‌ ఓడీసీ వద్ద, 1996 మార్చి 11న అప్పటి సీఎం చంద్రబాబు ఉరవకొండ పోలీసు స్టేషన్‌ ముందు హంద్రీ–నీవాకు శంకుస్థాపన మాత్రమే చేశారని, ఆ కార్యక్రమంలో అప్పుడు మంత్రిగా ఉన్న పరిటాల రవి, శాసనసభ్యులుగా రామకృష్ణ, పయ్యావుల కేశవ్‌ ఉన్నారని, 1999 ఎన్నికలు వచ్చే వరకు ఒక గంప మన్ను కూడా తీయలేదని గుర్తు చేశారు. చివరకు శంకుస్థాపనకు రూ.2.5 లక్షలు ఖర్చు చేసిన కాంట్రాక్టర్‌కు డబ్బు ఇవ్వకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారని తెలిపారు. 1983, 1996 నాటి జీఓలను రద్దు చేసి తిరిగి 1999 జులై తొమ్మిదో తేదీ 40 టీఎంసీలుగా ఉన్న హంద్రీ–నీవా సాగునీటి ప్రాజెక్టును ఐదు టీఎంసీల తాగునీటి ప్రాజెక్టుగా మార్చి జీఓను ఇచ్చి ఆత్మకూరు వద్ద మరోసారి శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 2005లో సీఎంగా వైఎస్సార్‌ ఉన్న సమయంలో ఉరవకొండ పోలీసు స్టేషన్‌ వద్ద హంద్రీ–నీవా పనులకు శంకుస్థాపన జరిగిందని, ఆయన చలువతోనే ప్రాజెక్ట్‌ వేగవంతంగా సాగిందన్నారు. 2012 నవంబర్‌ 18న అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి నీటి విడుదల ప్రారంభిస్తే.. అదే నెల 29న ఎంపీగా ఉన్న తాను, అప్పటి మంత్రి రఘువీరా రెడ్డి జీడిపల్లి రిజర్వాయర్‌కు నీరు తీసుకువచ్చామన్నారు. రైతాంగ శ్రేయస్సు కోసం, తాగునీటి అవసరాలకు, భవిష్యత్తులో పరిశ్రమలకు హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని, 3,850 క్యూసెక్కులకే పరిమితం చేయకూడదన్నారు. తక్షణం లైనింగ్‌ పనులు ఆపి, 10 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి కాలువను విస్తరించేలా చంద్రబాబును ఒప్పించాలన్నారు. 2019లో అనంతపురంలో కంటి వెలుగు ప్రారంభోత్సవానికి వచ్చిన అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని పెంచాలని విన్నవించామన్నారు. దీంతో 6,300 క్యూసెక్కుల సామర్థ్యంతో విస్తరణకు అనుమతిస్తూ 2021 జులైలో జీఓ ఇచ్చారని, తమ ప్రభుత్వ హయాంలోనే రూ.4,647 కోట్లతో టెండర్లు పిలిచారని గుర్తు చేశారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, నాయకులు ఖాజా, గోగుల పుల్లయ్య, చామలూరు రాజగోపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ పదహారేళ్ల పాలనలో గంపెడు మట్టి కూడా వేయలేదు

శంకుస్థాపనలకే పరిమితం చేసిన ఘనుడు చంద్రబాబు

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

అనంత వెంకటరామిరెడ్డి ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement