
‘అనంత’ అభివృద్ధే లక్ష్యం కావాలి
అనంతపురం సిటీ: విధి నిర్వహణలో అంకితభావం, చిత్తశుద్ధితో పని చేస్తూ.. జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని నూతనంగా పోస్టింగ్ అందుకున్న ఎంపీడీఓలకు జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ సూచించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో పని చేస్తున్న పది మంది పరిపాలనాధికారులు, డిప్యూటీ ఎంపీడీఓ (ఈఓఆర్‌డీ)లతో పాటు నంద్యాల నుంచి ముగ్గురు, కర్నూలు నుంచి ఇద్దరు అధికారులకు రెగ్యులర్ ఎంపీడీఓలుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పదోన్నతిపై వచ్చిన 15 మందిలో 10 మందిని శ్రీసత్యసాయి జిల్లా, ఐదుగురిని అనంతపురం జిల్లాకు కేటాయిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి మండలాలు కేటాయిస్తూ బుధవారం తన చాంబర్‌లో డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్యతో కలసి జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ ఉత్తర్వులు అందజేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 21 ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉండగా, 15 మంది వచ్చారని, త్వరలో మిగిలిన పోస్టులు కూడా భర్తీ అవుతాయని డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య తెలిపారు. కార్యక్రమంలో ప్లానింగ్, ఎస్టాబ్లిష్‌మెంట్ ఏఓలు రత్నాబాయి, నియాజ్ అహమ్మద్, జూనియర్ అసిస్టెంట్ లీలావతి పాల్గొన్నారు.
జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 మంది
ఎంపీడీఓలకు మండలాల కేటాయింపు

‘అనంత’ అభివృద్ధే లక్ష్యం కావాలి