
రూ.లక్ష నగదు అపహరణ
గుత్తి రూరల్: బైక్ సైడ్ బ్యాగ్‌లో ఉంచిన రూ.లక్ష నగదును ఓ దుండగుడు అపహరించారు. ఈ దృశ్యం సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమైంది. వివరాలు... గుత్తి మండలం మాముడూరు గ్రామానికి చెందిన రైతు మల్లికార్జున పంటల సాగు కోసమని గుత్తిలోని కెనరా బ్యాంకులో బంగారు నగలు తాకట్టు పెట్టి రూ. లక్ష రుణం తీసుకున్నాడు. ఈ నగదును బ్యాంక్ వద్ద నిలిపిన తన బైక్ సైడ్ బ్యాగ్‌లో ఉంచి ఎదురుగా ఉన్న దుకాణంలో సిగరెట్ కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ మాటు వేసిన దుండగుడు బైక్ బ్యాగులోని నగదు ఉంచిన సంచిని తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయాడు. సిగరెట్ కాల్చి తిరిగి వచ్చిన మల్లికార్జున బ్యాగ్‌లో నగదు కనిపించకపోవడంతో వెంటనే సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బ్యాంకు పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తే బ్యాగులోని నగదును తీసుకెళుతున్న వ్యక్తి ఆ వెనుకనే వచ్చిన మరో బైక్‌పై ఎక్కి వెళ్లిపోయే దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. బాధిత రైతు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.