
మూడు ముక్కలాట
● జీవీఎంసీలో తారస్థాయికి కూటమి రాజకీయం ● టీడీపీ, జనసేన అధిష్టానం దృష్టికి పంచాయితీ ● తమకే ఇవ్వాలంటూపట్టుబడుతున్న జనసేన ● ససేమిరా అంటున్న టీడీపీ ● ఇరు పార్టీల మధ్య అగ్గిరాజేస్తున్న డిప్యూటీ మేయర్ పోస్ట్
డాబాగార్డెన్స్: జీవీఎంసీలో కూటమి రాజకీయం తారాస్థాయికి చేరింది. అవిశ్వాసం ద్వారా గత మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌లను పదవుల నుంచి తొలగించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఆ తర్వాత మేయర్‌ను తొలగించి, తెలుగుదేశం పార్టీకి చెందిన పీలా శ్రీనివాస్‌ను కూటమి సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాజాగా డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయానికి వస్తే, కూటమిలో విభేదాలు మొదలయ్యా యి. మేయర్ పదవిని తీసుకున్నందున, డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. ఈ వివాదం తెలుగుదేశం పార్టీ అధిష్టానం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ల దృష్టికి చేరింది.
తమకంటే తమకు కావాలంటూ..
మేయర్ పదవిని తెలుగుదేశం పార్టీ తీసుకున్నందున, పొత్తులో భాగంగా డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ కార్పొరేటర్లు, పెద్దలు పట్టుబడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి డిప్యూటీ మేయర్ పదవి ఇస్తే తాను రాజీనామా చేస్తానని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పార్టీ అధినేతకు బహిరంగంగా లేఖ పంపారు. దీంతో కూటమి రాజకీయం వేడెక్కింది. పొత్తు ధర్మంలో భాగంగా డిప్యూటీ మేయర్ పదవి తమకు కావాలని జనసేన పార్టీ ఎప్పటి నుంచో ఆశిస్తోంది. ఇదిలా ఉండగా, జనసేన పార్టీ నుంచి డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇటీవలే వైఎస్సార్‌సీపీ నుంచి జనసేనలో చేరిన పెద్దిరెడ్డి ఉష, వంశీరెడ్డి, మాసిపోగు మేరీజోన్స్, ఇండిపెండెంట్‌గా గెలిచి ఆ పార్టీలో చేరిన మహ్మద్ సాదిక్, కందుల నాగరాజుతో పాటు ఆ పార్టీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి కూడా పోటీలో ఉన్నారు.
తాడోపేడో..
డిప్యూటీ మేయర్ ఒక్క పోస్టు కోసం రెండు పార్టీలు పట్టువిడవకుండా ఉన్నాయి. ఈ విషయంలో తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నాయి. డిప్యూటీ మేయర్ తమకే ఇవ్వాలని జనసేన గట్టిగా పట్టుబడుతుండగా, తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ పోస్టును వదులుకోవడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఈ పోస్టు కోసం ఈ నెల 19న ఎన్నిక జరగనుంది. మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకోవడంతో, డిప్యూటీ మేయర్ తమకు కేటాయించాలని జనసేన కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. లేనిచో రాజీనామా చేస్తామని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ శుక్రవారం పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లేఖ పంపడంపై కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి.
అంత సీన్ లేదు..
తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్‌కే డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలంటూ సాక్షాత్తు నూతనంగా ఎన్నికై న మేయరే అధిష్టానానికి లేఖ పంపినట్టు భోగట్టా. వీరిద్దరి మధ్య నేను అర్హురాలినేనంటూ బీజేపీ కార్పొరేటర్ కూడా రేస్‌లో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కూటమిలో అంతర్గత తగాదాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఈ కుమ్ములాటలే నిదర్శనం.
నువ్వా..నేనా?
డిప్యూటీ మేయర పదవిపై పార్టీల అధినాయకులు తేల్చకపోవడంతో ఇరు పార్టీల్లోనూ ఆశావాహుల సంఖ్య పెరిగింది. టీడీపీలో 10 మంది వరకు ఈ పదవి కోసం పోటీ పడతుండగా, జనసేనలో ఉన్న వారంతా (ఒక్క మూర్తి యాదవ్ తప్పా..ఎందుకంటే మూర్తి యాదవే తనను మినహాయించి ఎవరికై నా ఇవ్వాలని పవన్ కల్యాణ్‌కు పంపిన లేఖలో పేర్కొన్నారు) రేసులో ఉన్నట్టు తెలిసింది. ఎవరి స్థాయిలో వారు సీనియర్ల ద్వారా అధినాయకుడి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఇరు పార్టీల నుంచి ఇద్దరు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. టీడీపీ నుంచి 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావుకు డిప్యూటీ మేయర్ కట్టబెట్టాలని ఆ పార్టీలో పలువురు కార్పొరేటర్లు భావిస్తూ..ఆ పేరు ప్రతిపాదించినట్టు సమాచారం. ఇక జనసేన విషయానికొస్తే..ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్‌బాబు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మేయర్‌గా టీడీపీ నేత ఉండడంతో డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ఈ పదవిని జనసేన వదులుకునే ప్రసక్తే లేదంటూ తెగేసి చెబుతున్నారు. జనసేన నుంచి ఎందరో ఆశావాహులున్నా..ఎమ్మెల్యేలు మాత్రం ఉషశ్రీ పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా కూటమిలో డిప్యూటీ మేయర్ పదవి పెద్ద రాద్ధాంతం చేస్తోంది.