
పెళ్లి బృందం కారు బోల్తా
● నవ దంపతులతో సహా ఆరుగురికి గాయాలు
నక్కపల్లి: మండల కేంద్రం నక్కపల్లికి సమీపంలో 16 వ నంబర్ జాతీయ రహదారి పై సారిపల్లి పాలెం వద్ద నూతన దంపతులు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ఘటనలో నూతన దంపతులతో సహా ఆరుగురికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కశింకోట మండలం నూతగుంటపాలెం గ్రామానికి చెందిన యామిని, వినయ్‌లకు గురువారం వివాహం జరిగింది. శుక్రవారం అన్నవరంలో సత్యదేవుని వ్రతం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా సారిపల్లి పాలెం సమీపంలో బస్సును తప్పించబోయి వీరు ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీ కొంది. ఈ ఘటనలో నూతన దంపతులు యామిని, వినయ్‌లతోపాటు వైష్టవి, ఆశ, వీరబాబు, రోషిణిలకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స అందించారు. ప్రమాదం పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.