
మాతా, శిశు మరణాల నివారణకు చర్యలు
తుమ్మపాల: జిల్లాలో మాతా, శిశు మరణాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సర్వే, మాతా, శిశు మరణాలు, వ్యాధి నిరోధక టీకాలు, మలేరియా, డెంగ్యూ వంటి అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన దంపతులు, గర్భిణులు, శిశువుల రిజిస్ట్రేషన్ సక్రమంగా జరగాలన్నారు. హైరిస్క్ కేసులు, బరువు తక్కువ గల పిండాల కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. హైరిస్క్ కేసులను ముందుగానే గుర్తించి ఆస్పత్రులకు తరలించాలన్నారు. తదుపరి సమీక్షలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో హాజరుకావాలని అధికారులకు ఆమె సూచించారు. అబార్షన్లు అధికంగా చేస్తున్న ఆస్పత్రులపై నిఘా పెట్టాలని, అబార్షన్లకు గల కారణాలపై నివేదిక అందించాలన్నారు. శిశువులకు వ్యాక్సినేషన్ సకాలంలో పూర్తి చేసి, వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. గత సంవత్సరం 19,781 జననాలకు 133 మంది శిశువులు, 1 నుంచి 5 సంవత్సరాల పిల్లలు 16 మంది మరణించారని, 15 మాతృ మరణాలు సంభవించాయని కలెక్టర్ వివరించారు. ఇక నుంచి మరణం సంభవించిన ప్రతి కేసు నివేదికను వెంటనే అందజేయాలన్నారు. గ్రామాల్లో ఆశా, ఏఎన్‌ఎం కార్యకర్తలు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కువగా సిజేరియన్ నిర్వహిస్తున్న ఆస్పత్రుల వివరాలు సేకరించాలని సూచించారు. మలేరియా, డెంగ్యూ నివారణకు ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులను ఆస్పత్రులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, 104 వాహనాల ద్వారా ప్రజలకు సక్రమంగా సేవలు అందేలా వైద్యాధికారులు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ఎం.శాంతిప్రభ, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ వి.రమణ, డీఐవో డాక్టర్ చంద్రశేఖర్ దేవ్, డీపీఎంవో డాక్టర్ ప్రశాంతి, మెడికల్ అధికారులు పాల్గొన్నారు.
అబార్షన్ చేస్తున్న ఆస్పత్రులపై ప్రత్యేక నిఘా
సమీక్ష సమావేశంలో కలెక్టర్ విజయ కృష్ణన్