
ఉపాధి నిధులతో సమృద్ధిగా పనులు
నాతవరం : ఉపాధి హామీ పథకంలో ఉపాధితో పాటు అనేక అభివృద్ధి పనులు చేసుకోవచ్చునని మండల ప్రత్యేకాధికారి నాగశిరీష అన్నారు. మండలంలో శనివారం స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా మర్రిపాలెం పంచాయతీ శివారు పొట్టిపాలెం గిరిజన గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టిన కంపోస్టు గుంతలను ప్రారంభించారు. పచ్చదనం పర్యవరణంలో భాగంగా మొక్కలు నాటారు. ఉపాధి హామీ పథకంలో ఈ గ్రామంలో రైతులు కూలీలు చేస్తున్న కంపోస్టు గుంతలను స్వయంగా పరిశీలించి కూలీలతో మాట్లాడారు. పొట్టిపాలెం గ్రామంలో రైతులకు కూలీలకు ఉపయోగపడే పనులకు గ్రామసభలో తీర్మానం చేసి అమలు చేసే బాధ్యత తీసుకోవాలని ఏపీవోకు సూచించారు. టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరమణ, ఏపీవో దాసరి కొండాజీ, తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కె.సత్యనారాయణ, డి.యర్రవరం సర్పంచ్ సత్యవతి, వెర్రిగెడ్డ రిజర్వాయరు కమిటి చైర్మన్ స్వామినాయుడు, మర్రిపాలెం పెద్ద చెరువు నీటి సంఘం చైర్మన్ సత్యనారాయణ పాల్గొన్నారు.