● డెయిరీ, పౌల్ట్రీ ఉపాధి రంగాలకు ఊతం ● మాంస, కూరగాయల క్లస్టరుగా జిల్లా ● రుణ ప్రణాళిక విడుదల చేసిన కలెక్టర్
తుమ్మపాల: జిల్లాను మాంస, కూరగాయల క్లస్టరుగా ప్రకటించినందున బ్యాంకులు వ్యవసాయ, డెయిరీ, పౌల్ట్రీ ఉపాధి రంగాలకు లక్ష్యాలకు మించి రుణాలు అందించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (డీఎల్‌ఆర్‌సీ) త్రైమాసిక సమావేశం జరిగింది. 2025–26 పొటెన్షియల్ లింక్డ్ కార్యాచరణ ప్రణాళిక పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే సంవత్సరానికి 17 శాతం వృద్ధి రావాలని, అందుకు అనుగుణంగా యూనిట్లు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. గిరిజన ప్రాంతాలలో పశువులు, గొర్రెలు, నాటుకోళ్ల పెంపకం, మైదాన ప్రాంతంలో కూరగాయలు పెంపకం జరిగే విధంగా ప్రణాళిక వేసి, యూనిట్లు స్థాపించాలన్నారు. మాంస ఉత్పత్తుల యూనిట్లు, కూరగాయలు ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ కేంద్రాలకు విరివిగా రుణాలు అందించాలన్నారు. పంటకోత అనంతరం నష్టాలు తగ్గించాలని తెలిపారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి విద్యారుణాలు అందించాలని, రుణ మేళాలు, కళాశాలలలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలన్నారు. తోటలు, కూరగాయలు, పశు సంవర్ధక, డెయిరీ, మత్స్య పరిశ్రమలలో కాలానుగుణంగా ఉత్పత్తి సాధించే రంగాలకు ఆర్ధిక చేయూతనివ్వాలన్నారు. ఆయా శాఖల అధికారులు, బ్యాంకు అధికారులు సమన్వయంతో వ్యవసాయ, అనుబంధ రంగ రైతులను ప్రోత్సహించాలన్నారు. కౌలు రైతులకు కూడా వ్యవసాయ రుణాలు అందించాలని, ఈ క్రాప్ ఆధారంగా వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలు అందించాలని తెలిపారు.
జిల్లాలో ఉత్పత్తి అవుతున్న వస్తువులకు బ్రాండింగ్, మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణ గత సమావేశంలో చర్చించిన విషయాలపై తీసుకున్న చర్యలను, రుణ ప్రణాళిక అమలు నివేదికను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ హెడ్ పి.నరేష్, ఆర్‌బీఐ ఎంజీఆర్‌ఎల్‌డీ ఒ.రాజేష్ కుమార్ కుంద్, నాబార్డ్ డీడీఎం సమంత్ కుమార్, డైరెక్టర్ ఎస్‌బీఐ బి.విజయకుమార్, డీఆర్డీఏ పీడీ కె.శచీదేవి, జిల్లా వ్యవసాయ అధికారి బి.మోహనరావు, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డా.బి.రామమోహనరావు, ఉద్యానవన శాఖ అధికారి జి.ప్రభాకర్‌రావు, ఇతర బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ పి–4 సర్వేకు సంబంధించి జిల్లా అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. జిల్లాలో సర్వే 99.86 శాతం పూర్తయిందని తెలిపారు.