సింహగిరి.. భక్త ఝరి | Sakshi
Sakshi News home page

సింహగిరి.. భక్త ఝరి

Published Thu, May 9 2024 7:55 AM

-

● గంధం అమావాస్యకు పోటెత్తిన భక్తులు ● అప్పన్న ప్రతిరూపాలుగా కోలలకు పూజలు

సింహాచలం: గంధం అమావాస్యను పురస్కరించుకుని బుధవారం సింహగిరికి భక్తులు పోటెత్తారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఇలవేల్పుగా పూజించే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మత్స్యకారులు, గ్రామీణ ప్రాంత భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. మంగళవారం రాత్రికే సింహాచలం చేరుకున్న వీరంతా బుధవాం తెల్లవారుజామున కొండదిగువ వరాహ పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు. స్వామివారి ప్రతిరూపాలుగా వెంట తీసుకొచ్చిన కోలలను పుష్కరిణి గట్టుపై ఉంచి పూజలు చేశారు. వంటలు వండి కోలలకు ఆరగింపు చేశారు. అమృత కలశాలు, పండ్లు సమర్పించారు. కుటుంబసమేతంగా సహపంక్తి భోజనాలు చేశారు. మెట్లమార్గం ద్వారా సింహగిరి చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. గరిడీ నృత్యాలు చేస్తూ స్వామిని కీర్తించారు. పుష్కరిణి నుంచి అడవివరం మార్కెట్‌ కూడలి వరకు ఉన్న మార్గం భక్తజన సంద్రంగా మారింది. సింహాచలం దేవస్థానం ఈవో ఎస్‌.శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌ అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. పుష్కరిణి వద్ద గోపాలపట్నం పోలీసులు, దేవస్థానం గార్డులు బందోబస్తు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement