మంత్రి దామోదర రాజ నర్సింహ
బంజారాహిల్స్: నగరంలో బిల్డర్లు ఎదుర్కొంటున్న సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. వెస్ట్‌జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ఎనిమిదో వార్షిక వేడుకలు జూబ్లీహిల్స్‌లోని జూబ్లీహిల్స్ కన్వెన్షన్ హాల్ లో బుధవారం ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ.. ఇది ప్రజల ప్రభుత్వమని.. ఒంటెత్తు నిర్ణయాలు తీసుకోకుండా.. ప్రజాపాలనను అందిస్తామన్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి నగరంలోని బిల్డర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి సమస్యలను పరిష్కరిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బిల్డర్లు ఎదుర్కొంటున్న నాలాకు సంబంధించిన సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. నగరానికి వెస్ట్ జోన్ అనేది ఎంతో ముఖ్యమైనదని ఇక్కడ జరిగే అభివద్ధితో వచ్చే ఆదాయంతో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు విజయవంతంగా నిర్వహిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా బిల్డర్స్ సావనీర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, సినీ నటుడు మురళీమోహన్, వెస్ట్ జోన్ నారేడ్కో ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ ఎం.ప్రేమ కుమార్, ప్రధాన కార్యదర్శి కేవీ ప్రసాద్ రావు, కోశాధికారి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.