అంతా గప్‌చుప్‌ | Sakshi
Sakshi News home page

అంతా గప్‌చుప్‌

Published Fri, May 31 2024 1:22 AM

-

ఆర్టీఏలో ఏజెంట్లకు బ్రేక్‌

ఏసీబీ దాడులతో జిల్లాలో గుబులు

సిరిసిల్లక్రైం: రోడ్డు రవాణాశాఖ అధికారి కార్యాలయాల్లో కొద్దిరోజులుగా ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌, కరీంనగర్‌లో ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్న తరుణంలోని జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయ అధికారులు ముందస్తు చర్యలకు పూనుకున్నారు. దీనిలో భాగంగా ఆర్టీఏలో ఏజెంట్లుగా చలామణి అవుతున్న వారికి వాట్సాప్‌లో మెస్సెజ్‌లు పంపి కార్యాలయం వైపు రావొద్దని ఆదేశించినట్లు జిల్లాలో చర్చ జరుగుతోంది. దీంతో గురువారం జిల్లాలోని ఏజెంట్ల అనధికార ఆర్టీఏ కార్యాలయాలు మూసివేసినట్లు సమాచారం. కాగా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆర్టీఏ అధికారులందరినీ ఏకకాలంలో బదిలీ చేశారు. కొత్తగా వచ్చిన అధికారులు వారికి అనువుగా ఉన్నవారిని పర్సనల్‌ అసిస్టెంట్లుగా మార్చుకుని, ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ముందుగా నిర్ణయించిన రేటు గిట్టుబాటు అయితేనే పని చేయాలని, లేకుంటే నిబంధనల పేరిట వాహనదారులను, డ్రైవింగ్‌ కోసం వచ్చేవారిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కాగా, జిల్లా పోలీసు, ఆర్టీఏ అధికారులు సమన్వయంతో కొద్ది నెలల క్రితం యువకులకు ఉచితంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారు. ఈక్రమంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం పలువురు యువకులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే వీరందరికీ ఏజెంట్స్‌ లేకుండా పని పూర్తి చేయడం లేదని పలువురు వాపోతున్నారు. ఉచితంగా డ్రైవింగ్‌ అని లర్నింగ్‌ ఇచ్చి ఇప్పుడు డబ్బులు దండుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. దీనిని సరి చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement