గూడెం ఫైర్‌ స్టేషన్‌ నూతన భవనం ప్రారంభం | Sakshi
Sakshi News home page

గూడెం ఫైర్‌ స్టేషన్‌ నూతన భవనం ప్రారంభం

Published Fri, May 31 2024 1:18 AM

-

తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెంలోని అగ్నిమాపక కేంద్ర నూతన భవనాన్ని ఏపీ రాష్ట్ర విపత్తు స్పందనా, అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్‌ జనరల్‌ పీవీ సునీల్‌కుమార్‌ గురువారం ప్రారంభించారు. అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ పీవీ రమణ, ప్రాంతీయ అగ్నిమాపక అధికారి ఇ.స్వామి, జిల్లా అధికారి జి.శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అగ్నిమాపక శాఖ ఎంతో కృషి చేస్తోందని కొనియాడారు. ప్రమాదాలు సంభవించిన సమయంలో వేగంగా స్పందించి అగ్ని ప్రమాదాలను నివారించేందకు సిబ్బంది ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. అగ్నిమాపక సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని సునీల్‌ కుమార్‌ స్వీకరించారు. స్థానిక అగ్నిమాపక అధికారి గణేశ్న వెంకట రామారావు, ఫైర్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు 6,157 మంది హాజరు

భీమవరం: జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఆర్‌ఐవో కె.చంద్రశేఖర్‌బాబు చెప్పారు. మొదటి సంవత్సరం జనరల్‌ పరీక్షకు 4,940 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 4,478 మంది, ఒకేషనల్‌ పరీక్షకు 759 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 565 మంది హాజరు కాగా, 194 మంది గైర్హాజరయ్యారన్నారు. అలాగే ద్వితీయ సంవత్సరం జనరల్‌ పరీక్షకు 1,058 మందికి 906 మంది హాజరుకాగా, ఒకేషనల్‌ పరీక్షకు 272 మందికి 208 మంది విద్యార్థులు హాజరయ్యారని చంద్రశేఖర్‌బాబు తెలిపారు.

టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షకు 61.06 శాతం హాజరు

జిల్లాలో గురువారం నిర్వహించిన టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షకు 61.06 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖా ధికారి ఆర్‌.వెంకటరమణ చెప్పారు. జీవశాస్త్ర పరీక్షకు 7,058 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 2,748 మంది గైర్హాజరయ్యా రన్నారు. జిల్లా వ్యాప్తంగా 21 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా ఎక్కడా మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని వెంకటరమణ తెలిపారు.

‘సీఐపీఈటీ’ దరఖాస్తుకు జూన్‌ 2 తుది గడువు

పాలకొల్లు సెంట్రల్‌: విజయవాడలోని భారత ప్రభుత్వ సంస్థ సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రో కెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీఐపీఈటీ)లో డిప్లొమా, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి జూన్‌ 2తో గడువు ముగియనున్నట్లు సీఐపీఈటీ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సీహెచ్‌ శేఖర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాసైన విద్యార్థులకు 3 ఏళ్ల వ్యవధి గల డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ టెక్నాలజీ (డీపీటీ), డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ టెక్నాలజీ (డీపీఎంటీ) కోర్సులు, బీఎస్సీ విద్యార్థులకు రెండేళ్ల వ్యవధిగల పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ టెస్టింగ్‌ (పీజీడీ–పీపీటీ) కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు. 2024 జూన్‌ 2వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 2024 జూన్‌ 9వ తేదీన విజయవాడ, అనంతపురంలో సీపెట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (సీఏటీ) నిర్వహిస్తామన్నారు. దీనిలో ర్యాంకు ఆధారంగా విజయవాడ కేంద్రంలో 150 సీట్లను భర్తీ చేస్తామని తెలిపారు. ఈ కోర్సులలో చేరాలనుకునే విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల కొరకు, పూర్తి వివరాల కోసం 93980 50255 సెల్‌ నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

రేపటి నుంచి గ్రూపు–2 మెయిన్స్‌కు ఉచిత శిక్షణ

ఏలూరు (టూటౌన్‌): జూన్‌ 1 నుంచి బీసీ స్టడీ సర్కిల్‌ ఏలూరులో గ్రూపు–2 మెయిన్స్‌కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఆర్‌వీ నాగరాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీపీఎస్‌సీ గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి జూలై 28న నిర్వహించే మెయిన్స్‌ పరీక్షకు సిద్ధమవుతున్న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. లైబ్రరీ సౌకర్యం, స్టడీ మెటీరియల్‌ అందుబాటులో ఉన్నాయని, శిక్షణా కాలంలో స్టైఫండ్‌, బుక్స్‌ అలవెన్స్‌ వంటి సౌకర్యాలు కల్పిస్తారన్నారు. అభ్యర్థులు బీసీ స్టడీ సర్కిల్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇంగ్లిషు మీడియం యూపీ స్కూల్‌, వెన్నవెల్లివారి పేట, ఏలూరు అడ్రస్‌కు లేదా 99123 94799, 83419 91001 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Advertisement
 
Advertisement
 
Advertisement