
ప్రొఫెసర్ డేనియల్ నెజర్స్‌ను సత్కరిస్తున్న తెలుగు పరిరక్షణ నమితి సభ్యులు
అనకాపల్లి రూరల్: ఆయన ఫ్రాన్స్ దేశానికి చెందిన ప్రముఖ ప్రొఫెసర్. తెలుగు భాష గురించి ఆయనకేమి తెలుస్తుందనుకున్నారంతా. కానీ అలా అనుకున్న వారందరినీ ప్రొఫెసర్ డేనియల్ నెజర్స్ చేసిన తెలుగు ప్రసంగం ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే..శుక్రవారం అనకాపల్లిలోని హిమశేఖర్ పాఠశాలలో తెలుగు భాష పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలుగుకు వెలుగునిద్దాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. సంస్థ కన్వీనర్ కొయిలాడ రామ్మోహన్ అధ్యక్షతన నిర్వహించిన సభకు ఫ్రాన్స్ దేశంలో ఆంత్రోపాలజీ శాస్త్రం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డేనియల్ నెజర్స్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్న భాషల గురించి డేనియల్ అధ్యయనం చేస్తున్నారని కొయిలాడ రామ్మోహన్ చెప్పారు. ఈ సందర్భంగా డేనియల్ నెజర్స్ మొదటి నుంచి తెలుగులో అనర్గళంగా మాట్లాడడంతో విద్యార్థులతో పాటు అక్కడున్నవారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. తెలుగు భాషకు ప్రపంచ దేశాల్లో ఎంతో ఆదరణ ఉందన్నారు.
ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడానికి వచ్చిన తాను ఇటీవల ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరై అక్కడి నుంచి అనకాపల్లి వచ్చానని చెప్పారు. అనంతరంఅనర్గళంగా ప్రసంగించిన డేనియల్‌ను పలువురు అభినందించారు. సమితి సభ్యులు ఆయనను సత్కరించారు. సమావేశానికి హాజరైన రాచకొండ దశరధ రామయ్య, డి.శశిధర్ మాట్లాడుతూ తెలుగుభాష ఔన్నత్యం గురించి వివరించారు. విశ్రాంత ఐజీ కె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుభాష కోసం ఇటువంటి సేవలు చేయడం చాలా గొప్ప పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాష పరిరక్షణ సమితి సభ్యులు తమ్మిరాజు, శ్రీనివాసాచార్యులు, జి.రంగబాబు, అమరజ్యోతి, గాయత్రి,సీతారాం తదితరులు పాల్గొన్నారు.