
ఇంటింటా కుళాయిల కోసం వేస్తున్న పైపులైన్లు
చోడవరం: పట్టణ ప్రజలను దీర్ఘకాలంగా వెంటాడుతున్న తాగునీటి కష్టాలు త్వరలో తీరనున్నాయి. తమ దాహార్తి తీర్చాలని వేడుకున్నా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి రూ. 12.80 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టిన భారీ మంచినీటి ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి. 25 వేల మంది ఉన్న చోడవరం పట్టణం పరిధిలో భూగర్భ జలాలు తాగునీటికి ఉపయోగకరంగా లేకపోవడంతో ఇప్పటి వరకు అరకొరగా ట్యాంక్‌ల నీటి సరఫరా చేసేవారు. దీంతో బిందెడు నీళ్ల కోసం ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రత్యేక శ్రద్ధ చూపారు. జలజీవన్ మిషన్ పథకంలో గతేడాది రూ. 12.80 కోట్లు మంజూరు చేయించారు.
5 వేల ఇళ్లకు కుళాయిల ఏర్పాటు
ప్రధానంగా పట్టణంలో 9.50 లక్షల కెపాసిటీ కలిగిన ఏడు మంచినీటి వాటర్ ట్యాంక్‌లకు పంపింగ్ చేసేందుకు సమీపంలో పీఎస్‌పేట దగ్గర పెద్దేరు నదిలో గ్రౌండ్ లెవిల్ బ్యాలెన్సింగ్ ట్యాంక్ రిజర్వాయరు నిర్మించడంతోపాటు పట్టణంలో ప్రతీ ఇంటికీ కుళాయిలు ఇచ్చే విధంగా ఈ పథకాన్ని మంజూరు చేశారు. దీంతో పథకం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 5 వేల ఇళ్లకు కుళాయిల కోసం వీధుల్లో 70 కిలోమీటర్ల ప్రత్యేక పైప్‌లైన్ వేయడానికి ప్రతిపాదన ఉండగా, ఇప్పటి వరకు 55 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ వేసి 3 వేల ఇళ్లకుపైగా ఇంటింటి కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. మరో 15 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ వేసి మరో 2 వేల ఇళ్లకు కుళాయిలు ఇచ్చేందుకు పనులు చేస్తున్నారు.
బెన్నవోలు కొండపై బ్యాలెన్సింగ్ రిజర్వాయరు
మరో పక్క పెద్దేరు నదిలో నిర్మించిన పంపుహౌస్ పనులు 80 శాతానికి పూర్తిగా వరదలు వచ్చినప్పుడు సైతం ఈ పంపు హౌస్ దగ్గరకు వెళ్లేందుకు వీలుగా జన్నవరం వంతెన సమీపంలో నది ఒడ్డు నుంచి ఫుట్‌వే వంతెన నిర్మాణ పనులు జోరుగా చేస్తున్నారు. బెన్నవోలు కొండపై 60 వేల లీటర్ల కెపాసిటీతో గ్రౌండ్‌లెవిల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయరు ట్యాంక్‌ను ఇప్పటికే నిర్మించారు. నదిలో పంప్ హౌస్ నుంచి ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయరుకు నీరు పంపింగ్ అయ్యి అక్కడ నుంచి చోడవరం పట్టణంలో 7 ఓవర్ హెడ్ ట్యాంక్‌లకు నీటి సరఫరా చేసేందుకు వీలుగా సుమారు 5.7కిలోమీటర్ల మేర ప్రత్యేక మెయిన్ పైపులైన్ వేశారు. ఇంత భారీ మంచినీటి ప్రాజెక్టు ఏకకాలంలో వేగవంతంగా పనులు చేస్తున్నారు. యడ్లవీధి ట్యాంక్‌తోపాటు కొన్ని ప్రాంతాలకు ఇంటింటి కొళాయిలు ఇవ్వాల్సి ఉండగా వాటి పైప్‌లైన్ పనులు జోరుగా చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులు వేగంగా పూర్తిచేసి ఈ వేసవిలోగా పూర్తిగా పథకాన్ని వినియోగంలోకి తీసుకొచ్చి ప్రజల మంచినీటి కష్టాలు తీర్చేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు, జలజీవన్‌మిషన్ పథకం అధికారులు సంయుక్తంగా పనిచేస్తున్నారు. ఈ పథకం పూర్తయితే దీర్ఘకాలంగా మంచినీటి కోసం పడుతున్న చోడవరం ప్రజల తాగునీటి కష్టాలు పూర్తిగా తొలగిపోనున్నాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వేగంగా పనుల పూర్తికి చర్యలు
భారీ మంచినీటి పథకం పనులు వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం. ఇప్పటికే 80 శాతానికి పైగా పూర్తయ్యాయి. వేసవిలోగా పథకాన్ని పూర్తిగా వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. పంప్ హౌస్ పనులు మరింతగా వేగంగా పూర్తికి చర్యలు చేపట్టాం.
– శివకృష్ణ, డీఈఈ, ఆర్‌డబ్ల్యూఎస్, చోడవరం

పెద్దేరు నది మధ్యలో పీఎస్‌పేట వద్ద నిర్మిస్తున్న భారీ మంచినీటి పథకం పంప్ హౌస్