
సంఘటన స్థలంలో ప్రమాద బీభత్సం (ఇన్‌సెట్) మృతుడు నారాయణరాజు (ఫైల్)
పెద్ద శబ్దం.. స్థానికులు ఏమిటా అని చూసేసరికి.. వరాహ నది కాలువలోకి దూసుకుపోయిన బస్సు.. తుక్కుతుక్కయిన బస్సు వెనుకభాగం.. పక్కనే నుజ్జయిన ఆటో.. చెల్లాచెదురుగా క్షతగాత్రులు.. ఆర్తనాదాలు.. హాహాకారాలు.. ఎస్.రాయవరం మండలంలోని పి.ధర్మవరం జంక్షన్‌లో జాతీయరహదారిపై శుక్రవారం జరిగిన ప్రమాద బీభత్సమిది.. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 25మంది గాయపడ్డారు. ఐదుగురు తీవ్ర గాయాలతో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.
ఎస్.రాయవరం: అనకాపల్లి నుంచి పాయకరావుపేట వెళుతున్న బస్సు.. పి.ధర్మవరం జంక్షన్‌లో ఆగింది. నలుగురు ప్రయాణికులు దిగారు. మరో ఇద్దరు ఎక్కుతుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ప్రయాణికులు ఎక్కిన వెంటనే స్టార్ట్ చేద్దామనే ఆలోచనతో ఎగువ ప్రాంతంలో బస్సును నిలిపి, స్టీరింగ్ పట్టుకుని డ్రైవర్ అప్రమత్తంగా ఉన్నారు. అదే ప్రయాణికులను కాపాడింది. లేకుంటే వరాహనది బ్రిడ్జికి అతి సమీపంలో ఉండడంతో బస్సు బోల్తా కొడితే తీవ్ర ప్రాణనష్టం జరిగి ఉండేది. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు.
యలమంచిలి వైపు నుంచి తుని వైపు వెళుతున్న పంజాబ్ లారీ అతివేగంగా వచ్చి బస్సును వెనుక నుంచి ఢీకొని, అదే వేగంతో డివైడర్ దాటి అవతలి రోడ్డుపైకి దూసుకుపోయింది. ఆ సమయానికి బస్సు సమీపంలో ఒక ఆటో కూడా ఉంది. లారీ ఢీకొనడంతో బస్సు, ఆటో పక్కనున్న వరాహనది కాలువలోకి దూసుకుపోయాయి. వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించడంతో క్షతగాత్రులకు తక్షణ వైద్యసేవలు అందాయి. గాయపడిన వారిని నక్కపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు ఆటోల్లో, 108 వాహనంలో తరలించారు. ఎస్.రాయవరం ఎస్‌ఐ ప్రసాదరావు క్షతగాత్రులను మోసుకొని పైకి తీసుకువచ్చి ఆస్పత్రికి పంపించారు.
కూటి కోసం వచ్చి కాటికి..
ప్రమాదంలో తలకు గాయమైన విశాఖపట్నం ఇసుక తోట ప్రాంతానికి చెందిన మడపల్లి పరసయ్య (50) నక్కపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. ఇతను నక్కపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న కంపెనీల్లో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. స్థానికంగా నివాసం ఉంటూ వారానికి ఒకరోజు విశాఖలో కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి వస్తుంటారు. శుక్రవారం ఇంటి నుంచి నక్కపల్లి వస్తూ బస్సు ప్రమాదంలో మరణించారు.
తర్వాతి స్టాపులో దిగాల్సివుండగా..
బస్సు వెనుక భాగంలో కూర్చున్న ఎస్.రాయవరం మండలం పెద గుమ్ములూరుకు చెందిన ఏజెర్ల నారాయణరాజు (52) వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో తీవ్రగాయాలపాలయ్యారు. ఆయనను నక్కపల్లి ఆస్పత్రికి తరలించి, అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖ తీసుకువెళుతుండగా మార్గంమధ్యలో మరణించారు. ఇతను కూడా రోజువారీ కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. తాళ్లపాలెం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగి మృత్యువాత పడ్డారు. తర్వాతి స్టాపు అడ్డురోడ్డులో ఇతను దిగాల్సి ఉంది. ఇంతలోనే ప్రమాదం కబళించింది.
మిన్నంటిన ఆర్తనాదాలు
బస్సులో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఉండటంతో భయంతో ఆర్తనాదాలు చేశారు. స్థానికులతోపాటు సీఐ నారాయణరావు, ఎస్‌ఐ ప్రసాదరావు, ట్రాఫిక్ పోలీసులు, హైవే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బస్సులో నుంచి బయటకు తీసి ఆటోల్లోను, 108 వాహనంలోను ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో నక్కపల్లి ఆస్పత్రి ప్రాంగణం దద్దరిల్లింది. లింగరాజుపాలెం గ్రామానికి చెందిన ప్రయాణికుడు సత్యనారాయణరాజు బస్సు దిగుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. అతనికి కూడా గాయాలయ్యాయి. గాజువాక చెందిన అనంతలక్ష్మి అనే మహిళ పాయకరావుపేట వెళుతోంది. ఈ ప్రమాదంలో ఆమెకు కాలు విరిగిపోయింది. ఎస్.రాయవరం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఇళ్ల నాగరాజు అనే మహిళ పాయకరావుపేట వెళ్లడానికి అక్కడే బస్సు ఎక్కింది. వెంటనే ప్రమాదం జరిగింది. నక్కపల్లి మండలం వెదుళ్లుపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు కూడా ఈ బస్సులోనే ప్రయాణిస్తున్నారు. వారికి కూడా కవుకు దెబ్బలు తగిలాయి.
క్షతగాత్రులకు ఎమ్మెల్యే బాబూరావు పరామర్శ
సమాచారం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే గొల్ల బాబూరావు సహాయక చర్యలు వేగం పెంచాలని ఆదేశించారు. నక్కపల్లి ఆస్ప్రతికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్యం చేయిస్తామని హామీ ఇచ్చారు. నర్సీపట్నం డీఎస్పీ ప్రవీణ్‌కుమార్, అనకాపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ సుజాత ప్రమాద స్థలాన్ని పరిశీలించి నక్కపల్లి ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు.
క్షతగాత్రులు వీరే..
ఆటో డ్రైవర్ గొర్ల కృష్ణ, లారీ క్లీనర్ సుఫీమర్, బస్సు డ్రైవర్ ఇసరపు రమణ, కండక్టర్ కె.లక్ష్మి, ప్రయాణికులు.. నక్కపల్లి మండలం వెదుళ్లపాలెం గ్రామానికి చెందిన కొఠారి నాగమణి, వెదుళ్ల మంగ, గొల్లపల్లి నాగరత్నం, తుని మండలం సూరవరానికి చెందిన పి.రాజుబాబు, అనకాపల్లికి చెందిన రామ్మోజి రామలక్ష్మి, ఆనంద్, విశాఖపట్నానికి చెందిన ఎం.సత్యనారాయణ, పి.శేషు, యలమంచిలికి చెందిన కె.నూకరత్నం, బి.అప్పారావు, అప్పలనర్స, విజయనగరానికి చెందిన హెటెరో డ్రగ్స్ ఉద్యోగి ఎ.నరేష్, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చలాది నాగరాజు, శేషుశర్మ, కె.మణి, ఆర్.రాము, సతీష్, పి.మౌనిక, వర్షిణి, బి.లక్ష్మీరాజమ్మ, వరలక్ష్మి, సత్యవతి, ఎ.అప్పారావు, కె.దేవి, నాగరాజు, కె.లక్ష్మి, బి.జయలక్ష్మి, కె.వి.ఎస్.సుబ్బారావు.

ధ్వంసమైన బస్సును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గొల్ల బాబూరావు


ప్రమాదానికి కారణమయిన లారీ
