బీచ్‌..బ్యూటీ.. బిజినెస్‌..! | - | Sakshi
Sakshi News home page

Feb 25 2023 8:54 AM | Updated on Feb 25 2023 1:45 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఒకవైపు బీచ్‌ అందాలను...మరోవైపు వైజాగ్‌ బ్యూటీని విదేశీ, దేశీయ అతిథులతో పాటు పారిశ్రామికవేత్తలకు పరిచయం చేసేందుకు నగరం సిద్ధమవుతోంది. నగరంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఆత్మీయ స్వాగతంతో పాటు అడుగడుగునా విశాఖ అందాలను కనువిందు చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌)తో పాటు జీ–20 సదస్సుకు విచ్చేయనున్న అతిథులకు విమానం దిగిన తర్వాత సంప్రదాయపద్ధతిలో స్వాగతం పలకనున్నారు. అంతేకాకుండా అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఎన్‌ఏడీ జంక్షన్‌, తాటిచెట్లపాలెం, ఆంధ్రాయూనివర్సిటీ ప్రధాన ద్వారం, సిరిపురం, ఆర్‌కే బీచ్‌ మీదుగా జోడుగుళ్లపాలెం, సాగర్‌నగర్‌ మీదుగా రాడిసన్‌ హోటల్‌ వరకూ విశాఖ నగర అందాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

‘సరికొత్త వైజాగ్‌ను పరిచయం చేసేందుకు గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్‌ ఆధ్వర్యంలో అతిథులను వైజాగ్‌ అందాలు కట్టిపడేసేలా చర్యలు తీసుకుంటున్నాం. జీ–20 సదస్సు నేపథ్యంలో పనులను చేపట్టేందుకు ఎన్నికల కోడ్‌ అడ్డంకి కూడా తొలగిపోయింది. ఎన్నికల కమిషన్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది’ అని జీవీఎంసీ కమిషనర్‌ రాజబాబు తెలిపారు. నగర ప్రజలందరూ ఇందుకు సహకరించాలని ఆయన కోరారు. జీఐఎస్‌, జీ–20 సదస్సు నేపథ్యంలో జీవీఎంసీ చేపడుతున్న చర్యలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

జీ–20కు విచ్చేయనున్న అతిథులకు ఆంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేసే విధంగా స్వాగతం పలుకుతాం. కళాజాత కార్యక్రమాలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహి స్తాం. ప్రధానంగా మన రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక కళా రూపాల ద్వారా అతిథులను ఆత్మీయంగా పలకరింపుతో పాటు స్వాగతాంజలి ఉంటుంది. ఇక విమానాశ్రయం నుంచి వారు ప్రయాణించే మార్గంలో రోడ్డు మొత్తం జీ–20 బ్రాండింగ్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడికక్కడ సెంట్రల్‌ మెరీడియన్‌లో లైట్లతో అలంకరించడంతో పాటు ఫ్లవర్‌ షోతోపాటు రోడ్డుకు అ టుఇటుగా చక్కటి పెయింటింగ్స్‌ అలరించేలా ప్లాన్‌ చేస్తున్నాం. 26 కిలోమీటర్ల మేర 7 లక్షల మొక్కల పెంపకం చేపట్టనున్నాం. వైజాగ్‌కు ప్రకృతి ఇచ్చిన అందం ఉంది. దీనికి అదనంగా మరింత అందంగా తీర్చిదిద్దే పనిని చేపడుతున్నాం. విశాఖను మరింత ఎంజాయ్‌ చేసే విధంగా ప్లానింగ్‌ చేస్తున్నాం. ఇక రోడ్డుకు అటుఇటువైపుగా ఉన్న పేవ్‌మెంట్స్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం.

మరింత దగ్గరగా సముద్ర అందాలు

ఇప్పటికే ఉన్న బీచ్‌లతో పాటు కొత్త బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నాం. జోడుగుళ్లపాలెం, సీతకొండ వద్ద వ్యూ పాయింట్‌ అభివృద్ధి చేస్తున్నాం. ఇక్కడి నుంచి మరింతగా సముద్రపు అందాలను వీక్షించే అవకాశం ఉంది. ఆ తర్వాత సాగర్‌నగర్‌ వద్ద బీచ్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే ఉన్న బీచ్‌లకు ఇవి అదనంగా ఏర్పాటవుతున్నాయి. అంతేకాకుండా మొత్తం సముద్రతీరం మరింత స్పష్టంగా కనిపించేందుకు వీలుగా లైటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే బీచ్‌ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నాం. విశాఖకు రానున్న అతిథులకు విశాఖను మరింతగా పరిచయం చేసేందుకు ఈ కార్యక్రమాలు దోహదం చేస్తాయి. ఈ అవకాశాన్ని మేం సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం.

అతిథుల కోసం...!

జీ–20 సదస్సుకు వస్తున్న అతిథుల కోసం ప్రత్యేకంగా 30వ తేదీన వైజాగ్‌లో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాలను పరిచయం చేయనున్నాం. కాపులుప్పాడలోని చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి తయారు చేస్తున్న ప్రాంతం.. దీనిని వేస్ట్‌ టు వెల్త్‌ ఏరియాగా పరిచయం చేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రవేశద్వారాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఏ విధంగా విశాఖపట్నంలోని చెత్తను విద్యుత్‌గా మార్చుతున్నామన్న విషయాన్ని వివరించేందుకు వీలుగా ఉంటుంది. అదేవిధంగా ముడసర్లోవలోని నీటిపై తేలియాడే సౌర విద్యుత్‌ ప్లాంటును సందర్శించే విధంగా ప్లాన్‌ చేస్తున్నాం. దీంతో పాటు నరవ వద్ద మురికినీటిని శుద్ధి చేసి మంచినీటిగా మార్చే ట్రీట్‌మెంట్‌ ప్లాంటును చూపించనున్నాం. ఈ నీటిని పరిశ్రమలకు సరఫరా చేస్తున్నాం. సముద్రతీరం ద్వారా వ్యాపార అవకాశాలనూ వివరించే ప్రయత్నం చేస్తాం. మొత్తంగా వైజాగ్‌ బీచ్‌...బ్యూటీతో పాటు అభివృద్ధి కేంద్రంగా ఎలా మారుతుందన్న అంశాన్ని అతిథులకు చూపించనున్నాం.

జన్‌బాగ్‌దారీ..

జీ–20లో నగర ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తాం. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ మార్చి 5వ తేదీ నుంచి 27వ తేదీ వరకూ జన్‌బాగ్‌దారీ యాక్టివిటీస్‌ను నిర్వహిస్తాం. సైకిల్‌ మారథాన్‌, వాకింగ్‌ మారథాన్‌, రన్నింగ్‌ మారథాన్‌ వంటి కార్యక్రమాలతో పాటు సిటీ మొత్తం స్వచ్ఛ సర్వేక్షన్‌ కార్యక్రమం చేపడతాం. అంతేకాకుండా వైజాగ్‌ గాట్‌ టాలెంట్‌ పేరుతో ఆర్‌కే బీచ్‌ వద్ద ఔత్సాహికుల కోసం ప్రత్యేకంగా స్టేజీ ఏర్పాటు చేస్తున్నాం. యువతీ, యువకులు వారికి ఉన్న టాలెంట్‌ను పరిచయం చేసుకునేందుకు ఈ స్టేజీ వీలు కల్పించనుంది. రిజిస్టర్‌ చేసుకుని ఇందులో పాల్గొనే అవకాశం కల్పించనున్నాం. అంతేకాకుండా పెయింటింగ్‌, వక్తృత్వ పోటీలను కూడా నిర్వహిస్తాం. కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులతో మాక్‌ జీ–20ను నిర్వహించనున్నాం.

బీచ్‌ రోడ్డులో మెరుగులు1
1/2

ఐటీ సెజ్‌ రోడ్డులో వివిధ ఆకృతుల్లో చెట్లు2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement