రూ.13,500 తగ్గిన బ్లాక్‌బెర్రీ ‘జడ్10’ ధర
ముంబై: బ్లాక్‌బెర్రీ కంపెనీ జడ్10 మొబైల్ ధరను 31 శాతం తగ్గించింది. పండుగల సీజన్ సందర్భంగా రూ. 43,490గా ఉన్న జడ్10 మొబైల్ ధరను 31 శాతం(రూ.13,500) తగ్గించి రూ.29,990కే అందిస్తున్నామని కంపెనీ బుధవారం తెలిపింది. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే ఉంటుందని వివరించింది.
ఈ పండుగ సీజన్లో ఇలాంటి మరిన్ని ఆకర్షణీయ ఆఫర్లను అందిస్తామని బ్లాక్‌బెర్రీ ఇండియా ఎండీ సునీల్ లాల్వానీ చెప్పారు. బీబీ10 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే జడ్10, క్యూ5 మొబైళ్లను బ్లాక్‌బెర్రీ కంపెనీ ఈ ఏడాది జనవరిలో మార్కెట్లోకి తెచ్చింది. కానీ ఆశించినంత స్పందన ఈ ఫోన్లకు రాలేదు. ధరలు తగ్గించడం బ్లాక్‌బెర్రీకి కొత్తేమీ కాదు. గతంలో కూడా బ్లాక్‌బెర్రీ ధరలు తగ్గించింది. కొన్ని హ్యాండ్సెట్ల ధరలను గత ఏడాది మార్చిలో ఈ కంపెనీ 26 శాతం వరకూ తగ్గించింది. రూ. 37,990 ధర ఉన్న ప్లేబుక్ ధరను మొదట రూ.24,490కు, ఆ తర్వాత రూ.19,990కు తగ్గించింది.