breaking news
World Food and Agriculture Organization
-
స్వాతి నాయక్‌కు నార్మన్ బోర్లాగ్ అవార్డు
వాషింగ్టన్: ప్రతిష్టాత్మక నార్మన్ బోర్లాగ్– 2023 అవార్డుకు భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్ ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ (ఐఆర్ఆర్ఐ)లో పనిచేస్తున్న ఆమెను అద్భుతమైన మహిళా శాస్త్రవేత్తగా వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అభివర్ణించింది. చిన్న రైతులు సాగు చేసేందుకు వీలయ్యే ప్రశస్తమైన వరి వంగడాల రూపకల్పనలో విశేషమైన కృషి చేశారని కొనియాడింది. ఆహారం, పోషక భద్రత, ఆకలిని రూపుమాపేందుకు ప్రత్యేకమైన కృషి సల్పే 40 ఏళ్లలోపు శాస్త్రవేత్తలకు డాక్టర్ నార్మన్ బోర్లాగ్ పేరిట రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ఈ అవార్డును అందజేస్తుంది. అక్టోబర్‌లో అమెరికాలోని అయోవాలో జరిగే కార్య క్రమంలో డాక్టర్ స్వాతి పురస్కా రాన్ని అందుకోనున్నారు. అమెరికాకు చెందిన హరిత విప్లవం రూపశిల్పి, నోబెల్ గ్రహీత నార్మన్ బోర్లాగ్. కాగా, డాక్టర్ స్వాతి నాయక్ ఒడిశాకు చెందిన వారు. ఈమె 2003– 07లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ చదివారు. -
India: ఆకలి రాజ్యం
జూన్ 7న ప్రపంచ ఫుడ్ సెఫ్టీ డేగా ఐక్యరాజ్య సమితి ప్రతీ ఏటా నిర్వహిస్తోంది. 2019 నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ , యూఎన్వో, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్లు సంయుక్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. ఆహార భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ డే ముఖ్య ఉద్దేశం. వెబ్‌డెస్క్: సపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ అంటూ ఆకలి రాజ్యం సినిమాలో కమల్ పాడిన పాట ఒక ఊపు ఊపింది. నలభై ఏళ్లు గడిచినప్పటికీ దేశం సందుగొందుల్లో ఆకలి కేకలు వినపడుతూనే ఉన్నాయి. ఆహార భద్రత చట్టం అమల్లోకి తెచ్చినా.. పట్టెడన్నం దక్కక లక్షల కుటుంబాలు పస్తులుంటున్నాయి. వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా ఇండియాలో పెరిగిపోతున్న ఆకలిపై తీరుతెన్నులపై కథనం... ఆకలి కేకలు 2020లో ప్రకటించిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆహార భద్రతకు సంబంధించి 107 దేశాల నుంచి డేటాను సేకరించి విశ్లేషించగా ఇండియాకు 102 స్థానం దక్కింది. 1991 నుంచి 2014 వరకు ఉన్న వివరాల ఆధారంగా 2020లో ఈ వివరాలు ప్రకటించారు. తమ దేశ పౌరుల ఆకలి తీర్చడంలో పొరుగు దేశాలపైన నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు మెరుగైన స్థితిలో ఉన్నాయి. మొత్తం ఆసియాలోనే ఆఫ్ఘనిస్తాన్ ఒక్కటే మన కంటే వెనుకబడి ఉంది. పౌష్టికాహారం అందక పోవడం వల్ల ఎంతో మంది భావి భారత పౌరులు మరణం అంచులకు చేరుకుంటున్నారు. లాక్డౌన్ తిప్పలు పేదరికం కారణంగా ఆకలితో నిత్య పోరాటం చేస్తున్న పేదల బతుకులపై లాక్డౌన్ సమ్మెట పోటులా మారింది. దేశంలో రెండు సార్లు విధించిన లాక్‌డౌన్‌తో పేదల బతుకులు చిధ్రమయ్యాయి. ఉపాధి కోల్పోయి తినే నాలుగు మెతుకులు కూడా లభించిన దుస్థితి నెలకొంది. ఇక వలస కార్మికుల కష్టాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వలస కార్మికులకు ఆహారం అందించేందుకు ఏ వాహానం వచ్చినా.. వందల సంఖ్యలో ప్రజలు ఆ వెహికల్ వెంట పరుగులు పెడుతున్న దృశ్యాలు సర్వ సాధారణం అయ్యాయి. కల్తీ కంపు సరిపడ ఆదాయం లేక ఆకలితో ఆలమటిస్తున్న వారు కొందరైతే.. డబ్బులు ఉన్నా నాణ్యమైన తిండి దొరక్క అనారోగ్యం పాలై ప్రజలకు కొదవ లేదు. ముఖ్యంగా నాన్‌వెజ్ వంటకాల విషయంలో కొన్ని రెస్టారెంట్లు అనుసరిస్తున్న ధోరణి దారుణంగా ఉంటోంది. కుళ్లిపోయిన మాంసాన్ని ఫ్రిడ్జ్‌లో ఉంచి సరఫరా చేస్తున్నారు. ఫుడ్‌సెఫ్టీ అధికారులు ఎన్ని సార్లు దాడులు చేసినా అక్రమార్కుల తీరులో మార్పు రావడం లేదు. రోడ్లపైనే కాళ్లకు వేసుకునే చెప్పులను అద్దాల షోరూమ్‌లో అమ్ముతుంటా కానీ కడుపుకు తినే కూరగాయలు మాత్రం రోడ్ల పక్కన, మోరీల వెంట అమ్మేస్తుంటాం అని అప్పుడెప్పుడో లాలూ ప్రసాద్‌యాదవ్ చెప్పారు. ఇప్పటికీ ఈ పరిస్థితిలో మార్పు రాలేదు. కనీసం మున్సిపాలిటీల్లో కూడా వెజ్, నాన్‌వెజ్‌కి సరైన మార్కెట్లు లేవు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు ఇటు తెలంగాణ, అటు ఏపీ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఆహార భద్రత యూపీఏ ప్రభుత్వ హయంలో తెచ్చిన ఆహార భద్రత చట్టం ఆకలితో ఆలమటించే పేదలకు అండగా ఉంది. ఈ చట్టం క్రింద ప్రతీ ఒక్కరికి ఆరు కిలోల బియ్యాన్ని రెండు రూపాయలకే అందిస్తుండటంతో ఎంతో మందికి లబ్ధి చేకూరుతోంది. లాక్డౌన్ సమయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా బియ్యం సరఫరా చేసి ప్రజలను ఆదుకున్నారు. -
ఆహార భద్రతకు ఆ రెండూ కీలకం
న్యూఢిల్లీ: రైతులు పండించిన పంటలను మద్దతు ధరతో సేకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం స్పష్టం చేశారు. దేశ ఆహార భద్రతకు ఈ రెండు అంశాలు ముఖ్యమైనవని ఆయన తెలిపారు. వ్యవసాయ మార్కెట్ల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా కనీస మద్దతు ధర విధానం శాస్త్రీయమైన పద్ధతిలో కొనసాగేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ప్రపంచ ఆహార భద్రత విషయంలో భారత్ నిబద్ధతకు ఇటీవలి వ్యవసాయ సంస్కరణలే నిదర్శనమని ఆయన వివరించారు. అంతర్జాతీయ సంస్థ ‘‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్’ ఏర్పాటై 75 ఏళ్లు అయిన సందర్భంగా ప్రధాని మోదీ రూ.75 ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరేళ్లలో మండీల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు రూ.2,500 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఇటీవల తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు సాగును విస్తృతం చేసేందుకు, రైతుల ఆదాయాన్ని పెంచేందుకూ ఉద్దేశించినవని వివరించారు. ఎసెన్షియల్ కమాడిటీస్ చట్టంలో చేసిన మార్పులతో మండీల మధ్య పోటీతత్వం ఏర్పడుతుందని, తద్వారా రైతుల ఆదాయం పెరగడంతోపాటు ఆహార వృథాను అరికట్టవచ్చునని ప్రధాని చెప్పారు. ‘‘ఇప్పుడు మార్కెట్లే చిన్న, సన్నకారు రైతుల ఇంటి ముందుకు వచ్చేస్తాయి. అధిక ధరలు అందేలా చేస్తాయి. దళారులు లేకుండా పోతారు’’అని వివరించారు. కోవిడ్–19 కాలంలో భారత ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్ల విలువైన తిండిగింజలను 80 కోట్ల మందికి అందించిందని మోదీ తెలిపారు. ఈ ఉచిత రేషన్ అనేది యూరప్, అమెరికాలోని జనాభా కంటే ఎక్కువ మందికి అందించామని అన్నారు. పోషకాహార లోపాలను అధిగమించేందుకు కేంద్రం సిద్ధం చేసిన ఎనిమిది పంటల 17 బయో ఫోర్టిఫైడ్ వంగడాలను మోదీ విడుదల చేశారు. 2023 సంవత్సరాన్ని ‘‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్’గా ఆచరించేందుకు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంగీకరించడం అధిక పోషక విలువలున్న ఆహారానికి ప్రోత్సాహమివ్వడంతోపాటు చిన్న, సన్నకారు రైతులకు ప్రోత్సాహకంగా ఉంటుందన్నారు. వంగడాలతో కొత్త వెరైటీలు ప్రధాని జాతికి అంకితం చేసిన 17 కొత్త వంగడాల్లో ప్రత్యేకతలు ఎన్నో. కొన్ని పోషకాలు సాధారణ వంగడాల కంటే మూడు రెట్లు ఎక్కువ ఉండటం విశేషం. స్థానిక వంగడాలు, రైతులు అభివృద్ధి చేసిన వంగడాల సాయంతో కొత్త వెరైటీలను సిద్ధం చేశారు. ► ఇనుము, జింక్, కాల్షియం, ప్రొటీన్, లైసీన్, ట్రిప్టోఫాన్, విటమిన్లు ఏ, సీ, యాంథోసైనిన్, ఓలిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్ల వంటి పోషకాలను వీటితో పొందవచ్చు. ► సాధారణ వంగడాల్లో పోషకాలకు వ్యతిరేకంగా పనిచేసే యురుసిక్ ఆసిడ్, ట్రిప్సిన్ నిరోధకం తదితరాలు కొత్త వంగడాల్లో తక్కువగా ఉంటాయి. ► కొత్త వంగడాల్లో రెండింటిని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) అభివృద్ధి చేసింది. గిర్నార్ –4, గిర్నార్ –5 అని పిలుస్తున్న ఈ రెండు వేరుశనగ వంగడాల్లో ఓలిక్ ఆసిడ్ మోతాదు ఎక్కువ. సబ్బులు, ఫార్మా, వస్త్ర పరిశ్రమల్లో ఓలిక్ ఆసిడ్‌ను ఉపయోగిస్తారు. ► జాతికి అంకితం చేసిన వాటిల్లో గోధుమ వంగడాలు ఐదు ఉండగా.. మొక్కజొన్న వంగడాలు మూడు, రాగులు, వేరుశనగ రెండు చొప్పున ..వరి, సామలు, ఆవాలు, కంద వంగడాలు ఒక్కొక్కటి ఉన్నాయి. ఇంకో వంగడం వివరాలు తెలియాల్సి ఉంది. ఆడపిల్లల వివాహ వయో పరిమితిపై త్వరలో నిర్ణయం ఆడపిల్లల కనీస వివాహ వయో పరిమితిపై కేంద్రం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వివాహానికి తగిన వయసు ఏమిటన్న విషయంపై ముఖ్యమైన చర్చలు జరుగుతున్నాయని, కనీస వయో పరిమితిని సవరించేందుకు ఏర్పాటైన కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆరేళ్లుగా ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ఫలితంగా బాలికలు ఎక్కువ సంఖ్యలో బడిలో చేరుతున్నారని ఫలితంగా స్థూల నమోదు నిష్పత్తిలో తొలిసారి బాలికలు పై చేయి సాధించారని వివరించారు. స్వాతంత్య్ర దినో త్సవ ప్రసంగంలో భాగంగా మోదీ ఆడపిల్లల వివాహ కనీస వయో పరిమితిపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో ఆడపిల్లల వివాహ కనీస వయో పరిమితి 18 ఏళ్లు కాగా, పురుషుల విషయంలో ఇది 21 ఏళ్లుగా ఉంది. -
నేలమ్మా.. మన్నించమ్మా!
జీవానికి మూలాధారమైన నేలతల్లి నిర్లక్ష్యమై వట్టి పోతోంది. సకల జీవకోటికీ స్తన్యం పడుతున్న నేలమ్మే నాగరికతకు పునాది. మానవులతోపాటు భూమిపైన, భూమి లోపల సకల జీవులకూ ప్రాణాధారం భూమాతే. అన్నదాత చేతుల మీదుగా మన కంచాల్లోకి వస్తున్న ఆహారంలో 99% భూమాత ప్రసాదమే! ఆహారం, నీరు, వాతావరణం, జీవవైవిధ్యం, జీవితం.. వీటన్నిటికీ ప్రాణ దాతైన భూమాతతో సజీవ సంబంధాన్ని కొనసాగించడంలో మనం ఘోరంగా విఫలమయ్యాం. అందుకే.. అంతటి చల్లని తల్లికే పుట్టెడు కష్టం వచ్చిపడింది. సాగు భూమిలో 25% ఇప్పటికే నిస్సారమైంది. జీవాన్ని.. సేంద్రియ పదార్థాన్ని కోల్పోయింది. చౌడు తేలింది. చట్టుబండైంది. నీటిని గ్రహించే శక్తి నశించింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. పంటల సాగుకు పనికిరాకుండా పోయింది.. నాశనమవుతూనే ఉంది.. ప్రతి ఏటా రెండున్నర కోట్ల ఎకరాల్లో సుసంపన్నమైన నేల నాశనమైపోతున్నది. అంటే.. ప్రతి నిమిషానికి 30 ఫుట్‌బాల్ కోర్టులంత మేర సారవంతమైన భూమి పనికిరాకుండా పోతోంది. ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏవో) నివేదిక ప్రకారం.. నేలతల్లి ప్రాణాలను అనుక్షణం మనమే చేజేతులా తోడేస్తున్నాం. ఈ విధ్వంసం అంతా వ్యవసాయం పేరిట సాగిపోతోంది.. జీవనాధారంగా ప్రారంభమైన వ్యవసాయం.. విచక్షణారహితంగా వాడుతున్న వ్యవసాయ రసాయనాల వల్లనే ముఖ్యంగా నేల నిర్జీవమవుతోంది. తల్లి ఆరోగ్యం పాడైతే బిడ్డ బాగుంటుందా? అతిగా రసాయనిక అవశేషాలున్న ఆహారం తిన్న నేలతల్లి బిడ్డల ఆరోగ్యం కూడా అంతకంతకూ క్షీణిస్తోంది. మానవాళి మనుగడ సజావుగా సాగాలంటే.. నెత్తికెక్కిన కళ్లను నేల లోతులకు మళ్లించాలి. వనరుల విధ్వంసం ఆగాలంటే.. పారిశ్రామిక దేశాలు రుద్దిన సాంద్ర వ్యవసాయ పద్ధతిని వదిలేసి, ప్రకృతికి దగ్గరవ్వాలని ఎఫ్ఏవో మొత్తుకుంటున్నది. ఆహార భద్రత, పర్యావరణ వ్యవస్థలకు భూమి ఆరోగ్యం ప్రాణావసరమన్న స్పృహను పాలకుల్లో, ప్రజల్లో రగిలించడం తక్షణావసరం. ఇందుకోసమే 2015ను ‘అంతర్జాతీయ భూముల పరిరక్షణ సంవత్సరం’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అంతర్జాతీయ భూముల పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 5(రేపు) నుంచే భూముల పరిరక్షణకు పాలకులు, రైతులు, ప్రతి మనిషీ కదలాలని పిలుపునిచ్చింది. భూసారాన్ని పునరుద్ధరించుకుంటూనే నిశ్చింతగా జీవనాధారమైన పంటల సాగుకు ప్రపంచమంతా కంకణబద్ధులు కావాల్సిన తరుణమిది. వాతావరణ మార్పుల ప్రతికూల పరిస్థితుల మధ్య తెలుగు రాష్ట్రాలు ఈ అంశంపై తీక్షణంగా దృష్టిసారించాలి. భూసార విధ్వంసక విధానాలకు, అసపవ్య సాగు పద్ధతులకు పాతరేద్దాం.. ప్రకృతికి కీడు చేయని పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న ఆదర్శ అన్నదాతలకు జేజేలు పలుకుదాం.. నిస్సారమైన నేలకు తావు లేని రోజు కోసం అందరం ఉద్యమిద్దాం. జీవిత కాలంలో సెంటీమీటరు నేలను కూడా మనం సృష్టించలేం. అలాంటప్పుడు భూమిని పాడు చేసే హక్కు మనకెక్కడిది? ఆ తల్లి స్తన్యం తాగి రొమ్ము గుద్దడం మాని, నేలమ్మను పరిరక్షించుకుంటే పోయేదేమీ లేదు.. ఆహారోత్పత్తి 58% పెరగటం(ఎఫ్ఏఓ అంచనా) తప్ప! మనిషి పనుల మూలంగా నేలమ్మ చాలా వేగంగా సారాన్ని కోల్పోతూ సాంఘిక, ఆర్థిక, ఇతర సమస్యలకు దారితీస్తోంది. నేలను అపసవ్యమైన రీతుల్లో అతిగా వినియోగించడం మనుగడకే ఎసరు తెస్తోంది. హరిత విప్లవ కాలంలో ముందుకొచ్చిన సాంద్ర వ్యవసాయ పద్ధతుల వల్ల గత ఆరు దశాబ్దాలుగా నేల గతమెన్నడూ ఎరుగనంతగా పతనమైంది. అవసరానికి మించి దున్నడం, ఏదో ఒకే పంటను సాగు చేయడం, సేంద్రియ ఎరువులు చాలినంతగా వేయకపోవడం, రసాయనిక ఎరువులతోపాటు కలుపు మందులను విచ్చలవిడిగా వాడటం, కాలువ నీటి వాడకంలో అపసవ్య పోకడలు.. ఇవీ భూములు నాశనం కావడానికి ముఖ్య కారణాలని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే ఆహారోత్పత్తి వ్యవస్థే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దేశంలో 12 కోట్ల 10 లక్షల హెక్టార్ల భూమి నిస్సారంగా మారింది. ఇందులో 2 కోట్ల 28 లక్షల హెక్టార్ల సాగు భూమి కేవలం రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడడం వల్ల నిర్జీవమై సాగుకు పనికిరాకుండా పోయింది. పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చే క్రమంలో మన దేశంలో సాగు భూమి తగ్గిపోతున్నది. 1951లో ప్రతి మనిషికీ 1.19 ఎకరాల చొప్పున సాగు భూమి అందుబాటులో ఉండేది. ఇది 1991 నాటికి 40 సెంట్లకు తగ్గింది. 2035 నాటికి 20 సెంట్లకు తగ్గేలా ఉంది. ఉత్పాదకతను కోల్పోతున్న లక్షల హెక్టార్లు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 రకాల భూములున్నాయి. మెట్ట, మాగాణి అనే తేడా లేకుండా అన్ని రకాల భూముల్లోనూ సారం అంతకంతకూ తగ్గిపోతూ పంటల దిగుబడి క్షీణిస్తోంది. తెలంగాణ (భూముల్లో 29 శాతం) లో 34 లక్షల హెక్టార్ల భూమి ఏదో ఒక రకంగా ఉత్పాదక శక్తిని కోల్పోయిందని తాజా అంచనా. ఆంధ్రప్రదేశ్ (భూముల్లో 36 శాతం)లోని 58 లక్షల హెక్టార్ల భూములు నిస్సారంగా మారాయి. సేంద్రియ కర్బనం 0.5 శాతానికి అడుగంటిందని అంచనా. దీన్ని 2 శాతానికి పెంచుకోవడమే లక్ష్యంగా బహుముఖ వ్యూహాలను ప్రభుత్వం అమల్లోకి తేవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, వీటిని రైతు దగ్గరకు తీసుకెళ్లే యంత్రాంగమే అరకొరగా ఉంది. రైతుకు సాంద్ర వ్యవసాయాన్ని అలవాటు చేసిన ప్రభుత్వం.. దాని ద్వారా ఏర్పడిన భూసార సమస్యను అధిగమించే సులభమైన, ఆచరణాత్మక పద్ధతులను రైతులకు అందించలేని స్థితిలో ఉండిపోవడం విషాదకర వాస్తవం. దిక్కుతోచని బడుగు రైతు మనుగడకే ఇది పెనుశాపంగా పరిణమించింది. ఫ్రాంక్లిన్ డెలొనొ రూజ్వెల్ట్ ఇలా అన్నారు: ‘భూములను నాశనం చేసుకునే దేశం, తనను తాను నాశనం చేసుకుంటుంది’. ప్రస్తుతం మన భూములు, మన దేశం పరిస్థితి ఇలాగే ఉంది. ప్రత్యామ్నాయాల అడుగుజాడలు.. ప్రభుత్వం చేష్టలుడిగినంత మాత్రాన అన్నదాతలు అక్కడే ఆగిపోరు. తమ సమస్యలకు తామే పరిష్కారాలు వెతుక్కుంటూనే ఉంటారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు వాడడం పూర్తిగానో, పాక్షికంగానో మానేసి.. స్థానిక వనరులతోనే ఖర్చు తక్కువతో కూడిన ప్రత్యామ్నాయాలు వెదుకుతున్నారు. భూసారాన్ని పెంపొందించుకుంటూనే పంట దిగుబడులనూ పెంచుకుంటున్నారు. టన్నులకొద్దీ పశువుల ఎరువుల అవసరం లేకుండానే కొత్త పద్ధతుల్లో తక్కువ పశువులతోనే ఎక్కువ విస్తీర్ణంలో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. ప్రభుత్వాలు అత్యాధునికమైనవన్న భ్రమలో విదేశీ నమూనా ఎండమావుల వెంటపడకుండా.. మన రైతుల అనుభవంలో నిగ్గుతేలిన మేలైన, ప్రకృతికి అనుగుణమైన ప్రత్యామ్నాయ సాగు పద్ధతులపై దృష్టిపెట్టాలి. మట్టిలోనే పుట్టి మట్టిలోనే బతుకుతూ సమాజానికి మూడు పూటలా తిండి పెడుతున్న అచ్చమైన రైతుల అనుభవాల నుంచి బేషజాల్లేకుండా నేర్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అన్నదే అసలు ప్రశ్న. మన భూముల, మన రైతుల, వినియోగదారుల భవిష్యుత్తు, ఆరోగ్యం- ఈ ప్రశ్నకు వచ్చే సమాధానంపైనే ఆధారపడి ఉంది. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ భూసారాన్ని రక్షించుకునేలా సాగు మారాలి ఉత్పాదకత పెరగాలంటే భూమిలో సేంద్రియ కర్బన శాతాన్ని పెంచాలి. రసాయనిక, సేంద్రియ, జీవన ఎరువులు కలిపి వాడాలి. 25-50% పోషకాలను సేంద్రియ, జీవన ఎరువుల ద్వారా అందించాలి. భూసారాన్ని పరిరక్షించుకునే విధంగా వ్యవసాయ పద్ధతులు మార్చుకోవాలి. కౌలు, యువ రైతులకు అవగాహన కలిగించేందుకు విస్తరణ వ్యవస్థను పటిష్టం చేయాలి. సూక్ష్మజీవుల ద్వారా పోషకాలను అందించడంపై దృష్టిపెట్టాలి. సూక్ష్మజీవుల గురించి మనకు తెలిసింది ఒక శాతమే. అంతర్జాతీయ భూముల పరిరక్షణ సంవత్సరం సందర్భంగా ఈ అంశాలపై శ్రద్ధ చూపాలి. పరిశోధన ఫలితాలను రైతులకు అందించడానికి విస్తృత కృషి జరగాలి. సాయిల్ రిసోర్సెస్ మ్యాపింగ్‌పై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతులకు ఉపకరిస్తాయి. - డా. డి. బాలగురవయ్య, ప్రధాన శాస్త్రవేత్త, భూవిజ్ఞాన శాస్త్ర విభాగం, ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ఏయూ), హైదరాబాద్ ప్రకృతి వ్యవసాయంతోనే భూముల పునరుజ్జీవనం! మట్టి మొక్కలకు పునాది. ప్రకృతిసిద్ధమైన పర్యావరణ వ్యవస్థలో జీవరాశి (వానపాములు, సూక్ష్మజీవులు, పురుగులు, శిలీంధ్రాలు, ఇంకా మట్టిలో ఉండే అనేక ప్రాణులు) నిరంతరాయంగా పోషకాలను మొక్కల వేళ్లకు అందిస్తాయి. కానీ గత అరవయ్యేళ్లుగా రైతులు రసాయనిక ఎరువులు, పురుగుమందులు, శిలీంధ్రనాశనులు, కలుపుమందులు వాడుతుండడం వల్ల మట్టిలో ఉండాల్సిన వానపాములు, ఇతర జీవరాశి నాశనమై భూమి నిస్సారమైపోయింది. ఏదైనా ఎరువును బయటి నుంచి అధికంగా తెచ్చి వేస్తేనే గానీ పంట పండని దుస్థితి నెలకొంది. ఇప్పుడు మనం రసాయనిక ఎరువులు, పురుగుమందులు, సూక్ష్మపోషకాలు పొలంలో వేయకుండా పంటలు పండించాలనుకుంటే.. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా మట్టిలోని జీవరాశిని, వానపాములను తిరిగి ఆహ్వానించాలి. ప్రకృతి మనకు అందించిన ఈ అద్భుతమైన వ్యవసాయ విజ్ఞానానికి అడ్డుచెప్పే వారెవరూ ఇప్పుడు లేరు..ప్రాణావసరం కాబట్టి! - సుభాష్ పాలేకర్, ప్రకృతి వ్యవసాయోద్యమ సారధి, మహారాష్ట్ర (‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం - 1’ పుస్తకం నుంచి) నడుస్తుంటే మట్టి పెళ్లలు గుచ్చుకునేవి..! పచ్చిరొట్ట ఎరువులు, ఘనజీవామృతం, జీవామృతం వాడుతూ 6 ఎకరాల్లో నాలుగేళ్లుగా సేంద్రియ సేద్యం చేస్తున్నా. సేంద్రియ కర్బనం 0.5% నుంచి 0.95%కు పెరిగింది. అంతకుముందు పొలంలో చెప్పుల్లేకుండా నడిస్తే మట్టిపెళ్లలు గుచ్చుకునేవి. ఇప్పుడు నడి ఎండాకాలంలోనూ చెప్పుల్లేకుండా హాయిగా నడవొచ్చు. ఎకరానికి బీపీటీ ధాన్యం 28-30 బస్తాల దిగుబడి వస్తోంది. మా పొలం తుపాన్లు తట్టుకొని పడిపోకుండా నిలబడింది. నేల తేమ ఆరిపోదు. తక్కువ నీరే సరిపోతున్నది. - కోగంటి రవికుమార్ (80192 59059), సేంద్రియ రైతు, ఇందుపల్లి, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా సేంద్రియ కర్బనం 3% నుంచి 0.5%కి తగ్గింది.. జీవామృతం, పంచగవ్య, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువుల ద్వారా సేంద్రియ వ్యవసాయ వ్యాప్తికి కృషి చేస్తున్నాం. భూముల్లో సేంద్రియ కర్బనం 50 ఏళ్ల నాడు 3% ఉండే 0.5%కి తగ్గింది. దీన్ని కష్టపడి 1%కి పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. రైతులను చైతన్యవంతం చేస్తున్నాం. 8 ఏళ్లలో సేంద్రియ సాగు విస్తీర్ణం 5% నుంచి 25%కి పెరిగింది. సేంద్రియ ముడి బియ్యంతోపాటు సేంద్రియ పాలూ అందుబాటులోకి వచ్చాయి. వీటి వినియోగ దారుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి, వైద్య ఖర్చులు 50% తగ్గాయి. రైతులంతా సేంద్రియ సాగుకు మళ్లితే ఆసుపత్రుల అవసరమే ఉండదు. ప్రతి రైతుకూ నాటు ఆవు లేదా దూడైనా ఉండాలి. - కే సాంబశివరావు (97011 08511), సేంద్రియ సాగు సమన్వయకర్త, ప్రభుత్వ రైతు శిక్షణా కేంద్రం, విజయవాడ