breaking news
Voter right
-
అభ్యర్థి విద్యార్హత తెలుసుకోవడం ఓటరు హక్కు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల విద్యార్హతల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయంలో ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా నామినేషన్ పత్రాలు తిరస్కరించవచ్చని తెలిపింది. పోటీలో ఇద్దరే ఉండి,గెలిచిన అభ్యర్థి నామినేషన్ పత్రాల్లో తప్పుడు వివరాలు ఉన్నాయని నిరూపితమైతే, ఎన్నికల ఫలితాలు ప్రభావితమయ్యాయని ఓడిన అభ్యర్థి రుజువులు సమర్పించనక్కర్లేదనీ తెలిపింది. మణిపూర్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పృథ్వీరాజ్, శరత్చంద్ర పరస్పరం వేసుకున్న దావాలను కోర్టు విచారించింది. 2012 ఎన్నికల్లో నామినేషన్ పత్రాల్లో తన విద్యార్హత ఎంబీఏ అని తప్పుగా పేర్కొని విజయం సాధించిన పృథ్వీరాజ్ ఎన్నిక చెల్లదని మణిపూర్ హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును ఇప్పుడు సుప్రీంకోర్టు సమర్థించింది. -
ఒక్క ఓటూ వృథా కాకూడదు: కాజల్
ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని యువశక్తి మనకే సొంతం.. ఇప్పుడు ఆ యువతే ఈ ఎన్నికల్లో కీలకం కావాలి.. మన చుట్టూ ఉన్న సమాజంలో మార్పు కోసం, ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం సమర్థులైన పాలకులనే ఎన్నుకోవాలి... మనం వేసే ఏ ఒక్క ఓటూ వృథా కాకూడదు. ఈ మండే ఎండలో బయటకు ఏం వెళ్తాం అనే నిర్లక్ష్యం వద్దు.. ఒక్కరోజు నిర్లక్ష్యం ఐదేళ్ల శాపమవుతుంది. అందుకే మీరు ఓటేయడమే కాదు.. అందరితో ఓటు వేయించే బాధ్యత కూడా యువతరానిదే.. సో రెడీ టు ఓట్ టుడే... - కాజల్, హీరోయిన్ -
ఫేస్బుక్లో ‘సిరాచుక్క’
‘వేలిపై సిరాచుక్క’ ఫొటోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా మొదటిసారి తమ ఓటుహక్కును వినియోగించుకున్న యువత ఆ ఆనందాన్ని ఫేస్బుక్, ట్విట్టర్‌లోని తమ సన్నిహితులతో పంచుకుంటున్నారు. వారిలోనూ స్ఫూర్తి పెంచేలా కామెంట్లు, మెస్సేజ్‌లు పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా గురువారం నాటి మూడో విడత పోలింగ్‌లో ఓటేసి వచ్చిన యువత సిరాచుక్కతో ఉన్న వేలును గర్వంగా చూపిస్తూ ఫొటోలు దిగి వాటిని ఆ వెబ్సైట్లలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలతో పాటు పోస్ట్ చేసిన కామెంట్లలో కొన్ని.. ‘మై ఇండియా.. మై ఓట్.. మై ప్రైడ్’, ‘భారతీయుడిగా నేను చేసిన అత్యుత్తమ పని ఓటు వేయడం’, ‘ఇంక్డ్ ఫర్ చేంజ్’, ‘ఏ దేశమూ ఫర్ఫెక్ట్ కాదు.. మనమే మన దేశాన్ని ఫర్ఫెక్ట్గా చేసుకోవాలి.. ఇండియాను ఫర్ఫెక్ట్గా చేసేందుకు నా బాధ్యత నేను నిర్వర్తించాను’, ‘ఈ సిరాచుక్క టాటూ కన్నా గొప్ప’ ‘నేను ఓటేశా.. మరి మీరు?’ -
ఎన్నుకో.. ఏలుకో
* బాబు హయాంలో చదువు‘కొనా’ల్సిందే.. * ఫీ‘జులుం’ నుంచి విముక్తి కల్పించిన వైఎస్ * వైఎస్ అనంతరం పరిమితులు * జగన్ ‘అమ్మ ఒడి’ పై చిగురిస్తున్న ఆశలు దాదాపు 1.25 కోట్లు...! మన రాష్ట్రంలో ఓటు హక్కు వినియోగించుకోబోయే విద్యార్థుల సంఖ్య ఇది. ఇందులో కొత్త ఓటర్లు అంటే..18-19 ఏళ్లలోపు వయసున్న వారి సంఖ్య 15లక్షల పైచిలుకు ఉన్నారు. రానున్న ఎన్నికలలో వీరి ఓట్లదే కీలకం. ‘విద్యార్థుల రక్తము చిందని పోరే లేదు...విద్యార్థుల త్యాగమూ రాయని చరితే లేదు’....సమాజోద్ధరణలో విద్యార్థి దశ ఎంత కీలకమైనదో ఓ కవి ఎప్పుడో చెప్పాడు. అటువంటి యువత దేశ భవితవ్యాన్ని నిర్దేశించే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది...ఈ నేపథ్యంలో విద్యార్థి సంక్షేమానికి ఏ ప్రభుత్వం చిత్తశుద్ధి కనబర్చిందనే విషయమై...ఈ విశ్లేషణ. మేకల కళ్యాణ్ చక్రవర్తి, ఖమ్మం: తమ అభివృద్ధి కోసం పాటుపడిందెవరు? తమకు విద్యార్థి దశలో మంచి చదువులు చెప్పించే పరిస్థితులను కల్పించి, ఆ దశ దాటిన తర్వాత ఉపాధి కల్పన మార్గం చూపిన వారెవరు? అనే అంశాలే విద్యార్థి వేయబోయే ఓటును నిర్దేశిస్తాయి. ఈ నేపథ్యంలో ఓటేసే వయసున్న యువ విద్యార్థి లోకం గత పాలన తీరు తెరుతెన్నులను నేటి పాలనతో పోల్చి చూస్తోంది. విద్యార్థికి అండగా ఉన్నదెవరు?...వారి భవితవ్యాన్ని శూన్యం చేసిందెవరు?.. భవిష్యత్‌లో తమకు బంగారుబాట వేసేదెవరు? ఇప్పుడు తామేం చేయాలి... ఎవరిని ఎంచుకోవాలి... అనే అంశాలు చర్చిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వా లు ఫీజుల పథకాన్ని దూరం చేసేందుకు చేయ ని ప్రయత్నాలు లేవు. సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సులకు వైఎస్ హయాంలో పూర్తి ఫీజురీయింబర్స్ అవగా, ప్రస్తుతం కోర్సు ఫీజు ఎంతైనా గరిష్టంగా రూ.20వేలే రీయింబర్స్ చేస్తున్నారు. డబుల్ పీజీలకు కూడా గతంలో రీయింబర్స్మెంట్ ఇవ్వగా, ఇప్పుడు ఒక్క పీజీకి మాత్రమే వర్తింపజేయాలని నిర్ణయించారు. వయోపరిమితి నిబంధన విధిస్తామంటూ కోర్సుల వారీగా వయసును వర్గీకరించారు. పారామెడికల్ విభాగంలో 26 కోర్సులను 17కు కుదించారు. ఫ్యాషన్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంటర్ (వృత్తివిద్య), కలినరీ ఆర్ట్ వంటి సర్టిఫికెట్ కోర్సులనూ ఎత్తివేశారు. ‘గేట్’ ద్వారా ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో చేరిన వారిని మినహాయించారు. గతంలో లబ్ధి పొందిన వీరి నుంచి సొమ్మును రికవరీ చేస్తున్నారు. పీహెచ్డీ చేస్తున్న కొందరు విద్యార్థులకు ఫెలోషిప్ వస్తుందన్న సాకుతో పరిశోధన చేస్తున్న విద్యార్థులనూ మినహాయించడం గమనార్హం. కేంద్రం గుర్తించిన 183 విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్ చేయాలని నిర్ణయించారు. ఇంజనీరింగ్ ఫీజులనూ ఇష్టారాజ్యంగా పెంచేసి ప్రభుత్వం రూ.35వేలే చెల్లిస్తుందని తేల్చి చెప్పింది. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటనల్లో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను సందర్శించి అక్కడే రాత్రి బస చేసినా వారి మెస్‌చార్జీల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. రాజీవ్ యువకిరణాల పేరుతో యువతకు ఉపాధి కల్పిస్తానని చెప్పిన కిరణ్ విజయవంతం కాలేకపోయారు. ప్రచారార్భాటం కోసం పెట్టిన ఈ పథకం ద్వారా మండలానికో నలుగురికి కంప్యూటర్ శిక్షణ ఇచ్చి చేతులు దులుపుకున్నారు.అరకొరా హైదరాబాద్‌లోని సమీపంలో పరిశ్రమల్లో ఉద్యోగాలిప్పించినా వారు సరిగా జీతాలు కూడా ఇవ్వకపోవడంతో యువత అక్కడి నుంచి పారిపోవాల్సిన పరిస్థితులను కూడా కల్పించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు వై‘ఎస్’ ‘పేదరికం కారణంగా అర్హుడైన ఏ విద్యార్థీ ఉన్నత విద్య కు దూరం కాకూడదు.’ అన్న సదుద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పటివరకు ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే పూర్తిగా ఫీజు, స్కాలర్షిప్ వస్తుండగా (అవి కూడా రాష్ట్రం ఇచ్చేది కాదు... కేంద్రం నిధులనే పంచేవారు.) వైఎస్ వచ్చిన తర్వాత దానిని బీసీలకు, ఈబీసీలకు వర్తింపజేశారు. ఈ పథకం ద్వారా ప్రస్తుతం యేటా 26లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. - ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌ల వ్యవస్థను సమూలంగా మార్చి బీసీ, ఈబీసీలకూ రీయింబర్స్‌మెంట్‌ను వర్తింపజేశారు. - వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుసార్లు స్కాలర్షిప్లను 60శాతం మేర పెంచారు. - సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ఆరేళ్లలో రెండు సార్లు 60శాతం మేర డైట్‌చార్జీలు పెంచారు. ఏడో తరగతిలోపు విద్యార్థులకు నెలకు రూ.338 ఉండ గా రూ. 475కు, ఏడు నుంచి ‘పది’విద్యార్థులకు రూ. 412 నుంచి రూ.535కు పెంచారు. అప్పటి వరకూ హాస్టల్ విద్యార్థులకు ఏడాదికి రెండు జతల యూనిఫారంలు ఇస్తుండగా, దానిని నాలుగు జతలకు పెంచారు వైఎస్. అలాగే బాలురకు రూ. 20గా ఉన్న కాస్మొటిక్ చార్జీలను రూ. 50కి, బాలికలకు రూ. 50 నుంచి రూ.75కుపెంచారు. - కులవివక్షను రూపుమాపేందుకు 120 ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లను మంజూరు చేశారు. ఇందుకోసం ఒక్కో హాస్టల్‌కు రూ. 2.5 కోట్లు కేటాయించారు. - వైఎస్ అధికారం చేపట్టిన తర్వాత ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని శాచ్యురేషన్ పద్ధతిలోకి తీసుకెళ్లారు. 2011-12 విద్యాసంవత్సరంలో మైనార్టీలకు ఫీజురీయింబర్స్‌మెంట్ కోసం కేటాయించిన మొత్తం రూ.250.40 కోట్లు. 2006-07లో రూ.14 కోట్లుకాగా ప్రస్తుతం రూ.165 కోట్లకు చేరింది. - వైఎస్ అధికారంలోకి రాక ముందు మైనార్టీ విద్యార్థులకు కేవలం స్కాలర్షిప్ మాత్రమే భరించేవారు. ట్యూషన్ఫీజును విద్యార్థుల తల్లిదండ్రులే భరించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఎంబీబీఎస్ లాంటి కోర్సుల్లో సైతం మైనార్టీ విద్యార్థులు ఎలాంటి సంకోచం లేకుండా చేరగలుగుతున్నారని, ఈ ప్రభావం కొన్నేళ్ల తర్వాత ముస్లింలలో గణనీయ ప్రగతి సాధిస్తుందని ముస్లిం పెద్దలే వ్యాఖ్యానిస్తున్నారు. 2006 నుంచి ఇప్పటిదాకా 14 లక్షల మందికి లబ్ధి పొందారు. ఏటా 50శాతం మందికి ప్రొఫెషనల్ కోర్సుల్లో అడ్మిషన్లు వస్తున్నాయి. ఈ కోర్సులో మైనార్టీ బాలికల కోటా 38 శాతానికి చేరడం గమనార్హం. ప్రముఖ ఆర్థికవేత్త అబూసలేషరీఫ్ నివేదికలోనూ ముస్లిం విద్యాభివృద్ధికి బాటలు వేస్తున్న వైఎస్సార్ కలల పథకం గురించి ప్రస్తావించడం గమనార్హం. ‘ఉపకారం’ లేని బాబు... - తానే హైటెక్‌సిటీ నిర్మించానని చెప్పుకునే చంద్రబాబుకు అప్పుడు పల్లెల్లోని పేదలు గుర్తురాలేదు. కనీసం బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లిచ్చేందుకు కూడా మనసు వచ్చేది కాదు. ఒక్కో కాలేజీలో 100 మంది పిల్లలుంటే 10 మందికో, 20 మందికో స్కాలర్షిప్ మాత్రమే ఇచ్చేవారు. అది కూడా మరుసటి ఏడాది వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి ఉండేది. ఏటా కేవలం పదుల కోట్లలో స్కాలర్షిప్లను పదిశాతంమంది విద్యార్థులకిచ్చి చేతులు దులుపుకునేవారు. - ఫీజులు కట్టలేక విద్యార్థులు అవస్థలు పడుతుంటే విద్యార్థి సంఘాలు ఉద్యమించినప్పుడు... వాటిని రద్దు చేస్తానని బెదిరించడమే కాక తన పార్టీకి అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘాన్ని కూడా రద్దు చేశారు. స్కాలర్‌షిప్‌ల పెంపు కోసం బీసీ విద్యార్థులు ఉద్యమిస్తే వారిపై లాఠీచార్జి చేయించారు. - స్కాలర్షిప్ ఇవ్వడానికి సిద్ధపడని బాబు ప్రభుత్వం ఇంటర్ స్థాయి నుంచే విద్యను కార్పొరేటీకరణ చేసే ప్రయత్నం చేసింది. - చదువుకే కాదు..ఉపాధికల్పనలోనూ బాబు హయాం చీకటి యుగమే. బీసీ యువతకు స్వయం ఉపాధి కోసం ఇస్త్రీపెట్టెలు, మోకులు, సైకిళ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. -
సంకుచితాలకు అతీతంగా ఓటేయండి: ప్రణబ్ ముఖర్జీ
బాధ్యతాయుతంగా ఈ హక్కును వినియోగించుకోండి కొత్త ఓటర్లకు రాష్ట్రపతి ప్రణబ్ ఉద్బోధ న్యూఢిల్లీ: తగిన సమాచారాన్ని తెలుసుకుని, సంకుచిత ప్రతిఫలాలకు అతీతంగా ఓటు వేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశంలో కొత్తగా నమోదైన 1.27 కోట్ల యువ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని ఆయన వారికి ఉద్బోధించారు. అన్నీ తెలుసుకుని, సంకుచిత ప్రతిఫలాలకు అతీతంగా నైతిక విలువలతో ఓటు హక్కును వినియోగించుకోగలరని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలో శనివారం ఏర్పాటైన 4వ జాతీయ ఓటర్ల దినోత్సవంలో రాష్ట్రపతి ప్రణబ్ మాట్లాడారు. ప్రతి ఎన్నికల్లోనూ సగర్వంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని దేశంలోని దాదాపు 81 కోట్ల మంది ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు... - మిలిటెంట్లు, నక్సల్స్ గ్రూపుల బెదిరింపులకు, ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చినప్పుడల్లా దేశప్రజలు వెరవలేదని, పోలింగ్‌లో పెద్దసంఖ్యలో పాల్గొన్న ఓటర్లు తమ ధైర్య సాహసాలను చాటుకున్నారు. - రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారత్‌తో పాటు పలు దేశాలు స్వాతంత్య్రం పొంది, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను స్వీకరించినా, కొద్ది దేశాలు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగాయి. - చాలా దేశాలు నియంతలు లేదా మిలటరీ జుంటాల పాలనలోకి వెళ్లాయి. - పేదరికం సహా పలు సమస్యలను ఎదుర్కొంటున్నా, భారత్ తన ప్రజాస్వామ్యాన్ని మాత్రం బలోపేతం చేసుకోగలిగింది. - ప్రరజాస్వామిక ప్రక్రియలో ఓటరే కీలక పాత్రధారి. ప్రజా ప్రాతినిధ్య సంస్థలన్నీ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టాలి. కార్పొరేట్ రంగం కీలక పాత్ర పోషించాలి: సీఈసీ సంపత్ ఓటర్లకు అవగాహన కల్పించడంలో కార్పొరేట్ రంగం కీలక పాత్ర పోషించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్.సంపత్ పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఓటర్లకు అవగాహన కల్పించడాన్ని కార్పొరేట్ రంగం తన సామాజిక బాధ్యతలో భాగంగా చేసుకోవాలన్నారు. ఈ ఏడాది జరగనున్న 16వ లోక్‌సభ ఎన్నికల నిర్వహణను సవాలుగా తీసుకోవాలని ఎన్నికల అధికారులకు, సిబ్బందికి ఆయన పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా దాదాపు 81 కోట్ల మంది ఓటర్లు 9 లక్షల పోలింగ్ కేంద్రాల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చెప్పారు. లక్షలాది మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాలుపంచుకోనున్నట్లు తెలిపారు. గడచిన కొద్ది నెలల్లో 3.90 కోట్ల మంది కొత్తగా ఓటర్ల జాబితాల్లో చేరారని, వారిలో 1.27 కోట్ల మంది కొత్తగా ఓటు హక్కు పొందిన వారని చెప్పారు. సకాలంలో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ఎన్నికల్లో విశిష్టమైన సేవలందించిన ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి విజయ్ దేవ్‌కు ఎన్నికల కమిషన్ జాతీయ అవార్డును అందజేసింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా విజయ్ దేవ్ ఈ అవార్డును అందుకున్నారు.