breaking news
voluntary service
-
KOITA FOUNDATION: నై‘పుణ్య’ సేవ
కెరీర్లో దూసుకుపోతే ఆ కిక్కే వేరు. ‘అంతమాత్రాన సామాజిక బాధ్యత మరచిపోతే ఎలా’ అనుకునేవారు కొద్దిమంది ఉంటారు. అలాంటి వారిలో రేఖ–రిజ్వాన్ దంపతులు ఒకరు. తాము పనిచేస్తున్న రంగాలలో మంచి పేరు తెచ్చుకున్న రేఖ–రిజ్వాన్‌లు స్వచ్ఛందసేవారంగం లోకి వచ్చారు. ‘కోయిట ఫౌండేషన్’ ద్వారా హెల్త్‌కేర్ రంగంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మేనేజ్మెంట్ కన్సల్టెంట్, స్టార్టప్ ఫౌండర్స్‌గా విజయపథంలో దూసుకుపోయిన రిజ్వాన్, రేఖ కోయిటలు దాతృత్వం దారిలో ప్రయాణం ప్రారంభించారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసిన రేఖకు వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటో తెలిశాయి. ఈ నేపథ్యంలోనే స్వచ్ఛంద సంస్థలకు సాంకేతిక సహాయం తోడైతే ఎలా ఉంటుంది అనే అంశంపై దృష్టి పెట్టింది. సాంకేతిక సహకారంతో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయనే విషయాన్ని అవగాహన చేసుకుంది. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్(ఎన్ఏబీహెచ్)లో సభ్యుడిగా ఉన్న రిజ్వాన్ డిజిటల్ హెల్త్ స్పేస్‌లో ఎన్నో ఆస్పత్రులతో కలిసి పనిచేశాడు. విలువైన అనుభవాన్ని సొంతం చేసుకున్నాడు. ‘కోయిట ఫౌండేషన్’ తరఫున ఐఐటీ–ముంబైలో కోయిట సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ (కెసీడీహెచ్)ను ప్రారంభించారు. క్లినికల్ అప్లికేషన్స్, హెల్త్‌కేర్ డాటా మేనేజ్మెంట్(హెల్త్‌కేర్ డాటా ప్రైవసీ, సెక్యూరిటీ), హెల్త్‌కేర్ ఎనాలటిక్స్... మొదలైన వాటిని తన ప్రాధాన్యత అంశాలుగా ఎంపిక చేసుకుంది కెసీడీహెచ్. ఆసుపత్రుల నిర్వహణ, ఆరోగ్య సంరక్షణకు సంబంధించి శిక్షణ ఇవ్వడానికి ప్రణాళికలు కూడా రూపొందించుకుంది కేసీడీహెచ్. హెల్త్ కేర్ కెరీర్‌కు సంబంధించి యంగ్ ప్రొఫెషనల్స్‌ను ఉత్సాహపరచడం తన ప్రధాన లక్ష్యం అంటున్నాడు రిజ్వాన్. లీడింగ్ ఇంజనీరింగ్ కాలేజీలు, హెల్త్‌కేర్ ఇన్స్టిట్యూట్లు పూనుకొని తగిన కోర్సులకు అవకాశం కల్పిస్తే తన లక్ష్యం నెరవేరడం కష్టమేమీ కాదంటాడు రిజ్వాన్. ‘టాటా మెమోరియల్ సెంటర్’లో క్యాన్సర్ ఆస్పత్రులు డిజిటల్ హెల్త్టూల్స్ను ఎడాప్ట్ చేసుకోవడంలో సహాయపడటానికి ‘కోయిట సెంటర్ ఫర్ డిజిటల్ ఆంకాలజీ’ని ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్‌ను నిర్వహించడం అనేది ఆస్పత్రులకు సవాలుగా మారిన నేపథ్యంలో దీనికి పరిష్కార మార్గాలు కనుక్కునే దిశగా ఆలోచనలు చేస్తుంది కేసీడీహెచ్. ‘మహారాష్ట్ర యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్’తో ఒప్పందం కుదుర్చుకుంది కేసీడీహెచ్. డిజిటల్ హెల్త్‌కు సంబంధించి పరిజ్ఞానం విషయంలో వైద్యులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు... మొదలైన వారికి ఈ విశ్వవిద్యాలయంలో శిక్షణ ఇస్తారు. ఇతర రాష్ట్రాలలో కూడా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు రూపొందించే విషయంపై చొరవ చూపుతున్నారు రిజ్వాన్–రేఖ దంపతులు. ‘మెటర్నల్ హెల్త్’కు సంబంధించి ఫౌండేషన్ ఫర్ మదర్ అండ్ చైల్డ్‌హెల్త్(ఎఫ్ఎంసిహెచ్)తో కలిసి పనిచేస్తోంది కోయిట సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్. ‘ఎఫ్ఎంసిహెచ్’ తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని పర్యవేక్షించే లక్ష్యంగా ఏర్పడిన స్వచ్ఛంద సంస్థ. ఇందులో ప్రతి ఫీల్డ్వర్కర్కు కొన్ని కుటుంబాల పర్యవేక్షణ బాధ్యత ఉంటుంది. ‘నూట్రీ’ యాప్ ద్వారా ఫీల్డ్ ఆఫీసర్లకు ఇన్పుట్ డాటాతో ఔట్పుట్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. మ్యాజిక్ బస్, స్నేహా, విప్ల ఫౌండేషన్‌లాంటి ఎన్నో సంస్థలతో కలిసి పనిచేస్తోంది కోయిట ఫౌండేషన్. ‘చేయాల్సిన పని సముద్రమంత పెద్దదిగా ఉంది. అయినప్పటికీ చేయాలనే ఆసక్తి ఉంది’ అంటుంది రేఖ. -
సూపర్ స్పెషాలిటీ డాక్టర్లకు టీటీడీ ఆహ్వానం
తిరుమల: టీటీడీ నిర్వహించనున్న శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ ఆస్పత్రిలో స్వచ్ఛంద సేవలు అందించడానికి దేశంలోని గుర్తింపు పొందిన ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పీడియాట్రిక్ కార్డియో థోరాసిక్ సర్జన్లు, వైద్యులను ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. టీటీడీ ప్రాణదాన పథకం కింద నిర్వహించనున్న ఈ ఆస్పత్రిలో నవజాత శిశువులు, పిల్లలకు గుండె చికిత్స, వైద్య సేవలు అందించడం కోసం కనీసం 15 ఏళ్ల అనుభవం కలిగిన హిందూ మతానికి చెందిన వైద్యులు వారి ఆసక్తిని తెలియజేయాలని కోరింది. ఆసక్తి గల వైద్యనిపుణులు cmo. adldirector@gmail. com మెయిల్ ఐడీకి తమ వివరాలతో పాటు ఏయే కేటగిరీ కింద ఆసక్తి ఉందో తెలియజేస్తూ, వారి అర్హత పత్రాలను జత చేయాలని టీటీడీ కోరింది. ఆప్షన్ అ: ఈ విధానంలో స్వచ్ఛంద సేవ కోసం వచ్చే డాక్టర్‌తో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులకు ఉచిత వసతి, ప్రోటోకాల్ దర్శనం, తిరుమల–తిరుపతి మధ్య ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తారు. ఆప్షన్ ఆ: ఈ విధానంలో స్వచ్ఛంద సేవకు ఆసక్తి కనపరిచే వైద్య నిపుణులకు టీటీడీ నియమ నిబంధనల మేరకు పరస్పర ఒప్పందం ప్రకారం పారితోషికం చెల్లిస్తారు. వీరికి శ్రీవారి దర్శనం, రవాణా సదుపాయాలు ఉండవు. -
శభాష్ విహారి.. నువ్వు నిజంగా చాలా గ్రేట్ గురూ
లండన్: టీమిండియా టెస్టు బ్యాట్స్‌మన్, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారి మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. కరోనా కాలంలో తన మిత్రులు, అనుచరులతో కలిసి ఓ బృందాన్ని ఏర్పాటు చేసి అవసరాల్లో ఉన్నవాళ్లకు సాయం చేస్తున్న విహారి.. తాజాగా ప్రేమోన్మాది చేతిలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ అమ్మాయిని కాపాడాడు. సరైన సమయంలో వైద్యానికి అవసరమైన డబ్బును అందించడంతో ప్రియాంక అనే ఆ అమ్మాయి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి కోలుకుంటుంది. As promised yesterday to Priyanka’s family. They’ll be receiving funds from me today n get her surgery started asap. She deserves to have a better life and it’s all of our responsibility to give it to her.thank you everyone who has come forward@Hidderkaran special mention to you — Hanuma vihari (@Hanumavihari) June 7, 2021 వివారాల్లోకి వెళితే... శ్రీకాంత్ అనే అబ్బాయి ప్రేమ పేరుతో బాధితురాలు ప్రియాంకను నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో శ్రీకాంత్ ఓ రోజు ప్రియాంకకు ప్రపోస్ చేయగా.. ఆమె నిరాకరించింది. దీంతో ఆవేశానికి లోనైన శ్రీకాంత్.. కత్తితో ప్రియాంకపై దాడి చేసి, ఆమె గొంతు కోశాడు. ఘటనా స్థలంలో నిర్జీవంగా పడివున్న ప్రియాంకను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఆపరేషన్ కోసం 6 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. అంత మొత్తంలో డబ్బులు చెల్లించుకోలేని ప్రియాంక కుటుంబసభ్యులు సోషల్ మీడియా ద్వారా దాతలను అభ్యర్ధించారు. ఈ విషయం తెలుసుకున్న హనుమ విహారి.. వెంటనే స్పందించి ఆ అమ్మయి వైద్యానికి అవసరమయ్యే 5 లక్షలు పంపాడు. ఆపరేషన్ తర్వాత ప్రియాంక ప్రస్తుతం కోలుకుంటోంది. విహారి చేసిన సహాయానికి ప్రియాంక, ఆమె కుటుంబ సభ్యులతో పాటు విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆడేందుకు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విహారి అక్కడి నుంచే భారతీయుల అవస్థలపై కంట కనిపెట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 100 మంది వలంటీర్లతో విహారి ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఈ బృందంలో విహారి భార్య ప్రీతి, సోదరి వైష్ణవి, ఆంధ్ర రంజీ సహచరులు కూడా ఉన్నారు. వీరందరూ పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ లాంటి పలు సేవల్ని ప్రజలకు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే, 27 ఏళ్ల హనుమ విహారి ఇప్పటివరకు 12 టెస్టులు ఆడి ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీల సహాయంతో 624 పరుగులు సాధించాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ డ్రా చేసుకున్న సిడ్నీ టెస్టులో విహారి.. అశ్విన్‌తో కలిసి నాలుగు గంటల పాటు పోరాడి జట్టును గట్టెక్కించి విషయం తెలిసిందే. చదవండి: ఆసీస్ వికెట్ కీపర్‌కు తీవ్ర గాయాలు.. పెదాలపై ఏడు కుట్లు -
ప్రక్షాళనతోనే స్వచ్ఛంద సేవకు పుష్టి
దిలీప్ రెడ్డి ఎన్జీవోలంటేనే సక్రమాలు, అక్రమాల కలయిక. రాజకీయంగా తమకు అనుకూలంగా ఉండి, తమకు అడ్డు రానప్పుడు.. అవి ఏం చేసినా ప్రభుత్వాలకు పట్టదు. నిబంధనలను పాటించని ఎన్జీవోలన్నిటిపై నిష్పాక్షిక విచారణ జరిపి, నిజాన్ని నిగ్గు తేలిస్తే నిజమైన స్వచ్ఛంద సేవ చేసే సంస్థలే మిగులుతాయి. త్యాగనిరతిగల సంస్థలెన్నో ఉన్నాయి కూడా. స్వచ్ఛంద సంస్థల ముసుగులో పారదర్శకతకు తిలోదకాలిచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరించడాన్ని ఏ పౌర సమాజమూ ప్రోత్సహించకూడదు. ప్రజాధనం దుర్వినియోగాన్ని ఉపేక్షించకూడదు. అభివృద్ధి చెందిన దేశాల్లో పౌర సమాజం చైతన్యవంతమైనదిగా ఉంటుం దనేది బలమైన అభిప్రాయం. మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో... పౌర సమాజానికి సంపూర్ణ స్థాయి చేతన లేనందునే పాలకులు బాధ్యతా యుతంగా, జవాబుదారీతనంతో వ్యవహరించరనే భావన ఉంది. అది కొంత వరకు నిజం. సామాజిక చైతన్యం కొరవడటానికి కారణాలు అనేకం. నిరక్షరాస్యత, పేదరికం, సాంఘిక అసమానతలు తదితర పలు అంశాలు సమాజ వికాసాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఫలితంగా రాజకీయ వ్యవస్థతో పాటు అధికార యంత్రాంగం కూడా ప్రజా జీవితాన్ని, సమాజ గమనాన్ని శాసించే స్థితి బలపడింది. అయిదేళ్లకోసారి వచ్చే ఎన్నికలప్పుడు తప్ప ప్రజాభిప్రాయానికి పెద్దగా స్థానం లేదు. ఇది మారాలంటే ైచైతన్యవంతమైన పౌర సమాజం, సేవా దృక్పథంగల స్వచ్ఛంద సంస్థలు, ఉత్ప్రేరకాలుగా పనిచేసే ఉద్యమ సంఘాలు, బాధ్యతగల భాగస్వాములుగా ఉండే ప్రభుత్వేతర సంస్థలు క్రియాశీలంగా ఉండాలి. ఎన్జీవోల స్థాయి నుంచి మన సమాజం ఇప్పుడిప్పుడే పౌర సామాజిక సంస్థ (సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్-సీఎస్‌వో)ల స్థాయికి ఎదుగుతోంది. నిర్భయ కేసు సందర్భంగా, జన్ లోక్‌పాల్ బిల్లు కోరినపుడు...ఇలా కొన్ని సందర్భాల్లోనే పౌర సమాజం సంఘటిత శక్తి వెల్లడైంది. అదింకా పెరగాలనేదే మెజారిటీ ప్రజల అభిప్రాయం. సమాజంలోని మిగతా అన్ని రంగాల్లోలాగానే ఇక్కడా మంచీచెడూ కలగలిసి ఉన్నాయి. ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, సామాజిక వేత్తలు.... ఇలా అందరి సమీకృత కృషి ద్వారా ఎన్జీవోలు, పౌర సంఘాల్లో మంచిని పెంచి, చెడును తగ్గించాల్సిన అవసరం ఉంది. అన్వయంలోనే లోపమా! ఎన్జీవోల(నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్)ను ప్రభుత్వేతర సంస్థలుగా తెలుగులో వ్యవహరించాలి. కానీ, ఎన్జీవోను స్వచ్ఛంద సంస్థకు సమానార్థ కంగా పత్రికలు రాస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థంటే.. స్వచ్ఛందంగా సేవ చేసే సంస్థని అర్థం. దేశంలోని దాదాపు 99 శాతం స్వచ్ఛంద సంస్థలు ఒకరిద్దరు వ్యక్తులు నడిపేవే. కుటుంబ పోషణ తదితర ఖర్చులకు సరిపడా ఆదాయాన్నిచ్చే వృత్తి లేదా ఉద్యోగం వేరే ఉండి... మిగతా సమయంలో కొంత భాగాన్ని సేవకు ఉపయోగించేవారు వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మంది కూడా ఉండరు. ఎన్జీవోల నిధులను తమ అవసరాలకు పరిమితం గానైనా వాడుకోవడం సర్వసాధారణం. తొలి ‘అక్రమం’ అక్కడే మొదలు. నేను ఫలానా సంస్థలో పనిచేస్తున్నప్పుడు లక్ష రూపాయల జీతం వచ్చేదని, పని మానుకొని పేదలు, అనాథల సేవకే జీవితాన్ని అర్పించి... నా కోసం రూ. 50-60 వేలు తీసుకోవడంలో తప్పేంటి? అని ప్రశ్నించే స్వచ్ఛంద సంస్థల వాళ్లు చాలా మందే ఉన్నారు. అనాథల లేదా బాధిత వర్గాల సేవల కోసం దాతలు ఇచ్చిన సొమ్మును కొంతైనా వాడుకుంటూ ‘స్వచ్ఛంద సేవ’ అనడం, వాటిని స్వచ్ఛంద సంస్థలనడం అర్థరహితం. వివాదాలెన్నో... దేశవ్యాప్తంగా వేలాది ఎన్జీవోలు పనిచేస్తున్నాయి. అవన్నీ వివాదాల్లో లేవు. వచ్చిన విరాళాలకు, చేసిన ఖర్చుకు పొంతన లేదని, సరైన రికార్డులు చూపించలేదని ప్రభుత్వం వాటి అనుమతులు రద్దు చేసిన సందర్భాలు కోకొల్లలు. ఆయా సంస్థలు వివాదాల్లో ఉన్నా మీడియా పెద్దగా పట్టించుకోదు కాబట్టి ప్రజలకు తెలియదు. అయితే.. అత్యున్నత హోదాల్లోని వ్యక్తులు నడుపుతున్న సంస్థలు వివాదాల సుడిగుండాల్లో చిక్కుకున్నవీ చాలా ఉన్నాయి. ప్రత్యేకించి రాజకీయాలకు సంబంధించి వ్యక్తులు నడిపే సంస్థలు, కొంత మంది నాయకులను లక్ష్యంగా చేసుకొని ఉద్యమాలు, న్యాయ పోరాటాలు చేస్తున్న సంస్థలు.. వివాదాల్లో చిక్కుకున్నప్పుడు వాటి గురించి ప్రజలకు తెలుస్తుంది. అంత వరకు.. ఎన్జీవోలు ఏం చేస్తున్నాయి? వాటి అసలు లక్ష్యం ఏమిటి? నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయి? ఎలా ఖర్చు చేస్తున్నారు? చేస్తున్న ఖర్చులు సక్రమమా? అక్రమమా? ఇవన్ని ఎవరికీ తెలియని విషయాలు. ఈ విషయాల గురించి ఎవరైనా అడిగినా.. సంస్థల నిర్వాహకులు చెప్పరు. అక్కడే వస్తుంది చిక్కు. స్వచ్ఛంద సంస్థలేవైనా వాటి వ్యవహారాలన్నీ పారదర్శకంగా ఉండాలి. అప్పుడే అవి విశ్వసనీయతను పొందగలుగుతాయి. సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగినా.. ఇస్తున్న వారు తక్కువే. దశాబ్ది కిందట రూపుదిద్దుకున్న కేంద్ర సమాచార హక్కు చట్టంలో ఈ అంశాన్ని విస్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలే కాకుండా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా నిధులు పొందు తున్న ప్రభుత్వేతర, స్వచ్ఛంద సంస్థలు కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తాయి. కానీ, మెజారిటీ స్వచ్ఛంద, ప్రభుత్వేతర సంస్థలలో తాము సహ చట్టం పరిధిలోకి రామనే తప్పుడు అభిప్రాయం బలంగా ఉంది. విమర్శలు కూడా తక్కువేం కాదు ఢిల్లీ శాసనసభ ఎన్నికల సందర్భంగా ఎన్జీవోలపై బోలెడన్ని విమర్శలు, ప్రతి విమర్శలు రేగాయి. కారణం.. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసిన కిరణ్ బేడీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌లు ఇద్దరూ రాజకీయాల్లోకి రాకముందు ఎన్జీవోలు నడపడమే. కేజ్రీవాల్ ‘పరివర్తన్’లో ఎన్నో అక్రమాలు జరిగాయని బీజేపీ విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టింది. దేశంలో ఆర్టీఐ అమలును క్షుణ్ణంగా పరిశీలించి, పరిశోధన జరపడానికి అరవింద్ కేజ్రీవాల్ నడిపిన ఒక పరిశోధనా వేదికకు జిందాల్ సంస్థల నుంచి పెద్ద మొత్తంలో విరాళాలు అందాయని విమర్శలు వచ్చాయి. పర్యావరణానికి హాని కలిగించే వారి నుంచి విరాళాలు తీసుకోవడమేమిటి? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పుకోలేక ఇబ్బంది పడ్డారు. కిరణ్ బేడీ ‘విజన్ ఫౌండేషన్’, ‘నవ్‌జ్యోతి ఫౌండేషన్’లపై చీటింగ్ కేసులూ నమోదయ్యాయి. తాను పొందుతున్న రాయితీల్ని, వాస్తవాల్ని మరుగుపరచి, రెండేసి చోట్ల విమాన చార్జీలు తీసుకున్నారని కూడా విమర్శలొచ్చాయి. ‘లోక్‌సత్తా’ వంటి రాజకీయ పార్టీలు సైతం విరాళాల విషయంలో పారదర్శకంగా ఉండక పోవడం వివాదాస్పదమైంది. పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తుల ఎన్జీవోల మీదే ఇన్ని విమర్శలుంటే.. మిగతా వాటి సంగతేమిటో అర్థం చేసుకోవచ్చు. స్వచ్ఛంద సంస్థలన్న పదాన్నే అప్రదిష్ట పాల్జేసిన సంస్థలెన్నో ఉన్నాయి. నిన్నటికి నిన్న ఒక సంస్థ ఖైదీల పిల్లలకు గొప్పగా సేవ చేస్తున్నట్టు నమ్మించి ఒక మీడియా సంస్థ ప్రశంసలను సైతం పొందింది. తీరా లోతుల్లోకెళితే, చట్టాలకు, నిబంధనలకు లోబడి అది కార్యకలాపాలను నిర్వహించటం లేదని తేలింది. ఇటీవలి వరకు పలు జోకులు కూడా ప్రచారంలో ఉండేవి. మచ్చుకి ఒకటి... ‘అమ్మాయికి సంబంధం చూస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వో ద్యోగా? పరవాలేదు! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగా, బేషుగ్గా ఇవ్వొచ్చు! ఎన్జీవో నడుపుతున్నాడా, ఇంకేం, కళ్లు మూసుకొని ఇచ్చేయండి!’ మంచి చెడుల కలయిక... మూడు దశాబ్దాలుగా బాల కార్మికుల విముక్తి కోసం పనిచేస్తున్న సత్యార్థికి నోబెల్ శాంతి బహుమతి లభించడం గర్వించదగ్గ అంశం. 1992లో వచ్చిన బాల కార్మిక నిరోధక చట్టం రూపకల్పనలో సైతం ఆయన పాత్ర ఉందం టారు. నోబెల్‌కు ముందు.. ఆయన మీదా విమర్శలున్నాయి, ప్రభుత్వాలకు అసంతృప్తి ఉండేది. ‘యునెస్కో’ ఏర్పాటు చేసిన ‘ఎడ్యుకేషన్ ఫర్ ఆల్’కు చైర్మన్‌గా నియమించి సత్యార్థిని ఏడెనిమిదేళ్ల క్రితమే అంతర్జాతీయ సమాజం గౌరవించింది. కానీ భారత ప్రభుత్వం అందుకు అంగీకరించక, ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించాలని యునెస్కోకు లేఖ రాయడంతో వారాయన్ను ఆ పదవి నుంచి తప్పించారు. ఎన్జీవోలంటేనే సక్రమాలు, అక్రమాల కలయికగా చూడాల్సిన పరిస్థితి. ఎన్జీవోలన్నీ అక్రమాలే చేస్తున్నాయనిగానీ, అన్నీ సక్రమంగానే ఉన్నాయనిగానీ అనడానికి లేదు. ఎన్జీవోల మీద విమర్శలు, ఆరోపణలు వచ్చిన వెంటనే వాటిపై నిష్పాక్షిక దర్యాప్తును జరిపించి నిజాన్ని నిగ్గు తేల్చే వ్యవస్థ మన దేశంలో లేదు. రాజకీయంగా తమకు అనుకూలంగా ఉండి, తమ దారికి అడ్డురానప్పుడు.. అవి ఏం చేసినా ప్రభుత్వాలకు పట్టదు. సమాజానికి ఎంత మంచిని చేస్తున్నా తమ దారికి అడ్డువస్తే మాత్రం అవి వాటికి ఏదో ఒకలా సమస్యను సృష్టించడం తప్పదు. నిబంధనలను పాటిం చని ఎన్జీవోలన్నిటి మీద నిష్పాక్షిక విచారణ జరిపి, వాటి అసలు స్వరూపాన్ని బయటపెడితే నిజమైన అర్థంలో స్వచ్ఛంద సేవ చేసే సంస్థలే మిగులుతాయి. అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అన్నీ ప్రభుత్వమే చేయలేదనే విశాల దృక్పథంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ప్రభుత్వ-ప్రజా సంస్థల భాగస్వామ్యంలో వ్యయం చేస్తాయి. ఎన్జీవోల ప్రత్యక్ష పాత్ర, ప్రమేయంతో కార్యకలాపాలను జరిపిస్తాయి. కాబట్టి నిఖార్సయిన సంస్థలే మిగిలేలా చూడాల్సిన బాధ్యత వాటిదే. కేంద్ర ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది? విదేశీ విరాళాలను పొందుతున్న సంస్థలన్నీ ఏటా తమ విరాళాలు, ఖర్చుల వివరాలను కేంద్ర హోం శాఖకు పంపాలి. దేశంలో దాదాపు 45 వేల ఎన్జీవోలకు, సీఎస్‌వోలకు విదేశీ విరాళాలు అందుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వాటి సంఖ్య 5 వేల పైమాటే. వాటిలో వివరాలను సమర్పించని 1,441 సంస్థలకు కేంద్ర హోం శాఖ గత ఏడాది అక్టోబర్‌లో నోటీసులు పంపింది. అందులో 299 సంస్థలు తూతూ మంత్రంగా సమాధానాలు పంపాయి. 510 సంస్థలు సదరు చిరునామాల్లో లేవని, ఆ పేర్లే తమకు దొరకలేదని పోస్టల్ శాఖ వాటి నోటీసులను తిప్పి పంపించింది. మిగతా 632 సంస్థల నుంచి 2015 మార్చి 3 వరకు సమాధానం రాలేదు. సమాధానాలిచ్చిన 299 సంస్థల పరిస్థితిని హోం శాఖ పరిశీలిస్తోంది. మిగతా 1,142 సంస్థల అనుమతులను రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. స్పందించని సంస్థలకు అందుకు తగ్గ కారణాలున్నాయా? అసలా సంస్థలు మనుగడలో ఉన్నాయా? ఉంటే, పారదర్శకతకు తిలోదకాలిచ్చి దాక్కొని కార్యకలాపాలు సాగిస్తున్నాయా? ఇవన్నీ నిగ్గుతేలాల్సి ఉంది. పౌరసమాజం బలపడే క్రమంలో... ఇలాంటివి కొన్ని తప్పక పోవచ్చు. కానీ, స్వచ్ఛంద సంస్థల ముసుగులో పారదర్శకతకు తిలోదకాలిచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరించడాన్ని ఏ పౌర సమాజమూ ప్రోత్సహించకూడదు. ప్రజాధనం దుర్వినియోగాన్ని ఉపేక్షించకూడదు. ఈమెయిల్: dileepreddy@sakshi.com