breaking news
vips and vvips
-
ఆలయాల్లో వీఐపీ సంస్కృతిని అరికట్టేలా మార్గదర్శకాలు జారీ చేయలేం
న్యూఢిల్లీ: దేవాలయాల్లో చాలా ముఖ్యమైన వ్యక్తులకు(వీఐపీలు) అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ రాచమర్యాదలు చేస్తూ ప్రత్యేక దర్శనాలు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) సుప్రీంకోర్టు తిరస్కరించింది. బృందావన్‌లోని శ్రీరాధా మదన్మోహన్ ఆలయంలో సేవాయత్‌గా పని చేస్తున్న విజయ్‌కిశోర్ గోస్వామి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆలయాల్లో వీఐపీలకు ప్రత్యేక మర్యాదలు చేయడం, సామాన్యులు ప్రత్యేక దర్శనం చేసుకోవాలంటే అదనంగా రుసుము వసూలు చేయడాన్ని ఆయన సవాలు చేశారు. 12 జ్యోతిర్లాంగాల్లో వీఐపీ దర్శనాల సంస్కృతి విపరీతంగా ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆలయాల్లో వీఐపీ సంస్కృతిని అరికట్టేలా ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు. పౌరులంతా సమానమేనని రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 సూచిస్తున్నట్లు గుర్తుచేశారు. దర్శనాలకు అదనంగా రుసుము వసూలు చేయడం సమానత్వ హక్కులను, మత స్వేచ్ఛను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. విజయ్‌కిశోర్ గోస్వామి పిటిషన్ శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చింది. దేవాలయాల్లో వీఐపీ సంస్కృతిని అరికట్టేలా ప్రభుత్వాలను ఆదేశిస్తూ తాము మార్గదర్శకాలు జారీ చేయలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. సమస్యను పరిష్కరించడానికి సమాజం, ఆలయ మేనేజ్మెంట్ కమిటీలే చొరవ తీసుకోవాలని సూచించింది. ఆలయాల్లో ప్రముఖులకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదని, భక్తులందరినీ సమానంగా చూడాలన్న అభిప్రాయం తమకు కూడా ఉందని పేర్కొంది. కానీ, మార్గదర్శకాలు మాత్రం జారీ చేయలేమని వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 పరిధిలోకి ఈ కేసు వస్తుందని తాము భావించడం స్పష్టంచేసింది. పిటిషన్‌ను విచారించలేం కాబట్టి తిరస్కరిస్తున్నామని తెలియజేసింది. అయితే, పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడం అనేది వీఐపీ సంస్కృతిని అరికట్టే సంబంధిత అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోకుండా అడ్డుకోలేదని ఉద్ఘాటించింది. ఆలయాల్లో వీఐపీలకు ప్రత్యేక మర్యాదలు చేయకుండా స్థానికంగా చర్యలు తీసుకోవచ్చని పరోక్షంగా తేల్చిచెప్పింది. -
ఆ లిఫ్ట్ ఎక్కేందుకు వీఐపీ, వీవీఐపీలకైతే ఓకే...
వృద్ధులు, వికలాంగులు సైతం రూ.100 టికెట్ కొనాల్సిందే సిబ్బందికి ఐడీ కార్డు తప్పనిసరి ఆలయ వేళలు రోజుకు 15 గంటలు లిఫ్టు పనివేళలు ఏడు గంటలే వ్యాపారుల ప్రయోజనాల కోసమే అధికారుల నిర్ణయం! విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు దేవస్థానం ఏర్పాటు చేసిన లిఫ్టు ఎక్కాలంటే అనేక నిబంధనలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అమ్మవారికి భక్తులు సమర్పించిన మొక్కుబడులు, కానుకల సొమ్ము నుంచి సుమారు రూ.50 కోట్లు వెచ్చించి మల్లికార్జున మహామండపాన్ని నిర్మించారు. దీనిలో సుమారు రూ.20 లక్షలు పెట్టి రెండు లిప్టులు ఏర్పాటు చేశారు. అయితే ఈ లిప్టును ఇప్పుడు భక్తులు వినియోగించుకునేందుకు అధికారులు అనేక నిబంధనలు విధిస్తున్నారు. వృద్ధులు, వికలాంగులపైనా కనికరం లేదా... సాధారణంగా వృద్ధులు, వికలాంగులు, గర్భిణులు కనపడితే వారికి సహాయం చేద్దామని భావిస్తాం. అయితే దేవస్థానం అధికారులు వారిపైనా కనికరం చూపడం లేదు. వృద్ధులు లిఫ్టు ఎక్కదలిస్తే వారు 65 ఏళ్లు దాటినట్లు ధృవపత్రం, వికలాంగులకు 40 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్నట్లు ధృవపత్రం చూపించాలంటూ నిబంధనలు విధించారు. దీంతో పాటు రూ.100 టిక్కెట్ తీసుకోవాలని నిబంధనల్లో పేర్కొన్నారు. ఆ టిక్కెట్‌పై మరొకరిని అనుమతిస్తామని నిబంధనల్లో తెలిపారు. అలా కాకుండా ఉచితంగా కొండపైకి వెళ్లదలిస్తే.. సాధారణ భక్తులతో కలిసి ఉచిత బస్సులో కొండపైకి చేరుకుని అక్కడ నుంచి కొంత దూరం బ్యాటరీ కారులో వెళ్లి తరువాత కొద్దిదూరం నడిచి అమ్మవారి దర్శనానికి వెళ్లాలని దేవస్థానం అధికారులు సెలవిస్తున్నారు. వీఐపీ, వీవీఐపీలకైతే ఓకే... అమ్మవారి దర్శనానికి వచ్చే వీఐపీ, వీవీఐపీలను మాత్రం లిఫ్టులో అనుమతిస్తారు. అందుకు సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణ భక్తులను అనుమతించని అధికారులు.. ప్రజాప్రతినిధులు, వారి అనుచరగణానికి వీలు కల్పించేందుకే ఇటువంటి నిబంధనలు విధించారనే విమర్శలు వస్తున్నాయి. దేవస్థానం నిత్యం ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు 15 గంటలపాటు పనిచేస్తుంటే.. లిఫ్టును మాత్రం మొక్కుబడిగా ఏడుగంటలే నడపాలని నిర్ణయించటం విచారకరం. కమిషనర్ ఆదేశాలు బేఖాతర్... ఇటీవల దేవాదాయ శాఖ కమిషనర్ వై.అనూరాధ దేవస్థానానికి వచ్చిన సందర్భంగా లిఫ్టును వినియోగించకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులకు ఈ లిఫ్టును ఉపయోగించాలంటూ ఆదేశాలిచ్చారు. దుర్వినియోగం అవుతోందని భావిస్తే అందులో ఎక్కేవారి ఐడీ కార్డులు అడగాలని సూచించారు. దీన్ని ఆసరాగా చేసుకున్న అధికారులు సాధారణ భక్తులు ఎక్కటానికి వీల్లేకుండా నిబంధనలు విధించటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకే! భక్తులు లిఫ్టు మార్గంలో కొండపైకి వెళితే ఘాట్‌రోడ్డులోని దుకాణాల్లో పూజా సామగ్రి కొనుగోలు చేయకుండా నేరుగా అమ్మవారి దర్శనానికి వెళతారు. అందువల్ల వ్యాపారులు తమకు నష్టాలు వస్తున్నాయని గోల చేయడంతో అధికారులు ఈ నిబంధనలు విధించారని భక్తులు విమర్శిస్తున్నారు.