breaking news
vinod royal
-
నన్నే మీ బిడ్డ అనుకోండి: పవన్
-
నన్నే మీ బిడ్డ అనుకోండి
- మీకెప్పుడూ అందుబాటులో ఉంటా.. - నేరస్థులను శిక్ష పడేలా ప్రభుత్వాన్ని కోరతా - వినోద్ రాయల్ తల్లితో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సాక్షి ప్రతినిధి, తిరుపతి ‘నన్నే మీ బిడ్డనుకోండి. మీకెప్పుడూ అందుబాటులోనే ఉంటా. ఏ కష్టమొచ్చినా వెంటనే స్పందించి సాయమందిస్తా'నని జనసేన అధినేత, సినీహీరో పవన్ కల్యాణ్ తిరుపతిలోని వినోద్ రాయల్ తల్లిదండ్రులకు భరోసా నిచ్చారు. రాయల్ హత్యోదంతంలో నేరస్థులైన వారికి చట్టప్రకారం శిక్ష పడేలా ప్రభుత్వాన్ని కోరతానన్నారు. భవిష్యత్తులో సంఘటన పునరావృతం కాకుండా అభిమానులకు సూచిస్తానని చెప్పారు. గురువారం ఉదయం 11 గంటలకు తిరుపతి వచ్చిన పవన్ కల్యాణ్ ఎస్టీవీ నగర్‌లోని వినోద్ రాయల్ ఇంటికి వెళ్లి ఆయన తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ నెల 21న కోలారులో హత్యకు గురైన తన కుమారుడు వినోద్ రాయల్ గురించి ఆయన తల్లిదండ్రులు వేదవతి, వెంకటేశ్‌లు పవన్ కల్యాణ్‌కు సవివరంగా వివరించారు. చెట్టంత కొడుకును దూరం చేసుకుని కుంగిపోతున్నామనీ, కొడుకు చంపిన నేరస్థులకు శిక్ష పడేలా చూడాలని వేదవతి కోరింది. ఈ సందర్భంగా పవన్ అభిమాన సంఘ నాయకునిగా తన కుమారుడు వినోద్ చేసిన సేవా కార్యక్రమాలు, అవయువ దాన శిబిరాలను, కోలారులో చివరిసారిగా ప్రసంగించిన వీడియో విజువల్స్‌ను వేదవతి పవన్ కల్యాణ్‌కు చూపించి భోరున విలపించింది. వినోద్ రాయల్ సోదరి వినీత, సోదరుడు రాజాలతో పాటు కుటుంబ సభ్యులందర్నీ పలకరించిన పవన్ కల్యాణ్ గంటసేపు విషణ్ణవదనంతో కూర్చుండిపోయారు. నేరస్థులకు తప్పకుండా శిక్ష పడుతుందనీ, అభిమానులు క్షణికావేశంలో ఈ తరహా ఘాతుకాలకు పాల్పడటం మంచిది కాదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆయన వెంట జనసేన నాయకులు మారిశెట్టి రాఘవయ్య, టీటీడీ బోర్డు సభ్యుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, పవన్ కల్యాణ్ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు కిరణ్‌రాయల్, అనీఫ్, రియాజ్, లోకేష్, శంకర్‌గౌడ్‌లు ఉన్నారు. అనంతరం పవన్ శ్రీవారి దర్శనం కోసం తిరుమల కొండకు వెళ్లారు. శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్.. జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం సాయంత్రం ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు. పవన్ వస్తున్నాడనే సమాచారంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆలయం వద్దకు చేరుకోవడంతో.. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దర్శన అనంతరం భారి జనసందోహం మధ్య అభిమానుల తోపులాటల నడుమ పవన్ కళ్యాణ్ తన వాహనం వద్దకు చేరుకున్నారు. ఈ రోజు రాత్రికి తిరుమలలోనే బస చేసి శుక్రవారం ఉదయం మరో మారు శ్రీవారిని దర్శించుకుంటారని సమాచారం. -
60 రోజుల్లో అమెరికా వెళ్లాల్సిన బిడ్డ..
తన బిడ్డ మరో 60 రోజుల్లో అమెరికా వెళ్లాల్సిన వాడని.. అంతలోనే పక్క రాష్ట్రంలో ఇంత అఘాయిత్యం జరిగిపోయిందని కోలార్‌లో హత్యకు గురైన పవన్ అభిమాని వినోద్ రాయల్ తల్లి అన్నారు. తమ కుటుంబాన్ని పవన్ కల్యాణ్ పరామర్శించిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. తన కొడుకు ఎప్పుడూ పదిమందికి సేవ చేయాలి, అనాథాశ్రమం పెట్టాలి, ఫ్యాక్టరీ పెట్టి 200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అనేవాడని ఆమె తెలిపారు. ఆ రోజు కూడా కర్ణాటకలోని కోలార్‌లో అవయవదానం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేశాడని అన్నారు. అదే అక్కడివాళ్లకు కంటగింపుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రం కారులో బయల్దేరుతున్నానని, చికెన్ చేయాలని తనకు ఫోన్ చేసి చెప్పాడని, అంతలోనే కారు ఎక్కుతున్న పిల్లాడిని ఆపి, మాట్లాడాలని పది అడుగుల దూరం తీసుకెళ్లారని ఆమె అన్నారు. అక్కడ అతడితో ఏమీ మాట్లాడలేదని, కళ్లలో దుమ్ముకొట్టి పొడిచి చంపేశారని విలపించారు. గుండె బయటకు వచ్చేసిందని చెబుతున్నారని.. తన బిడ్డ ఇంకెలా బతుకుతాడని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. పవన్ కల్యాణ్ తన కొడుక్కి న్యాయం చేస్తానన్నారని.. తనకు కొడుకులా ఉంటానన్నారని ఆమె చెప్పారు. బిడ్డ ఆత్మకు శాంతి కలిగిద్దామని.. అతడి ఆశయాలను నెరవేరుద్దామని చెప్పారన్నారు. తమ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఇక కొడుకు లేని లోటు తీర్చలేనిదే అయినా.. తననే కొడుకులా అనుకోవాలంటూ పవన్ తమకు చెప్పారని వినోద్ రాయల్ తండ్రి చెప్పారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను వదిలేశారని ఆయన ఆరోపించారు. త్రినాథ్, సునీల్ అనే ఇద్దరికీ బాగా డబ్బుందని అంటున్నారని, వాళ్లిద్దరినీ కూడా పట్టుకుని శిక్షించాలని పవన్‌ను తాను కోరానని తెలిపారు. తప్పకుండా వాళ్లకు కూడా శిక్ష పడేలా చూస్తానని ఆయన చెప్పారన్నారు. -
60 రోజుల్లో అమెరికా వెళ్లాల్సిన బిడ్డ..