breaking news
vikas parva
-
'టీఆర్ఎస్ దరఖాస్తు చేసుకోలేదు'
కేంద్రంలో చేరికపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆ పార్టీ నుంచి వినతి వస్తే ఆలోచిస్తాం రాష్ట్రంలో ఒంటరిగానే బలోపేతం అవుతాం ఏపీ, తెలంగాణ మధ్య వివక్ష లేదు రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం మోదీ పాలనలో భారత్ పేరు ప్రపంచమంతా మార్మోగుతోంది సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రివర్గంలో చేరుతామని టీఆర్ఎస్ ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకోలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. టీఆర్ఎస్ నుంచి వినతి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకోవాలా లేదా అన్న విషయంపై ఆలోచిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘వికాసపర్వం’ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన అమిత్‌షా ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే బలోపేతం అవుతుందని, రాష్ట్రంలో పార్టీ విస్తరించడానికి అనువైన పరిస్థితులున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం ఉందన్నారు. ఇప్పుడు ఎన్నికలు లేనందున పొత్తుల ప్రస్తావన కూడా లేదని వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం 14వ ఆర్థిక సంఘం ముందుందని పేర్కొన్నారు. ఇప్పటిదాకా ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినా.. ఏపీకి అదే స్థాయిలో నిధులిచ్చి అభివృద్ధికి సహకరిస్తున్నామని చెప్పారు. ఏపీ, తెలంగాణ మధ్య మిగతా ఎలాంటి వివక్ష లేకుండా, రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తున్నామన్నారు. ప్రపంచంలో భారత్ పేరు మర్మోగిపోతోంది ప్రధానిగా నరేంద్రమోదీ రెండేళ్లు పూర్తి చేసుకున్నారని, ఈ రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా భారత్ పేరు మార్మోగిపోతోందని అమిత్ షా అన్నారు. భారత్ వైపు ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయని, ప్రధాని పనితీరు, సమర్థత, ముందుచూపే అందుకు కారణమని వివరించారు. అవినీతికి ఆస్కారం లేకుండా రెండేళ్ల పాలన స్వచ్ఛంగా ఉందని చెప్పారు. ఈ రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచుతున్నామని, దేశవ్యాప్తంగా 200 ప్రెస్మీట్లు పెడుతున్నామని తెలిపారు. ‘‘కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా గ్రామాల్లో ఉంటూ ప్రచారం చేస్తారు. కాంగ్రెస్ నేతలు అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారు. వారి అక్కసు సహజమే. వారు విమర్శలకు బదులు ప్రశంసలు చేస్తారని మేం ఆశించడం లేదు. ఇప్పుడు దేశానికి సమర్థవంతమైన, పని చేయగలిగే ప్రధాని ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలంతా మంత్రులే. ఒక్క ప్రధాని తప్ప అంతా ప్రధానమంత్రులే’’ అని షా ఎద్దేవా చేశారు. యూపీఏ హయాంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి గత ప్రభుత్వం మాదిరి కాకుండా తమ ప్రభుత్వం ప్రతీ అంశంలో ఒక స్పష్టతతో పనిచేస్తోందని అమిత్‌షా అన్నారు. ప్రధానిగా మోదీ కన్నా మన్మోహన్సింగ్ ఎక్కువ దేశాల్లో పర్యటించారని చెప్పారు. అయితే ప్రధానిగా మన్మోహన్ పర్యటనను విదేశాలు పట్టించుకోలేదని, మోదీ విదేశాలకు వెళ్తే రెడ్‌కార్పెట్ స్వాగతాలు పలుకుతున్నాయని వ్యాఖ్యానించారు. యూపీఏలో హయాంలో ప్రధాని అసమర్థత వల్ల ప్రభుత్వ విధానాల్లో పక్షవాతం వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పాలసీలు అప్పటి ప్రధానికి కూడా తెలిసేవి కావన్నారు. ఆ పదేళ్లలో రూ.12 లక్షల కోట్ల అవినీతి, కుంభకోణాలు జరిగాయన్నారు. అట్టడుగు స్థాయికి పథకాలు.. మోదీ చేపడుతున్న కార్యక్రమాలు దేశంలోని రైతులు, యువత, మహిళలు, పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. పట్టణాలు, పల్లెల మధ్య వ్యత్యాసం లేకుండా సమాంతర అభివృద్ధి జరుగుతోందన్నారు. గ్రామాల విద్యుద్దీకరణ, పేద మహిళలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు, కిసాన్ బీమా, ముద్రా బ్యాంకు, సుకన్య యోజన, భేటీ బచావో-బేటీ పడావో వంటి పథకాలు అట్టడుగు స్థాయికి చేరుతున్నాయన్నారు. యూరియా కొరత లేకుండా చేశామని, బ్లాక్ మార్కెట్లను నియంత్రించామని చెప్పారు. నల్లధనం వెనక్కి తీసుకురావడానికి ఇప్పటి దాకా కాంగ్రెస్ పార్టీయే అడ్డుపడిందన్నారు. అయినా బ్లాక్‌మనీ వెనక్కి తీసుకురావడానికి ఇప్పటికే చాలా పని జరిగిందని, త్వరలోనే తీసుకొస్తామని చెప్పారు. దళితులకు గుడి ప్రవేశాన్ని అడ్డుకోవడం దుర్మార్గమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, హన్స్‌రాజ్ గంగారాం అహిర్, బీజేఎల్పీ నాయకులు జి.కిషన్ రెడ్డి పాల్గొన్నారు. -
'కేంద్ర నిధులను సద్వినియోగం చేయండి'
విజయవాడ : కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులను సద్వినియోగం చేసి ప్రాజెక్టులు పూర్తిచేస్తే మంచిదని రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు సూచించారు. ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించేందుకు ఈ నెల 26 నుంచి జూన్ 15 వరకు చేపట్టిన వికాస్పర్వ్పై బుధవారం విజయవాడలో నిర్వహించిన సమావేశంలో హరిబాబు మాట్లాడారు. ఈ ప్రచారం కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. విశాఖ, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, అనంతపురం, తిరుపతి, నెల్లూరులో కేంద్ర మంత్రులు పర్యటించి కేంద్రం సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తారని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రతిపక్షాలు అడ్డుకోవడం వల్ల ఆగిన బిల్లులు, అవి చట్టరూపం దాల్చకపోవడంతో అభివృద్ధికి కలుగుతున్న అడ్డంకులను కూడా ఈ కేంద్ర మంత్రులు తెలియ జేస్తారని చెప్పారు. ఏపీ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందన్నారు. రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు, పోలవరం ప్రాజెక్ట్, రైల్వేజోన్ వంటి 4 ప్రధాన అంశాలపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని హరిబాబు ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వలన కలిగే ప్రయోజనం కంటే ఎక్కువ ప్రయోజనం చేకూరేలా కేంద్రం వ్యవహారిస్తుందన్నారు. నీతి అయోగ్ సూచించిన రూ.2,500 కోట్లలో ఇప్పటివరకు రూ.1,950 కోట్లను నూతన రాజధానికి అందించినట్లు హరిబాబు వెల్లడించారు. నీతి అయోగ్ అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.16,010. 45 కోట్లని, జాతీయ ప్రాజెక్ట్ అయినందున ఈ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 70:30 నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉందన్నారు. కానీ కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి కృషి ఫలితంగా కేంద్రం వంద శాతం భరించేందుకు నిర్ణయించిందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్రం ఇప్పటివరకు మొత్తం రూ.850 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. రైల్వే జోన్ కోసం బీజేపీ కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. వికాస్‌పర్వ్ కార్యక్రమం పూర్తి కాగానే రైల్వే మంత్రిని కలుస్తామని చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, వెలంపల్లి శ్రీనివాస్, కొచ్చర్లకోట లక్ష్మీపతిరాజా తదితరులు పాల్గొన్నారు.