breaking news
Vacant faculty posts
-
గురువు కరువు!
సాక్షి, అమరావతి: దేశంలోని ప్రతిష్టాత్మక జాతీయ ఉన్నత విద్యాసంస్థల్లో బోధన సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా బోధించేవారు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్ఈఆర్లు, సెంట్రల్ యూనివర్సిటీలతోపాటు వివిధ రకాల ఉన్నత విద్యాసంస్థల్లో పెద్ద ఎత్తున ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం... ఈ విద్యాసంస్థల్లో మొత్తం 18,940 టీచింగ్ పోస్టులు మంజూరు కాగా, 28.56 శాతం ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలలో 2,540 ప్రొఫెసర్ పోస్టులు మంజూరు కాగా, 56.18% ఖాళీగా ఉన్నాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వెల్లడించింది.బడ్జెట్లో 90శాతం జీతాలకే..⇒ జాతీయ స్థాయి ఉన్నత విద్యాసంస్థలతోపాటు సెంట్రల్ యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉండటం అధ్యాపక–విద్యార్థి నిష్పత్తిని ప్రభావితం చేస్తోందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభిప్రాయపడింది. ఇది బోధన నాణ్యతను దెబ్బతీస్తోందని హెచ్చరించింది.⇒ కాంట్రాక్టు ఉద్యోగాలను దశలవారీగా తొలగించి, అర్హత కలిగిన అధ్యాపకులను శాశ్వత ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత, న్యాయమైన వేతనాలను ఇచ్చేలా విద్యా మంత్రిత్వశాఖ నిర్మాణాత్మక ప్రణాళికను రూపొందించాలని సూచించింది.⇒ విద్యార్థుల నమోదు నిష్పత్తికి తగ్గట్టుగా బోధన సౌకర్యాలు కల్పించాలని తెలియజేసింది.⇒ ముఖ్యంగా ఉన్నత విద్యకు కేటాయించిన బడ్జెట్లో 90శాతం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే ఖర్చవుతుండటంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభ్యంతరం వ్యక్తంచేసింది. ప్రభుత్వాలు ఖర్చులను తగ్గించుకునేందుకు శాశ్వత ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయకుండా కాంట్రాక్టు పద్ధతులను అవలంబించడంతో వ్యవస్థలు దెబ్బతింటాయని హెచ్చరించింది. విద్యార్థుల నిష్పత్తికి తగ్గట్టుగా అధ్యాపకులు లేకుండా నాణ్యమైన విద్యను ఎలా అందిస్తారని ప్రశ్నించింది.⇒ శాశ్వత ప్రాతిపదికన అధ్యాపకులను నియమించాలని సూచించింది. మెరిట్ ఆధారంగా, పారదర్శకంగా అధ్యాపక నియామక ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేసింది. ఇందుకోసం నియామక ప్రక్రియలో ఆన్లైన్ దరఖాస్తులు, స్క్రీనింగ్, సమాచార మార్పిడి కోసం సాంకేతికతను పెంపొందించాలని, తద్వారా ఇతరుల జోక్యాలను తగ్గించవ్చని స్పష్టంచేసింది. -
డైట్ అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట : హన్మకొండలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ అయ్యంగార్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు ఎన్సీటీఈ మార్గదర్శకాలకు అనుగుణంగా సంబంధిత సబ్జెక్టులో (పీజీ, ఎంఈడీ) కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. సంబంధిత హెచ్ఎంలు, ఎంఈఓల ఆమోదంతో రేషనలైజేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఒక సబ్జెక్టుకు ఒకరి కన్నా ఎక్కువ ఉంటేనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 26లోగా ప్రిన్సిపాల్ ప్రభుత్వ డైట్ కళాశాలకు దరఖాస్తులు అందజేయాలన్నారు. తెలుగు మీడియంలో తెలుగు, సైన్స్, సోషల్ మెథడ్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ టెక్నాలజీ, లైబ్రేరియన్, ల్యాబ్ టెక్నిషియన్, ఆర్ట్ ఎడ్యుకేషన్ పోస్టులతో పాటు ఉర్దూ మీడియంలో ఉర్దూ, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్మెథడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇతర వివరాలకు, దరఖాస్తు ఫారాల కోసం డైట్ కళాశాలలోని సురేష్‌కుమార్‌ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.