breaking news
universal industries
-
సుప్రీంలో సుజనాకు చుక్కెదురు
యూకే కోర్టు తీర్పు అమలుచేయరాదని కోర్టును ఆశ్రయించిన సుజనా పిటిషన్‌ను తోసిపుచ్చిన ధర్మాసనం ఇక మారిషస్ బ్యాంకుకు రూ. 106 కోట్లు చెల్లించాల్సిందే సాక్షి, న్యూఢిల్లీ: మారిషస్ బ్యాంకుకు రూ. 106 కోట్లు చెల్లించాలని యూకే కోర్టు ఇచ్చిన తీర్పును అమలుచేయరాదని కోరుతూ కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. తమకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరుతూ సుజనా ఇండస్ట్రీస్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ నారీమన్‌తో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. కేంద్ర మంత్రి సుజనా చౌదరికి సంబంధించిన సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ హేస్టియా హోల్డింగ్స్ లిమిటెడ్ సూనేతె మారిషస్ దేశంలో ఒక అనుబంధ కంపెనీ ఏర్పాటుచేసింది. 2010లో మారిషస్ కమర్షియల్ బ్యాంకు(ఎంసీబీ) నుంచి హేస్టియా రూ. 100 కోట్ల మేర రుణం తీసుకుంది. ఈ లావాదేవీలో సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ హామీదారుగా ఉంది. రుణానికి సంబంధించి ఎంసీబీకి, హేస్టియాకు మధ్య రాతపూర్వక ఒప్పందం కూడా జరిగింది. ఇంగ్లాండ్ చట్టాలకు లోబడి ఈ ఒప్పందాన్ని అమలు చేస్తున్నట్టు ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. అయితే 2012 నుంచి ఎంసీబీకి హేస్టియా కంపెనీ బకాయిలు చెల్లించడం మానేసింది. బకాయిల విషయంలో స్పందించాలంటూ హేస్టియాకు ఎంసీబీ లేఖలు రాసినా ఫలితం దక్కలేదు. గతంలో చేసుకున్న ఒప్పందానికి సవరణలు చేయాలంటూ హేస్టియా కోరడంతో ఎంసీబీ అందుకు అంగీకరించింది. ఆ తరువాత కూడా బకాయిలు చెల్లించకుండా ఒప్పందానికి మరోసారి సవరణలు చేయించింది. ఇదే సమయంలో ఎంసీబీ అధికారులు హేస్టియా డెరైక్టర్‌గా ఉన్న సుజనా చౌదరితో సంప్రదింపులు జరిపారు. అయినా బకాయిలు మాత్రం చెల్లించలేదు. ఈమొత్తం వ్యవహారంలో ఇంగ్లిష్ కోర్టుల న్యాయపరిధిని సవాలు చేస్తూ హేస్టియా, సుజనా యూనివర్శల్ కంపెనీలు లండన్‌లోని క్వీన్స్ బెంచ్ కమర్షియల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఇంగ్లిష్ చట్టాల ప్రకారం చేసుకున్న ఒప్పందాల్లో జోక్యం చేసుకున్న అధికారం ఇంగ్లాండ్ కోర్టులకు ఉందని తేల్చిచెప్పింది. అంతేకాక వడ్డీ సహా బకాయి ఉన్న రూ. 105 కోట్లతో పాటు మరో రూ. 72 లక్షలను ఖర్చుల కింద ఎంసీబీకి చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును సైతం హేస్టియా, సుజనా కంపెనీలు పట్టించుకోలేదు. దీంతో ఎంసీబీ హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించి లండన్ కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరింది. సిటీ సివిల్ కోర్టులోఎంసీబీకి అనుకూలంగా తీర్పు వెలువడింది. హైకోర్టులో కూడా ఇదే తీర్పు వెలువడింది. తాజాగా శుక్రవారం సుప్రీం కోర్టులో హేస్టియా సంస్థ హైకోర్టు తీర్పు అమలుచేయరాదని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సుజనా సంస్థ బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విచారణకు సుజనా గ్రూపు తరపున సీనియర్ న్యాయవాది ఎం.ఎన్.రావు, ఎంసీబీ తరపున సీనియర్ న్యాయవాదులు ధ్రువ్ మెహతా, వసీం బేగ్ హాజరయ్యారు. -
సుజనా చౌదరికి హైకోర్టు షాక్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి సుజనా చౌదరికి ఉమ్మడి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. సుజనా చౌదరి తమ నుంచి తీసుకున్న రూ.106 కోట్ల అప్పును చెల్లించే స్థితిలో లేనందున.. ఆయనకు చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను మూసివేసి, దాని ఆస్తులను అమ్మి, తద్వారా తమ అప్పును తీర్చేలా ఆదేశాలివ్వాలంటూ మారిషస్‌కు చెందిన మారిషస్ కమర్షియల్ బ్యాంక్ (ఎంసీబీ) దాఖలు చేసిన కంపెనీ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఇదే సమయంలో సుజనా చౌదరికి మరో అవకాశం ఇచ్చింది. పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించిన విషయాన్ని ఎంసీబీ ఆరు నెలల వరకు పత్రికల్లో ప్రకటన ఇవ్వకుండా ఆదేశాలిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి ఎ.రాజశేఖరరెడ్డి మంగళవారం తీర్పు వెలువరించారు. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తీరును ఈ సందర్భంగా న్యాయమూర్తి దుయ్యబట్టారు. తీసుకున్న మొత్తాలను తిరిగి చెల్లించాల్సిన సుజనా.. ఎంసీబీ పదే పదే కోరినప్పటికీ, ఆ మొత్తాలను తిరిగి చెల్లించకూడదని తీర్మానించుకున్నట్లుగా వ్యవహరించిందన్నారు. బకాయి మొత్తాన్ని ఎంసీబీకి తిరిగి చెల్లించేందుకు సుజనా ముందుకొచ్చినట్లుగా ఈ కోర్టు ముందు ఎటువంటి ఆధారం చూపలేదన్నారు. ఇటువంటి కంపెనీ విషయంలో తాము దాఖలు చేసిన కంపెనీ పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని కోరే హక్కు ఏ రుణదాతకైనా ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ఎంసీబీని అలాగే వదిలేస్తే, భారతీయ కంపెనీలు నిజాయితీగా లేవనే అభిప్రాయం అంతర్జాతీయంగా కలుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఎంసీబీ కంపెనీ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్లు జస్టిస్ రాజశేఖరరెడ్డి తెలిపారు. ఇదీ వివాదం సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ తమ అనుబంధ కం పెనీని హేస్టియా పేరుతో మారిషస్‌లో ఏర్పాటు చేసింది. 2010లో హేస్టియా ఎంసీబీ నుంచి రూ.100 కోట్ల మేర రుణం తీసుకుంది. ఈ లావాదేవీలో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ హామీదారు (గ్యారెంటార్)గా ఉంది. అయితే 2012 నుంచీ హేస్టియా బకాయి చెల్లిం పులు మానేసింది. పలు పరిణామాల నేపథ్యంలో ఎంసీబీ తొలుత హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది. ఆ బ్యాంకు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. అయితే తమ బకాయి చెల్లించే విషయంలో హేస్టియా, సుజనా యూనివర్సల్ చేస్తున్న జాప్యం, తాత్సారాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కంపెనీని మూసివేయాలని కోరుతూ ఎం సీబీ గతేడాది హైకోర్టులో కంపెనీ పిటిషన్ దాఖలు చేసింది.