రజినీతో నటించడం మరచిపోలేను
- శ్రీయ
టీనగర్: రజినీకాంత్‌తో నటించడాన్ని జీవితకాలంలో మరచిపోలేనని నటి శ్రీయ తెలిపారు. తమిళ, తెలుగు చిత్రసీమలో వెలుగొందిన శ్రీయ ప్రస్తుతం ప్రకాష్‌రాజ్ నిర్మిస్తున్న హిందీ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. దీని గురించి శ్రీయ మాట్లాడుతూ తాను చిత్రరంగానికి వచ్చి 15 ఏళ్లు పూర్తయిందని, ఆమె నటించిన మొదటి చిత్రం ‘ఇష్టం’(తెలుగులో) అని పేర్కొన్నారు. ఈ చిత్రం 2001లో విడుదలయిందన్నారు. ఆ తర్వాత ‘సంతోషం’ చిత్రం ద్వారా ఎన్నో అవకాశాలు వచ్చాయని అన్నారు. 2005లో తమిళం, తెలుగు చిత్ర రంగాల్లో అధిక చిత్రాలలో నటించానన్నారు.
అప్పట్లో ఎలా ఉన్నానో ఇప్పుడు అదే విధంగా ఉన్నానని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారని తెలిపారు. తన శరీరాకృతి ఏ మాత్రం మారలేదని ప్రశంసలు అందుకోవడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. నటిగా ఇన్నేళ్లు చిత్రరంగంలో నిలదొక్కుకోవడం కష్టమని, తాను ఇప్పటికీ కథానాయికగానే నటిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఎంతోమంది కొత్త కథానాయికలు వస్తున్నప్పటికీ తనకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయన్నారు. ఏడాదికి రెండు చిత్రాలకు తగ్గకుండా నటిస్తున్నట్టు తెలిపారు.
తాను నటించిన చిత్రాల్లో గొప్పగా చెప్పుకునే చిత్రం ‘శివాజి’ అని, రజినీకి జంటగా నటించడం తన అదృష్టమన్నారు. అది నా జీవితంలో మరచిపోలేనన్నారు. ప్రస్తు తం హిందీ చిత్రంలోను నటిస్తున్నానని, తమిళంలో ప్రకాష్‌రాజ్, స్నేహ నటించిన ‘ఉన్ సమయల్ అరైయిల్’ చిత్రం హిందీలో రూపొందుతోందన్నారు. ప్రకాష్‌రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్నేహ పాత్రలో తాను నటిస్తున్నట్లు తెలిపారు. తనతోపాటు నానా పటేకర్ నటిస్తున్నారని, ఈ చిత్రం ద్వారా హిందీలో కూడా మంచి గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.