breaking news
two member committee
-
సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణ పనులపై అభ్యంతరాలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణ పనుల పరిశీలనకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నియమించిన ద్విసభ్య కమిటీ నేడు జిల్లాలో పర్యటించనుంది. ఈ మేరకు కమిటీ పర్యటనలకు అనుగుణంగా సీతమ్మ సాగర్ బ్యారేజీ ప్రభావిత ప్రాంతాల్లో ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 3,600 ఎకరాలు అవసరం.. రాష్ట్ర ప్రభుత్వం బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ‘సీతారామ’ను చేపడుతోంది. దీని ద్వారా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే వీలుంది. దీంతో పాటు 320 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సీతారామ ప్రాజెక్టులో కీలకమైన సీతమ్మ సాగర్ బ్యారేజీని అశ్వాపురం – దుమ్ముగూడెం మండలాల మధ్య గోదావరి నదిపై నిర్మిస్తున్నారు. బ్యారేజీ నిర్మాణం, బ్యాక్ వాటర్ ముంపు, నదికి ఇరువైపులా కరకట్టలు తదితర అవసరాల కోసం చర్ల, దుమ్మగూడెం, మణుగూరు, అశ్వాపురం మండలాల పరిధిలో 3,600 ఎకరాల స్థలం అవసరమవుతోంది. ఇందులో ఇప్పటికే 3,100 ఎకరాలు సేకరించగా ఇంకా 500 ఎకరాలు సేకరించాల్సి ఉంది. భూ సేకరణ సందర్భంగా ప్రభుత్వం అందించే నష్టపరిహారంపై నిర్వాసిత రైతుల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మరోవైపు భూసేకరణ పూర్తి స్థాయిలో జరగకపోయినా బ్యారేజీ నిర్మాణ పనులు మాత్రం చకచకా సాగుతున్నాయి. గ్రీన్ ట్రిబ్యునల్ ఎంట్రీ.. తమకు తగినంత నష్టపరిహారం చెల్లించడం లేదంటూ సీతమ్మసాగర్ నిర్వాసిత రైతులు నిరసన కార్యక్రమాలకు దిగుతున్నారు. మరోవైపు బ్యారేజీ నిర్మాణం కారణంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు, పొలాలు, అడవులు మునిగిపోతాయనే ఆందోళనలు పెరిగాయి. సరైన అనుమతులు తీసుకోకుండా బ్యారేజీ నిర్మాణ పనులు సాగతున్నాయంటూ ప్రాజెక్టు బాధితుల్లో కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో అన్ని అనుమతులు వచ్చే వరకు బ్యారేజీ నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ గ్రీన్ ట్రిబ్యునల్ గత ఏప్రిల్ 26న ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ పనులు కొనసాగుతుండడంతో బాధితులు మే నెలలో మరోసారి గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలన సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణ పనులపై వస్తున్న అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని గ్రీన్ ట్రిబ్యునల్ మే 29న నియమించింది. ఇందులో తరుణ్ (రీజనల్ డైరెక్టర్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, హైదరాబాద్), ప్రసాద్ (సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్, గోదావరి నదీ జలాల నిర్వహణ బోర్డు) సభ్యులుగా ఉన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు వారు బుధవారం అశ్వాపురం, దుమ్ముగూడెం, మణుగూరు, చర్ల మండలాల పరిధిలో పర్యటించనున్నారు. ముఖ్యంగా గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు క్షేత్రస్థాయిలో ఏ మేరకు అమలవుతున్నాయి, నిర్వాసితులకు సరైన పరిహారం అందుతోందా, పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తలు తదితర అంశాలను పరిశీలించనున్నారు. ఈ క్రమంలో సంబంఽధిత ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ పనులు చేపడుతున్న కంపెనీ ప్రతినిధులు, ప్రాజెక్టు నిర్వాసితులు, ప్రభావిత ప్రాంతాల ప్రజలను కలిసి నేరుగా వివరాలు సేకరించనున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో సేకరించిన అంశాలను క్రోడీకరించి జూలై 12లోగా ద్విసభ్య కమిటీ తన నివేదికను అందించాల్సి ఉంటుంది. పరిహారంపై పేచీ.. సీతమ్మ సాగర్ బ్యారేజీ ప్రభావిత ప్రాంత ప్రజలు, రైతులతో ప్రజాభిప్రాయ సేకరణను జూన్ 14న చేపట్టారు. ఈ సమావేశంలో సీతారామ ప్రాజెక్టును ప్రభావిత ప్రాంత రైతులు స్వాగతించినప్పటికీ.. నష్ట పరిహారం విషయంలో మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎకరానికి రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నష్టపరిహారం చెల్లిస్తుండగా, రైతులు రూ.30 లక్షలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక బ్యారేజీ నిర్మాణ పనులు జరుగుతున్న అమ్మగారిపల్లి, కుమ్మరిగూడెం గ్రామాల్లోని రైతులు దాదాపుగా సర్వం కోల్పోయిన పరిస్థితి నెలకొంది. దీంతో జల విద్యుత్ కేంద్రంలో ఈ గ్రామాలకు చెందిన వారికి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
రిషితేశ్వరి కేసు విచారణకు ద్విసభ్య కమిటీ
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో చోటుచేసుకున్న ర్యాగింగ్ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణకు ద్విసభ్య కమిటీని నియమించామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన ఏఎన్‌యూ పర్యటనలో మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళం అంబేడ్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణమోహన్, తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య విజయలక్ష్మిలతో కూడిన కమిటీ విచారణ చేపడుతుందన్నారు. ఆర్కిటెక్చర్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనపై విచారణ జరిపి ఘటనకు దారితీసిన కారణాలు, రాష్ట్రవ్యాప్తంగా ర్యాగింగ్ నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై కమిటీ సూచనలు చేస్తుందని తెలిపారు. రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై గతంలో విచారణ జరిపిన కమిటీ కన్వీనర్ బాలసుబ్రహ్మణ్యంను కూడా వీరిద్దరితోపాటు ఏఎన్‌యూలో పర్యటించాలని కోరుతున్నామన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య తరువాత ఏఎన్‌యూతోపాటు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టామన్నారు. పూర్తిస్థాయి వీసీ, రెగ్యులర్ అధ్యాపకులు లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోందన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో కనీసం 50శాతం భర్తీ చేసుకునే అవకాశం ఇవ్వాలని హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో 5 కొత్త విద్యాలయాలు ప్రారంభమైయ్యాని.. వచ్చేఏడాది మరో 3 ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వచ్చేఏడాది ఒంగోలు ట్రిపుల్ ఐటీని ప్రారంభిస్తున్నామని అన్నారు.