breaking news
Transformer meter
-
లోన్ వస్తే ట్రాన్స్‘ఫార్మర్ల’కు మీటర్లు! వివరణ ఇచ్చిన టీఎస్ఎస్పీడీసీఎల్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్ల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈ ఆర్సీ)కి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) వివరణ ఇచ్చింది. మీటర్ల ఏర్పాటు కోసం రూ.93 కోట్ల రుణమివ్వాలని గతేడాది జూలై 22న గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్ఈసీ)కు ప్రతిపాదనలు పంపామ ని.. ఆ రుణం మంజూరయ్యాక మీటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపింది. అయితే దీనిపై ఆర్ఈసీ నుంచి ఇంకా స్పందన రాలేదని పేర్కొంది. రాష్ట్రంలో అన్ని వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు నిర్దేశిత గడువులోగా మీటర్లు బిగించి, వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని కచ్చితంగా లెక్కించాలని గతంలో రాష్ట్ర ఈఆర్సీ ఆదేశించింది. ఈ అంశంలో పురోగతిని తెలియజేయాలని ఇటీవల ఈఆర్సీ కోరగా.. తాజాగా టీఎస్ఎస్పీడీసీఎల్ బదులిచ్చింది. తగ్గిన వ్యవసాయ విద్యుత్ వినియోగం రాష్ట్రంలో భారీ ఎత్తిపోతల పథకాలు చేపట్టిన నేపథ్యంలో కాల్వల కింద సాగు పెరిగి బోరుబావుల కింద వ్యవసాయ విద్యుత్ వినియోగం క్రమంగా తగ్గుతోందని రాష్ట్ర డిస్కంలు వెల్లడించాయి. ఇదే సమయంలో ఎత్తిపోతల పథకాల విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని వివరించాయి. ►దక్షిణ తెలంగాణలోని 5 ఉమ్మడి జిల్లాల పరిధిలో 2021–22 తొలి అర్ధవార్షికంలో 5,410 మిలియన్ యూనిట్ల (ఎంయూ) వ్యవసాయ విద్యుత్ వినియోగం జరగ గా.. 2022–23తొలి అర్ధవార్షికంలో 5,105 ఎంయూల వినియోగం జరిగిందని టీఎస్ఎస్పీడీసీఎల్ తెలిపింది. తమ సంస్థ పరిధిలో దాదాపు 6% వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గిందని తెలిపింది. 2023– 24లో ఎత్తిపోతల పథకాల వినియోగం 105% పెరగనుందని అంచనా వేసింది. ►ఉత్తర తెలంగాణలోని ఐదు ఉమ్మడి జిల్లాల పరిధిలో 2021–22 తొలి అర్ధ వార్షికంలో 2,938 ఎంయూల వ్యవసాయ విద్యుత్ వినియోగం జరగగా.. 2022–23 తొలి అర్ధ వార్షికంలో 2,809 ఎంయూల వినియోగం మాత్రమే జరిగిందని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ ఎన్పీడీసీఎల్) తెలిపింది. తమ సంస్థ పరి ధిలో దాదాపు 4% వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గిందని ఈఆర్సీకి నివేదించింది. ఉత్తర తెలంగాణలో 2023–24లో ఎత్తిపోతల పథకాల విద్యుత్ వినియోగం 287% పెరగనుందని అంచనా వేసింది. ►2023–24కి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)లో వ్యవసాయ విద్యుత్ అవసరాల అంచనాలను తగ్గించడంపై ఈఆర్సీ వివరణ కోరగా.. డిస్కంలు ఈ వివరాలు ఇచ్చాయి. -
తెలివిని పంచి... పరిశ్రమను పెంచాలి!!
పరిశ్రమల రంగంలో తనదైన ముద్ర వేస్తున్న మహిళ గజ్జెల శకుంతలమ్మ. దేశంలో ట్రాన్స్ఫార్మర్ మీటరు బాక్సుల తయారు చేస్తున్న ఏకైక మహిళ. ‘బతకడం అంటే పదిమందికి బతుకునివ్వడం’... అని నమ్మే ఈమె తన అనుభవాలను పంచుకున్నారిలా... మేము మొదట్లో రిఫ్రిజిరేటర్ విడిభాగాలు తయారు చేసి ఆల్విన్ కంపెనీకి సరఫరా చేసేవాళ్లం. ఆకంపెనీ మూత పడిన తర్వాత అనేక కంపెనీలకు అనేక రకాల వస్తువులను తయారు చేస్తూ పరిశ్రమను విస్తరించాం. ఇప్పటి వరకు దాదాపు 150 రకాల వస్తువులు తయారు చేశాం. మా కుటుంబంలో తొలి మహిళా పారిశ్రామికవేత్తను నేనే. గడచిన 23 ఏళ్లుగా పరిశ్రమను నడిపిస్తున్నాను. నా దగ్గర ఇప్పుడు మహిళలు, మగవాళ్లు అంతా ముప్ఫై మంది పనిచేస్తున్నారు. అందరికీ కచ్చితంగా హాజరుపట్టీలు నిర్వహించడం, వేతనంతో కూడిన వారాంతపు సెలవుతోపాటు శ్రామికులకు వర్తించాల్సిన చట్టాలకు లోబడి ఇండస్ట్రీని నడిపిస్తున్నాను. మాయ చేయరాదు, మెప్పించాలి! ఒకసారి తయారైన వస్తువు అది స్టూలైనా, కుర్చీ అయినా పదేళ్లు, పాతికేళ్లయినా విరగనంత పటిష్టంగా ఉండాలి. పలుచటి మెటీరియల్‌తో చేసిన ఫైబర్ కుర్చీలు, స్టూళ్ల మీద కూర్చుంటే కాళ్లు వంగిపోతుంటాయి. వాటి మన్నిక తక్కువ కావడంతో ఏడాదిలోపే విరిగి రీసైక్లింగ్‌కి వస్తాయి. రీఫిల్ అయిపోక ముందే విరిగిపోయే పెన్నులు కూడా ఇదే కోవలోకి వస్తాయి. మార్కెట్లో తక్కువ ధరతో దొరికే నాసిరకం వస్తువుల ధాటికి తట్టుకోలేక మేము ట్రాన్స్ఫార్మర్ మీటరు బాక్సుల తయారీ వంటి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నాము. ఇదో పరిశోధన! పరిశ్రమను విజయవంతంగా నడిపించాలంటే సమాజంలో మార్పులను గమనిస్తూ ఉండాలి. ఒక కొత్త వస్తువు మార్కెట్లోకి వచ్చిన వెంటనే దానికి అనుబంధ వస్తువుల అవసరం ఏర్పడుతుంది. సెల్ఫోన్లు వచ్చాయి... వాటిని చార్జింగ్ పెట్టడానికి ప్లగ్ పాయింట్ పక్కనున్న కిటికీనో, రీడింగ్ టేబుల్‌నో ఆసరా చేసుకోవడాన్ని చూసి వీటికో స్టాండు తయారు చేద్దామనుకున్నాను. అనుకున్నంత త్వరగా దానిని డిజైన్ చేయించకపోవడంతో నేను పని మొదలు పెట్టేసరికే మార్కెట్లోకి ఆ స్టాండులు వచ్చేశాయి. ఆ తర్వాత మేము చేసినా కూడా అనుకరణ అవుతుందే కానీ రూపకల్పన అనిపించుకోదు. ఫ్రిజ్‌లో వస్తువులు పెట్టుకోవడానికి అనువుగా ఎత్తు తక్కువగా ప్లాస్టిక్ ట్రేలు చేయించాను. అవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇప్పుడు దేవుడి బొమ్మల తయారీ మీద దృష్టి పెట్టాను. రోజ్‌వుడ్‌తో చేసిన వేంకటేశ్వర స్వామి బొమ్మ సైజుని బట్టి లక్ష రూపాయల పై మాటే. అదే ఫైబర్‌తో చేసి రాళ్లు పొదిగి మధ్యతరగతి వారికి అందుబాటు ధరల్లో అందిస్తున్నా. - వాకా మంజులారెడ్డి ఫొటోలు: రాజేశ్‌రెడ్డి రెండు చక్రాలు... ఎవరూ చదువుని, తెలివిని వృథా చేయకూడదు. ఉమ్మడి కుటుంబాలు లేని నేటి పరిస్థితుల్లో భర్త పారిశ్రామికవేత్త అయితే భార్య కూడా పరిశ్రమ నిర్వహణలో కీలకంగా మారాలి. భార్యాభర్త రెండు చక్రాలుగా పరిశ్రమను నడిపించాలి. భర్త లక్షలు, కోట్లు సంపాదిస్తున్నా సరే, సమయాన్ని వృథా చేస్తూ షాపింగులతో కాలం వెళ్లబుచ్చవద్దని నాకు కనిపించిన వారందరికీ చెబుతుంటాను. - గజ్జెల శకుంతలమ్మ, నవ్య పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహకురాలు, హైదరాబాద్