breaking news
tractor bike collides
-
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
కందుకూరు(ప్రకాశం): ఎదురెదురుగా వచ్చిన కట్టెల లోడు ట్రాక్టర్.. ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందడంతో పాటు మరో విద్యార్థి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి ఓవీ రోడ్డులోని పలుకూరు అడ్డ రోడ్డు వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కందుకూరు మండలం ఓగూరుకు చెందిన కందూరు కృష్ణారెడ్డి (20) సింగరాయకొండ వద్ద మలినేని కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. ఇదే గ్రామానికి చెందిన షేక్ రఫీ (17) ఒంగోలు ఉమామహేశ్వర కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వీరితో పాటు మర్రిపూడి మండలం నర్సాపురం గ్రామానికి చెందిన మాణికొండ వీరాస్వామి (17) ఒంగోలు ఐటీఐ కాలేజీలో చదువుతున్నాడు. వీరు ముగ్గురూ స్నేహితులు. ద్విచక్ర వాహనంపై మలినేని కాలేజీ నుంచి రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఓగూరు వస్తున్నారు. అదే సమయంలో పొగాకు చెక్కుల లోడ్‌తో ట్రాక్టర్ సింగరాయకొండ వైపు వెళ్తోంది. పలుకూరు అడ్డ రోడ్డు వద్ద వాహనాలు సైడ్ ఇచ్చి వెళ్లే సమయంలో ట్రాక్టర్.. ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురు విద్యార్థులు రోడ్డుపై పడటంతో షేక్ రఫీ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన వీరాస్వామిని 108లో కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. ఆస్పత్రికి చేరుకున్న కొద్ది సేపటికే వీరాస్వామి మృతి చెందాడు. తీవ్రగాయాలైన కృష్ణారెడ్డిని మెరుగైన చికిత్స కోసం ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టరును ఢీకొన్న బైక్
ఇద్దరు యువకుల దుర్మరణం న్యాయం చేయాలని బంధువుల రాస్తారోకో వరికుంటపాడు : మితిమీరిన వేగంతో పక్క రోడ్డులో నుంచి మెయిన్‌రోడ్డుపైకి ట్రాక్టర్ రావడంతో ఓ బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈసంఘటన మండలంలోని రామాపురం సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి మజరా బ్రాహ్మణపల్లికి చెందిన సయ్యద్ బాజీ (23), ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన సయ్యద్ హన్నన్ (23) పామూరు నుంచి బైక్‌పై వరికుంటపాడు తహసీల్దార్ కార్యాలయానికి ధ్రువీకరణ పత్రాల కోసం వెళ్లారు. తిరిగి పామూరుకు వెళ్తుండగా రామాపురం వద్దకు వచ్చే సరికి పక్కరోడ్డులో నుంచి ఒక్కసారిగా ట్రాక్టర్ మెయిన్‌రోడ్డుపైకి వచ్చింది. దీంతో బైక్ అదుపు చేయలేకపోవడంతో ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇద్దరు మృతుల కుటుంబాలు పదిహేనేళ్లుగా పామూరులో ఉంటున్నారు. ఇటీవల బాజీ టీటీసీ పూర్తి చేసి డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్న అతనిపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్న మృతితో ఆవిరయ్యాయి. హన్నన్ బాజీకి మేనమామ కొడుకు. రోడ్డు ప్రమాదంలో ఎదిగివచ్చిన ఇద్దరు బిడ్డలు మృతి చెందటంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. హన్నన్ బెంగళూరులోని ఓ మొబైల్ షాపులో పని చేస్తున్నాడు. బక్రీద్ పండగ కోసం ఇంటికొచ్చాడు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన పలువురు బంధువులు, స్నేహితులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలను చూసి గుండెలవిసేలా రోదించడం పలువురిని కలిచివేసింది. విషయం తెలుసుకున్న ఎస్సై నాగార్జున తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. న్యాయం చేయాలని జాతీయ రహదారిపై రాస్తారోకో ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని బంధువులు, కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు బాధిత కుటుంబాలు ఆందోళన చేపట్టడంతో ఇరువైపు వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాసరావు, ఎస్సై నాగార్జున సిబ్బందితో అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.