breaking news
tension in padayatra
-
కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట
సాక్షి, లింగంపేట్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ నల్లమడుగు సురేందర్ చేపట్టిన రాజీవ్ సందేశ్ యాత్రను టీఆర్ఎస్ కార్యకర్తలు సోమవారం అడ్డుకున్నారు. ఎల్లారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి సొంత గ్రామంలో ఈ ఘటన జరిగింది. లింగంపేట్ మండలంలో నల్లమడుగు సురేందర్ పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా ఇందులో పాల్గొన్నారు. నిన్న రాత్రి పాదయాత్ర తాడ్వాయి మండలం ఏర్రా పహాడ్‌కు చేరుకున్నప్పుడు టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డగించారు. కాంగ్రెస్ నాయకులతో వాగ్వివాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థతులు తలెత్తాయి. గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కాంగ్రెస్ పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేక అధికార పార్టీ నేతలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. -
అగ్రిగోల్డ్ బాధితుల పాదయాత్ర ఉద్రిక్తం
- సీఎం అపాయింట్మెంట్కు నిరాకరణ - లెనిన్ సెంటర్లో రోడ్డుపై పడుకుని నిరసన - అనుమతిలేదంటూ అరెస్టు చేసిన పోలీసులు అమరావతి : న్యాయం కోసం విజయవాడకు కదిలివచ్చిన అగ్రిగోల్డ్ బాధితుల పాదయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. తొలుత వెలగపూడి సచివాలయం వరకు పాదయాత్ర నిర్వహించాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్ల వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు ఇచ్చింది. అందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో తుమ్మలపల్లి కళాక్షేత్రం సమీపంలో బుధవారం సభ నిర్వహించిన అనంతరం లెనిన్ సెంటర్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ ఆందోళనలో ఏపీతోపాటు తెలంగాణా, పశ్చిమబెంగాల్, కర్నాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి తరలివచ్చిన బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్ర చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం పట్టుపట్టిన బాధితులు, ఏజెంట్లు, సంఘీభావంగా వచ్చిన రాజకీయ పార్టీల నేతలు రోడ్డుపైనే పడుకుని, బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన డిపాజిటర్లు, ఏజెంట్లు, బీజేపీ, కాంగ్రెస్, లోక్‌సత్తా, వామపక్ష నేతలను అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చంద్రబాబు సర్కారుపై బీజేపీ నేత ఘాటు విమర్శలు.. అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూస్తుంటే హాయ్‌ల్యాండ్‌ను కొట్టేసేందుకు, అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కాజేసేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌కుమార్‌రెడ్డి అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు సంఘీభావంగా నిర్వహించిన సభలో ఆయన పాల్గొని తెలుగుదేశం ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. టీడీపీ తమకు మిత్రపక్షమైనప్పటికీ బాధితులకు అండగా నిలవడంలో బీజేపీ వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు. ఉద్దేశ్యపూర్వకంగానే సీఐడీ విచారణ నీరుగార్చి అగ్రిగోల్డ్ ఆస్తులు దక్కించుకోవడానికి ప్రభుత్వంలోని కొందరు మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయని చెప్పారు. వాస్తవాలను నిగ్గు తేల్చేలా విచారణ చేపట్టాని డిమాండ్ చేశారు.