tenent farmer
-
కౌలుదారులకు గుర్తింపేది
వ్యవసాయ రంగంలో 70–80 శాతం కౌలుదారులే ఉన్నారు. వీరికి సాగు హక్కు కార్డుల (సీసీఆర్సీ) జారీ కోసం ఏటా ఏప్రిల్, మే నెలల్లో సీసీఆర్సీ మేళాలు నిర్వహించేవారు. ఖరీఫ్ సాగు ప్రారంభంలోనే ప్రతి కౌలుదారునికి భూ యజమాని అనుమతితో సాగు హక్కు కార్డులు జారీ చేసేవారు. ఈ ఏడాది మరో 15 రోజుల్లో తొలకరి సాగు మొదలవుతున్నప్పటికీ ఇప్పటివరకు కార్డుల జారీ ప్రక్రియ పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో విత్తనాల నుంచి రుణాల వరకు, పెట్టుబడి సాయం నుంచి పెట్టుబడి రాయితీ వరకు అందుతాయో లేదోననే ఆందోళన కౌలు రైతుల్లో నెలకొంది. – సాక్షి, అమరావతి32 లక్షల మంది కౌలుదారులురాష్ట్రంలో 32 లక్షల మంది కౌలుదారులుండగా, వారిలో సొంత భూమి సెంటు కూడా లేని కౌలుదారుల సంఖ్య 10లక్షల పైమాటే. బ్యాంకుల ఆంక్షలతో రుణాలకు దూరమయ్యే వీరు పెట్టుబడి కోసం ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి రూ.3, రూ.5 వడ్డీకి అప్పులు తెచ్చి సాగు చేసేవారు. ఈ పరిస్థితికి చెక్‌పెడుతూ భూ యజమానుల హక్కులకు భంగం కలగని రీతిలో కౌలుదారుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా తీసుకొచ్చిన సీసీఆర్సీ–2019 చట్టం ద్వారా వాస్తవ సాగుదారులకు 11 నెలల కాల పరిమితితో ఏటా సీసీఆర్సీలు జారీ చేసేవారు. ఇందుకోసం ఖరీఫ్ ప్రారంభానికి ముందుగానే సీసీఆర్సీ మేళాలు నిర్వహించేవారు. ఇలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019–24 మధ్య 25.94 లక్షల మందికి కార్డులు జారీ చేసింది. వీటి ప్రామాణికంగానే పంట రుణాలతోపాటు వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ, పంటల బీమా, పంట నష్టపరిహారం వంటి సంక్షేమ ఫలాలు అందించడంతోపాటు కనీస మద్దతు ధరకు పంట ఉత్పత్తులను కళ్లాల నుంచే కొనుగోలు చేసింది. గడచిన ఐదేళ్లలో 6.78 లక్షల మందికి రూ.8,345 కోట్ల పంట రుణాలిచ్చింది. 5.57 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కౌలుదారులకు రూ.751.42 కోట్లను రైతు భరోసా కింద పెట్టుబడి సాయంగా అందించింది. 3.55 లక్షల మందికి రూ.731.08 కోట్ల పంటల బీమా పరిహారం, 2.42 లక్షల మందికి రూ.253.56 కోట్ల పంట నష్టపరిహారం అందించింది.అన్నదాత సుఖీభవకు దూరం అన్నదాత సుఖీభవ పథకం కింద మూడు విడతల్లో సాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. తొలివిడత సాయం ఈ నెలాఖరులో జమ చేస్తామంది. కౌలు కార్డుల జారీ ప్రక్రియ ఇంకా మొదలు కాకపోవడంతో కార్డుల ప్రామాణికంగా పెట్టుబడి సాయం ఏవిధంగా అందిస్తారని కౌలు రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం అందించే పీఎం కిసాన్ సాయానికి కౌలు రైతులు దూరమయ్యారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వీరికి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రూ,13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించేది. కానీ.. కూటమి ప్రభుత్వం అలాంటి చర్యలేమీ చేపట్టడం లేదు. ఏడాది గడిచినా..సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కౌలు రైతులు ఇబ్బంది పడకూడదన్న సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం 2024–25 సీజన్లో 10 లక్షల మంది కౌలుదారులకు కార్డులు జారీ లక్ష్యంగా నిర్దేశించింది. 9.13 లక్షల మంది కౌలుదారులకు కార్డులు జారీ చేసింది. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో వీరికి పెట్టుబడి సాయంతో పాటు ఏ ఒక్కరికీ బీమా పరిహారం, నష్టపరిహారం వంటివేమీ అందలేదు. మరోవైపు సీసీఆర్సీ చట్టం స్థానంలో కొత్త కౌలుచట్టం తెస్తామంటూ కూటమి ఇచ్చిన హామీ ఏడాది గడిచినా కార్యరూపం దాల్చలేదు. పాత కౌలుచట్టం ప్రకారమే ఈ ఏడాది కూడా 10 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ చేయాలని నిర్ణయించారు. అయితే, భూ యజమానులు సమ్మతి తెలిపేందుకు ముందుకు రాలేదు. వారిని ఒప్పించడంలో క్షేత్రస్థాయి సిబ్బంది విఫలమవుతున్నారు. కొత్త కార్డుల జారీ మాట దేవుడెరుగు.. ఉన్న కార్డులను సైతం రెన్యువల్ చేయలేని దుస్థితి నెలకొంది. దీంతో సీజన్ ముంచుకొస్తున్నప్పటికీ సీసీఆర్సీ జారీ అడుగు ముందుకు పడటం లేదు.కౌలుదారులకు మొండిచేయి కార్డుల జారీలో జాప్యం వల్ల కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సీసీఆర్సీ చట్టం–2019 స్థానంలో తెస్తామన్న కొత్త చట్టానికి అతీగతీ లేదు. గతేడాది వర్షాకాల సమావేశాల్లోనే తెస్తామన్న ఈ బిల్లు ఏ దశలో ఉందో కూడా చెప్పడం లేదు. సీజన్ ముంచుకొస్తున్నా ఏ ఒక్కరికీ కార్డు జారీ చేయలేదు. కౌలుదారులకు రుణాలు అందడం లేదు. అన్నదాత సుఖీభవ సాయం కూడా వీరికి అందే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. – పి.జమలయ్య, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలురైతు సంఘం -
కౌలుదారులందరికీ కార్డులివ్వాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నూటికి 80 శాతం కౌలుదారులున్నారని, వాందరినీ గుర్తిస్తూ ప్రభుత్వం కౌలు కార్డులివ్వాలని ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై.రాధాకృష్ణ, ఎం.హరిబాబు డిమాండ్ చేశారు. కౌలు రైతుల సమస్యలపై గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ.. పంటల నమోదులో కౌలురైతుల పేర్లతోనే నమోదు చేయాలన్నారు. భూమి లేని ఓసీ రైతులతో సహా కౌలుదారులందరికీ రూ.20వేల పెట్టుబడి సాయం అందించాలని కోరారు. కౌలురైతులకు పంట రుణాలు, పంట నష్టపరిహారం, పంటల బీమా తదితర సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. అయితే 2019లో తీసుకొచ్చిన పంట సాగుదారుల హక్కు చట్టంలో భూ యజమాని విధిగా కౌలు ఒప్పంద పత్రంపై సంతకం చేయాలని లేదా వీఆర్వోకు ఫోన్ చేసి తన అంగీకారాన్ని తెలియజేయాల్సి ఉంటుందన్నారు. మెజార్టీ భూ యజమానులు అంగీకార పత్రంపై సంతకాలు చేయకపోవడం వలన కౌలుదారులు కౌలుకార్డులు పొందలేక, పంట రుణాలతో పాటు ప్రభుత్వ రాయితీలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువలన 2011లో తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ భూ అ«దీకృత రైతుల చట్టాన్ని అమలు చేయాలన్నారు. ఈ చట్టం ప్రకారం భూ యజమానుల అంగీకారంతో సంబంధం లేకుండా ప్రభుత్వమే కౌలురైతులను గుర్తించి, గ్రామసభల్లో కౌలుకార్డులు ఇచ్చేదని గుర్తు చేశారు. భూ యజమానులు ఏమైనా అభ్యంతరాలు లేవనెత్తితే వాటిని అధికారులే పరిష్కరించేవారన్నారు. గ్రామాల వారీగా కౌలు రైతుల జాబితాలను బ్యాంకులకు పంపి పంట రుణాలు, ప్రభుత్వ రాయితీలు అందించేవారని గుర్తు చేశారు. -
కౌలు రైతులకూ ‘భరోసా’!
సాక్షి, హైదరాబాద్: కౌలు రైతులకు కూడా రైతుభరోసా కింద పెట్టుబడి సాయం ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ వానాకాలం నుంచే అమలు చేయాలని యోచిస్తోంది. రైతుభరోసాపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మార్గదర్శకాలు ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. ఎన్నికలకు ముందు రైతులతోపాటు కౌలు రైతులకు కూడా రైతుభరోసా సాయాన్ని అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ఏడాదికి ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి సాయం అందించనుంది. అయితే కౌలు రైతులను గుర్తించడమే ప్రభుత్వానికి అసలు సవాల్‌గా మారింది. చాలామంది కూలీలు రైతుల వద్ద కొంత భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తుంటారు. కొందరు రైతులు కూడా తమ భూమితోపాటు ఇతర రైతుల వద్ద కౌలుకు తీసుకొని కూడా సాగు చేస్తుంటారు. ఇలా రెండు విధాలుగా కౌలు రైతులుంటారు. ఒకరు భూమి ఉన్నవారు, ఇంకొకరు భూమిలేని కౌలు రైతులు. రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులుండగా కౌలు రైతులు సుమారు 25 లక్షల వరకు ఉంటారని అంచనా. అయితే వీరిని గుర్తించేందుకు 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతుల చట్టం తెచ్చింది. దీనిప్రకారం కౌలు రైతులను గుర్తిస్తామని ఎన్నికలకు ముందు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ చట్టం ప్రకారం కౌలు రైతులకు అనేక అధికారాలు సంక్రమిస్తాయి. అదేవిధంగా చట్టపరంగా కౌలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు రైతులు కౌలుపై అధికారికంగా ఒప్పందం చేసుకోవడానికి ముందుకొచ్చే అవకాశం ఉంటుందా అన్న సందేహం తలెత్తుతోంది. కౌలు రైతు కోసం అసలు రైతు పెట్టుబడి సాయాన్ని కోల్పోయేందుకు సిద్ధంగా ఉంటారా అనేది ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో కౌలు రైతులను ఎలా గుర్తించాలన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఏదిఏమైనా జూలై 15లోపు రైతుభరోసాపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉపసంఘాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సబ్‌కమిటీ త్వరలో పలువురు రైతు సంఘాల నేతలతోనూ, మేధావులతోనూ సమావేశం కానుంది. రైతుభరోసా మార్గదర్శకాల్లో భాగంగానే కౌలు రైతులకు ఎలా ఇవ్వాలన్న దానిపై అభిప్రాయాలు స్వీకరిస్తారు. కాగా, రైతు భరోసాకు నిబంధనలు కఠినంగా ఉంటాయన్న చర్చ జరుగుతోంది. పీఎం కిసాన్ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుంటారన్న వాదనలు కూడా ఉన్నాయి. వాస్తవంగా రైతుబంధుకు, రైతుభరోసాకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటుందని అధికారులు అంటున్నారు. అదీగాక రైతుబంధు మార్గదర్శకాలన్నీ పూర్తిస్థాయిలో మారుతాయని, దాని స్వరూపమే మారుతుందని చెబుతున్నారు. -
YSR Rythu Bharosa: కౌలు రైతులకు రైతు భరోసా.. నిధులు జమ చేయనున్న సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(గురువారం) కౌలు రైతులకు రైతు భరోసా అందించనున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి నగదు జమ చేయనున్నారు. వివరాల ప్రకారం.. సీఎం జగన్ ఏపీలోని కౌలు రైతులకు రైతు భరోసా అందించనున్నారు. అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నగదును సీఎం జగన్ జమ చేయనున్నారు. కౌలు రైతులతో పాటుగా దేవాదాయ భూమి సాగుదారులకు కూడా సాయం అందనుంది. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. కౌలు రైతులకు కౌలు కార్డులు.. ఇదిలా ఉండగా.. ఏపీలో కౌలు రైతులకు పెద్దఎత్తున కౌలు కార్డులు జారీ చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సీసీఆర్సీ (క్రాప్ కల్టివేషన్ రైట్స్ కార్డ్స్) మేళాలు నిర్వహిస్తోంది. ఆర్బీకే స్థాయిలో మేళాలు నిర్వహించేలా వ్యవసాయ, రెవెన్యూ శాఖలు చర్యలు చేపట్టాయి. కౌలు రైతులకు నూరు శాతం పంట రుణాలు ఇవ్వాలన్న సంకల్పంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్‌ల)ను ప్రభుత్వం ఇప్పటికే ఆర్బీకేలతో అనుసంధానించింది. ప్రతి కౌలు రైతుకు రుణంతోపాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలన్న భావనతో కౌలుదారులందరికీ పంట సాగు హక్కు పత్రాలు (కౌలు కార్డులు) జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఇది కూడా చదవండి: రాష్ట్రానికి రక్ష జగనన్న.. సీఎం జగన్‌పై ప్రేమను చాటుకున్న విద్యార్థులు -
కౌలు రైతుకు పెద్ద కష్టం..పంట డబ్బూ పోయే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కౌలురైతులకు మరో పెద్ద కష్టం వచ్చిపడింది. ధాన్యం కొనుగోలు డబ్బులను.. సదరు భూమి యజమాని బ్యాంకు ఖాతాల్లోనే వేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొత్త సమస్య మొదలైంది. ఇందుకోసం రైతులు కౌలుకు తీసుకున్న భూమి యజమానుల ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లు కావాలనడం, ధాన్యం డబ్బులను ఆ ఖాతాల్లోనే జమ చేస్తుండటంతో కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతేగాకుండా.. సదరు భూయజమానికి చెందిన పాస్‌బుక్‌లో ఎంత మేర భూమి ఉందో.. దానికి తగినంత మాత్రమే ధాన్యం కొంటామని చెప్తుండటంతో దిగాలు పడుతున్నారు. తాము ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు ఈ కొత్త నిబంధనలు ఏమిటని మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోలు భారం తగ్గించుకునేందుకే కొత్త రూల్స్ పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే.. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలను అడ్డుకునేందుకే ఈ కొత్త విధానం అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్తోంది. రైతు బంధుతో లింక్ అయిన ఖాతాల్లోకే.. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములన్నింటికీ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తోంది. ఏటా రెండుసార్లు ఎకరానికి రూ.5 వేల చొప్పున సదరు భూయజమానుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తోంది. ఇప్పుడు పంట కొనుగోళ్లు, ధాన్యం డబ్బులను జమ చేయడానికి అవే వివరాలను ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో.. జిల్లా కలెక్టర్లు పౌరసరఫరాల శాఖ అధికారులు/సిబ్బందిని అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభమైన సుమారు 4 వేల కొనుగోలు కేంద్రాల వద్ద లాప్టాప్/ట్యాబ్లెట్లతో పౌరసరఫరాల శాఖ తరఫున ఒక్కో వ్యక్తిని నియమించారు. ఆ వ్యక్తి ధాన్యం విక్రయించేందుకు వచ్చిన రైతుల నుంచి ఆధార్ నంబర్ తీసుకుని ఆన్లైన్లో నమోదు చేయగానే సదరు రైతుకున్న భూమి వివరాలు కనిపిస్తాయి. ఆ రైతు పేరు మీద ఎంత భూమి ఉంది, ఏమేం పంటలు వేశారు, రైతుబంధుకు లింక్ అయిన బ్యాంక్ ఖాతా తదితర వివరాలు వస్తాయి. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు.. ఆ వివరాలు అన్నీ సరి చూసుకున్నాకే వడ్లను తూకానికి వేస్తున్నారు. వివరాల్లో ఎక్కడ తేడా వచ్చినా కొనడం లేదు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సొమ్మును రైతుబంధు జమవుతున్న బ్యాంకు ఖతాల్లోనే జమ చేయాలని పౌరసరఫరాల శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ శాఖ డేటాతో అనుసంధానించి.. రైతులకు ఉన్న భూమి విస్తీర్ణం, వేసిన పంట, రైతుబంధు కింద రైతుకు అందుతున్న సొమ్ము వివరాలన్నీ మండలాల వారీగా వ్యవసాయ శాఖ అధికారుల వద్ద ఉంటాయి. వానాకాలం, యాసంగి పంటలు వేసిన తర్వాత మండలాల ఏఈవోలు.. రైతుల భూమి విస్తీర్ణం, వేసిన పంటల వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఇప్పుడు ఆ డేటాను పౌర సరఫరాల శాఖ తరఫున నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోళ్లకు అనుసంధానం చేశారు. దీనివల్ల కొనుగోలు కేంద్రంలో రైతుల ఆధార్ నంబర్ నమోదు చేయగానే.. వారికి ఉన్న భూమి, వారు వేసిన పంటల వివరాలు కనిపిస్తున్నాయి. అయితే రైతుల ఆధార్ నంబర్ నమోదు చేసినప్పుడు దానికి లింక్ అయి ఉన్న రైతుల ఫోన్‌కు ఓటీపీ (వన్‌టైం పాస్వర్డ్) వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేశాకే.. వివరాలన్నీ కనిపిస్తాయి. భూమికి తగినంతే కొనుగోళ్లు.. రైతులకు ఎంత భూమి ఉంటే.. దానికి అనుగుణంగానే ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ ఆదేశాలు ఇచ్చింది. గరిష్టంగా ఎకరానికి 36 క్వింటాళ్ల ధాన్యం వస్తుందని లెక్కలు వేసింది. రైతులు తెచ్చిన పట్టాదారు పాస్‌బుక్‌లో ఉన్న భూమికి, కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యానికి లెక్క కుదిరితేనే సేకరిస్తోంది. దీనివల్ల కౌలు రైతులు తమకున్న కొద్దిపాటి భూమి పాస్‌బుక్ ఆధారంగా.. కౌలు పంట అంతా విక్రయించుకునే పరిస్థితి ఉండదు. భూయజమానులను బతిమాలి పాస్‌బుక్, ఇతర వివరాలు తెచ్చుకోవాల్సిందే. పంట డబ్బులు వారి ఖాతాల్లో జమ అయ్యాక వెళ్లి తీసుకోవాల్సిందే. ఆధార్ ఫోన్ నంబర్లు, ఓటీపీల సమస్యతో.. చాలా మంది రైతులు తాము ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు.. తమ పిల్లల ఫోన్ నంబర్లు, తెలిసిన వారి నంబర్లను ఇచ్చారు. గ్రామాల్లో అయితే మీసేవ సెంటర్ల ఓనర్ల నంబర్లు కూడా ఇచ్చి నమోదు చేసుకున్నారు. వీటిలో చాలా వరకు ఫోన్ నంబర్లు మారిపోవడమో, ఏ నంబర్ ఇచ్చామన్నది మర్చిపోవడమో జరిగింది. ఇప్పుడా రైతులంతా ఓటీపీ ఏ నంబర్‌కు వచ్చిందో తెలియక.. ధాన్యం అమ్ముకోలేకపోతున్నారు. విరాసత్, మ్యుటేషన్ భూములు.. ధరణి సమస్యలు ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత క్రయవిక్రయాలు జరిగిన వ్యవసాయ భూముల వివరాలు చాలావరకు వ్యవసాయ శాఖ రికార్డుల్లో నమోదుకాలేదు. రైతుబంధుకు దరఖాస్తు చేసుకునే వీలు లేకపోవడంతోపాటు ఇతర కారణాల వల్ల మ్యూటేషన్, విరాసత్ అయిన భూములు వ్యవసాయ శాఖ రికార్డుల్లో లేవు. సదరు రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద తమ ఆధార్ నంబర్ ఇస్తే.. కేవలం రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్న భూముల వివరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. వ్యవసాయశాఖ పరిధిలోని డేటా (వేసిన పంటలు, రైతుబంధు ఖాతా నంబర్ వంటివి) చూపించడం లేదు. అలాగే ధరణి పోర్టల్‌లో అప్డేట్ కాని వ్యవసాయ భూములకు కూడా ఇదే సమస్య తలెత్తింది. ఈ రైతులెవరూ కూడా తమ ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి లేకుండా పోతోంది. కౌలు రైతులనే అంశమే లెక్కలోకి రాదు పంట పండించిన రైతులకు ధాన్యం సొమ్ము చేరేలా చర్యలు తీసుకున్నాం. కౌలు రైతులు అనే అంశమే మా లెక్కలోకి రాదు. అందుకే రైతు ఖాతాలోకే ధాన్యం సొమ్మును జమ చేస్తున్నాం. అలాగే రైతుకు ఉన్న భూమికి తగిన మేర పంటను మాత్రమే కొంటాం. రెండెకరాల పొలంలో 200 క్వింటాళ్లు దిగుబడి రాదు కదా. ఎకరానికి గరిష్టంగా 36 క్వింటాళ్లుగా నిర్ణయించాం. పీడీఎస్ బియ్యాన్ని కూడా కస్టమ్ మిల్లింగ్ రైస్‌గా చూపించే పరిస్థితి ఉండకూడదనే కఠినంగా వ్యవహరిస్తున్నాం. విరాసత్, మ్యుటేషన్ అయిన భూముల వివరాలను వ్యవసాయ శాఖ వద్ద నమోదు చేయించుకుంటే ధాన్యం కొనుగోలు చేస్తాం. గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈయన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందిన కౌలు రైతు తంగెళ్ల శ్రీనివాస్. రెండెకరాలు కౌలుకు తీసుకుని పండించిన ధాన్యాన్ని 15 రోజుల కిందే కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు. రెండు రోజుల క్రితమే కొనుగోళ్లు మొదలవడంతో కాంటా వేసేందుకు సిద్ధమయ్యారు. భూయజమాని పాస్‌బుక్, ఆధార్ కార్డు జిరాక్స్‌లు ఇచ్చిన శ్రీనివాస్.. పంట సొమ్మును జమచేసేందుకు తన బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీ ఇచ్చాడు. కొనుగోలు కేంద్రంలో ఉన్న ఓ వ్యక్తి ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయగా.. వ్యవసాయ శాఖ వద్ద ఉన్న డేటాలోని బ్యాంకు ఖాతా నంబర్‌తో సరిపోలలేదు. దానితో వడ్లు కాంటా వేసేందుకు నిరాకరించారు. భూయజమాని బ్యాంకు ఖాతా నంబర్‌ను నమోదు చేశాకే.. కొనుగోలుకు ఓకే అయింది. ఇప్పుడు పంట డబ్బులు భూయజమాని ఖాతాలోనే పడనున్నాయి. వారి నుంచి శ్రీనివాస్ డబ్బులు తీసుకోవాల్సి రానుంది. -తంగెళ్ల శ్రీనివాస్) ఎక్కడికని పోవాలె..? రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్నవారిలో 20శాతం నుంచి 30 శాతం వరకు కౌలు రైతులే. ఎక్కడో హైదరాబాద్‌లోనో, ఇతర జిల్లాలు, దూర ప్రాంతాల్లోనో ఉన్నవారి భూములను స్థానికంగా ఉన్నవారు కౌలుకు తీసుకుని పంటలు వేస్తున్నారు. ఇప్పుడు కౌలు రైతులు ఎక్కడో ఉన్న భూయజమానుల నుంచి ఆధార్, పట్టా పాస్‌బుక్, ఇతర వివరాలు తీసుకోవడం.. వారి ఫోన్‌కు వచ్చిన ఓటీపీ అడిగి తెలుసుకుని నమోదు చేయించడం తప్పడం లేదు. ఇంతా చేసి ధాన్యం డబ్బులు భూయజమాని బ్యాంకు ఖాతాలో పడితే.. మళ్లీవారి వెంటపడి తీసుకోవాల్సిన పరిస్థితి. దీనితో కౌలు రైతులు దిగాలు పడుతున్నారు. అగ్గువకు అమ్ముకోవాల్సిన దుస్థితి కౌలు రైతులు అయితే తాము కౌలుకు తీసుకున్న భూయజమానుల నుంచి ఆధార్, ఇతర వివరాలు తీసుకుని ఇవ్వాల్సి వస్తోంది. పంట డబ్బులు కూడా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. భూయజమానులు వివరాలు ఇవ్వకున్నా, ఆ వివరాల్లో ఏవైనా తేడాలు ఉన్నా.. కౌలు రైతులకు ఇబ్బందే. చివరికి ఏ దిక్కూ లేక.. మిల్లర్లు, దళారుల వద్దకు వెళ్లి అగ్గువకో సగ్గువకో ధాన్యం అమ్ముకోక తప్పని పరిస్థితి. మిగతాది ఎవరు కొనాలి? పట్టాదారు పాస్‌బుక్‌లో ఉన్న భూమికి తగినట్టే ధాన్యాన్ని కొనాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. అయితే చాలా మంది కౌలు రైతులకు సొంతంగా కొద్ది గుంటలో, అర ఎకరం వరకో భూమి ఉంటుంది. వారు మరింత భూమిని కౌలుకు తీసుకుని పంట వేస్తుంటారు. ఇప్పుడు తమ పాస్‌బుక్‌లో ఉన్న కొద్దిపాటి భూమికి అనుగుణంగా కొంత పంటనే కొనుగోలు చేస్తే.. మిగతా ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలని కౌలు రైతులు వాపోతున్నారు. మా పైసలు మాకియ్యరా? రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఓబులాపూర్‌కు చెందిన ఏనుగుల రాజు ఓ కౌలు రైతు. 12 ఎకరాల్లో వేసిన పంట కోతకు రాగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు. కానీ పంట కొనుగోళ్ల కోసం ఆధార్ అడుగుతుండటం, డబ్బులను భూ యజమాని ఖాతాలో వేస్తామంటుండటంతో ఆందోళనలో పడ్డాడు. అసలు తమ ధాన్యం కొంటరా లేదా, తమ వడ్ల పైసలు తమకు రావంటే ఎట్లాగని ప్రశ్నిస్తున్నాడు. -
కౌలు రైతు ఆత్మహత్య
తుళ్లూరు(గుంటూరు): అప్పుల బాధ తాళలేక కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పఠాన్ శిలార్‌ఖాన్(28) అనే కౌలు రైతు ఇంటి వద్ద పురుగుల మందు తాగి మృతి చెందాడు. సొంత పొలం లేకపోవడంతో గత ఏడాది 12 ఎకరాలు కౌలుకు తీసుకున్న శిలార్‌ఖాన్ పది ఎకరాల్లో పత్తి, మరో రెండు ఎకరాల్లో మిరప సాగు చేశాడు. దిగుబడులు రాక సుమారు రూ.6 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. ఈ పరిస్థితుల్లో కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థంకాక తనలో తాను కుమిలిపోతూ చివరకు పురుగుమందు తాగి మృతి చెందినట్టు కుంటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
కౌలు రైతు ప్రాణం తీసిన రుణ భారం
తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం శివారు పేకేటిపాకల గ్రామానికి చెందిన కడియాల బుల్లబ్బాయి(29) అనే కౌలు రైతు అప్పుల బాధతో బలవన్మరణం చెందారు. నాలుగేళ్లుగా వరి సాగు చేస్తున్న బుల్లబ్బాయి ప్రకృతి వైపరీత్యాలు, పంట తెగుళ్లతో వరుసగా నష్టాలు రావడంతో రూ.2.5 లక్షల వరకు అప్పుల పాలయ్యారు. కొద్ది నెలల క్రితం భార్య నగలు, కుమార్తె గొలుసు తాకట్టు పెట్టి కొంత అప్పు చెల్లించారు. అయినా రూ.2 లక్షలకు పైగా రుణం మిగిలి ఉంది. రైతుమిత్ర గ్రూపు ద్వారా బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.15 వేల రుణం మాఫీ అవుతుందని ఆశపడ్డాడు. చెల్లించాల్సిందేనని బ్యాంక్ సిబ్బంది చెప్పడంతో విధిలేక అప్పుతెచ్చి చెల్లించారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి పొలంలోని పాకలో ఉరి వేసుకున్నాడు. ఆయనకు భార్య, కూతురు(4), ఏడాదిన్నర కొడుకు ఉన్నారు. మండపేట రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.