breaking news
Telugu medium teachers
-
‘తెలుగు’ కనుమరుగు..?
- గణనీయంగా పడిపోయిన తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్య - చాలా పాఠశాలల్లో - రెండంకెలకు తగ్గుదల - పది వరకు ఉన్న స్కూల్ ఒక్కటే..! సాక్షి, ముంబై: రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. గతంలో తెలుగు విద్యార్థులతో కళకళలాడిన అనేక పాఠశాలల్లో నేడు విద్యార్థులు కరవయ్యారు. విద్యార్థులు తగ్గుతుండటంతో ఉపాధ్యాయుల సంఖ్య కూడా తగ్గిపోతోంది. తెలుగు విద్యార్థులకోసం ‘బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్’ (బీఎంసీ) అనేక సదుపాయాలు కల్పిస్తోంది. విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, నోట్ పుస్తకాలు, దుస్తులు, ఇలా 27 రకాల వస్తువులను ఉచితంగా పంపిణీ చేస్తోంది. గతంలో బీఎంసీ తెలుగు పాఠశాలల్లో ఎనిమిది వేల మంది విద్యార్థులు ఉండేవారు. ప్రస్తుతం రెండు పాఠశాల్లో మినహా మిగతా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రెండంకెలకు చేరుకుంది. గతంలో పాఠశాల్లో తెలుగు ఉపాధ్యాయుల సంఖ్య 350కి పైగా ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 90కి చేరుకుంది. దీన్ని బట్టి తెలుగు పాఠశాలల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకటి రెండు ప్రైవేట్ పాఠశాలలు మాత్రమే తెలుగు మీడియంలో బోధిస్తున్నాయి. ముంబై వడాలాలోని ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ (ఏఈఎస్) హైస్కూల్, తూర్పు బోరివలిలోని చైతన్య తెలుగు హైస్కూల్ ఉన్నాయి. ఆంధ్ర ఎడ్యుకేషన్ సోసైటీ హైస్కూల్లో తెలుగు ఒక సబ్జెక్టుగా ఉంది. చైతన్య తెలుగు హైస్కూల్లో పూర్తిగా తెలుగులోనే బోధిస్తున్నారు. చైతన్య స్కూల్లో ఎనిమిది నుంచి పదో తరగతి వరకు తెలుగు మీడియం ఉంది. మూతపడుతున్న పాఠశాలలు విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండటంతో తెలుగు పాఠశాలలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. గతంలో బీఎంసీ పాఠశాలలు 60 నుంచి 45కు పడిపోయింది. ప్రభాదేవి, గోఖలే రోడ్డు తెలుగు మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థులు కరువయ్యారు. గతంలో విద్యార్థులతో కళకళలాడిన వర్లీ అంబేద్కర్, లోయర్ పరేల్ జీకే మార్గ్, నాయిగావ్, గోరేగావ్ సిద్దార్థ్నగర్, సైన్ కోలివాడా కేడీ గైక్వాడ్, ఘాట్కోపర్ పంత్నగర్, కామాటిపూర సీవీబీ మార్గ్, ములూండ్ మున్సిపల్ స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య 2 అంకెలకు చేరుకుంది. తెలుగు మీడియం హైస్కూల్ ఒకే ఒక్కటి: నాయిని ఆదినారాయణ బీఎంసీకి చెందిన పాఠశాలల్లో పదో తరగతి వరకు ఉన్న పాఠశాల ఒకటే ఉందని ములూండ్ తెలుగు మున్సిపల్ పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు నాయిని ఆదినారాయణ పేర్కొన్నా రు. తాను పాఠశాలలో ఆరేళ్ల కింద చేరినపుడు ఏడో తరగతి వరకే ఉండేదన్నారు. ఇక్బాల్ అనే సీనియర్ ఉపాధ్యాయుడు ఎనిమిదో తరగతి ప్రారంభించి పదవీ విరమణ పొందారని చెప్పారు. పాఠశాలలో పదవ తరగతి వరకు తెలుగు మీడియంలో బోధించాలన్న లక్ష్యంతో సహచరులతో కలసి ప్రయత్నించానని అన్నారు. ప్రస్తుతం పాఠశాలలో పదవ తరగతి వరకు తెలుగు మీడియం లోనే బోధిస్తున్నారని, బీఎంసీ పాఠశాలల్లో తెలుగు మీడియంలో బోధించే ఒకే పాఠశాలగా గౌరవాన్ని పొం దామన్నారు. ప్రస్తుతం స్కూళ్లో ఎనిమిది నుంచి పది వరకు సెకండరీ సెక్షన్లో 90 మంది, 1 నుంచి 7 తరగతి వరకు 80 మంది విద్యార్థులున్నారని చెప్పారు. ప్రైమరీ సెక్షన్లో విద్యార్థుల సం ఖ్య పెరగలేదని, సెకండరీ సెక్షన్ స్కూల్ ఒక్కటే ఉండటంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందన్నారు. అందరు ప్రయత్నించాలి: బడుగు విశ్వనాథ్ తెలుగు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణాలున్నప్పటికీ సంఖ్య పెంచేందుకు అందరూ ప్రయత్నించాల్సిన అవసరం ఉందని శివ్డీ-వడాలా ఇస్టేట్లోని మున్సిపల్ పాఠశాల ఇన్చార్జ్ బడుగు విశ్వనాథ్ అన్నారు. మున్సిపల్ స్కూళ్లలో పిల్లలకు అన్ని సదుపాయాలున్నాయని, 27 రకాల వస్తువులను ఉచితంగా అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం కంప్యూటర్ శిక్షణ కూడా ఉచితంగా ఇస్తున్నారు. -
సక్సెస్ అంతంతే!
మంచిర్యాల సిటీ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఇంగ్లిష్ నేర్చుకోవాలనే సదుద్దేశంతో ప్రభుత్వం సక్సెస్ పేరిట ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టింది. జిల్లాలో 468 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా, వీటిలో 272 పాఠశాలల్లో 2008 సంవత్సరంలో సక్సెస్ పేరిట ఇంగ్లిష్ మీడియం ప్రారంభించింది. ప్రత్యేకంగా ఇంగ్లిష్ బోధించే ఉపాధ్యాయులు కాకుండా ఆరు నుంచి పదో తరగతి తెలుగు మీడియం బోధించే ఉపాధ్యాయులతోనే బోధన ప్రారంభించింది. అధికారులు మొదటి ఏడాది సీబీఎస్ఈ సిలబస్‌ను ఎంపిక చేశారు. సాధ్యం కాదని ఉపాధ్యాయులు చెప్పడంతో రెండో సంవత్సరం రాష్ట్ర సిలబస్‌కు పరిమితం చేశారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల బోధన ఇంగ్లిషు మీడియంలో అంతంత మాత్రమే ఉండటం, మరికొన్ని పాఠశాలల్లో అత్తెసరు ఉపాధ్యాయులు ఉండటంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. కొందరు విద్యార్థులు ప్రైవేటును ఆశ్రయించగా, మరికొందరు తెలుగు మీడియంకు బదిలీ అయ్యారు. దీంతో సక్సెస్ పాఠశాలల సంఖ్య 100 లోపుకు పడిపోయింది. ‘ఫీజుల’ భారం తట్టుకోలేక.. పట్టణ ప్రాంతాల్లో ఇంగ్లిషు మీడియం విద్యపై తల్లిదండ్రులకు ఆసక్తి పెరిగింది. ఐదో తరగతి వరకు ప్రైవేటు పాఠశాలల్లో చదివించి, ఫీజుల భారం తట్టుకోలేక ఆరో తరగతి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు. 2013-14 విద్యా సంవత్సరంలో ఒక్క మంచిర్యాల మండలంలోనే పదో తరగతి 91 మంది విద్యార్థులు మాత్రమే చదివారు. ఇందులో 47 మంది బాలికలే కావడం విశేషం. కాగా, 1998 డీఎస్సీ తర్వాత నియామకమైన ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది ఇంగ్లిషు మీడియం వారే ఉన్నారు. వీరితోపాటు ఉపాధ్యాయ శిక్షణలో ఇంగ్లిషు మెథడాలజీ తీసుకున్నవారు కూడా ఉన్నారు. వీరు మారుమూల ప్రాంతాల్లోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్నారు. వీరిని ఉన్నత పాఠశాలల్లో నియమిస్తే కొంత మేరకు విద్యార్థులకు న్యాయం జరిగేది. ప్రస్తుతం ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు కూడా 1998కి ముందు నియామకమై పదోన్నతి పొందినవారే ఉన్నారు. వీరితోనే ఇంగ్లిషు మీడియం విద్యార్థులకు ప్రస్తుతం తరగతులు చెప్పిస్తున్నారు. దీంతో సమస్య ఉత్పన్నమవుతోంది. ప్రభుత్వం ఇప్పటికైన ఆయా సబ్జెక్టుల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.