breaking news
Telangana Traditional
-
భాషకు బ్రహ్మోత్సవం
ఆరంభం అదరహో.. మతాబులు.. బాణ సంచా వెలుగులు జిలుగులు.. ఆకాశంలో సప్తవర్ణ కాంతులు.. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు సంబురం మిన్నంటింది! శుక్రవారం రాత్రి అంగరంగవైభవంగా ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మహాసభలను ప్రారంభిస్తున్నట్లు రాత్రి 8.30 గంటలకు అధికారికంగా ప్రకటించిన వెంటనే.. ఆకాశంలో కాంతులు విరజిమ్మాయి. ఎల్ఈడీ.. లేజర్ లైట్ల వెలుతురుతో ఆకాశంలో సప్తవర్ణాలు ఆవిçష్కృతమయ్యాయి. సుమారు పది నిమిషాల పాటు ఈ వెలుగులు.. ఆహూతులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. బాణసంచా వెలుగులను తమ సెల్ఫోన్లలో బంధించేందుకు వీక్షకులు ఆసక్తి చూపారు. ఆకాశంలోని అద్భుత దృశ్యాలను స్టేడియం నలుమూలలా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ తెరల్లో చూసి ఆనందించారు. ఈ మ్యూజికల్ ఫైర్వర్క్స్ను ప్రముఖ కార్పొరేట్ సంస్థ విచ్‌క్రాఫ్ట్ నిర్వహించింది. వీటికి సుమారు కోటి రూపాయల దాకా వెచ్చించినట్టు నిర్వాహకులు తెలిపారు. మహాసభల ముగింపు రోజైన ఈ నెల 19న కూడా లేజర్‌షోతోపాటు బాణసంచా కాంతులతో మరోసారి మంత్రముగ్ధులను చేయనున్నారు. మొత్తంగా వీటన్నింటికిగానూ రూ.2.20 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సాంస్కృతిక సౌరభం.. ప్రపంచ తెలుగు మహాసభలలో తెలంగాణ సాహిత్య సాంస్కృతిక సౌరభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ చరిత్రను, కళలను, వైభవాన్ని ఆవిష్కరించిన రాజారెడ్డి, రాధారెడ్డి, కౌసల్యారెడ్డి బృందం ప్రదర్శించిన ‘మన తెలంగాణ మాణిక్యవీణ’ సంగీత నృత్య రూపకం అలరించింది. అద్భుతమైన నృత్యం, అందుకు తగిన అభినయంతో అరంగంటకు పైగా సాగిన ప్రదర్శనలో ప్రతి ఒక్కరూ తన్మయత్వం పొందారు. ప్రధాన వేడుకల ప్రారంభోత్సవం అనంతరం మిరుమిట్లు గొలిపే బాణ సంచా వెలుగు జిలుగులు ఒకవైపు సంగీత, సాంస్కృతిక ప్రదర్శనలు మరోవైపు మహాసభలను కన్నులపండువ చేశాయి. ప్రారంభోత్సవ వేడుకలకు ముందు మయూరి ఆర్ట్స్ బృందం ప్రదర్శించిన పేరిణీ లాస్యం శతాబ్దాల నాటి కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టింది. శ్రీనిధి, వందేమాతరం శ్రీనివాస్ గీతాలాపన మరో ఆకర్షణ. ఆద్యంతం తెలంగాణ వైభవాన్ని కీర్తిస్తూ సాగిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంది. అనంతరం లిటిల్ మ్యుజీషియ¯Œ ్స అకాడమీ రామాచారి బృందం పాడిన పాటలు, దేశపతిశ్రీనివాస్ సారథ్యంలో, రాధాకృష్ణన్ సంగీతం కూర్చిన ‘జయజయోస్తు తెలంగాణ’ నృత్య రూపకం మరో అద్భుతమైన ప్రదర్శనగా ఆకట్టుకుంది. ఆహా ఏమి రుచి... ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవ వేడుకల్లో తెలంగాణ సంప్రదాయ రుచులు అదుర్స్ అనిపించాయి. తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేష¯Œ ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో తెలంగాణ వంటకాలను తెలుగు భాషాభిమానులు ఆరగించి తృప్తిపడ్డారు. హైదరాబాదీ బిర్యానీ, బడేమియా కబాబ్, బొక్కల పులుసు, తెలంగాణ మిర్చి బజ్జీ, బ్రెడ్ ఆమ్లెట్, మలాయి కుల్ఫీ, తెలంగాణ చాయ్, వేడి వేడి గుడాలు వారేవా అనిపించాయి. హైదరాబాద్‌కు వస్తే హైదరాబాదీ బిర్యాని రుచి చూడాల్సిందే. పేరుతోనే ఆకలి పెంచే హైదరాబాదీ బిర్యానీ రుచులు మహాసభల్లోనూ అదిరిపోతున్నాయి. మటన్, చికె¯Œ తో చేసిన కబాబ్స్ నా¯Œ వెజ్ ప్రియుల నోరూరించాయి. వేడి వేడి శనగ, పెసర, బబ్బెర గుడాలు గుప్పెడు నోట్లో వేసుకుంటే చాలు.. గిన్నెలోవి మొత్తం కడుపులో పడే వరకు చెయ్యీ నోరూ ఆగవు. వేడి వేడి చర్చల్లో వీటి రుచి రెట్టింపు అని గ్రహించారేమో, వాటికీ ఒక స్టాల్ పెట్టేశారు. సీజ¯Œ తో సంబంధం లేకుండా అందరికీ ఇష్టమైన పానీయం తేనీరే. దీంతో సభ ప్రాంగణంలోనికి వెళ్లే ముందు చాయ్ కోసం పోటీ పడ్డారు. ముందే చలికాలం కావడంతో మరింత మక్కువ కనిపించింది. తెలుగు భాష తియ్యనిదే అయినా కారం అంటే మమకారం వదలరు. అందుకేనేమో మహాసభల్లో మిర్చిబజ్జీలకు మహా గిరాకీ పలికింది! తొలి తొవ్వ మనదే ఎన్నో సాహితీ ప్రక్రియలు ఇక్కడే పురుడుపోసుకున్నాయి: దేశపతిమాతృభాష మీద తెలంగాణ గడ్డకు అనాదిగా అమితమైన ప్రేమ ఉంది. అనేక సాహిత్య ప్రక్రియలకు తెలుగులో తొలి తొవ్వలు పరచిన వారిలో సింహభాగం తెలంగాణ బిడ్డలే కనిపిస్తారు. ఎన్నో ప్రక్రియలకు తెలంగాణలోనే తొలి పొద్దు పొడిచింది అని ప్రముఖ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తన సంగీత నృత్యరూపకం గురించి ఆయన స్పందన. పాట.. ఎన్నో మహోద్యమాలను నడిపింది. దానికి అనుసంధానంగా నృత్యరూపకాలు. ఎన్నో సందర్భాల్లో ఇవి రుజువయ్యాయి. తెలంగాణ గడ్డపైన తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన తెలంగాణ తేజోమూర్తులు అనేక మంది ఉన్నారు. వారి కష్టం వృథా పోకూడదు. వారి వీరోచిత చరిత్ర ప్రజలకు తెలియాలి. నేటి తరానికి తెలియజెప్పాల్సిన బాధ్యత కవిగా నాపై ఉందని భావించా. పాటతో నృత్యరూపకం అయితే బాగుంటుందని భావించా. దీన్నుంచి పురుడుపోసుకున్నదే ‘జయ జయోస్తు తెలంగాణ’ సంగీత నృత్యరూపకం. వాళ్లు జీవితాన్నే పాడుతారు ∙జ్ఞానపీపురస్కార గ్రహీత సీతాకాంత్ మహాపాత్రద్విభాషాకోవిదులు, జ్ఞానపీ అవార్డు గ్రహీత, ఒరియా నుంచి 12 భారతీయ భాషలూ, 13 భారతీయేతర భాషల్లోకీ అనువదించిన అనేక పరిశోధనాత్మక గ్రంథాలను రాసిన, ఐదు దశాబ్దాలపాటు తన సాహిత్యంతో ఒడిశా ప్రజల, ప్రధానంగా ఆదివాసీల మన్ననలనందుకున్న గొప్ప రచయిత సీతాకాంత్ మహాపాత్ర పుస్తకం పేరు ‘దే సింగ్ లైఫ్’. మన దేశ చరిత్రలో మౌఖిక సాహిత్య ప్రాధాన్యతను గురించి చెప్పమని ‘సాక్షి’ అడిగినప్పుడు కూడా ఆయన అదే చెప్పారు. ‘వాళ్లు తమ జీవితాన్నే పాడుతారు’. ప్రపంచ తెలుగు మహాసభల్లో సత్కారాన్ని స్వీకరించడానికి హైదరాబాద్ వచ్చిన సీతాకాంత్ పంచుకున్న అంతరంగం... ‘‘వాళ్లు తమ జీవితాన్నే పాడుతారు. మొదట వాళ్ల తల్లులు, ఆ తరువాత వాళ్ల పిల్లలు, మనవలు, మునిమనవరాళ్లు. కానీ వాళ్ల సజీవ సాహితీ ప్రక్రియ అయిన మౌఖిక సాహిత్యం మరణించదు. నిరంతరం, తరం తరం ఒకరినుంచి మరొకరికి సంక్రమిస్తూనే ఉంటుంది. ఇక్కడైనా, ఎక్కడైనా మౌఖిక సాహిత్యానికున్న ప్రత్యేకత అది. వాళ్లు నిరక్షరాస్యులు. అయితేనేం ఎంతో పాండిత్యాన్ని చదివినవారు కూడా వాళ్ల ప్రతిభ ముందు దిగదుడుపే. తూర్పు భారతంలో నేను ఎక్కువగా పనిచేశాను. ఒడిశా, బిహార్, బెంగాల్, జార్ఖండుల్లో విస్తృతంగా ఆదివాసీల జీవితాలను చదవడం కోసమే తిరిగాను. ఆదివాసులకు ఆస్తుల్లేవు. ఆధిపత్యాల్లేవు. అవకాశాలూ లేవు. ‘దే డోంట్ హావ్ పొసిషన్ ఆల్సో’. వాళ్లకి తెలిసిందొక్కటే... జీవితాన్ని అనుభవించడం. వాళ్లది సామూహిక జీవితం. సమైక్య జీవనం. ఆధునిక సమాజంలో ఉన్నట్టు ఒక్కరు పాడితే వెయ్యిమంది వినడం కాదు. వారంతా కలిసి పాడతారు. ఆడతారు. అందరికోసం అందరూ అనేది వారిదైన వారి సంస్కృతి. ఈ రెండు సమూహాలకీ మధ్య ఒక బలమైన గీత ఉంది. అదే కమర్షియలైజేషన్. వ్యాపారీకరణ. ఒక్కరు పాడటం డబ్బు కోసం. కానీ అందరూ కలసి పాడటం ఆనందం కోసం. కళని కొనుక్కోవడం బ్రిటిష్ వారి నుంచే వచ్చింది. కానీ ఆదివాసీలనెవరూ కొనలేరు(నెక్లెస్ రోడ్లో ఆకాశం గుండా ఎగురుతోన్న పక్షుల్ని చూపిస్తూ). ఎందుకంటే వాళ్లు స్వేచ్ఛా జీవులు. వాళ్లకి తమవాళ్లెవరో, పరాయివాళ్లెవరో స్పష్టంగా తెలుసు. బయటి వాళ్లని వాళ్లు ‘దిక్కు’ అని పిలుస్తారు. చేయాల్సింది వాళ్లని మనలో కలుపుకోవడం కాదు. వాళ్ల సంస్కృతినీ, వారి జీవితాలనూ, వారి సాహిత్యాన్నీ కాపాడాలి. అలా అని వారు ఎదుగూబొదుగూ లేకుండా నిరక్షరాస్యులుగా ఉండాలని కాదు. వారి భవిష్యత్ తరాలను అక్షరాస్యులుగా మార్చి వారి కళలను కాపాడాలి. వారి హస్తకళలు ఇప్పుడు ఆధునిక ప్రపంచం గోడలకు వాల్‌హ్యాంగింగ్స్‌గా వేలాడుతున్నాయి. అలాగే ఆధునిక ప్రపంచం వారి చేతితో గీసిన బొమ్మలు వేసిన బట్టలను విస్తృతంగా వాడుకలోకి తెచ్చింది. అలా వారి మనుగడను కొనసాగనివ్వాలి. 200 ఏళ్ల క్రితం తెలుగు ఎలా వుందో, ఇప్పుడలా లేదు. మౌఖిక సంప్రదాయాల్లో కొనసాగింపు అధికం. అనేక తరాలు వాటిని అందిపుచ్చుకుని కొనసాగిస్తాయి. వాటిని అలా బతకనిస్తే చాలు’’ దేశ రాజధానిలోనూ జరగాలి! తెలుగు సంస్కృతి ప్రపంచంలో నలుదిశలా విస్తరించింది. సంస్కృతి పరిపూర్ణమయ్యేది భాషతోనే. అలా తెలుగు భాష విస్తరించని ప్రదేశం లేదంటే అతిశయోక్తి కాదు. మేము మా కళ ద్వారా ప్రపంచంలోని అనేక దేశాలలో పర్యటించినప్పుడు అక్కడ తెలుగు మహిమ గురించి మాట్లాడే అవకాశాలెన్నో వచ్చాయి. ఉద్యోగాల కారణంగా ఖండాంతరాలలో స్థిరపడిన వాళ్లు ఒక ఇరవై ఏళ్ల నుంచి తెలుగు భాష, సంస్కృతి మీద మమకారం పెంచుకుంటున్నారు. అమెరికాలో తెలుగు వారి సాంస్కృతిక సభలకు వెళ్లినప్పుడు అనేక మంది తల్లిదండ్రులు వారాంతంలో పిల్లలను కల్చరల్ క్లాస్‌లకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. స్విట్జర్లాండ్, స్టాక్‌హోమ్‌లో ప్రదర్శన ఇచ్చినప్పుడు 90 ఏళ్ల మహిళ ఈ పద విన్యాసం, అంగ విన్యాసం, భావ వ్యక్తీకరణ ఏకకాలంలో ఇంత అద్భుతంగా చేయడం భారతీయులకే సాధ్యం అని మురిసిపోయింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రదర్శనలిచ్చినప్పుడు అనేక మంది ఉత్తరాది కవులు తెలుగు భాషలో, తెలుగు గ్రంథాలలో భావ వ్యక్తీకరణ రమణీయంగా ఉంటుందని ప్రశంసించేవారు. చరిత్రలో కూడా తెలుగు భాష గొప్పదనాన్ని గుర్తించిన రాజు తెలుగేతరుడే. కృష్ణదేవరాయలు తెలుగు భాష సౌందర్యానికి ముగ్ధుడవడంతోపాటు తెలుగు కవులకు ఆశ్రయమిచ్చి తెలుగు సాహిత్యాన్ని తారస్థాయికి తీసుకెళ్లాడు. నేటికీ మనం తెలుగు భాష గురించి గొప్పగా చెప్పుకోవడానికి కృష్ణదేవరాయలు చెప్పిన ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అనే జాతీయాన్నే చెప్పుకుంటున్నాం. తెలుగు భాష మహోన్నతంగా విరాజిల్లాలంటే ఇలాంటి సభలు ఇంకా జరగాలి. దేశ రాజధాని నగరంలో కూడా నిర్వహించాలి. – రాజారెడ్డి, రాధారెడ్డి దంపతులు, ప్రముఖ నాట్యకారులు ఇలా చేద్దాం...! ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నిటా పాఠశాల విద్య ప్రభుత్వ నిర్వహణలోనే ఉంది. మరీ ముఖ్యంగా విద్యాబోధన తల్లి భాషలోనే జరుగుతోంది. మన దగ్గర ఇది పూర్తి విరుద్ధం. పాఠశాల విద్యను దాదాపు ప్రైవేటు పరం చేశారు. ప్రభుత్వ నియంత్రణే లేని ప్రైవేటు రంగంలో ఆంగ్లమాధ్యమ పాఠశాలలే అత్యధికం. అమెరికా, రష్యా, చైనా, జపాన్, కొరియా, ఆస్ట్రేలియా వంటి దేశాలతోపాటు ఐరోపాకు చెందిన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ వంటి ఏ దేశం తీసుకున్నా అక్కడి విద్యా బోధన ప్రధానంగా తల్లిభాషలోనే! వలస విముక్త దేశాల్లో ఆంగ్ల దుష్ప్రభావం వల్ల ఎన్ని స్థానిక భాషలు కాలగర్భంలో కలిసిపోయాయో ‘యునెస్కో’వద్ద లెక్కుంది. పలు ప్రపంచ అధ్యయనాల సారం ఏమంటే.. ‘పరభాషల కన్నా తల్లి భాషలో విద్యాబోధన వల్ల పిల్లల్లో మేధోవికాసం ఎన్నో రెట్లు ఎక్కువ ఉంది. అలా చేస్తూనే ఒకటి, లేదా రెండు పరభాషల్ని నేర్పించినా 13–14 ఏళ్ల వరకు పిల్లలు అత్యంత తేలిగ్గా వాటిని నేర్చుకోగల్గుతారు. అలాంటి వారే ఎన్నెన్నో పరిశోధనలు జరిపి, కొత్త విషయాలు కనుగొని, వినూత్న ఆవిష్కరణలు చేసిన దాఖలాలున్నాయి. ఇది శాస్త్రీయంగా ధృవపడిన అంశం. చైనాలో అత్యధికులకు బొత్తిగా ఇంగ్లీషు రాదు. ఇంగ్లీషు ఎరిగిన వారూ అదనపు భాషగా నేర్చుకున్నదే! కానీ, విశ్వవ్యాప్తంగా వారు విస్తరించడానికీ, ఇటీవల సాధిస్తున్న ఆధిపత్యానికీ అదేం అవరోధం కాలేదు. పాఠశాల విద్య తల్లిభాష తెలుగులోనే ఉండాలి. ఐదారు తరగతుల నుంచి ఇంగ్లీషును అదనపు భాషగా నేర్పాలి. 12వ తరగతి వరకూ తెలుగు తప్పనిసరి అంశం కావాలి. ఆ పైన కూడా యువతలో ఆసక్తి తగ్గకుండా ఉండేందుకు ప్రాచీన, ఆధునిక తెలుగుసాహిత్యాన్ని విరివిగా ప్రచురించి, చౌకగా అందుబాటులోకి తేవాలి. శాస్త్ర–సాంకేతిక, విశ్వస్థాయిలో వచ్చే నూతన పదజాలానికి, భావజాలానికి తెలుగులో మంచి అనువాదం, అనుసృజన జరిపించాలి. ఇందుకోసం అకాడమీలు, భాషా పరిశోధనాలయాలు, విశ్వవిద్యాలయాల్లో భాషాపీఠాలకు తగు నిధులిచ్చి నిరంతరం క్రియాశీలంగా కృషి జరిపేట్టు చూడాలి. – దిలీప్‌రెడ్డి తమిళనాట తెలుగు శోకం తమిళనాడులో తెలుగు ‘బతికి బట్ట కట్టడం కష్టమే’నంటున్నారు మాడభూషి సంపత్‌కుమార్. అక్కడ మద్రాస్ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన తెలుగు మహాసభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. విశేషాలు ఆయన మాటల్లోనే.. తెలుగువాళ్లు తమిళులుగా మారుతున్నారు..తెలుగు మహాసభల ఏర్పాట్లు బాగున్నాయి. తెలుగు నేల మీద అడుగు పెట్టడమే ఒక పులకింత అయితే ఆత్మీయ స్వాగతం మరింత ఆనందపరిచింది. తమిళనాడులో మన తెలుగు పరిస్థితి ‘బతికి బట్ట కట్టడం కష్టమే’ అన్నట్లుంది. మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తమిళనాడులో తెలుగు వాళ్ల సంఖ్య 40 శాతం. ఇప్పుడు రెండు శాతానికి మించి లేదు. ఉన్న తెలుగు జనం మాత్రం ఎక్కడికీ పోవడం లేదు. పిల్లవాడిని పాఠశాలలో చేర్చేటప్పుడు కృష్ణ అనే పేరు ఉంటే కృష్ణన్ అని రాసేస్తారు. అలా తెలుగు వాళ్లు తమిళులుగా మారిపోతున్నారు.తెలుగు టీచర్ రిటైర్ అయితే అంతే..తమిళనాడులో ఒకప్పుడు తెలుగు పాఠశాలలు ఉండేవి. కానీ ఆ స్కూళ్లలో తెలుగు టీచర్ రిటైర్ అయితే ఇక ఆ పోస్టును భర్తీ చేయడం లేదు. దాంతో పిల్లలు అందులో చేరరు. ‘విద్యార్థులు చేరడం లేదు కాబట్టి ఆ పోస్టును రద్దు చేస్తున్నాం’ అని ప్రభుత్వం వ్యూహాత్మకంగా తెలుగు భాషను అణచివేస్తోంది. 2006లో నిర్బంధ తమిళ విద్య చట్టాన్ని తెచ్చింది. ఇతర భాషలను చదవడానికి ఇప్పుడసలే వీల్లేదు. అందుకే తెలుగు భాషా పరిరక్షణ సమితి తమిళులకు వాళ్ల మాతృభాష మీద ప్రేమ చాలా ఎక్కువ. ఈ క్రమంలో వారి తీరుతో తెలుగు భాష, తెలుగు వాళ్లు వివక్షకు గురవుతున్నారని అనిపించేది. అందుకే తెలుగు వాళ్లను ఒక వేదికపైకి తెచ్చే ప్రయత్నంలోనే భాగంగానే తెలుగు భాçషా పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశాం. యూనివర్సిటీలో తమిళ ప్రొఫెసర్లు పైకి ఏమీ అనరు. కానీ తమిళనాడులో ఉన్నప్పుడు తమిళులుగానే జీవించవచ్చు కదా, తెలుగు భాష అంటూ ఇవన్నీ ఎందుకు... అని తమలో తాము చర్చించుకుంటారు! తెలుగు మాట్లాడేవారు 16 కోట్లుతెలుగు మాట్లాడేవాళ్లు 16 కోట్ల మంది ఉన్నారు. అయితే ఇందులో సగం మంది తెలుగేతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కాబట్టి ఈ సంఖ్యను ప్రభుత్వాలు అధికారికంగా ఒప్పుకోవు. ప్రభుత్వాలు తమిళనాడుతో మాట్లాడాలి..తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమిళనాడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినప్పుడే.. భాష పరిరక్షణకు మాలాంటి వాళ్లు చేస్తున్న ప్రయత్నాలకు ఊతం వస్తుంది. కన్నడిగులు జ్ఞానపీఠ అవార్డు గ్రహీతల ఫొటోలను ఇళ్లలో పెట్టుకుంటారు. తెలుగులో ముగ్గురికి జ్ఞానపీఠ అవార్డు వస్తే... ఆ సంగతి సాహిత్యకారులకు తప్ప సామాన్యులకు తెలీదు. – వాకా మంజులారెడ్డి తెలుగును కాదని పరభాషని ప్రేమించకూడదుచరిత్రకారులు కొందరు జరిగిన దాన్ని రాస్తారు. కానీ జరుగుతున్న ప్రజల చరిత్రను, వారి అనుభవాలను రాయడమే నేడు అవసరం అంటారు కారా మాష్టారుగా తెలుగు ప్రజలకు పరిచయమైన కాళీపట్నం రామారావు. 93 ఏళ్ల వయోవృద్ధులు కారా ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’ పలకరించింది. నేటి తరానికి కావాల్సిన కథలెలా ఉండాలి? సంస్కృతం చదివిన వారికి కూడా కావ్యాలు చదివే శక్తిలేదిప్పుడు. కూటి కోసం, కూలి కోసం వలసెళుతున్న ఎందరో పేదలు నిలువనీడలేక, బ్రిడ్జిల కింద కూడా తలదాచుకుంటున్న పరిస్థితి ఉంది. అలాంటి వ్యక్తుల జీవితాల్ని ఆవిష్కరించే రచనలు, ఆ అభిప్రాయాలను వ్యక్తీకరించే పాత్రలు రచనల్లో కనపడాలి. తెలుగు భాషనీ, సాహిత్యాన్నీ కాపాడుకోవడానికి ఏం చేయాలంటారు? ప్రగతిశీల భావాలు కలిగిన వారే ఆ పని చేయగలరని ఆశ. తెలుగు వారిపై ఆంగ్ల భాషా ప్రభావాన్ని ఎలా చూడాలి? భాషల్లో ఎక్కువ తక్కువలుండవు. తమిళం మాట్లాడేవారికి అదే గొప్ప. తెలుగు మాట్లాడతాం కనుక మనకిది గొప్ప. కానీ తెలుగువాళ్ళు తెలుగుని నిర్లక్ష్యం చేసి ఆంగ్లంలో మాట్లాడటం సరికాదు. అభిప్రాయాల కారణంగా పొరపాట్లు జరుగుతాయి. విజ్ఞానంతో విమర్శనాత్మకంగా మన జీవితాల్ని తరచి చూసుకోవాలి. అది అందరికీ అర్థం అయ్యేట్లు చేయాలి. మంచి ఆలోచన, మంచి పద్ధతి ఎవరినుంచి గ్రహించినా అది కలకాలం ఉంటుంది. కానీ మన భాషని నిర్లక్ష్యం చేసి, పరభాషని ప్రేమించడం కాదు. స్త్రీల సమస్యల్నెలా చూడాలి? స్త్రీల జీవితాలను గురించి మాట్లాడేటప్పుడు మహిళా ఉద్యమకారులు, ఓల్గా లాంటి వారు ఒకప్పుడు తమ రచనల్లోనూ, నిజజీవితంలోనూ పురుష ద్వేషాన్ని ప్రదర్శించేవారు. కానీ ఇప్పుడు వారిలో మార్పొచ్చింది. పురుషుల్ని కాకుండా సామాజిక పరిస్థితుల్ని ద్వేషిస్తున్నారు. ఇది మంచిదే. ఎంతో మంది వారి అభిప్రాయాలను అంగీకరించడానికి కూడా అదే కారణం. ఆగితే స్త్రీల చరిత్రే లేదు జ్ఞానపీపురస్కార గ్రహీత ప్రతిభా రాయ్ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా హైదరాబాద్‌కి విచ్చేసిన ప్రతిభారాయ్ వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. తన రచన ‘ఉల్లఘ్న’కు 1985లో ఒడిశా సాహిత్య అకాడమీ అవార్డుని అందుకున్నారు. ఆమె రాసిన ‘యజ్ఞసేని’కి సరళ అవార్డు, అమృతకీర్తి పురస్కార్‌లాంటి ఎన్నో ఆమె ఖాతాలో చేరాయి. ఏడు పదుల వయసు దాటిన ప్రతిభారాయ్ ఇప్పటికీ ఉత్సాహంగా రాస్తున్నారు. ‘నాకీ శక్తి ఎక్కడినుంచి వచ్చిందో తెలుసా?’ అంటూ ఆమే ప్రశ్నించి, తన చుట్టూ ఉన్న జనఘోషే తన రచనాశక్తికి కారణమంటూ ‘సాక్షి’తో ముచ్చటించారు. ∙మీ రచనకు ప్రేరణ ఏమిటి? అమ్మ. ప్రకృతి. ఇవి రెండూ నాలోని రచనాశక్తికి ప్రాణం పోశాయి. తొమ్మిదేళ్ళకే రాయడం మొదలుపెట్టాను. కానీ అవి అందమైన ఇంద్రధనుస్సులో, అమ్మ మీదో, ప్రకృతిని గురించో. అయితే స్త్రీలకు ఇల్లు, భర్త, పిల్లలే పరామవధి. ఇప్పటికీ. రాత వాళ్ళ ప్రాధాన్యత కాకుండా చేశారు. మీ రచనలన్నింటికీ నేపథ్యం అసమానతలే. ఆ సామాజిక చైతన్యానికి స్ఫూర్తి? నా జీవితాన్ని అమితంగా ప్రభావితం చేసిన విషయం మత వివక్ష. మేం నివసించే పరిసరాల్లో మా యింటి చుట్టూ ఉన్న ముస్లింల జీవితాలను నిత్యం వెంటాడే అభద్రతాభావం నా రచనలకు స్ఫూర్తి. ఎక్కడో ఏదో విస్ఫోటనం జరిగితే అక్కడ హిందూ, ముస్లింలిరువురూ ఉంటే కేవలం ముస్లిం యువకుడొక్కడే ఎందుకు జైలుకెళ్ళాల్సి వస్తోంది అన్నది నా ప్రశ్న. దానిపైనే ‘పవిత్ర రాత్రి’ రాశాను. టెర్రరిస్టులనే ముద్రకాదు, సమస్యకు పరిష్కారాలు కావాలి. ఆశించినంతగా స్త్రీల రచనలు రాకపోవడానికి కారణం? ఒకప్పుడు ప్రాచీన స్త్రీల రచనలన్నీ వారి జీవితం ముగిసిన తరువాత ఏ తలదిండుకిందనో, బీరువాలోని చీరల మడతల్లోనో, ఏ వంటింటి మరుగుల్లోనో రాతప్రతులుగా దొరికేవి. జీవితంలో తమకోసం ఒక్క క్షణాన్నీ వెచ్చించలేని పరిస్థితి స్త్రీకి కల్పించారు. అయినా వారి అభిప్రాయాల్ని ఎక్కడోచోట భద్రపరిచారు రహస్యంగా. స్త్రీలు రాయడమే నేరమనే భావనలోంచి ‘వు డేర్ టు రైట్’ అనేదాకా వచ్చాం. మేం రాసే సాహసం చేశాం. ఆనాడు రాసే ఆడవాళ్లని చెడ్డవాళ్లని ముద్రవేసారు. ఇప్పుడు ఇంకేదో ముద్ర వేస్తున్నారు. అయినా మనం ఆగకూడదు. ఆగితే స్త్రీల చరిత్రే లేదు. భాష, లేదా సాహిత్యం ఎలా కాపాడుకోగలం? చదువొక్కటే ఈ రెంటినీ బతికించలేవు. జనజీవితాలే సాహిత్యంగా రావాలి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, చుట్టూ వున్న సమాజం మన పిల్లల ఎదుగుదలపై ప్రభావాన్ని చూపే అంశాలు. వారే సమాజాన్ని ప్రభావితం చేయగలరు. మార్పుకి నాంది పలకగలరు. తెలుగు మహాసభలపై మీ స్పందన? మాలాంటి ఇతర భాషీయులను కూడా పిలిచారు కాబట్టి, ఇవి తెలుగు సభల్లా కాదు ప్రపంచ భాషా సభల్లా అనిపిస్తున్నాయి. ఇది హర్షించాల్సిన విషయం. మాలాంటి ఎందరినో ఈ సభలకు ఆహ్వానించి సన్మానించడం సంతోషం. ‘‘నేను వర్గరహిత, కులరహిత, వర్ణవివక్షలేని సమాజాన్ని ఆకాంక్షిస్తున్నాను. అవే రాశాను. అదే ఆచరించాను కూడా. లింగ వివక్ష మీద రాసినందుకు ఫెమినిస్ట్నన్న ముద్రవేశారు. కుల, వర్గ వివక్షపైన రాస్తున్నానని నన్ను కమ్యూనిస్టునన్నారు. కానీ నేను హ్యూమనిస్టుని. అసమానతలు లేకుండా, వివక్షకి బలికాకుండా సమానంగా జీవించే సమాజాన్ని చూడాలన్నదే నా జీవితాశయం’’ అంటున్నారు ఒడిశా రచయిత్రి, జ్ఞానపీuЇ పురస్కార గ్రహీత ప్రతిభారాయ్. సంభాషణ: అత్తలూరి అరుణ -
బ్యూటీ ఫుల్.. బతుకమ్మ
-
స్వీట్ మెమొరీ
సంతోషాన్నిచ్చింది బతుకమ్మ పండుగంటే చాలా ఇష్టం. తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన సాక్షి ‘సిటీ ప్లస్’కు ధన్యవాదాలు. - సందీప్తి, హీరోయిన్ సంప్రదాయ వేదిక బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు వేదిక. స్వతహాగా కూచిపూడి డ్యాన్సర్‌ను కావడం... ఇలాంటి కళాత్మక పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉంది. - రమ్య, నర్తకి పెరుగుతున్న ఆదరణ రాబోయే రోజుల్లో బతుకమ్మకు మరింత ఆదరణ పెరుగుతుంది. మరింత ఉత్సాహంగా ఈ వేడుక జరుపుకొంటాం. తొలిసారి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం మన సంప్రదాయానికి ఊపిరి పోస్తోంది. - అంజనాచౌదరి, మాజీ ఎమ్మెల్యే అదృష్టం గతేడాది బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నా. ఈసారి సాక్షి ‘సిటీ ప్లస్’ ఆధ్వర్యంలో ఈ ఉత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పండుగ ప్రతి ఇంటా సుఖసంతోషాలు తేవాలని ఆశిస్తున్నా. - మాధవీలత, హీరోయిన్ మధురానుభూతి: బతుకమ్మ వేడుకలో పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ అవకాశం కల్పించిన సాక్షి ‘సిటీ ప్లస్’కు కృతజ్ఞతలు. ఇలా సంప్రదాయబద్ధంగా ముస్తాబై సహ నటులతో ఆడటం జీవితాంతం గుర్తుండిపోతుంది. - ఫర్హాఖాన్, హీరోయిన్ సంస్కృతీ సౌరభం బతుకమ్మ ఆట ఆరంభం నుంచి నిమజ్జనం వరకు.. ప్రతి క్షణం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టింది. అమెరికా నుంచి వచ్చిన వెంటనే ఈ వేడుకలో పాల్గొనే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు ‘సాక్షి’. - రుచికాశర్మ, మిసెస్ సౌత్ ఏషియా ఇంటర్నేషనల్ 2014 ‘సాక్షి’కి కృతజ్ఞతలు చిన్నప్పటి నుంచే సిటీలో బతుకమ్మ ఆడటం చూస్తున్నా. అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి వేడుకలో పాల్గొనేదాన్ని. అయితే యాంకర్‌గా మారాక తొలిసారిగా బతుకమ్మ ఆడే అవకాశం కల్పించిన ‘సాక్షి’కి థ్యాంక్స్. - గీతాభగత్, యాంకర్ ఎంజాయ్ చేశా ఈ వేడుకను ఎంతో ఎంజాయ్ చేశా. శిల్పరామంలో చాలా మంది మధ్య పాటలకు చప్పట్లు కొడుతూ... ఆడుతూ బతుకమ్మల చుట్టూ తిరగడం ఓ మధురానుభూతి. - అనూష, యాంకర్ చిన్నప్పటి నుంచీ... మాది వరంగల్ జిల్లా. చిన్నప్పటి నుంచే బతుకమ్మ ఆడుతున్నా. అమ్మమ్మ, నానమ్మలు పాట పాడుతుంటే మేం కోరస్ అందుకునే రోజులు గుర్తొచ్చాయి. ‘సాక్షి’కి ధన్యవాదాలు. - మహతి, టీవీ నటి అంతా ఒక్కచోట... బతుకమ్మ ఆడటం ఇదే తొలిసారి. నాలాంటి నటీమణులందరినీ ఒక చోటకు చేర్చిన సాక్షి ‘సిటీ ప్లస్’కు థ్యాంక్స్. సంప్రదాయ వేదిక శిల్పారామంలో ఈ వేడుక జరుపుకోవడం మరిచిపోలేని అనుభూతి. - తనుశ్రీ, హీరోయిన్ కలకాలం... సిటీలో ఎవరి లైఫ్‌లో వారు బిజీగా ఉంటున్నారు. అలాంటి సిటీకి ‘సాక్షి’ బతుకమ్మ కళ తెచ్చింది. తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఆడటం జీవితంలో మరిచిపోలేనిది. - క్యాండీ, యాంకర్ అద్భుతం గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నవారందరినీ ఒక చోటకు చేర్చి బతుకమ్మ ఆడించడం అద్భుతంగా ఉంది. ఇలాంటి చక్కని వేడుకను నిర్వహించి, మా అందరికీ స్వీట్ మెమొరీని మిగిల్చిన ‘సాక్షి సిటీ ప్లస్’కు ధన్యవాదాలు. - అనిత, యాంకర్ -
బ్యూటీ ఫుల్.. బతుకమ్మ
సద్దుల సద్దు మోగకముందే.. ఆనందం అంబరాన్నంటింది. రంగురంగుల బతుకమ్మకు అన్ని రంగాల ఆడపడుచులు ఆటపాటలతో ఆరాధించారు. తీరొక్క పూల కొమ్మకు తమదైన రీతిలో ఉయ్యాల పాటలు వినిపించారు. సంబరాల వేడుకను సయ్యాటలతో జరుపుకున్నారు. కళాకారులు, యాక్టర్లు, యాంకర్లు, లాయర్లు, క్రీడాకారిణులు.. పిన్నలు, పెద్దలు, రాజకీయ రమణులు.. ఇలా అన్ని రంగాలకు చెందిన మగువలు జనజాతరలో మమేకమయ్యారు. బతుకమ్మ పాటకు.. దాండియా ఆటను జోడించి కలర్‌ఫుల్ వేడుకను కళ్లముందుంచారు. గౌరమ్మకు జానపదాలతో గళార్చన చేసి మురిపెంగా గంగ ఒడికి చేర్చారు. సెల్కాన్ సౌజన్యంతో సాక్షి ‘సిటీప్లస్’ ఆధ్వర్యంలో శిల్పారామంలో మంగళవారం జరిగిన బతుకమ్మ సంబరాలు.. సైబర్వనంలో గునుగు పూల పరిమళం వెదజల్లింది. - సాక్షి, సిటీప్లస్ ‘ఆడబిడ్డకు బతుకునిమ్మంటూ ఉయ్యాలో... ఆడ బిడ్డకు బతుకునివ్వమంటూ ఉయ్యా లో... బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో’.. పాటలతో పచ్చని ఆవరణ అణువణువూ ప్రతిధ్వనించింది. ఈ పాటలకు రాగం కలిపిన వారిలో రాజకీయనేతలూ ఉన్నారు. కాలు కదిపిన వారిలో కళాకారులూ ఉన్నారు. లాంగ్గార్డెన్లో ఒక వైపుగా నెలకొల్పిన బంగారు పూల బతుకమ్మ కాంతులు వెదజల్లింది. మధ్యలో ఏర్పాటు చేసిన చిన్న వేదికపై ఒక్కొక్కరుగా బతుకమ్మలను అమర్చారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్రముఖ న్యూస్‌రీడర్ స్వప్న స్వాగత వచనాలతో సెలబ్రిటీల రాక ప్రారంభమైంది. ఒకరి వెంట ఒకరుగా వచ్చిన విభిన్న రంగాల ప్రముఖులు బతుకమ్మ సంబరాలకు సిద్ధమయ్యారు. తెలంగాణ సంప్రదాయ సంగీత రీతులను ఆస్వాదిస్తూ, ముచ్చట్లతో గడిపారు. అందరూ హాజరైన అనంతరం ఆటపాటలకు తెరలేచింది. సంప్రదాయానికి వందనం.. మెత్తని పచ్చిక మీద నర్తించిన పాదాలు... ప్రకృతికి ప్రణమిల్లిన తెలంగాణ సంప్రదాయానికి ఘన వందనాలు అర్పించాయి. అచ్చమైన తెలంగాణ ప్రాంత గ్రామీణ మహిళలు అందించిన సహకారాన్ని ఆనందంగా అందుకుంటూ.. అక్కడికక్కడే ఆటపాటల్లో ఇన్స్టంట్ ట్రైనింగ్ తీసుకుని మరీ పలువురు సినీ, గ్లామర్ రంగపు అమ్మాయిలు ఆడిపాడిన తీరు అందరినీ అలరించింది. మన పండుగ అంటే మనది మాత్రమే కాదు మన లో మమేకమైన అందరిదీ అనే సరికొత్త సిద్ధాంతానికి జన్మనిచ్చిందీ సంబరం. పురుషులమైతేనేం.. ఆటపాటలకు మేము సైతం సై అంటూ పాలమూరు ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ వంటివారు సైతం పాల్గొనడం విశేషం. అపురూప ‘కళ’యిక... రాత్రి 9గంటల దాకా నిర్విరామంగా సాగిందీ సందడి. రాజకీయనేతలు, యువ సినీతారలు, అందాల రాణులు, సంప్రదాయ కళాకారులు... ఇలా విభిన్న రంగాలకు చెందిన మహిళల అపూర్వ కలయికతో తెలంగాణలోనే ఇప్పటిదాకా జరిగిన వాటిల్లో అత్యంత వైవిధ్యభరిత వేడుకగా నిలిచింది. ఈ సంబరంలో శిల్పారామం సందర్శకులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన సినీ, రాజకీయ, గ్లామర్ రంగ ప్రముఖుల ఆటోగ్రాఫ్స్ తీసుకుంటూ, ఫొటోలు దిగుతూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. కోలాహలంగా దాండియా... దసరా వేడుకలో భాగంగా సిటీప్లస్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాండియా కార్యక్రమం సైతం అతిథులను ఉర్రూతలూగించింది. రంగు రంగుల స్టిక్స్‌ను చేతబూనిన యువతులు, సెలబ్రిటీలు శిల్పారామం ఆవరణకు కొత్త శోభను అద్దారు. దాదాపు 2 గంటలకు పైగా సాగిన దాండియా సంబరంలో సందర్శకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎంజాయ్ చేశారు. అద్భుతమైన సంగీత నేపధ్యంలో సాగిన ఈ సందడిని తమకు సమర్పించిన సాక్షి సిటీప్లస్కు వీరంతా హ్యాట్సాఫ్ చెప్పారు. ఆకట్టుకున్న ఆర్జే సూర్య... కార్యక్రమం ముగింపు సందర్భంగా బిగ్ ఎఫ్ ఎమ్ ఆర్జే సూర్య అందించిన మిమిక్రీ హర్షధ్వానాలు అందుకుంది. అటు మెగాస్టార్ నుంచి ఇటు సూపర్‌స్టార్ దాకా పలువురు నటుల్ని ఆయన అనుకరించిన తీరు, అందుకు గాను అల్లుకున్న కథనం అహుతుల్ని నవ్వుల్లో ముంచెత్తింది. స్వరాష్ట్రంలో తొలిసారి.. ఇది మహిళల పండుగ. కులాలకు అతీతంగా అందరి మధ్య అనుబంధాలను పెంచే పండుగ. తొలిసారి సొంత రాష్ట్రంలో అధికారికంగా సెలిబ్రేట్ చేసుకోవడాన్ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. - శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే సామాజిక పండుగ.. ఆటపాటలు, ఆడవాళ్ల ముచ్చట్లు, ఇరుగుపొరుగు క్షేమసమాచారాలు.. ఇలా అన్నీ కలసి బతుకమ్మ ఓ సామాజిక పండుగలా అనిపిస్తుంది. - కార్తీక రెడ్డి, నగర మాజీ మేయర్ పూల పండుగ బతుకమ్మ అంటే పూల పండుగ. పూలను పూజించే పండుగ. ప్రకృతి ఒడిలో పుట్టిన అందమైన పూలను సేకరించడం మొదలు.. వాటిని గౌరమ్మగా తీర్చిదిద్ది.. ఆటపాటలతో ఎంతో ఆసక్తిగా సాగే పండుగ. - రేష్మ, సినీనటి తెలంగాణ ఆయువుపట్టు తెలంగాణ సంప్రదాయానికి బతుకమ్మ ఆయువుపట్టు. బతుకమ్మ పాటను మించిన చైతన్య గీతం మరొకటి లేదు. చరిత్ర మొదలు చుట్టుపక్కల జరిగే విషయాల వరకూ అన్నీ బతుకమ్మ పాటల్లో భాగమవ్వడమే ఈ పండుగ ప్రత్యేకత. - డాక్టర్ బండారు సుజాత శేఖర్, రచయిత్రి అన్నింటా ముందుకు.. ఈ బతుకమ్మకు అందరూ ఒక చోట చేరడం నాకు చాలా హ్యాపీగా ఉంది. బతుకమ్మను తెలంగాణ రాష్ట్రం ఇంత గొప్పగా సెలబ్రేట్ చేయడం చాలా బాగుంది. ఇప్పట్నుంచి తెలంగాణ అన్నింటా ముందుండాలని కోరుకుంటున్నాను. - నైనా జైస్వాల్, టీటీ ప్లేయర్ రంగుల బతుకమ్మలు.. బతుకమ్మ గొప్పదనం కళ్లకు కట్టినట్టుగా కనిపించింది ఇక్కడ. బాగా ఎంజాయ్ చేశాను. అందరూ రంగురంగుల చీరల్లో బతుకమ్మల్లా మెరిశారు. - అనూష, విజే పోరు బాట.. హోరు పాట తెలంగాణ పోరుబాటలో బతుకమ్మ ఆటపాటలు కీలక భూమిక పోషించాయి. రాష్ట్ర సాధన ఉద్యమంలో బతుకమ్మలు చేతబూని ఉద్యమించిన మగువలందరూ ఇప్పుడు వేడుకగా జరుపుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే బతుకమ్మ వైభవం దేశవ్యాప్తంగా విస్తరించాలి. ఈ పండుగ ఒక్క ప్రాంతానికి పరిమితం కాకూడదు. అన్ని వర్గాల ప్రజలను ఈ పండుగలో భాగస్వాములను చేయాలి. అప్పుడే ఈ జనం పండుగ ఘనంగా జరిగినట్టు అవుతుంది. - డీకే అరుణ, మాజీ మంత్రి దేశమంతా ఆడాలి.. బతుకమ్మను అందంగా పేర్చడం వచ్చు. అమ్మమ్మ పాట పాడుతుంటే మా పెదనాన్న, చిన్నాన్న, పిల్లలమంతా కలసి ఆడేవాళ్లం. అడుగులో అడుగేస్తూ సాగే బతుకమ్మ ఆట ఆడటం కూడా ఒక కళే. తెలంగాణ వచ్చాక దీన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. మన బతుకమ్మను దేశవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకునేలా చేసే బాధ్యత మనదే. - అలేఖ్య పుంజల పట్నం వచ్చిన తల్లి పల్లెపల్లెను.. ప్రతి గడపను పలకరించిన బతుకమ్మ.. ఇప్పుడు నగరానికి వచ్చేసింది. సిటీలో అన్ని చోట్ల ఘనంగా జరుపుకుంటున్న బతుకమ్మ వేడుకలే దీనికి నిదర్శనం. బతుకమ్మ పండుగ .. ప్రకృతిని కొలిచే పండుగ. అమ్మవారిని ఆటపాటలతో పూజించే పండుగ ఇది. - వి. మమత , టీజీవో అధ్యక్షురాలు - ఫొటోలు: ఠాకూర్, రాజేష్ సృజన్, రాజేష్ రెడ్డి -
ఒక్కేసి పువ్వేసి చందమామ..
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ సంస్కృతిని, పల్లెజీవనశైలిని పాటలతో చాటిచెప్పే ప్రకృతి పండుగ బతుకమ్మ శుక్రవారం మొదలవుతోంది. సాంస్కృతిక అస్థిత్వం నిలుపుకునే క్రమంలో తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మకు ప్రాధాన్యం ఏటేటా పెరుగుతోంది. ప్రత్యేక రాష్ట్రం కోసం మొదలైన మలిదశ ఉద్యమం తర్వాత ఇది వేగంగా జరుగుతోంది. దశాబ్దం క్రితం గ్రామాల్లో బతుకమ్మను ఆడేవారు తక్కువగా ఉండేవారు. కేవలం సద్దుల బతుకమ్మకే పరిమితమయ్యే గ్రామాల్లోని పెద్ద కుటుంబాల వారు సైతం ఇప్పుడు నాలుగైదు రోజులు ఆడుతున్నారు. పూర్తిగా ప్రకృతిని, అత్మీయతలను మననం చేసుకోవ డం ప్రధాన ఉద్దేశంగా బతుకమ్మ పాటలు ఉం టాయి. బతుకు తీరును చెప్పే బతుకమ్మ పాట లన్నీ ఎక్కువ నిరక్షరాస్యులే పాడుతుంటారు. తరతరాలుగా ఈ పాటల వారసత్వ పరంపర అలా కొనసాగుతూ వస్తోంది. మంచి వర్షాలతో పంటల సాగు విస్తీర్ణం పెరిగిన తరుణంలో ఈ ఏడాది జరుగుతున్న బతుకమ్మతో తెలంగాణ పల్లెలకు కల వచ్చింది. ప్రత్యేక వాతావరణం... బతుకమ్మ పండుగ వచ్చే రోజులకు ప్రత్యేకత ఉంటుంది. వానాకాలం వరినాట్లకు, కోతలకు ఇది మధ్యకాలం. వర్షాకాలం ముగింపు, చలికాలం మొదలయ్యే తరుణం. అందుకే దీన్ని కొత్తపాత సందు అంటారు. అశ్వయుజమాసం అమావాస్య రోజున ఎంగిలిపూలతో తొలిరోజు బతుకమ్మ పండగ మొదలవుతుంది. సద్దుల పండుగతో తొమ్మిదోరోజు ముగుస్తుంది. పరమేశ్వరుడి సతి పార్వతిని దేశమంతా శక్తిస్వరూపిణిగా, ఉగ్రరూపిణిగా కొలుస్తారు. ఒక్క తెలంగాణలో మాత్రం బతుకమ్మ రూపంలో ప్రకృతి మాతగా పూజిస్తారు. బతుకమ్మను పూలతో పేర్చడం, మట్టిలో ఆడడం, నీళ్లలో కలపడం అంతా ప్రకృతితో మమేకమైన ప్రక్రియగానే సాగుతుంది. పార్వతి... గిరిరాజు పుత్రిక. అందుకే బతుకమ్మను కొండలాగా పేర్చుతారు. బతుకమ్మ పేర్చడం కోసం వినియోగించే ఒక్కో పువ్వులో ఒక్కో రకమైన రోగనిరోధక శక్తి ఉంటుంది. తంగేడు పువ్వు లేకుండా బతుకమ్మ పేర్చడం ఉండదు. ఆకులు లేకుండా పువ్వులను సేకరించడం తంగేడు విషయంలో సాధ్యం కాదు. బతుకమ్మలో తప్పకుండా ఉండే తంగేడుపూలు, ఆకులలో రోగనివారణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇది శాస్త్రీయంగా నిర్ధారణ జరిగింది. తంగేడు వేర్లు చర్మరోగాల నివారణకు వినియోగిస్తారు. ఆకులు, పూలు, కొమ్మలను దగ్గరగా పట్టుకోవడం వల్ల అస్తమా, డయాబెటిస్, మూత్రవిసర్జన సమస్యల నివారణ జరుగుతుంది. వర్షాకాలం చివర, చలికాలం ఆరంభంలో ఉండే ఆరోగ్య సమస్యలకు నివారణగా తంగేడు పూలతో ఉండే బతుకమ్మ పేర్పు దోహదం చేస్తుంది. ఆడబిడ్డ... బతుకమ్మ తెలంగాణలో బతుకమ్మను ఇంటి ఆడబిడ్డగా చూసుకుంటారు. అందుకే ఆడబిడ్డ పండుగకు రాకపోతే అవమానంగా భావిస్తారు. ఆడబిడ్డను శుక్రవారం, బుధవారం పుట్టింటి నుంచి పంపరు. అందుకే సద్దుల బతుకమ్మను... శుక్రవారం, బుధవారం జరుపరు. తిథి ప్రకారం ఈ రోజుల్లో సద్దుల బతుకమ్మ వచ్చినా మరుసటి రోజు నిర్వహిస్తారు. బతుకమ్మ పేర్చే తీరు ప్రత్యేకంగా ఉంటుంది. ఎనిమిది రోజులూ సిబ్బి(వెదురు అల్లిక)లో బతుకమ్మలు పేరుస్తారు. గుమ్మడి ఆకులతో మొదటి వరుస పేర్చి వాటిపైన గునుగు పూలను, ఆకులతో ఉన్న తంగేడు పూలను పేరుస్తారు. చివరగా బీర, గుమ్మడి, కట్ల, రుద్రాక్ష... ఇతర రంగురంగుల పూలను కోణాకారంలో అమర్చుతారు. మధ్యలో గౌరమ్మ (గుమ్మడిపువ్వు మధ్య భాగం)ను పెడతారు. బతుకమ్మ పేర్పునకు ఇదే మూలం. పసుపు, కుంకుమ పెట్టి గౌరమ్మను పూజిస్తారు. సద్దులనాడు మాత్రం పెద్ద పెద్ద బతుకమ్మలు పేరుస్తారు. దీనికోసం తాంబాళం ఉపయోగిస్తారు. మొదటి రోజు ఎంగిపూల బతుకమ్మ, రెండో రోజు పప్పుబెల్లం బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ... (ఈ రోజు బతుకమ్మ ఆడరు), ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ. ఇలా ప్రతి రోజు ఈ సీజనులో వచ్చిన పంట ఉత్పత్తులతో చేసిన ప్రసాదాలను బతుకమ్మ ఆడే వద్దకు తీసుకువస్తారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటున్నారు. మొదటి రోజు ఆలయాల్లో... తర్వాత రోజులు ఊరి చెరువులో నిమజ్జనం చేస్తారు. పూల కొరత.. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా లభించే తంగేడు, గునుగు, గుమ్మడి, బంతి, ఇతర పూలు ప్రస్తుతం అంతగా లభించడం లేదు. గ్రామాల్లో కూడా కాంక్రీట్ నిర్మాణాలు వెలుస్తుండడంతో ఇంటి చుట్టూ, పెరట్లో పూల పెంపకం తగ్గిపోయింది. గతంలో పెరళ్లలో గునుగు, గుమ్మడి వంటి పూలు పెంచితే, ఇటీవల కాలంలో వాణిజ్య పంటలు వేస్తుండడంతో వీటి పెంపకం పూర్తిగా తగ్గిపోయింది. బీడుభూముల్లో విరివిగా లభించే తంగేడు పూలు సైతం ఇప్పుడు పెద్దగా దొరకడం లేదు. పట్టణాలతోపాటు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఇప్పుడు మార్కెట్లో పూలు కొనుగోలు చేసి బతుకమ్మ పేర్చుతున్నారు. ధరల కారణంగా పూలు కొనలేని వారు కాగితం బతుకమ్మలతో సంతృప్తి చెందుతున్నారు.