breaking news
telangana Movement
-
‘ఆది’లో అసమ్మతి !
సాక్షి, కొత్తగూడెం: గత ఎన్నికల ముందు జిల్లాలో నామమాత్రంగా ఉన్న టీఆర్ఎస్.. అధికారంలోకి వచ్చాక ఇబ్బడి ముబ్బడి వలసలతో ప్రస్తుతం కిటకిటలాడుతోంది. అన్ని పార్టీల్లోని ఎమ్మెల్యే స్థాయి నుంచి స్థానిక ప్రజాప్రతినిధుల వరకు, ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో పార్టీ బలం ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే గత ఎన్నికల ముందు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో టీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రంఅంతంతమాత్రమే. అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు అసలు కేడర్ అనేదే లేదు. ఇల్లెందు, పినపాక, కొత్తగూడెం నియోజకవర్గాల్లో మాత్రం కొంతమంది టీఆర్ఎస్ జెండా పట్టుకుని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భవించిన 2001 నుంచి పని చేసిన కార్యకర్తలు రాష్ట్రం సాధించేవరకు అనేక ఇబ్బందులు పడుతూ ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించారు. నామినేటెడ్ పోస్టుల్లో మొండిచెయ్యే... తీరా రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తమకు గుర్తింపు లేకుండా పోయిందని నాటి కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. వివిధ నామినేటెడ్ పోస్టులతో పాటు, పార్టీ పదవులు సైతం తమకు దక్కలేదని వాపోతున్నారు. ప్రాధాన్యం ఇవ్వకపోతారా అని నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నా ఫలితం లేదని గగ్గోలు పెడుతున్నారు. ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ సొంత పనులు వదులుకుని ఉద్యమంలో తిరిగామని, చివరకు పార్టీలో ఏమాత్రం విలువ లేదని ఆవేదన చెందుతున్నారు. పార్టీ తమను గుర్తించడంలేదని ఇప్పటివరకు సన్నిహితుల వద్ద వాపోయిన ఉద్యమకారులు ప్రస్తుతం బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 13 ఏళ్ల పాటు ఉద్యమంలో పనిచేసినా, ఇప్పుడు ఆదరణ లేదని ఆవేదన చెందుతున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు తమకు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదని, తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని అంటున్నారు. ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో సుమారు 150 మంది చొప్పున, పినపాక నియోజకవర్గంలో మరో 100 మంది కార్యకర్తలు పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేశారు. తీరా ఇప్పుడు తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని వారు వాపోతున్నారు. త్యాగాలు తప్పవని కేసీఆర్ చెబుతున్నప్పటికీ, ఇన్నేళ్లూ ఉద్యమంలో పనిచేసిన తామే ఇలాగే ఉంటే బయటి నుంచి వచ్చినవారు అధికారం అనుభవించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పినపాక నియోజకవర్గంలో బూర్గంపాడుకు చెందిన పొడియం నరేందర్‌కుమార్, మణుగూరుకు చెందిన ఎడ్ల శ్రీనివాస్ తదితరులు టీఆర్ఎస్ జెండా మోస్తూ నిరంతరం ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చివరకు పొడియం నరేందర్‌కుమార్ గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ను సైతం త్యాగం చేశారు. కానీ వారికి ప్రస్తుతం పార్టీ పదవుల్లోనూ న్యాయం జరగలేదు. ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. చిరు వ్యాపారులు, రోజువారీ పనులు చేసుకునే వారు సైతం ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని పాల్వంచలో తాజాగా సోమవారం కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు ఏకంగా మున్సిపాలిటీ కార్యాలయం ఎదుటే ఆందోళన చేశారు. 17 నెలలుగా మున్సిపాలిటీలో తాత్కాలిక కార్మికులుగా పనిచేస్తే వేతనాలు ఇవ్వకపోగా తమను తొలగించారని, టీఆర్ఎస్లో పనిచేస్తున్నా ఇలా చేయడమేంటని గగ్గోలు పెట్టారు. ఉగ్గగాని శేఖర్ అనే కార్యకర్త పెట్రోల్ బాటిల్ పట్టుకుని సెల్ టవర్ ఎక్కడం గమనార్హం. తెలంగాణ జనసమితిలోకి తాళ్లూరి, గోపగాని గతంలో ఉమ్మడి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన తాళ్లూరి వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ ఆవిర్భావంలోనే ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఉద్యమంలో ఉండడంతో పాటు ఇటీవలి వరకు పార్టీలోనే కొనసాగారు. చివరకు ఇక్కడ ప్రాధాన్యత కరువైందని భావించి మరో టీఆర్ఎస్ సీనియర్ నేత గోపగాని శంకర్రావుతో కలిసి కోదండరాం స్థాపించిన తెలంగాణ జనసమితిలో ఆవిర్భావం రోజే చేరారు. మరికొంతమంది సైతం ఇదే బాట పట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
టాప్‌గేర్‌లో కారు
లోక్‌సభ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు పెండింగ్‌లో ఐదు అసెంబ్లీ స్థానాల అభ్యర్థిత్వాలు సాక్షిప్రతినిధి, నల్లగొండ, టీఆర్ఎస్ మరో జాబితా విడుదల చేసింది. జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలు నల్లగొండ, భువనగిరితోపాటు కోదాడ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. డాక్టర్స్ జేఏసీ చైర్మన్‌గా పనిచేసిన డాక్టర్ బూర నర్సయ్య గౌడ్‌ను భువనగిరి లోక్‌సభ స్థానానికి, మూడు నాలుగు రోజుల కిందటే పార్టీలో చేరిన పల్లా రాజేశ్వర్‌రెడ్డిని నల్లగొండకు ప్రకటించింది. కోదాడఅసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా అక్కడి ఇన్చార్జ్ శశిధర్‌రెడ్డి పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ గత ఏడాది టీఆర్ఎస్లో చేరారు. డాక్టర్స్ జేఏసీ చైర్మన్‌గా పనిచేసిన ఆయనకు భువనగిరి లోక్‌సభ సీటును కేటాయిస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పార్టీలో చేరి పనిచేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు నర్సయ్యగౌడ్ పేరును కనీసం ఇన్ చార్జ్‌గా కూడా పేర్కొనని టీఆర్ఎస్ నాయకత్వం చివరకు టికెట్ ఖరారు చేసింది. ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తు కుదిరితే, కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన భువనగిరిలో అవకాశం కల్పించడం కష్టమని భావించి ఇన్నాళ్లూ ఎదురుచూసినట్లు చెబుతున్నారు. ఇక, పొత్తు లేనట్టేనని భావించడం వల్లే భువనగిరికి నర్సయ్య గౌడ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. మూడు నాలుగు రోజుల కిందటి దాకా నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.అయితే, కోదాడలో విద్యా సంస్థలు ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి నల్లగొండ లోక్‌సభ సీటును ఆశించే టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన రోజు ఎలాంటి హామీ ఇవ్వని కేసీఆర్ శనివారం మాత్రం రాజేశ్వర్‌రెడ్డి పేరును నల్లగొండ లోక్‌సభ స్థానానికి ఖరారుచేశారు. కోదాడ అసెంబ్లీ నియోజకవ ర్గ ఇన్చార్జ్ కె.శశిధర్‌రెడి అభ్యర్థిత్వం కూడా ఖరారైంది. పార్టీలో చాలా కాలంగా కొనసాగతున్న శశిధర్‌రెడ్డికి రెండో జాబితాలో టికెట్ ఓకే కావడంతో ఆయన అనుచర వర్గంలో ఆనందం వ్యక్తం అవుతోంది. -
నాడు ఒడ్డున కూర్చుని..నేడు ఓట్లడుగుతారా?
కాంగ్రెస్ నేతలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్న డిచ్పల్లి/జక్రాన్‌పల్లి, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఒడ్డున కూర్చున్నవారికి ఓటు వేస్తారో, పోరాడిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు ఓటు వేస్తారో ఆలోచించుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె.కవిత ప్రజలను కోరారు. తెలంగాణ వికాసం టీఆర్ఎస్తోనే సాధ్యమని చెప్పారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి, జక్రాన్‌పల్లి మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉద్యమం కొనసాగినప్పుడు ఏ మాత్రం పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు నేడు తమ వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పోరాటాలతో సాధించుకున్న రాష్ట్రాన్ని అప్పనంగా ఎవరి చేతిలోనే పెట్టడం సమంజసం కాదన్నారు.‘మన రాష్ట్రాన్ని మనమే పాలించుకుందాం, అభివృద్ధి చేసుకుందాం’ అని ఆమె పిలుపునిచ్చారు.