breaking news
technology addiction
-
బాని‘సెల్’ కావొద్దు..
నేడు సెల్ఫోన్లు లేని జీవితాన్ని ఊహించుకోలేం. 20 ఏళ్ల క్రితం ధనికుల ఇళ్లలో ఒక ల్యాండ్‌ఫోన్ ఉండటమే గొప్పగా భావించేవారు. ప్రస్తుతం దినసరి కూలీ వద్ద కూడా ఒకటికి మించిన ఖరీదైన ఫోన్లు ఉండటం మామూలైంది. మూడేళ్ల పిల్లల నుంచి 30 ఏళ్ల యువత వరకు సెల్‌ఫోన్ ఆరోగ్యం, చదువు, మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆధునికీకరణ పేరుతో జరుగుతున్న ఈ సామాజిక నష్టాన్ని వారించేందుకు అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ప్రయత్నించాలని మానసిక శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. కడప కల్చరల్/ ప్రొద్దుటూరు క్రైం: ప్రస్తుతం మూడేళ్ల చిన్నారి కూడా సెల్‌ఫోన్ చూస్తున్నారు. ఇంట్లో స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండటం.. అందులోని రంగులు, బొమ్మలు వారిని ఆకర్షిస్తుండటంతో పిల్లలు సెల్‌ఫోన్ దొరికితే గంటల కొద్ది ఆడుకుంటున్నారు. పెద్ద పిల్లలు సెల్ఫోన్లతో మరింత ఎక్కువ సమయం గడుపుతున్నారు. మొండికేసి, అలకబూని పెద్దలను బ్లాక్మెయిల్ చేసి మరీ స్మార్ట్ ఫోన్ ఇప్పించుకుంటున్నారు. పెద్దలకు ఇచ్చిన మాటను తప్పి స్కూళ్లలో ఖాళీ సమయాల్లో కూడా సెల్‌ఫోన్‌తో గడుపుతున్నారు. కొందరు తరగతుల్లో వెనుకవైపు కూర్చొని సైలెన్స్‌లో పెట్టి మరీ ఫోన్‌తో వినోదిస్తున్నారు. యువత కూడా అంతే.. ఎప్పటికప్పుడు మారుతున్న లేటెస్ట్ రకాల ఫోన్లు లేకుంటే నేటి యువతకు గడిచేటట్టు లేదు. కనీసం రెండు స్మార్ట్ ఫోన్లు లేకుంటే బతకలేమన్నట్లుగా భావిస్తున్నారు. తెల్ల వారుజాము నుంచి అర్ధరాత్రి వరకు నిరంతరాయంగా సెల్‌ఫోన్‌ను వాడుతూనే ఉన్నారు. ఇందులో అశ్లీల వెబ్సైట్లనే ఎక్కువ చూస్తుంటారని ఓ సర్వేలో తేలింది. యువత కూడా దాన్ని అంతగా ఖండించేందుకు ప్రయత్నించడం లేదు. వారి కెరీర్‌కు సంబంధించి ఉపయోగకరంగా ఉంటుందని పెద్దలు స్మార్ట్ ఫోన్లు కొనిస్తే యువకుల్లో ఎక్కువ శాతం మంది ఫోర్న్ సైట్లలోనే గడుపుతుంటారని సమాచారం. దీంతో వారి ఆలోచన తీరులో మార్పు రావడం.. నైతిక, సామాజిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం.. తొమ్మిది నెలల చిన్నారి నుంచి 90 ఏళ్ల వృద్ధులైన మహిళల వరకు లైంగిక దాడులకు గురి కావడం స్మార్ట్ ఫోన్ల ప్రభావం 50 శాతానికి పైగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రాకముందు ఇలాంటి క్రైమ్ రేట్ ఐదు శాతానికి మించి ఉండేది కాదని, ›ప్రస్తుతం అది తారాస్థాయికి చేరిందని పోలీసుల రికార్డులు తెలియజేస్తున్నాయి. కుటుంబ పెద్దలైన తల్లిదండ్రులు సెల్ఫోన్ల వాడకం విషయంలో.. యువత కంటే 60 శాతం తక్కువే అయినా పురుషుల కంటే స్త్రీలే ఫోన్‌ను ఎక్కువగా వాడుతున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యంపై ప్రభావం సమయం వృథా, విలువల సంగతి అటుంచితే.. స్మార్ట్ ఫోన్లు ప్రజల ఆరోగ్యం, జీవితాలపై చూపుతున్న దుష్ప్రభావం చాపకింద నీరులా విస్తరిస్తోంది. ముఖ్యంగా యువత అర్ధరాత్రి వరకు చాటింగ్ చేస్తుండటంతో నిద్రకు దూరమై క్రమంగా అనారోగ్యం పాలవుతున్నారు. యువతకు చాటింగ్ ఓ వ్యసనంగా మారింది. ఫలితంగా చదువు కుంటుపడుతోంది. అసహనం పెరగడంతో ఆలోచన కోల్పోతున్నారు. లక్ష్య సాధన దిశగా విఫలమవుతున్నారు. పగలంతా రొటీన్ పనులతో అలిసిపోయినపుడు మనిషికి గంటసేపు నిద్ర కూడా మంచి ఉపశమనం ఇస్తుంది. నిజానికి మన శరీరానికి తగినంత విశ్రాంతి ఉన్నప్పుడే తిరిగి పని చేసేందుకు నూతన శక్తి లభిస్తుంది. మానసిక ఒత్తిళ్లు, శారీరక శ్రమ అధికంగా ఉండే విద్యార్థి దశలో బాలలకు తగిన నిద్ర ఎంతో ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. చదివింది గుర్తుండాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. పరీక్షల సమయంలో మానసిక ప్రశాంతత ఎంతో అవసరం. కానీ నేటి యువత సామాజిక మాధ్యమాలతో పగలు, రాత్రి బిజీ అవుతూ నిద్రలేమితో బాధపడుతున్నారు. యువతతోపాటు మిగతా వయసుల వారు కూడా స్మార్ట్‌ఫోన్‌తో అర్ధరాత్రి వరకు గడుపుతున్నారు. సామాజిక మాధ్యమాలతో సమాజానికి మంచితోపాటు చెడు కూడా ఎక్కువగా జరుగుతోంది. సోషల్ మీడియా ద్వారా పిల్లలు మంచి కంటే చెడే ఎక్కువగా నేర్చుకుంటున్నారని సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలాది మందిలో ఒంటరై.. స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ యాప్స్‌తో గడుపుతుండటంతో యువత, బాలలకు చుట్టుపక్కల పరిస్థితులను గమనించే స్థితి పోతుంది. చుట్టూ తెలిసిన వారు, స్నేహితులున్నా వారిని కూడా పట్టించుకోకుం డా ఫోన్లో చాటింగ్ చేస్తూ పరిసరాలు మరిచిపోతున్నారు. వయసు, హోదా, స్థాయి భేదం లేకుండా ఇప్పుడు పదేళ్ల వయసు బాలల నుంచి చేతుల్లో స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. ఇం టర్నెట్ ప్యాకేజీల ధర భారీగా తగ్గడంతో.. రోజంతా అన్నీ లిమిటెడ్‌గా స్మార్ట్ ఫోన్‌తో గడుపుతున్నారు. ఫేస్బుక్లో లైకులు, కామెంట్లు ఫ్యాషన్‌గా మారాయి. నాలుగు గోడల మధ్య అర్ధరాత్రి వరకు సెల్‌ఫోన్‌తోనే గడుపుతూ నిద్రకు దూరమవుతున్నారు. రాత్రిళ్లు ఎంత ఆలస్యంగానైనా పడుకుంటారు గానీ ఉదయాన్నే నిద్రలేవడం మాత్రం తమ చేతుల్లో లేదన్నట్లు ప్రవర్తిస్తున్నారు. రోజంతా కష్టపడి ఉదయం త్వరగా నిద్రలేస్తే ఆ రోజంతా ఉల్లాసంగా ఉంటుం దని వైద్యులు చెబుతున్నా.. ఈ తరం మనుషులు ఆ ధ్యాస వదిలేసి నిరంతరం సెల్‌ఫోన్‌తోనే గడుపుతున్నారు. మన దేశంలో పదేళ్ల వయసు నుంచి పాతికేళ్లలోపు వారు రోజూ ఐదు గంటలపాటు స్మార్ట్ ఫోన్‌తో గడుపుతున్నట్లు ఆరోగ్య నిపుణుల అంచనా. సెల్‌ఫోన్ తక్కువగా వాడితే అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇటీవల సెల్ఫీలు ఫ్యాషన్‌గా మారడంతో ప్రమాదకరమైన సన్నివేశాలను ఫోన్లలో బంధించాలన్న ఆవేశంతో ముఖ్యంగా యువకులు ప్రాణాలను కోల్పోతున్నారు. తల్లిదండ్రులు మేల్కోవాలి ► చిన్నారులు, విద్యార్థులు సెల్ గేమ్‌లలో మునిగిపోకుండా చూసుకోవడంలో తల్లిదండ్రుల పాత్రే కీలకమని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ► భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఆడే ఆటలు చాలా ఉన్నాయని, ఇలాంటి గేమ్‌ల జోలికి పోవద్దని సున్నితంగా చెప్పాలి. ► పాశ్చాత్య సంస్కృతిలో అందుబాటులో వచ్చిన వీడియో గేమ్‌ల వల్ల కలిగే అనర్థాలను వివరించాలి. ► సాధ్యమైనంత వరకు అత్యవసరమైతే తప్ప మొబైల్ డేటా వేయకపోవడమే మంచిది. ► పిల్లల అభిరుచులు, అలవాట్లను గౌరవిస్తూనే వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచి అవుట్డోర్ క్రీడల్లో ప్రోత్సహించాలి. దగ్గరుండి పిల్లలను తీసుకొని వెళ్లాలి. ► రోజూ శారీరక వ్యాయామం చేయించడం, శారీరక అలసట ఉండే క్రీడల్లో ప్రోత్సహించాలని వైద్యులు చెబుతున్నారు. ప్రమాదకరం సెల్ఫోన్లలో గేమ్‌లు ఆడటం చాలా ప్రమాదకరం. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, ఏకాగ్రత లోపించడం, కలుపుగోలుతనం లేకపోవడం వంటివి జరుగుతాయి. ముఖ్యంగా కంటి జబ్బులు వస్తాయి. పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ నాగదస్తగిరిరెడ్డి, ప్రొద్దుటూరు సమయం వృథా మానవాభివృద్ధికి దోహదపడే సాంకేతిక పరిజ్ఞానం ఇదే స్థాయిలో వారి మనుగడకు ముప్పుగా పరిణమిస్తోంది. వయసు, లింగ భేదాలు తేడా లేకుండా అందరినీ అంధకారంలోకి నెట్టివేస్తోంది. ఆన్లైన్ గేమ్‌లతో ఎంతో విలువైన సమయానికి నిర్ధాక్షిణ్యంగా వృథా చేసుకుంటున్నారు. గంటల తరబడి సెల్‌ఫోన్ చూడటం వల్ల వెన్నెముక దెబ్బతినే అవకాశం ఉంది. -
అతి ‘స్మార్ట్’ అనర్థమే..!
మీరు డిజిటల్ అడిక్షన్ అదేనండి...స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు ఇతర డిజిటల్ రూపాల్లోని పరికరాలు, వస్తువుల వినియోగం ఓ వ్యసనంగా మారే ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారా ? దీనికి అవుననే స్పష్టమైన సమాధానమే వస్తోంది. స్మార్ట్ఫోన్ల అతి వినియోగం నాడీమండలంలో మార్పులకు కారణమవుతోందని ఓ తాజా అధ్యయనంలో బయటపడింది. అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా తలమునకలైతే ఎదుటివారిని నిందించే స్వభావం, ప్రవర్తన పెరగడంతో పాటు సామాజికంగా ఇతరులకు దూరమై, ఒంటరితనానికి గురైనట్టుగా భావిస్తారని ఇటీవలే ‘న్యూరో రెగ్యులేషన్’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ స్టడీ వెల్లడించింది. ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ తమ స్మార్ట్‌ఫోన్‌ను ఒక్కక్షణం కూడా వదిలి ఉండలేని పరిస్థితులున్నాయి. ఈ ఫోన్లలో వచ్చే మెసేజ్ అలర్ట్‌ల పట్ల స్పందిస్తున్న తీరు పురాతన కాలంలో ఏదైనా అనుకోని ముప్పు లేదా కీడు సంభవిస్తుందా అని నాటి మానవుడు పడిన ఆందోళన పోల్చదగినదిగా ఉంటోందని ఈ పరిశీలన పేర్కొంది. సిగిరెట్ల మాదిరిగానే డిజిటల్ టెక్నాలజీని కూడా ఓ వ్యసనంగా మారేలా రూపొందించారని నిఫుణులు భావిస్తున్నారు. వివిధ రూపాల్లో వచ్చే నోటిఫికేషన్లు, పింగ్‌లు, వైబ్రేషన్లు, అలర్ట్‌ల పట్ల ఏదో ప్రమాదం సంభవిస్తుందేమో అన్నట్టుగా స్పందిస్తున్నారు. ఓ వైపు తమ మనసులోని భావాలను ఫోన్ ద్వారా కమ్యూనికేట్ చేస్తూ అదే సమయంలో ఇతర పనులు (మల్టీ టాస్కింగ్) చేస్తున్నందు వల్ల మెదడు, శరీరం రిలాక్స్ కావడంలేదు. దాంతో చురుకుదనం మందగిస్తోంది. ఒకేసారి రెండు, మూడు పనులు చేస్తున్నవారు వాటిపై పూర్తి దృష్టి పెట్టకపోవడం వల్ల ఆ పనులను సగం మాత్రమే సక్రమంగా నిర్వహిస్తున్నారని శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. ప్రతీ చిన్న విషయానికి ఫోన్లపైనే ఆధారపడడం ఎక్కువై పోయింది. మనలో 40 శాతానికి పైగా ఉదయం నిద్రలేచిన 5 నిముషాల్లోనే ఫోన్లు చెక్ చేసుకుంటున్నట్టు, యాభైశాతానికి పైగా రోజుకు 25 సార్లు అంతకంటే ఎక్కువగానే ఫోన్లు పరీక్షించుకుంటున్నట్టు డెలాయిట్ సంస్థ స్టడీలో వెల్లడైంది. గేమింగ్ డిజార్డరేనంటున్న డబ్ల్యూహెచ్ఓ... పరిసరాలను పట్టించుకోకుండా నిరంతరం వీడియో గేమ్‌ల్లో మునిగిపోయే ‘గేమింగ్ డిజార్డర్’ ను కూడా ‘రివిజన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిజీసెస్’ (ఐసీడీ–11)లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చేర్చనుంది. దీనిలో భాగంగా ఈ డిజార్డన్‌ను అంతర్జాతీయ రోగాల వర్గీకరణ (ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్) జాబితాలో ప్రచురించనుంది.. ప్రపంచం లోని ఆరోగ్య పోకడలు, సమస్యల తీరును గుర్తించి, వాటి నిర్థారణతో పాటు వర్గీకరణకు ఉద్ధేశించి ఐసీగీ–11ను ఓ ప్రామాణిక సాధనంగా డాక్టర్లు, పరిశోధకులు, ఎపిడమియోలాజిస్ట్‌లు ఉపయోగిస్తున్నారు. భారత్‌లో... మనదేశంలో తొలిసారిగా 2016లో ఢిల్లీలోని రాంమనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యులు ఈ గేమింగ్ డిజార్డర్‌ను గుర్తించారు. సైకియాట్రీ వార్డులో 22 , 19 ఏళ్ల వయసున్న అన్నదమ్ములు నెలరోజుల పాటు చికిత్స తీసుకున్నారు. వారి తల్లితండ్రులు వైద్యుల సహాయం కోరేనాటికే కొన్నిరోజుల పాటు తిండి,నిద్ర అనే అలోచన లేకుండాS ఎడతెగని గేమింగ్ కారణంగా ఈ యువకులు సామాజికంగా ఇతరులతో కలవకుండా, శారీరకంగానూ పూర్తి నిస్సత్తులో మునిగిపోయారు. అధిగమించేందుకు ఏం చేయాలి ? స్మార్ట్ఫోన్టలోని అలర్ట్‌లు, నోటిఫికేషన్లను ఆపేయాలి. ఆన్లైన్ కార్యకలాపాల కంటే ఆఫ్‌లైన్‌లో ఇతర కార్యక్రమాలు చేపట్టడం, కుటుంబసభ్యులు, మిత్రులతో సంభాషణలు కొనసాగించాలి. నిద్రపోవడానికి గంట ముందు అన్ని పరికరాలు ఆఫ్ చేసేయాలి లేదా మరో గదిలో ఫోన్‌ను ఉంచాలి. ఫోన్లలోని ‘బ్లూ వేవ్ లెంథ్ లైట్’ మెదడులో నిద్రకు సమయం ఆసన్నమైనదని సూచించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటుంది. రాత్రి భోజనం చేసేపుడే ఫోన్ ఆఫ్ చేసేయాలి. ఆ తర్వాత దానిని ఇంటి వద్దే వదిలేసి కొంతదూరం నడిచిరావాలి. ప్రతీ చిన్న విషయానికి వెబ్‌లో సెర్చ్ చేసే ధోరణి మార్చుకోవాలి నిరంతరం ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి నెట్‌వర్క్‌ల్లో మునిగిపోకుండా సామాజికమాధ్యమాల వినియోగంపై నియంత్రణ పాటించాలి. కంప్యూటర్ లేదా మొబైల్‌ను చూడాలనే కోరిక కలిగినపుడు నచ్చిన పుస్తకంలోని కనీసం 30 పేజీలు చదివాకే వాటిని ముట్టుకోవాలని తమకు తాము సవాల్ చేసుకోవాలి. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా..?
ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌తో గడుపుతున్నారా? అయితే మీకు వ్యక్తిగతంగా, పనిచేసే ప్రదేశాల్లో సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అధ్యయనంలో భాగంగా స్మార్ట్ఫోన్లకు బానిసలుగా మారిన వారిని... ‘ఎక్కువగా ఒంటరిగా ఉండడం, ఆందోళనగా ఉండడం, ఒత్తిడికి లోనవడం’ వంటి లక్షణాల ఆధారంగా వర్గీకరించారు. ‘మనం ఉపయోగిస్తున్న స్మార్ట్ఫోన్లు అప్పటికప్పుడు సంతృప్తినిచ్చే ఒక ఉత్ప్రేరకంగా మారాయి’అని స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌కి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఐజక్ వాగేఫి తెలిపారు. ‘అతిగా సోషల్ మీడియాను ఉపయోగించడం, ఆఫర్ల పేరిట గంటల తరబడి ఆన్లైన్ షాపింగ్‌లలో ఉండడం, అదే పనిగా వీడియో గేమ్‌లు, వీడియోలు చూడడం’ వంటి లక్షణాలన్నింటినీ కలిపి సాంకేతిక పరిభాషలో ‘టెక్నాలజీ అడిక్షన్’గా పిలుస్తారు. పరిశోధనల్లో భాగంగా 182 కళాశాలకు చెందిన విద్యార్థులను ఎంచుకుని వారి రోజువారి స్మార్ట్ ఫోన్ ఉపయోగాల గురించి అడిగి తెలుసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్ దగ్గర్లో లేకపోతే ఆత్రుతకు, ఒత్తిడికి గురయ్యారని పరిశోధకులు తెలిపారు. ‘మీరు ఫోన్ రింగ్ అవ్వకున్నా, మాటిమాటికి ఫోన్ వైపు చుస్తూన్నారా? స్మార్ట్ ఫోన్ దగ్గర లేకపోతే ఆందోళనకు గురవుతున్నారా..? అయితే వెంటనే మంచి వైద్యుని దగ్గరికి వెళ్లండి’. అని పరిశోధకులు సూచిస్తున్నారు.