కమెడియన్ సరసన క్రేజీ హీరోయిన్
కోలీవుడ్‌లో నటించడానికి ఆచితూచి అడుగేస్తున్న మలయాళ చిత్రం ప్రేమమ్ నాయకి సాయిపల్లవి తమిళంలో రెండవ చిత్రానికి అంగీకారం తెలిపింది. మాలీవుడ్‌లో ప్రేమమ్ చిత్రంతో, టాలీవుడ్లో ఫిదా సినిమాతో సంచలన విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు క్రేజీ నటిగా మారిపోయింది. తమిళంలో ఇప్పటికే విజయ్ దర్శకత్వంలో కరు చిత్రంలో నటిస్తున్న సాయిపల్లవి తాజాగా సంతానంతో జోడి కట్టానికి రెడీ అయింది. దర్శకుడు రాజేష్ తెరకెక్కిస్తున్న సినిమాలో సంతానం సరసన హీరోయిన్గా ఆమె నటించనుంది.
హాస్య నటుడిగా రాణించి ఆ తరువాత కథానాయకుడిగా మారిన సంతానం చేతిలో ఇప్పుడు మూడు చిత్రాలున్నాయి. సంతానం నటిస్తున్న సర్వర్ సుందరం, చెక్క పోడు పోడు రాజా, మన్నవన్ వండానడీ చిత్రాలు వరుసగా విడుదలకు ముస్తాబవుతున్నాయి. తాజాగా ఎం.రాజేష్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దర్శకుడు రాజేష్ ఇప్పటివరకు చేసిన ఆరు చిత్రాలలో ఐదింటిలో హీరోకు సమానమైన పాత్రల్లో సంతానం నటించడం గమనార్హం. కాగా, ఈసారి ఏకంగా హీరోగానే నటించనున్నారు. త్వరలో సెట్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించనుంది. కాగా సంతానం తొలి సారిగా హీరోగా నటించిన కన్నా లడ్డు తిన్న ఆశైయా చిత్రాన్ని ఈ సంస్థనే నిర్మించింది.