breaking news
sweep
-
స్వల్పకాల పెట్టుబడికి దారేదీ?
ప్రతి వ్యక్తికి స్వల్పకాల, మధ్య కాల, దీర్ఘకాల లక్ష్యాలనేవి ఉంటాయి. వీటి ఆధారంగానే పెట్టుబడి సాధనాలను ఎంపిక చేసుకోవాలి. అన్నింటికీ ఒకే అస్త్రం ఫలితాలనివ్వదు. ప్రతి పెట్టుబడిలోనూ రిస్క్ ఉంటుంది. ఇది తమకు ఎంత వరకు ఆమోదమో పరిశీలించిన తర్వాతే వాటిపై నిర్ణయానికి రావాలి. దీర్ఘకాలానికి ఈక్విటీలు అధిక రాబడులు ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మధ్య కాలిక లక్ష్యాలకు, ఈక్విటీ, డెట్‌తో కలయికతో ఉండే హైబ్రిడ్ ఫండ్స్ మెరుగైనవి. మరి స్వల్పకాల లక్ష్యాల మాటేమిటి? వీటి కోసం రిస్క్ తీసుకోవడం ఎంత మాత్రం సూచనీయం కాదు. స్వల్పకాలంలో రాబడి కంటే పెట్టుబడి రక్షణ కీలకం అవుతుంది. అదే సమయంలో ఎంతో కొంత రాబడి కూడా రావాలి. ఇందుకు అందుబాటులో ఉన్న మెరుగైన సాధనాలపై అవగాహన కల్పించే కథనం ఇది. స్వల్పకాలం అంటే..? నిజానికి స్వల్పకాలానికి ఇతమిత్థమైన నిర్వచనం లేదు. కొన్ని రోజుల నుంచి నెలల వరకు స్వల్పకాలం కిందకే వస్తుంది. ఏడాది, రెండేళ్లు కూడా స్వల్పకాలం కిందకే వస్తుంది. 3–5 ఏళ్ల కాలాన్ని మధ్యస్థంగా, 10 ఏళ్లు మించితే దీర్ఘకాలంగా పరిగణిస్తుంటారు. ముఖ్యంగా మూడేళ్ల కాలానికి ఈక్విటీలను పరిగణనలోకి తీసుకోకపోవడమే రిస్క్ పరంగా సానుకూలం. ఈక్విటీ పెట్టుబడులకు కనీసం ఐదేళ్లు అయినా ఉండాలన్నది నిపుణుల సూచన. గతంలో మాదిరిగా కాకుండా నేడు ఆర్థిక అస్థిరతలు పెరిగిపోయాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సైతం అధికమయ్యాయి. వీటి ప్రభావం ఈక్విటీలపై ఎక్కువగా ఉంటుంది. కనుక దీర్ఘకాలంలోనే ఈక్విటీల్లో మెరుగైన రాబడులు సాధ్యపడతాయి. మూడేళ్ల కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత, ఒకవేళ ఈక్విటీలు బేరిష్ లోకి వెళ్లిపోతే కోలుకునేందుకు ఎంత సమయం అయినా తీసుకోవచ్చు. అందుకుని ఇన్వెస్టర్లు ఈక్విటీలకు బదులు సంప్రదాయ డెట్ సాధనాలను స్వల్ప కాలం కోసం పరిశీలించొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లు... బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీలు).. తాతల కాలం నుంచి ప్రాచుర్యంలో ఉన్న సాధనం. కానీ, నేడు అధిక రాబడుల కాంక్షతో చాలా మంది స్వల్పకాలానికీ ఈక్విటీల వైపు అడుగులు వేస్తున్నారు. దీర్ఘకాలానికి అధిక రాబడిని ఆశించడం సమంజసమే. అదే సమయంలో స్వల్ప కాల లక్ష్యాలకు తక్కువ రాబడిని ఇచ్చే రిస్క్ లేని ఎఫ్డీలను విస్మరించడం సరికాదు. ఫిక్స్డ్ డిపాజిట్‌తోపాటు, రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) అందరికీ అర్థమయ్యే సాధనాలు. ముఖ్యంగా ఎఫ్డీలపై రాబడి స్థిరంగా ఉంటుంది. అందుకని స్వల్పకాలం కోసం ఉద్దేశించిన పెట్టుబడి కోసం వీటిని నమ్ముకోవచ్చు. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే.. అప్పుడు ఒకటికి మించిన బ్యాంకుల్లో ఎఫ్డీలు వేసుకోవాలి. ఒక బ్యాంక్‌లో గరిష్టంగా రూ.5 లక్షలు డిపాజిట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక బ్యాంక్ సంక్షోభం పాలైతే ఒక డిపాజిట్‌దారునికి గరిష్టంగా రూ.5 లక్షల వరకే బీమా కింద లభిస్తుంది. స్వీప్ ఇన్ ఎఫ్డీని సైతం పరిశీలించొచ్చు. ఇది సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు అనుబంధంగా ఉంటుంది. సేవింగ్స్ ఖాతాలో కనీస బ్యాలన్స్‌ను మించి నగదు చేరిన తర్వాత నిర్ణీత మొత్తం (రూ.1,000 అంతకుమించి) స్వీప్ ఇన్ డిపాజిట్‌గా మారుతుంది. సేవింగ్స్ ఖాతాలో బ్యాలన్స్‌పై వడ్డీ రేటు 3–4 శాతం మించదు. అదే స్వీప్ ఇన్‌లో అయితే 5–6 శాతం వరకు (డిపాజిట్ ఉంచిన కాలాన్ని బట్టి) లభిస్తుంది. డిపాజిట్ రూపంలోకి మారినా కానీ, అవసరమైనప్పుడు వెంటనే ఆ మొత్తాన్ని ఏటీఎం నుంచి అయినా ఉపసంహరించుకోవచ్చు. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లను సైతం పరిశీలించొచ్చు. కార్పొరేట్ ఎఫ్డీలు (కంపెనీలు నిధుల కోసం జారీ చేసేవి), ఎన్బీఎఫ్సీ సంస్థల ఎఫ్డీలకు దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే వీటిలో డిఫాల్ట్ రిస్క్ ఉంటుంది. అందుకే ఈ డిపాజిట్లలో రాబడి ఎక్కువగా ఉంటుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్డీలను సైతం పరిశీలించొచ్చు. వీటిలో రిస్క్ ఉంటుంది. అయినప్పటికీ ఆర్బీఐ డిపాజిట్ గ్యారంటీ పథకం పరిధిలోకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు కూడా వస్తాయి. కనుక రూ.5 లక్షల డిపాజిట్ వరకు ఢోకా ఉండదు. ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో రూ.5 లక్షలు మించకుండా డిపాజిట్ చేసుకోవచ్చు. పెట్టుబడి ఉద్దేశం? పెట్టుబడిని కాపాడుకోవం, అదే సమయంలో కొంత రాబడిని సమకూర్చుకోవడం స్వల్పకాల పెట్టుబడుల ఉద్దేశంగా ఉండాలి. స్వల్పకాల పెట్టుబడుల కోసం అధిక రాబడులను ఇచ్చే విభాగాలను అస్సలు పరిగణనలోకి తీసుకోకూడదు. అధిక రాబడుల చరిత్ర కలిగిన ఈక్విటీల్లో స్వల్పకాలంలో పెట్టుబడికి సైతం రిస్క్ ఏర్పడుతుంది. దీర్ఘకాలంలోనే అలాంటి సాధనాల్లో రిస్క్ ను అధిగమించి రాబడులు సమకూర్చుకోగలరు. ఎఫ్డీలపై టీడీఎస్.. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే రాబడి ఒక ఆర్థి క సంవత్సరంలో రూ.40,000 మించితే (60 ఏళ్లలోపు వారికి), ఆ మొత్తంపై బ్యాంక్‌లు 10 శాతం టీడీఎస్ మినహాయిస్తాయి. 60 ఏళ్లు నిండిన వారికి రూ.50,000 మించితే అప్పుడు టీడీఎస్ అమలవుతుంది. కానీ, డెట్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు టీడీఎస్ వర్తించదు. టీడీఎస్ వద్దనుకునే వారు ఎఫ్డీలకు బదులు డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఎఫ్‌డీల కంటే ఇతర డెట్ ఫండ్స్‌లోనే పన్ను అనంతరం రాబడి కాస్తంత అధికంగా ఉంటుంది. ముఖ్యంగా డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ను గత రాబడుల ఆధారంగా ఎంపిక చేసుకోవడం సరైన విధానం కాదు. తమ పెట్టుబడుల కాల వ్యవధికి అనుకూలంగా ఉండే ఫండ్స్‌ను, అది కూడా వాటి పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో చూసిన తర్వాత ఎంపిక చేసుకోవాలి. తిరిగి ఫలానా సమయంలో పెట్టుబడిని వెనక్కి తీసుకుంటానన్న స్పష్టత ఉన్న వారికి ఎఫ్డీలు మెరుగైనవి. ఎంత రాబడి వస్తుందో పెట్టుబడి సమయంలోనే తెలుసుకోవచ్చు. ఒకవేళ పెట్టుబడిని ఎప్పుడు వెనక్కి తీసుకోవాలన్న విషయంలో స్పష్టత లోపించినట్టయితే, అప్పుడు ఓవర్‌నైట్ ఫండ్స్ లేదా లిక్విడ్ ఫండ్స్ లేదా బ్యాంక్ స్వీప్ ఇన్ ఎఫ్డీ ఎంపిక చేసుకోవచ్చు. దీర్ఘకాలానికి సైతం.. డెట్ సాధనాలు కేవలం స్వల్పకాల పెట్టుబడులకే అనుకోవడం పొరపాటు. దీర్ఘకాల లక్ష్యాల విషయంలోనూ ఎవరైనా 100 శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకోవడం సరికాదు. కాల వ్యవధి, తమ రిస్క్ సామర్థ్యం ఆధారంగా అసెట్ అలోకేషన్ విధానాన్ని (వివిధ సాధనాల మధ్య కేటాయింపులు) రూపొందించుకోవాలన్నది నిపుణుల సూచన. 10–20 ఏళ్లకు మించిన కాలానికి ఒకరు తమ పెట్టుబడుల్లో 70 శాతం వరకు ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు. మిగిలిన 30 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. బంగారానికి సైతం 5–10 శాతం మేర కేటాయింపులు చేసుకోవచ్చు. ఇన్వెస్టర్ వయసు పెరుగుతూ, లక్ష్యానికి చేరువవుతున్న క్రమంలో ఈక్విటీ పెట్టుబడులను క్రమంగా తగ్గించుకుంటూ, డెట్‌లో పెట్టుబడులు పెంచుకుంటూ వెళ్లాలి. దీని ద్వారా రిస్క్ ను అధిగమించొచ్చు. లాభాలపై పన్ను డెట్ సాధనం ఏదైనా సరే పెట్టుబడిపై వచ్చే లాభం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. ఎంత కాలం పాటు ఇన్వెస్ట్ చేశారన్న అంశంతో సంబంధం లేదు. పెట్టుబడిని విక్రయించగా వచ్చిన లాభం సంబంధిత ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్టర్ ఆదాయానికి కలుస్తుంది. నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గతంలో మాదిరి మూడేళ్లు నిండిన పెట్టుబడులు విక్రయించినప్పుడు వచ్చిన లాభంపై ఇండెక్సేషన్ ప్రయోజనం ఇప్పుడు లేదు. ఓవర్‌నైట్ ఫండ్స్... డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇవి అతి తక్కువ రిస్క్ కలిగినవి. కొన్ని రోజుల పాటు పెట్టుబడికి ఓవర్‌నైట్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. వీటిలో వార్షిక రాబడి సుమారుగా 5 శాతం ఉంటుంది. కేవలం ఒక రోజులో గడువు తీరే సెక్యూరిటీల్లో ఓవర్‌నైట్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. కేవలం ఒక రోజు వ్యవధిలోనే ఈ పెట్టుబడిని నగదుగా మార్చుకోవచ్చు. ఎక్కువ లిక్విడిటీతో ఉంటాయి. ఆర్బీఐ వడ్డీ రేట్ల సవరణల ప్రభావం వీటిపై ఉంటుంది. ఏరోజుకారోజు ఇవి గడువు తీరిపోతుంటాయి. దీంతో ఫండ్ మేనేజర్లు రోజువారీగా సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కనుక వడ్డీ రేట్ల మార్పు ప్రభావం ఈ పెట్టుబడులపై వెంటనే అమల్లోకి వస్తుందని గుర్తు పెట్టుకోవాలి. ఆర్బీఐ రివర్స్ రెపో రేట్లను తగ్గించినప్పుడు వీటి రాబడులు కొంత వరకు ప్రభావితమవుతాయి. మనీ మార్కెట్ ఫండ్స్ ఏడాది వరకు కాల వ్యవధి తీరే సెక్యూరిటీల్లో (సర్టీఫికెట్ ఆఫ్ డిపాజిట్లు, కమర్షియల్ పేపర్లు, కమర్షియల్ బిల్లులు, ట్రెజరీ బిల్లులు) ఇవి పెట్టుబడులు పెడుతుంటాయి. అధిక లిక్విడిటీకి తోడు మెరుగైన రాబడిని ఇచ్చే విధంగా వీటి పనితీరు ఉంటుంది. సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కంటే వీటిలో కాస్త అధిక రాబడి ఉంటుంది. గడిచిన ఏడాది కాలంలో ఇవి సగటున 7.59 శాతం రాబడిని ఇచ్చాయి. ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఏడాదికి మించి పెట్టుబడి కొనసాగించేట్టు అయితే ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఇవి ఈక్విటీ ఆర్బిట్రేజ్ అవకాశాల్లో (ధరల వ్యత్యాసం) పెట్టుబడులు పెడుతుంటాయి. గడిచిన ఏడాది కాలంలో (అక్టోబర్ నాటికి) ఆర్బిట్రేజ్ ఫండ్స్ సగటున 6.5–8 శాతం మధ్య రాబడులు ఇచ్చాయి. కానీ, మార్కెట్ అస్థిరతల్లో ఇవి తక్కువ రాబడులు, కొన్ని సందర్భాల్లో ప్రతికూల రాబడులు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. అందుకే ఏడాదికి మించిన కాలానికే వీటిని పరిశీలించాలి. అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ ఈ పథకాలు 3–6 నెలల్లో గడువు తీరే సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇతర డెట్ పథకాలతో పోల్చినప్పుడు కాస్త సురక్షితమైనవి. అదే సమయంలో ఓవర్‌నైట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ కంటే వీటిలో కొంచెం రిస్క్ ఉంటుంది. అంతేకాదు, ఫండ్ మేనేజర్ తక్కువ రేటింగ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తే, డిఫాల్ట్ రిస్క్ కూడా ఎదురుకావచ్చు. కనుక, పెట్టుబడికి ముందు వాటి పోర్ట్‌ఫోలియోలోని సెక్యూరిటీలను ఒక్కసారి పరిశీలించడం మంచిది. అధిక రేటింగ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసిన పథకాలనే ఎంపిక చేసుకోవడం సూచనీయం. ఇవి ఏడాది కాలంలో సగటున 7.5 శాతం మేర రాబడులు ఇచ్చాయి. లిక్విడ్ ఫండ్స్... కొన్ని నెలల పాటు పెట్టుబడులకు లిక్విడ్ ఫండ్స్ కూడా అనుకూలమే. అధిక నాణ్యతతో కూడిన డెట్ సెక్యూరిటీల్లో లిక్విడ్ ఫండ్ మేనేజర్లు పెట్టుబడులు పెడతారు. ఒక్కో డెట్ ఇన్స్ట్రుమెంట్ మెచ్యూరిటీ 91 రోజులకు మించకుండా ఉంటుంది. కావాల్సినప్పుడు వేగంగా వెనక్కి తీసుకోవచ్చు. కొన్ని లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్స్టంట్ రిఫండ్ సదుపాయాన్ని (రూ.50 వేల వరకు) అందిస్తున్నాయి. అంటే ఆ మేరకు వెంటనే బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. లేదంటే విక్రయించిన మరుసటి రోజున బ్యాంక్ ఖాతాకు ఈ మొత్తం అందుతుంది. వడ్డీ రేట్ల మార్పుల రిస్క్ వీటిపైనా ఉంటుంది. ఓవర్‌నైట్ ఫండ్స్‌తో పోలి్చతే రిస్క్ కాస్తంత ఎక్కువ. వీటిల్లో రాబడులు పెట్టుబడి కాలాన్ని బట్టి 5–6.5 శాతం మధ్య ఉంటాయి. స్వల్పకాలానికి 5 శాతం వరకు ఆశించొచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఆ షాట్ ను అతని నుంచే నేర్చుకున్నా:ఏబీ
లండన్:ప్రస్తుతమున్న విధ్వంసకర క్రికెటర్లలో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ఒకడు. బంతిని సునాయాసంగా బౌండరీ దాటించడంతో పాటు అనేక రకాల షాట్లను ఆడటంలో ఏబీ సిద్ధహస్తుడు. స్వీప్, రివర్స్ స్వీప్, అప్పర్ కట్, రివర్స్ స్కూప్ ఇలా ఏ షాట్ నైనా ఏబీ చాలా ఈజీగా ఆడగలడు. అయితే స్వీప్ షాట్ ను ఆడటాన్ని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ నుంచి ఏబీ నేర్చుకున్నాడట. ఈ విషయాన్ని ఏబీనే స్వయంగా వెల్లడించాడు. 'నెమ్మదిగా తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని స్ట్రైయిట్ గా ఆడితే వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లే ఆస్కారం ఎక్కువ. అందుకు నేను ఇష్టపడను. అలాంటి బంతిని స్వీప్ షాట్ ద్వారా బౌండరీకి తరలించేందుకు యత్నిస్తా. ఆ షాట్ ను నేర్చుకున్నది యూనిస్ ఖాన్ నుంచి అనే కచ్చితంగా చెప్పగలను. యూనిస్ ఆ షాట్ ఆడే విధానం బాగుంటుంది. అతని వద్ద నుంచి స్వీప్ షాట్ ను ఆడటం నేర్చుకున్నా'అని ఏబీ పేర్కొన్నాడు. ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యలపై యూనిస్ స్పందించాడు. కొంతమంది ఆటగాళ్ల ఆట తీరును పరిశీలించడం సాధారణంగా జరుగుతూ ఉంటుందని యూనిస్ అన్నాడు. అసలు స్వీప్ షాట్లు ఆడటానికి చాలా ధైర్యం కావాలన్నాడు. ఆ షాట్లు ఆడేటప్పుడు అవుటైతే మనకు విమర్శలు కూడా తప్పవన్నాడు. తాను టెస్టుల్లో పదివేల పరుగుల మార్కును చేరేటప్పుడు కూడా స్వీప్ షాట్ నే ఆడినట్లు యూనిస్ తెలిపాడు. మరొకవైపు తాను కూడా డివిలియర్స్ నుంచి కొన్ని షాట్లు ఆడటాన్ని నేర్చుకున్నట్లు యూనిస్ తెలిపాడు. -
జేఎన్‌యూ వామపక్షమే!
- విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ-ఏఐఎస్ఏ విజయం - నాలుగు పదవులూ కైవసం - ఢిల్లీ వర్సిటీలో పట్టు నిలుపుకున్న ఏబీవీపీ న్యూఢిల్లీ: జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో నాలుగు సీట్లనూ వామపక్ష కూటమి(ఎస్ఎఫ్ఐ-ఏఐఎస్ఏ) గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. శుక్రవారం నాటి ఎన్నికల్లో 60 శాతం ఓటింగ్ నమోదవగా..ఫలితాలను శనివారం వెల్లడించారు. అధ్యక్షుడిగా.. ఏఐఎస్ఏ(సీపీఐ-ఎంఎల్ అనుబంధ) విద్యార్థి మోహిత్ పాండే ఎన్నికయ్యారు. ఆయన సమీప ప్రత్యర్థి అయిన ‘బాప్సా’ అభ్యర్థి రాహుల్‌పై 409 ఓట్ల తేడాతో గెలిచారు. ఏబీవీపీ అభ్యర్థి శివశక్తినాథ్ బక్షీకి 694 ఓట్లొచ్చాయి. వామపక్ష కూటమి అభ్యర్థులు అమల్ పిప్లీ ఉపాధ్యక్షుడిగా, శతపుత్ర చక్రవర్తి ప్రధాన కార్యదర్శిగా, తాబేజ్ హుసేన్ సంయుక్త కార్యదర్శిగా గెలిచారు. 31 కౌన్సిలర్ సీట్లలోనూ 30 సీట్లు ఈ కూటమి ఖాతాలోకే చేరాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 9 ఘటన తర్వాత కన్హయ్యకుమార్ అరెస్టుతో జేఎన్‌యూ రాజకీయాలపై, ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. ఢిల్లీ వర్సిటీలో ఏబీవీపీ హవా ఢిల్లీ యూనివర్సిటీ(డీయూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ గెలిచింది. నాలుగు స్థానాలకు గానూ మూడింటిని గెలుచుకుంది. అధ్యక్షుడిగా ఏబీవీపీ నేత అమిత్ తన్వార్, ప్రియాంక ఉపాధ్యక్షురాలిగా, కార్యదర్శిగా అంకిత్ సింగ్ గెలిచారు. ఎన్ఎస్యూఐకి చెందిన మోహిత్ సంయుక్త కార్యదర్శిగా గెలిచాడు. 2014, 2015 ఎన్నికల్లో నాలుగు స్థానాలనూ ఏబీవీపీ గెలుచుకుంది. డీయూలో పాగా కోసం తీవ్రంగా ప్రయత్నించిన వామపక్షాలకు ఈసారి కూడా భంగపాటు తప్పలేదు. -
నేషనల్ జియోగ్రాఫిక్ పోటీలో దుమ్మురేపారు
నేషనల్ జియోగ్రాఫిక్ బీ కాంపిటీషన్ లో భారతీయ అమెరికన్ విద్యార్థులు స్వీప్ చేశారు. తమ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి మొదటి స్థానంతో పాటు, రెండు మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రధాన కార్యాలయం లో జరిగిన 28వ వార్షిక పోటీలో ఫ్లోరిడా కు చెందిన ఆరవ తరగతి విద్యార్థి రిషీ ఫస్ట్ ప్లేస్ కొట్టేసి ప్రతిష్టాత్మక బహుమతిని గెల్చుకున్నాడు. తన సమీప ఇండో అమెరికన్ విద్యార్థులపై పై చేయి సాధించి ఈ భారీ బహుమతిని సొంతం చేసుకున్నాడు. కేరళకు చెందిన రిషీ నాయర్ (12) ఈ ప్రిస్టీజియస్ అవార్డును దక్కించుకున్నాడు. దీనికి గాను 33 లక్షల ప్రైజ్ మనీని (యాభైవేల అమెరికన్ డాలర్లు) స్కాలర్ షిప్ గా నాయర్ కు అందించనుంది. దీంతో పాటు నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీలో జీవితకాల సభ్యత్వం కూడా లభించనుంది. హోరా హోరీగా నడిచిన పోటీలో పసిఫిక్ మహాసముద్రం ద్వీపసముదాయంలో వేల్స్ లాంటి వన్యప్రాణి సంరక్షణ కోసం సాంక్చురీ ఏర్పాటు చేసిన 'గాలా పగోస్ దీవి' పేరు చెప్పి నాయర్ ఈ విజయం సాధించాడు. మరో ఇద్దరు భారతజాతి అమెరికన్ విద్యార్థులు మసాచు సెట్స్ నుంచి సాకేత్ జొన్నలగడ్డ రెండవస్థానంలో, అలబామా కు చెందిన కపిల్ నాథన్ మూడవ స్థానంలో నిలిచారు. కాగా గత ఏడాది కరన్ మీనన్ ఈ పోటీలో విజేతగా నిలువగా... ఇండియన్ అమెరికన్ విద్యార్థులకు వరుసగా ఇది అయిదవ విజయం. గత కొన్నేళ్లుగా ఈ పోటీలో భారతసంతతికి చెందిన అమెరికన్ విద్యార్థులు వరుసగా విజయం సాధిస్తుండడం విశేషం. -
జేఎన్‌యూలో ఐసా
సాక్షి, న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) ఎన్నికలను వామపక్షానికి చెందిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) స్వీప్ చేసింది. నాలుగు స్థానాల్లోనూ విజయ దుంధుబి మోగించింది. ప్రత్యర్థులను భారీ మెజార్టీతో మట్టికరిపించింది. అధ్యక్షుడిగా అక్బర్ చౌదరి, ఉపాధ్యక్షుడిగా అనుభూతి ఏగ్నెస్, ప్రధాన కార్యదర్శిగా సందీప్ సౌరవ్, సంయుక్త కార్యదర్శిగా సర్ఫరాజ్ హమీద్ ఎన్నికయ్యారు. మూడు రోజులకు పైగా ఓట్లను లెక్కించిన అధికారులు సోమవారం ఫలితాలను ప్రకటించారు. మొత్తం 4,589 ఓట్లు పోలయ్యాయని జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికల కమిషనర్ జ్ఞాన్‌ప్రకాశ్ తెలిపారు. అన్ని స్థానాల్లో ఏఐఎస్ఏ విజయం సాధించిందన్నారు. అధ్యక్ష పదవికి పోటీపడిన డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (డీఎస్ఎఫ్)కు చెందిన ఇషాన్ ఆనంద్, ఎన్ఎస్యూఐకి చెందిన ప్రాణ్‌వీర్ సింగ్, ఏబీవీపీకి చెందిన ఆలోక్ కుమార్ సింగ్, కన్సర్న్స్డూడెంట్స్కు చెందిన చంద్రసేన్‌పై ఏఐఎస్ఏకు చెందిన అక్బర్ చౌదరి విజయం సాధించారు. ఫిలాసఫీలో డాక్టరేట్ చేస్తున్న చౌదరికి 1,977 ఓట్లు పొలవగా, ప్రత్యర్థి డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (డీఎస్ఎఫ్)కు చెందిన ఇషాన్ ఆనంద్‌కు 1,327 ఓట్లు పొలయ్యాయి. ఉపాధ్యక్షుడిగా పోటీ చేసిన హిస్టరీలో ఎంఫిల్ చేస్తున్న ఏఐఎస్ఏకు చెందిన ఏగ్నెస్కు 1,966 ఓట్లు పోలయ్యాయి. ప్రత్యర్థి డీఎస్‌ఎఫ్‌కు చెందిన జీశాన్ అలీకి 1,052 ఓట్లు పోలయ్యాయి. ప్రధాన కార్యదర్శి పదవీకి పోటీచేసిన స్కూల్ ఆఫ్ లాంగ్వేజేస్ విద్యార్థి సౌరవ్‌కు 1,657 ఓట్లు పోలయ్యాయి. ఇతను ఎన్ఎస్యూఐకి చెందిన కారొలిన్ మనైనీని 953 ఓట్లతో మట్టికరిపించాడు. కార్యదర్శి పదవికి పోటీచేసిన ఫ్రెంచ్ మాస్టర్ స్టూడెంట్ హమీద్ 1,705 ఓట్లు పోలయ్యాయి. ఇతను డీఎస్‌ఎఫ్‌కు చెందిన సోనమ్ గోయల్‌ను 59 ఓట్లతో ఓడించాడు. 2012 సంవత్సరంలో మూడు పదవులను గెలుచుకున్న ఏఐఎస్ఐకి డీఎస్‌ఎఫ్‌కు మధ్య గట్టిపోరు సాగింది. ‘మా కృషిని విద్యార్థులు గుర్తించారు. గత రెండు నెలల నుంచి వివిధ సమస్యల సాధనకు కృషి చేశాం. మెస్, హాస్టల్ వసతులతో పాటు విద్యార్థుల ఉపకారవేతనాన్ని రూ.200ల నుంచి రూ.500లకు పెంచేలా చొరవ తీసుకున్నామ’ని చౌదరి సోమవారం విలేకరులకు తెలిపారు. వీటన్నింటి వల్లే తాము ఘన విజయం సాధించగలిగామని సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులందరూ చూపించిన ఆదరాభిమానాలు మరవమని, ఇక నుంచి జేఎన్‌యూను ప్రపంచస్థాయి పరిశోధన విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఏగ్నేస్ తెలిపారు.