breaking news
Success Plan
-
ల్యాబ్‌లోని మెదడు కణాలూ వీడియోగేమ్ ఆడేశాయ్
సిడ్నీ: మానవ మేథోశక్తిని ప్రయోగశాలలో పునఃసృష్టి చేసేందుకు ప్రయత్నిస్తున్న పరిశోధకులు ఆ క్రతువులో స్వల్ప విజయం సాధించారు. 1970ల నాటి టెన్నిస్ క్రీడను తలపించే పోంగ్ కంప్యూటర్ వీడియోగేమ్‌ను ప్రయోగశాలలో అభివృద్ధిచేసిన మెదడు కణాలు అర్థంచేసుకుని, అందుకు అనుగుణంగా స్పందిస్తున్నాయి. కొత్త తరం బయోలాజికల్ కంప్యూటర్ చిప్స్ అభివృద్ధి కోసం ఆస్ట్రేలియాలోని కార్టికల్ ల్యాబ్స్ అంకురసంస్థ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇందులోని న్యూరో శాస్త్రవేత్తల బృందం మానవ, ఎదగని ఎలుక నుంచి మొత్తంగా దాదాపు 8,00,000 మెదడు కణాలను ల్యాబ్‌లో పెంచుతోంది. డిష్‌బ్రెయిన్‌గా పిలుచుకునే ఈ మెదడు కణాల సముదాయం ఎలక్ట్రోడ్ వరసలపై ఉంచినపుడు పోంగ్ వీడియోగేమ్‌కు తగ్గట్లు స్పందించిందని పరిశోధనలో భాగస్వామి అయిన డాక్టర్ బ్రెడ్ కగాన్ చెప్పారు. ఈ తరహా ప్రయోగం కృత్రిమ జీవమేథో ప్రయోగాల్లో మొదటిది కావడం గమనార్హం. మూర్ఛ, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం సమస్యలను మరింతగా అర్ధంచేసుకునేందుకు, భవిష్యత్‌లో కృత్రిమంగా ప్రయోగశాలలోనే జీవమేథ రూపకల్పనకు ఈ పరిశోధన ఫలితాలు ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. తదుపరి పరీక్షలో తాము మత్తునిచ్చే ఇథనాల్‌ను వాడి కణాల పనితీరు.. మద్యం తాగిన మనిషి ‘పనితీరు’లా ఉందో లేదో సరిచూస్తామన్నారు. ఈ పరిశోధన వివరాలు న్యూరాన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
సివిల్స్ మెయిన్ 75days సక్సెస్ ప్లాన్
యూపీఎస్సీ కోరుకునేదేమిటి? మెయిన్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ముందుగా అభ్యర్థి నుంచి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏం కోరుకుంటోందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దీనికోసం గత పదేళ్ల సివిల్స్ మెయిన్ ప్రశ్న పత్రాలను విశ్లేషించి పరీక్ష తీరుతెన్నులపై సమగ్ర అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత ప్రిపరేషన్ పరంగా అనుసరించాల్సిన వ్యూహం రూపొందించుకోవాలి. వాస్తవానికి యూపీఎస్సీ అభ్యర్థుల్లోని నిర్ణయాత్మక శక్తిని, విశ్లేషణ నైపుణ్యాలను, తార్కిక విశ్లేషణను పరిశీలించేందుకు ప్రయత్నిస్తుంది. ఆప్షనల్స్‌కు ప్రాధాన్యమిస్తూ.. మెయిన్ ప్రిపరేషన్లో అభ్యర్థులు ముందుగా ఆప్షనల్ సబ్జెక్ట్‌లకు ప్రాధాన్యమివ్వాలి. వీటికి సంబంధించి బేసిక్స్‌పై అవగాహన పెంచుకుంటూ.. వాటిని వాస్తవ పరిస్థితుల్లో అన్వయిస్తూ చదువుకోవాలి. అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్ సాగించడం ఎంతో మేలు చేస్తుంది. ఆయా సబ్జెక్టుల్లోని సిద్ధాంతాల ఆధారంగా తాజాగా సంబంధిత రంగాల్లో జరిగిన మార్పుల గురించి చర్చించాలని అడిగే అవకాశముంది. జనరల్ ఎస్సేలో రాణించాలంటే... సివిల్స్ మెయిన్ అభ్యర్థులు జనరల్ ఎస్సే పేపర్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎందుకంటే.. జనరల్ ఎస్సే విజయావకాశాలను ప్రభావితం చేయడంలో కీలకంగా మారుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ముందుగా జనరల్ ఎస్సే పేపర్ పరంగా ప్రశ్నలు అడిగే అవకాశమున్న అంశాలను గుర్తించాలి. ప్రధానంగా అంతర్జాతీయ అంశాలపై దృష్టి పెట్టాలి. వీటితోపాటు జాతీయ స్థాయిలో తాజాగా జరిగిన పరిణామాలు-అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో వాటి ప్రభావం గురించి తెలుసుకోవాలి. ఆయా అంశాలకు సంబంధించిన ముఖ్యాంశాలు నోట్ చేసుకోవాలి. కూర్పులో నేర్పుగా... జనరల్ ఎస్సే ప్రజెంటేషన్ విషయంలో అభ్యర్థులు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలి. తమకు పరిజ్ఞానం ఉందనే ఉద్దేశంతో అన్ని అంశాలు రాయాలనుకోకుండా.. నిర్దిష్టంగా ఒక ఎస్సేకు లభించే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమైన అంశాలను సమీకృతం చేస్తూ రాయడం మంచిది. ఉపోద్ఘాతం, వివరణ, ముగింపు అనే మూడు ముఖ్య సూత్రాలను దృష్టిలో పెట్టుకుని ఎస్సే రాయడం అలవర్చుకోవాలి. జీఎస్.. ఫోకస్డ్ ప్రిపరేషన్.. జనరల్ స్టడీస్ విషయంలో అభ్యర్థులకు ఫోకస్డ్ ప్రిపరేషన్ అవసరం. అన్ని విషయాలు తెలుసుకోవాలనే దృక్పథం మంచిదే. అయితే, అందుబాటులో ఉన్న సమయం, సదరు అంశానికి పరీక్ష పరంగా ఉన్న ప్రాధాన్యతను గుర్తించి ముందుకు సాగాలి. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ విషయంలో ప్రత్యేక దృష్టితో వ్యవహరించాలి. ప్రశ్నార్హమైన అంశాలను గుర్తించే నైపుణ్యం అలవర్చుకోవాలి. జనరల్ స్టడీస్ పేరుతో నాలుగు పేపర్లకు సంసిద్ధులు కావాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి కోర్ అంశాలను కాంటెంపరరీ పరిణామాలతో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. పథకాలపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వ పథకాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ముఖ్యంగా జనరల్ ఎస్సే విషయంలో వీటికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇటీవలి కాలంలో జాతీయ స్థాయిలో పలు పథకాలు రూపొందాయి. వాటి ఉద్దేశం-లక్ష్యం-కార్యాచరణ ప్రణాళిక - సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకోవాలి. వీటికి సంబంధించి ఇప్పటికే ఆయా రంగాల్లోని నిపుణుల విశ్లేషణలు చదవడం ఎంతో లాభిస్తుంది. రైటింగ్, ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం.. అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలోనే అలవర్చుకోవాల్సిన మరో ముఖ్య లక్షణం.. రైటింగ్ ప్రాక్టీస్. పరీక్షలో ఒక ప్రశ్నకు లభించే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా రోజూ ప్రశ్నలు-సమాధానాలు ప్రాక్టీస్ చేయాలి. ఇందుకోసం టైం రిమైండర్ సెట్ చేసుకోవాలి. నిర్ణీత టైం ముగియగానే ఆ సమాధానం రాయడం ఆపేయాలి. ఆ తర్వాత ఆ సమాధానంలో రాయలేకపోయిన ముఖ్యాంశాలు లేదా అనవసరంగా రాసిన అంశాల గురించి స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. రోజూ అన్ని సబ్జెక్టులు చదివేలా.. మెయిన్ అభ్యర్థులు రోజూ అన్ని సబ్జెక్టులు చదివేలా టైంటేబుల్ రూపొందించుకోవాలి. దీనికి భిన్నంగా కొన్ని రోజులు పూర్తిగా ఒక సబ్జెక్టుకు కేటాయించి, తర్వాత మరో సబ్జెక్ట్ చదివే విధానం వల్ల చివరి దశలో ప్రతికూల ఫలితాలు ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రతి రోజూ ప్రతి సబ్జెక్ట్ చదివే విధానం వల్ల పరీక్ష సమయానికి అన్ని సబ్జెక్ట్‌లను పూర్తి చేయగలిగే అవకాశం ఉంటుంది. అలాగే అభ్యర్థులు తమకు ఇష్టమైన అంశాలతో ప్రిపరేషన్ ప్రారంభించాలి. ఆసక్తి లేని టాపిక్స్‌తో మొదలుపెడితే ఫలితం ప్రతికూలంగా ఉంటుంది. మొత్తం ప్రిపరేషన్‌పై ఆ ప్రభావం పడుతుంది. విజయానికి వీక్లీ టెస్ట్‌లు.. అభ్యర్థులు స్వయంగా లేదా నిపుణుల ఆధ్వర్యంలో వీక్లీ టెస్ట్‌లు రాసి, మూల్యాంకనం చేయించుకోవాలి. ఫలితంగా ఎప్పటికప్పుడు తాము ఇంకా మెరుగవాల్సిన అంశాలపై అవగాహన వస్తుంది. అప్లికేషన్ ఓరియెంటేషన్‌లో.. మెయిన్ అభ్యర్థులు ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి బేసిక్స్‌ను ఇప్పుడు చదవాలనుకోవడం సరికాదు. వాటికి సంబంధించిన సినాప్సిస్‌ను పరిశీలించి, అప్లికేషన్ ఓరియెంటేషన్‌లో ప్రిపరేషన్ కొనసాగించాలి. నవంబర్ 15 నాటికి ప్రిపరేషన్ పూర్తి చేసుకొని, ఆ తర్వాత నుంచి రివిజన్‌కు కేటాయించాలి. - శ్రీరామ్, డెరైక్టర్, రామ్స్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ విశ్లేషణాత్మక దృక్పథం.. అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలోనే ప్రతి అంశంపై విశ్లేషణాత్మక దృక్పథంతో ముందుకు సాగాలి. కేవలం మెటీరియల్‌లో పేర్కొన్న పాయింట్లను యథాతథంగా రీ-ప్రజెంట్ చేయాలనే విధానం సరికాదు. - ఆర్.సి.రెడ్డి, డెరైక్టర్, ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ పాయింటర్ అప్రోచ్ మెయిన్ అభ్యర్థులు రివిజన్ పరంగా పాయింటర్ అప్రోచ్‌ను అవలంబించాలి. ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు అందులోని ముఖ్యమైన సబ్ టాపిక్స్‌ను అండర్లైన్ చేసుకోవడం లేదా పాయింట్స్ రూపంలో సొంత నోట్స్ రూపొందించుకోవడం వల్ల రివిజన్ ఫలవంతంగా ఉంటుంది. - వి.గోపాలకృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ ముఖ్యమైన టాపిక్స్ అంతర్జాతీయ సదస్సులు, భారత్‌పై ప్రభావం జీఎస్టీ బిల్లు భూసేకరణ చట్టం ఇండియన్ ఎకనమిక్ సర్వే పేర్కొన్న అంశాలు ఇటీవల ఒలింపిక్స్‌లో భారత ప్రదర్శన, భారత క్రీడా విధానం ప్రభుత్వ పథకాలు భారత ఉపగ్రహ ప్రయోగాలు పర్యావరణ పరిరక్షణ- జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీసుకుంటున్న చర్యలు బడ్జెట్ ముఖ్యాంశాలు - ఆయా రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల్లో పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ -
సివిల్స్-2015 సక్సెస్ ప్లాన్
సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్.. దేశ అత్యున్నత సర్వీసుల్లోకి ప్రవేశం కల్పించే ప్రతిష్టాత్మక పోటీ పరీక్ష. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సర్వీసులకు ప్రతిభావంతులను ఎంపిక చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏటా సివిల్ సర్వీసెస్ పరీక్షను నిర్వహిస్తోంది. సంప్రదాయ డిగ్రీ మొదలు టెక్నికల్ గ్రాడ్యుయేట్ల వరకు.. ఫ్రెషర్స్ నుంచి వర్కింగ్ ప్రొఫెషనల్స్ వరకూ.. దేశవ్యాప్తంగా లక్షల మంది సివిల్స్‌కు పోటీపడతారు. లక్షల ప్యాకేజీల కార్పొరేట్ కొలువులను కాదనుకొని.. ఐఏఎస్ కావడమే లక్ష్యంగా పరీక్షకు సిద్ధమయ్యేవారు ఎందరో! ఉద్యోగ భద్రత.. సంఘంలో గౌరవప్రదమైన హోదా.. సమాజానికి సేవ చేసే అవకాశం.. వెరసి సివిల్స్‌కు పోటీ పెరుగుతోంది. తీవ్ర పోటీ దృష్ట్యా ఔత్సాహికులుదీర్ఘకాలిక పటిష్ట ప్రణాళికతో కృషి చేస్తే సక్సెస్ సాధ్యమవుతుందంటున్నారు నిపుణులు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2015 క్యాలెండర్‌ను యూపీఎస్సీ ప్రకటించిన నేపథ్యంలో.. అభ్యర్థులు అనుసరించాల్సిన విధానాలు, విజయానికి మార్గాలు!! 200 రోజులు.. ప్రిలిమ్స్-2015కు అందుబాటులో ఉన్న సమయం.. 100 రోజులు.. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు మధ్య లభించే సమయం.. సిలబస్‌పై పట్టు.. తొలి మెట్టు మానసిక సంసిద్ధత కోణంలో సాధించాలనే సంకల్పం ప్రధాన పాత్ర వహిస్తే.. పరీక్ష ప్రిపరేషన్ పరంగా సిలబస్‌పై పట్టు సాధించడం తొలి మెట్టు. ఔత్సాహిక అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రారంభానికి ముందుగా యూపీఎస్సీ నిర్దేశించిన సిలబస్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేసి పూర్తి అవగాహన పొందాలి. కేవలం ప్రిలిమ్స్ సిలబస్‌నే కాకుండా మెయిన్స్ సిలబస్‌ను కూడా పరిశీలించాలి. ఫలితంగా రెండు పరీక్షల్లో ఉమ్మడిగా ఉన్న అంశాలపై ఏకకాలంలో ప్రిపరేషన్ ప్లాన్ రూపొందించుకోవచ్చు. అదేవిధంగా గత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. దీనివల్ల ఆయా అంశాలకు లభిస్తున్న వెయిటేజీ; ప్రశ్నలు అడుగుతున్న తీరు; అభ్యర్థులకు తాము బలహీనంగా ఉన్న అంశాలు; మరింతగా దృష్టి సారించాల్సిన అంశాలపైనా అవగాహన ఏర్పడుతుంది. ఇది క్రమబద్ధమైన ప్రిపరేషన్‌కు దోహదపడుతుంది. ఆప్షనల్.. ముందుగానే స్పష్టత మెయిన్స్‌లో రెండు పేపర్లుగా ఉండే ఆప్షనల్ సబ్జెక్ట్ ఎంపికలో అభ్యర్థులు ముందుగానే స్పష్టతకు రావాలి. అందుకోసం వ్యక్తిగత అభిరుచి, అకడమిక్ నేపథ్యం, స్కోరింగ్ ఆప్షనల్, మెటీరియల్ లభ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వాస్తవానికి గత కొన్నేళ్లుగా అభ్యర్థులు తమ విద్యా నేపథ్యంతో సంబంధంలేని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంత్రోపాలజీ, సోషియాలజీ; లిటరేచర్; ఫిలాసఫీ వంటి సబ్జెక్ట్‌లను ఎంచుకొని విజయం సాధిస్తున్నారు. ఆయా సబ్జెక్ట్‌ల సిలబస్‌లో పేర్కొన్న అంశాలు తేలిగ్గా అర్థమయ్యేలా ఉండటం, మెటీరియల్ లభ్యతే అందుకు కారణంగా చెప్పొచ్చు. అయితే, అభ్యర్థులు ఆప్షనల్ ఎంపికలో తమ ఆసక్తికి కూడా ప్రాధాన్యమివ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. జీఎస్‌తో ప్రారంభించి ఇటీవల కాలంలో సివిల్స్ పరీక్షల శైలిని పరిశీలిస్తే.. జనరల్ స్టడీస్, కాంటెంపరరీ ఇష్యూస్‌కు అధిక ప్రాధాన్యం లభిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని జనరల్ స్టడీస్‌తో ప్రిపరేషన్ ప్రారంభించడం మంచిది. దీనివల్ల అన్ని విభాగాలకు సంబంధించిన అంశాల గురించి తెలుసుకునే వీలు లభిస్తుంది. ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులకు కలిసొచ్చే మరో అంశం.. డిస్క్రిప్టివ్ అప్రోచ్‌ను అనుసరించడం. దీన్ని గుర్తించి ఒక సబ్జెక్ట్ నిర్దిష్ట అంశాన్ని చదివేటప్పుడు విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. ఒక అంశం నుంచి విభిన్న కోణాల్లో స్పృశిస్తూ చదవాలి. అప్పుడు ప్రిలిమ్స్‌లోని ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు; మెయిన్స్‌లోని డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. వన్ షాట్ టు బర్డ్స్ అభ్యర్థులు ప్రిపరేషన్‌ను ‘వన్ షాట్ టు బర్డ్స్’ తీరులో సాగించాలి. అంటే.. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్రిపరేషన్ ఒకే సమయంలో పూర్తి చేసుకునే విధంగా ముందుకు సాగాలి. ప్రిలిమ్స్‌లోని జనరల్ స్టడీస్; మెయిన్స్‌లోని జీఎస్ పేపర్లలో పేర్కొన్న అంశాలన్నీ దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. దీంతో ప్రిపరేషన్ సమయంలోనే మెయిన్స్ పరీక్ష-సమాధానం శైలిని పరిగణనలోకి తీసుకుని విశ్లేషణాత్మక అధ్యయనం చేయడం వల్ల సమయం ఎంతో ఆదా అవుతుంది. ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు మధ్య ఉన్న తక్కువ వ్యవధిలో కొత్తగా మెయిన్స్ కోసం ప్రిపరేషన్ ప్రారంభించడం వల్ల ఆశించిన ఫలితం ఉండదు. ప్రిలిమ్స్ ప్రిపరేషన్ నుంచే మెయిన్స్ కోణంలో చదివితే రెండు పరీక్షల మధ్య సమయం రివిజన్‌కు ఉపయోగపడుతుంది. కోర్ + కాంటెంపరరీ అభ్యర్థులు అనుసరించాల్సిన మరో వ్యూహం.. కోర్ టాపిక్స్‌ను సమకాలీన అంశాలతో సమన్వయం చేసుకోవడం. ఇటీవల కాలంలో పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ వంటి అంశాల నుంచి అడిగే కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు కూడా అంతర్లీనంగా కోర్ సబ్జెక్ట్ నాలెడ్జ్‌ను పరీక్షించే విధంగా ఉంటున్నాయి. ఉదాహరణకు తాజాగా ఏదైనా రాజ్యాంగ సవరణ చేపడితే.. ఆ సవరణకు సంబంధించి రాజ్యాంగంలో పేర్కొన్న అంశాల గురించి కూడా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కరెంట్ అఫైర్స్ అంటే కేవలం కొశ్చన్-ఆన్సర్ అనే పద్ధతిలో ప్రిపరేషన్‌కు స్వస్తి పలికి; కోర్ సబ్జెక్ట్‌తో సమన్వయం చేసుకుంటూ చదవాలి. గ్రూప్-1తో సమన్వయం తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సివిల్స్ ప్రిపరేషన్‌ను గ్రూప్-1తో సమన్వయం చేసుకోవచ్చు. త్వరలో తెలంగాణలో గ్రూప్-1 ప్రకటన వెలువడొచ్చు. ఈ పరీక్షలో పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటివి సివిల్స్‌లోనూ ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని సిద్ధమవ్వాలి. ప్రిలిమ్స్ పేపర్-2 ప్రత్యేకంగా అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సింది ప్రిలిమ్స్ పేపర్-2 (ఆప్టిట్యూడ్ టెస్ట్). డెసిషన్ మేకింగ్; ఇంగ్లిష్ కాంప్రహెన్షన్; జనరల్ మెంటల్ ఎబిలిటీ; బేసిక్ న్యూమరసీ విభాగాలతో ఉండే ఈ పేపర్లో విజయానికి కొంత కసరత్తు చేయాలి. టెన్త, +2 స్థాయిలో ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్ అంశాలపై పట్టు సాధించాలి. ఫలితంగా బేసిక్ న్యూమరసీ, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్‌లో రాణించొచ్చు. అదేవిధంగా ఇంగ్లిష్ పత్రికల ఎడిటోరియల్స్ చదవడం కూడా లాభిస్తుంది. అంతర్జాతీయ ప్రాముఖ్యమున్న అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో.. ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాలు-లక్ష్యాలు-ఉద్దేశాలపై అవగాహన ఉండాలి. జాతీయ స్థాయిలో కొత్తగా ప్రారంభించిన పథకాలు-లక్ష్యాలపై అవగాహన పెంచుకోవాలి. సమయపాలన అభ్యర్థులకు టైం ప్లానింగ్‌లో స్పష్టత ఉండాలి. అందుబాటులో ఉన్న సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే..- జూన్ నెలాఖరుకు ప్రిలిమ్స్ (మెయిన్స్ కోణంలోనూ) ప్రిపరేషన్ పూర్తి చేయాలి. ప్రతిరోజూ సగటున 8 గంటలు చదివే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. * జూలై నుంచి ప్రిలిమ్స్ పరీక్ష తేదీ (ఆగస్ట్ 23) వరకు పూర్తిగా రివిజన్‌కు కేటాయించాలి. * ఈ రెండు నెలలు మెయిన్స్ ప్రిపరేషన్‌కు విరామం ఇచ్చి.. పూర్తిగా ప్రిలిమ్స్‌పైనే దృష్టి కేంద్రీకరించాలి. * ప్రిలిమ్స్ మరుసటి రోజు నుంచే డిసెంబర్ 18న మొదలయ్యే మెయిన్స్‌కు ఉపక్రమించాలి. * ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ మధ్యలో లభించే దాదాపు నాలుగు నెలల సమయంలో ఆప్షనల్ సబ్జెక్ట్‌లోని రెండు పేపర్లకు, జనరల్ స్టడీస్ నాలుగు పేపర్లకు సమ ప్రాధాన్యం లభించే విధంగా టైం టేబుల్ రూపొందించుకోవాలి. ఇలా.. ఇప్పటి నుంచే ప్రతి దశలోనూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే సివిల్స్ లో విజయావకాశాలు మెరుగుపరుచుకోవచ్చు. సివిల్స్-2015 షెడ్యూల్ ప్రకటన తేదీ: మే 16, 2015 దరఖాస్తు చివరి తేదీ: జూన్ 12, 2015 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: ఆగస్ట్ 23, 2015 మెయిన్స్ పరీక్షలు: డిసెంబర్ 18 నుంచి (5 రోజులు) సివిల్ సర్వీసెస్ పరీక్ష తీరుతెన్నులు మొత్తం మూడు దశల్లో (ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్) ఉండే సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో ప్రిలిమ్స్, మెయిన్స్లు రాత పరీక్షలు. వీటిలో ఉత్తీర్ణత సాధించిన వారికి పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్-1: జనరల్ స్టడీస్ - 200 మార్కులు పేపర్-2: ఆప్టిట్యూడ్ టెస్ట్ - 200 మార్కులు మెయిన్ ఎగ్జామినేషన్ పేపర్-1: జనరల్ ఎస్సే పేపర్-2 : జనరల్ స్టడీస్-1(ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ వరల్డ్ అండ్ సొసైటీ) పేపర్-3: జనరల్ స్టడీస్-2 (గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్) పేపర్-4: జనరల్ స్టడీస్-3 (టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్) పేపర్-5: జనరల్ స్టడీస్-4 (ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్) పేపర్-6: ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్-1 పేపర్-7: ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్-2 ప్రతి పేపర్‌కు 250 మార్కులు చొప్పున 1750 మార్కులకు మెయిన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఖాళీల ఆధారంగా 1:1.2 లేదా 1.3 నిష్పత్తిలో అభ్యర్థులను పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ-275 మార్కులు)కు ఎంపిక చేస్తారు. రెగ్యులర్ ప్రాక్టీస్ సివిల్స్ ఔత్సాహిక అభ్యర్థులు ఇప్పటి నుంచే ఎలాంటి విరామం లేకుండా రెగ్యులర్‌గా ప్రిపరేషన్ సాగించాలి. చదివే అంశాలకు సంబంధించి రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఎంతో ముఖ్యం. ఇది మెయిన్స్‌లో కలిసొస్తుంది. అంతేకాకుండా సెల్ఫ్ అసెస్మెంట్ కూడా లాభిస్తుంది. నిర్దిష్ట యూనిట్ పూర్తి కాగానే అందులో మోడల్ కొశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయడం, ఇందుకోసం సమయాన్ని నిర్దేశించుకోవడం వంటి టెక్నిక్స్ అనుసరించాలి. మెటీరియల్ ఎంపిక విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. సీనియర్లు, ఇతర మార్గాల ద్వారా సరైన మెటీరియల్‌ను ఎంపిక చేసుకోవాలి. ఒక పుస్తకాన్ని ఎంపిక చేసుకునే ముందు అందులో.. సిలబస్ మేరకు అన్ని అంశాలు కవరయ్యే విధంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా మెటీరియల్ ఎంపిక నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే మంచి ఫలితం ఆశించొచ్చు. - శ్రీరంగం శ్రీరామ్, డెరైక్టర్, శ్రీరామ్స్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం ఇటీవల కాలంలో యూపీఎస్సీ సివిల్స్ ప్రశ్నల సరళిని పరిశీలిస్తే కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సివిల్స్-2015 అభ్యర్థులు.. జూలై-2015కు ముందు ఒక సంవత్సర కాలంలో చోటు చేసుకున్న ముఖ్య పరిణామాలపై దృష్టి పెట్టాలి. ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో విజయవంతమైన శాటిలైట్ ప్రయోగాలు, అంతర్జాతీయ ఒప్పందాలపై అవగాహన పెంచుకోవాలి. అభ్యర్థులు సబ్జెక్ట్‌పై అవగాహనతోపాటు పరీక్షలో రాణించే విధంగా మాక్ టెస్ట్‌లకు హాజరవ్వడం కూడా లాభిస్తుంది. - వి. గోపాలకృష్ణ,డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి సివిల్స్ విజయంలో రైటింగ్, షార్ట్ నోట్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. చదివిన ముఖ్యాంశాలను షార్ట్ నోట్స్ రూపంలో రాసుకోవాలి. అదేవిధంగా మెయిన్స్ కోణంలో రైటింగ్ ప్రాక్టీస్ చేయడం ఉపయుక్తం. పరీక్షలో ఒక ప్రశ్నకు లభించే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా సమాధానాలు రాసే విధంగా సిద్ధమవ్వాలి. జనరల్ ఎస్సేకు దిన పత్రికల్లోని ఎడిటోరియల్స్, యోజన వంటివాటిలో వ్యాసాలు చదివి ముఖ్యాంశాలతో సొంత నోట్స్ రూపొందించుకోవాలి. - కృత్తిక జ్యోత్స్న, 30వ ర్యాంకర్, సివిల్స్-2014