breaking news
sub-collector office
-
నూజివీడు ఇన్చార్జి ఆర్డీవోగా చక్రపాణి
నూజివీడు: స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయం ఇన్చార్జి ఆర్డీవోగా గుడివాడ ఆర్డీవో ఎం.చక్రపాణిను నియమించారు. చక్రపాణి బుధవారం నూజివీడు సబ్‌కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసి బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రజల పనులను త్వరితగతిన చేయాలన్నారు. ఫైళ్లు పెండింగ్ ఉండటానికి ఏ మాత్రం వీల్లేదన్నారు. ఒక పని గురించి ప్రజలను పదేపదే కార్యాలయం చుట్టూ తిప్పుకోవద్దన్నారు. అలా తిప్పుకోవడం వల్ల కార్యాలయానికి, అధికారికి, సిబ్బందికి చెడ్డపేరు వస్తుందన్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా మాట్లాడి, వారు అడిగిన విషయాలకు సరైన వివరణ ఇవ్వాలన్నారు. నూజివీడు తహసీల్దారు దోనవల్లి వనజాక్షి ఆర్డీవోకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో కార్యాలయ ఇన్చార్జి ఏవో కాకుమాను స్లీవజోజి, సిబ్బంది పాల్గొన్నారు. -
సర్వే విధులకు గైర్హాజరైతే చర్యలు
విజయవాడ : ప్రజాసాధికారిత సర్వే విధులకు హాజరుకాని సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ బాబు.ఎ హెచ్చరించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజాసాధికారిత సర్వే కోసం ఎంపిక చేసిన వివిధ శాఖల సిబ్బందికి శుక్రవారం ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాసాధికారిత సర్వేను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఇప్పటి వరకు కోటీ 17 లక్షల 74 వేల కుటుంబాలకు చెందిన మూడు కోట్ల 70 లక్షల 50 వేల మంది వివరాలను నమోదు చేశామని తెలిపారు. జిల్లాలో ఇంకా 19 లక్షలమంది వివరాలను సేకరించాల్సి ఉందన్నారు. పట్టణ ప్రాంతాల్లో 11 లక్షల మంది వివరాలు నమోదుచేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం అన్ని శాఖల పరిధిలో సిబ్బందిని సర్వే విధుల్లో నియమించగా, కొన్ని శాఖల అధికారులు సిబ్బందిని రిలీవ్ చేయడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. వెంటనే అధికారులు సంబంధిత మున్సిపల్ శాఖ నోడల్ అధికారికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. రాబోయే 10 రోజుల్లో సర్వేను పూర్తిచేసేలా సర్వే చేపట్టాలని సూచించారు. విజయవాడ మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ మాట్లాడుతూ నగరంలో 8 నుంచి 9 లక్షల వ్యక్తుల వివరాలను సేకరించాల్సి ఉందన్నారు. కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న 480 మంది సర్వే సిబ్బందికి అదనంగా 484 మందిని కలెక్టర్ నియమించారని తెలిపారు. కృష్ణాపుష్కరాలు, దసరా మహోత్సవాల కారణంగా సర్వేలో వెనుకబడ్డామన్నారు. జిల్లా నోడల్ అధికారి, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్‌కలెక్టర్ లక్ష్మీశ, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.