breaking news
Strictly Personal
-
మా నాన్న ఉత్సాహం ఆధారంగా 'జీవితచరిత్ర'
న్యూఢిల్లీ: తన జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావాలా? లేదా అన్న దానిపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయించుకోవాల్సి ఉందని ఆయన కుమార్తె దామన్‌సింగ్ తెలిపారు. ‘‘నా తండ్రి తన జీవిత చరిత్రను ఎప్పుడు రాస్తారనేది, ఆయన దానిపై కనపరిచే ఉత్సాహంపైనే ఆధారపడి ఉంది’’ అని దామన్ చెప్పారు. తన తల్లిదండ్రుల వ్యక్తిగత జీవిత విశేషాలతో ‘స్ట్రిక్ట్లీ పర్సనల్: మన్మోహన్ అండ్ గురుశరణ్’ అనే పుస్తకాన్ని దామన్‌సింగ్ రచించిన విషయం తెలిసిందే. ఈ పుస్తకం ప్రచురణ సందర్భంగా దామన్‌సింగ్ మాట్లాడుతూ తన తల్లిదండ్రుల గురించి అభిమానంతో, నిజాయతీగా రాయడానికి ముగ్గురు రచయితల (విక్రంసేత్, సిలివా నాసర్, ఎంజే అక్బర్) జీవిత చరిత్రలు సహాయపడినట్లు ఆమె వెల్లడించారు. ** -
డాక్టర్ కాబోయి ఎకానమిస్ట్!
ప్రీ మెడిసిన్‌లో చేరి మానేసిన మాజీ ప్రధాని మన్మోహన్ తండ్రి జీవిత చరిత్ర పుస్తకంలో పేర్కొన్న ఆయన కుమార్తె దమన్‌సింగ్ న్యూఢిల్లీ: దేశంలోని గొప్ప ఆర్థికవేత్తల్లో ఒకరిగా, సంస్కరణలతో దేశ ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టిన వ్యక్తిగా అందరికీ సుపరిచితమైన మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ తొలుత వైద్య రంగంవైపు అడుగులు వేశారట! తనను డాక్టర్‌ను చేయాలన్న తండ్రి ఆలోచన ప్రకారం అయిష్టంగానే 1948 ఏప్రిల్‌లో అమృత్‌సర్‌లోని ఖాస్లా కాలేజీలో రెండేళ్ల ప్రీమెడిసిన్ కోర్సు ఎఫ్ఎస్సీలో చేరారట. అయితే వైద్య రంగంపై ఆసక్తి కోల్పోవడంతో కొన్ని నెలలకే ఆ కోర్సు మానేశారట. మన్మోహన్ జీవితంలో చోటుచేసుకున్న ఇటువంటి ఆసక్తికర పరిణామాలకు ఆయన కుమార్తె దమన్‌సింగ్ తాజాగా పుస్తకరూపం ఇచ్చారు. తల్లిదండ్రుల జీవితచరిత్రపై రాసిన పుస్తకం ‘స్ట్రిక్ట్లీ పర్సనల్: మన్మోహన్ అండ్ గురుశరణ్’లో తండ్రి జీవితంలోని విభిన్న కోణాలను ఆమె ఆవిష్కరించారు. అయితే ప్రధానిగా ఆయన పదేళ్ల పదవీకాలంలోని అంశాలను మాత్రం దమన్‌సింగ్ ఇందులో ప్రస్తావించలేదు. తండ్రిని ఉటంకిస్తూ పుస్తకంలో దమన్‌సింగ్ పేర్కొన్న వివరాల ప్రకారం...ప్రీమెడిసిన్ కోర్సు మానేశాక మన్మోహన్ తన తండ్రి దుకాణంలో చేరారు. అయితే అక్కడి పరిస్థితులు నచ్చక 1948 ఆగస్టులో హిందూ కాలేజీలో చేరారు. ఆర్థికశాస్త్రం వైపు అడుగులు...: కాలేజీలో చేరాక మన్మోహన్‌ను ఆర్థికశాస్త్రం ఎంతగానో ఆకర్షించింది. పేదరికానికి సంబంధించిన అంశాలు ఆయనలో ఆసక్తిని కలిగించాయి. కొన్ని దేశాలు పేదరికంలోనే ఎందుకు మగ్గుతున్నాయి? మిగిలినవి ధనక దేశాలుగా ఎందుకు ఉన్నాయి? అనే ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందన్న ఉద్దేశంతో ఆ రంగాన్ని ఎంచుకున్నారు. విదేశాల్లో డబ్బుకు ఇక్కట్లు...: కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో మన్మోహన్‌ను ఎక్కువగా డబ్బు సమస్య వేధించింది. టూషన్, వ్యక్తిగత ఖర్చులకు ఏడాదికి 600 పౌండ్లు అవసరమగా పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఆయనకు 160 పౌండ్ల స్కాలర్షిప్ లభించేది. మిగిలిన సొమ్ము కోసం ఆయన తండ్రిపై ఆధారపడేవారు. ఎప్పుడైనా డబ్బుకు ఇబ్బందైనా లేక ఆలస్యంగా అందినా దాన్ని సర్దుబాటు చేసుకునేందుకు మన్మోహన్ భోజనం మానేయడమో లేక క్యాడ్బరీ చాక్లెట్ బార్‌తో కడుపునింపుకోవడమో చేసేవారు. సరదా మనిషే...: మన్మోహన్ స్నేహితులతో పిచ్చాపాటిగా మాట్లాడేటప్పుడు భలే సరదాగా ఉండేవారు. జోకులు పేలుస్తూ నవ్వుతూ కనిపించేవారు. సన్నిహితుల్లో కొందరికి ముద్దుపేర్లు పెట్టడం కూడా ఆయనకు సరదా. సమీప బంధువొకరికి జాన్ బాబు అని, ఇంకొకరికి జువెల్ బాబు అని, మరొకరికి చుంజ్ వాలే అని కొంటెపేర్లు పెట్టారు. భార్యకు గురుదేవ్ అని, పిల్లలకు కిక్, లిటిల్ నోన్, లిటిల్ రామ్ అని పేర్లు పెట్టారు.