breaking news
Story Board
-
ప్రధాన మీడియాకు ఆన్లైన్ ప్లాట్‌ఫాంలు...పరిహారం ఇవ్వాల్సిందే
న్యూఢిల్లీ: కొత్త తరాన్ని ఆకట్టుకునేందుకు పుంఖానుపుంఖాలుగా పుట్టుకొస్తున్న ఆన్లైన్ మీడియా ప్లాట్‌ఫాంల వల్ల వార్తాపత్రికలు, వార్తా చానళ్ల వంటి సంప్రదాయ ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు ఆర్థికంగా నష్టపోతున్నాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అభిప్రాయపడ్డారు. ‘‘సంప్రదాయ మీడియా సంస్థలకు సంబంధించిన కంటెంట్‌ను ఆన్లైన్ ప్లాట్‌ఫాంలు విస్తారంగా వాడుకుంటున్నాయి. ఇందుకు వాటికవి సముచిత పరిహారం చెల్లించాల్సి ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. ఈ దిశగా చర్యలు తీసుకునేందుకు కేంద్రం కృషి చేస్తోందని వెల్లడించారు. గురువారం స్టోరీబోర్డ్18 డీఎన్‌పీఏ సదస్సును ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో సంప్రదాయ మీడియా పెను సవాళ్లను ఎదుర్కొంటోందని అభిప్రాయపడ్డారు. ‘‘ఆన్లైన్ ప్లాట్‌ఫాంలు కృత్రిమ మేధ (ఏఐ) తదితరాల సాయంతో కంటెంట్‌ను అత్యంత ఆకర్షణీయంగా రూపొందిస్తూ పాఠకులు, వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దాంతో యువత సంప్రదాయ మీడియా నుంచి పూర్తిగా డిజిటల్ మీడియావైపు మళ్లుతోంది. ఈ పరిస్థితుల్లో సంప్రదాయ మీడియా తన పాత్రను సమీక్షించుకోవాల్సి ఉంది. శరవేగంగా చోటుచేసుకుంటున్న కొత్త తరం మార్పులకు అనుగుణంగా తనను తాను మార్చుకోవాలి. ఇది చాలా ముఖ్యం’’ అని సూచించారు. ఈ మార్పిడి క్రమంలో సంప్రదాయ మీడియాకు అన్నివిధాలా దన్నుగా నిలిచేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించారు. డిజిటల్ ప్లాట్‌ఫాంలు తమ ఆదాయంలో సంప్రదాయ ప్రధాన స్రవంతి మీడియా సంస్థలకు సముచిత వాటా ఇచ్చేలా పలు దేశాల్లో ఇప్పటికే చట్టాలు అమల్లో ఉన్నాయని సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘‘భారత్‌లో మాత్రం ఇంకా ఆ పరిస్థితి లేదు. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫాంలకు ఇప్పటికీ ప్రధాన స్రవంతి సంస్థల కంటెంటే ప్రధాన వనరు. కానీ వాటి ఆదాయంలో మాత్రం ప్రధాన మీడియా సంస్థలకు తదనుగుణంగా అందడం లేదు’’ అన్నారు. -
అనగనగా ఓ కథ.. కదిలే బొమ్మల కళ
బంజారాహిల్స్: మనం ఉన్నది కంప్యూటర్ యుగంలోనైనా.. తిరిగేది రోబోటిక్ ప్రపంచంలోనైనా ఏదైనా ఓ విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలంటే అద్భుత సాధనం కథ. అమ్మమ్మ కాలంనాటి కథలు ఇప్పటి పిల్లలు వింటారా..! అనిఅనుమానించక్కరలేదు.. కాలం మారినా కథను మించిన విషయ వాహకం మరొకటి లేదని ఎప్పటికప్పుడు నిరూపితమవుతూనే ఉంది. అందుకే ప్రస్తుత యుగంలోనూ స్టోరీ టెల్లర్స్‌కి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ కథలు చెప్పడంలో ఒకొక్కరిదీ ఓ స్టైల్. అయితేనేం..చెప్పదలచుకున్న విషయం సూటిగాపిల్లలకు చేరుతోంది. ఈ అన్నివాహకాల్లోకీ బాగా ప్రసిద్ధి పొందింది మాత్రం తోలుబొమ్మలాట. మానవ మనుగడ ప్రారంభమయ్యాక..తొలి వినోద సాధనమైన ఈ కథా సాధనం ఇప్పటికీ మనుగడ సాగిస్తోందంటే అది ఎంతటి ప్రభావితమైనవాహకమో వేరే చెప్పనక్కరలేదు. ‘‘ఒకరోజు పిల్లి ఆకలితో అటూ ఇటు తిరుగుతుంది. ఒక దగ్గర ఒక కుండ కనిపించింది. అందులోని పాలు చూసి తాగడానికి ప్రయత్నించగా పిల్లి తల కుండలో ఇరుక్కుపోయింది. అప్పుడు పిల్లికి ఓ ఉపాయం వచ్చింది. కుండ తలతో తాను చాలా బాగా కనిపిస్తున్నాను అని అనుకుంది. అడవిలోకి వెళ్లి జపం చేస్తే తనను చూసిన వారికి సాధు పిల్లిలా కనిపిస్తానని భావించింది. అనుకున్నదే తడవుగా అడవిలోకి వెళ్లి జపం మొదలు పెట్టింది. అంతలో ఓ కుందేలు, పిట్ట రెండూ ఆ చెట్టు వద్దకు వచ్చి గొడవపడుతున్నాయి. అది చూసిన పిల్లి తాను సహాయం చేస్తానని చెప్పింది. అప్పుడు రెండూ చెట్టులో ఉన్న ఆహారం గురించి గొడవ పడుతున్నాయని తెలిసింది. అప్పుడు ఆ పిల్లి తనలా కుండలో తల దూర్చి జపం చేస్తే బాగుంటుందని పిల్లి చెప్పడంతో కుందేలు, పిట్ట కలిసి పిల్లికున్న కుండను తీసి అవి తగిలించుకుని జపం చేయడం మొదలు పెట్టాయి. ఇలా ఆ పిల్లి తన చతురతతో కుండలోంచి తల బయటికి తీసి ప్రాణాలు దక్కించుకుంది’’.. ఇది అమ్మమ్మ తన మనువరాలికి చెప్పే కథ. ఈ కథను తోలు బొమ్మలతో ప్రాణం పోసినట్లుగా చూపిస్తే ఎలా ఉంటుంది? అవును ఇప్పుడు తోలు బొమ్మలతో ఆకట్టుకునే కథలు చెప్పుకొస్తున్నారు. ఇందుకు బంజారాహిల్స్‌లోని సప్తపర్ణి, లామకాన్, రవీంద్రభారతి వేదికలుగా నిలుస్తున్నాయి. అంతరించిపోతున్న కథా సంస్కృతిని మళ్లీ తీసుకొస్తున్న కళాకారులు ముఖ్యంగా పిల్లలను బాగా ఆకట్టుకుంటున్నారు. కథకు తగ్గట్టుగా తోలుబొమ్మలు.. నేపథ్య సంగీతం.. చక్కని స్క్రీన్‌ప్లేతో కథ నడిపించే విధానం, పాత్రలు తెర వెనుక నీడగా కదలికలు పిల్లలకు కట్టిపడేస్తున్నాయి. ఇటీవల సప్తపర్ణి వేదికపై ఏకంగా వారం రోజుల పాటు తోలుబొమ్మలాట నిర్వహించారు. రామాయణ, మహాభారత ఘట్టాలతో పాటు పిల్లి, ఎలుక, ఉడుత, కుందేలు, సింహం, పులి తదితర కథలను చక్కగా వివరించారు. తోలుబొమ్మలాటపై వర్క్‌షాప్ కూడా జరుగుతున్నాయి. నోరి ఆర్ట్ అండ్ పపెట్రీ సంస్థ ద్వారా శర్మ నోరి, రత్నమాల నోరి, షెహనాజ్ బేగం, పరమేశ్వరి, అంబిక ఈ కథల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. నగరంలోని పేరెన్నికగన్న కళాకారులు రత్నమాల నోరి, శర్మ నోరి దర్శకత్వం వహిస్తున్నారు. సీహెచ్ రోహిత్‌కుమార్, రాంబాబు వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. కథకు తగ్గట్లుగా వెనుకాల వాయిస్ అందించడం కూడా కథలను రక్తి కట్టించి విజయవంతం చేసేందుకు కారణమవుతోంది. మంచి సంగీతం అందుకు తగినట్లు పాత్రల రూపకల్పన తోలుబొమ్మలాటను నేటి తరాన్ని ఆకట్టుకునేలా చేస్తున్నాయి. దాదాపు అంతరించిపోయిందనుకుంటున్న ఈ పురాతన కళను మళ్లీ వీక్షింపజేసేలా పలు సంస్థలు కృషి చేస్తున్నాయి. కొంతమంది తమ పాఠశాల కార్యక్రమాల్లో కూడా తోలుబొమ్మలాటను ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. నగరంలో ప్రస్తుతం వేసవి సందడి నెలకొనగా పిల్లల కోసం వారికి మరింత ఆసక్తి రేకెత్తించడానికి తోలుబొమ్మాలట ప్రదర్శనలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.