breaking news
State Budget session
-
‘పద్దు’పొడుపు!
దాదాపు కోటి మందికి పైగా జనాభా ఉన్న రాష్ట్ర రాజధాని నగరాన్ని పలు సమస్యలు వెంటాడుతున్నాయి. అరకొర నిధులతో పరిష్కారానికి ప్రణాళికలు అమలు చేస్తుంటే.. ఇంకోపక్క కొత్త సమస్యలు ఏటికేడాది పెరుగుతున్నాయి. బల్దియా నుంచి వస్తున్న ఆదాయం.. ఖర్చుకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. గ్రేటర్లో ఓ పక్క జనాభాకు తాగునీరు అందుతుంటే ఇంకో పక్కనున్నవారికి గొంతెండుతోంది. ఇందుకోసం జలమండలి పలు ప్రాజెక్టులను సిద్ధం చేసి కొన్నింటిని చేపట్టింది. అయితే, నిధులు లేక ఆయా ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. ఇంకోపక్క విశ్వనగరాన్ని నేర రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పోలీస్ ట్విన్ టవర్స్‌ను కూడా నిధుల గండం వెంటాడుతోంది. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు ఇప్పటి దాకా శాశ్వత కార్యాలయం అంటూ లేదు. ఇక నగరంలో ప్రతిష్టాత్మక ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల సంఖ్యకు తగ్గ మౌలిక వసతులు కూడా లేనిపరిస్థితి. ఇవన్నీ పరిష్కారం కావాలంటే ఆయా విభాగాలు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించే నిధులపైనే ఆశలు పెట్టుకున్నాయి. ఇప్పటికే ఆయా శాఖల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు సైతం పంపారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే నిధులతోనే ఆయా ప్రాజెక్టులు పట్టాలెక్కే పరిస్థితి. సోమవారం ప్రవేశపెట్టే ‘రాష్ట్ర బడ్జెట్’లో మహానగరానికి సింహభాగం నిధులు వస్తాయని అధికారులు సైతం అంచనా వేస్తున్నారు. హెచ్ఎండీఏ ఆశ నెరవేరేనా! సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు ఈసారైనా బడ్జెట్లో సరైన కేటాయింపులు దక్కుతాయా! అని ఆశగా ఎదురుచూస్తోంది. గతేడాది ఔటర్ రింగ్ రోడ్డు జైకా రుణాలు, ఔటర్ రింగ్ రోడ్డు అన్యూటీ వర్క్స్(బీవోటీ) కోసం రూ.1100 కోట్లు అడిగితే.. రూ.455 కోట్లు మంజూరు చేసి చివరకు కేవలం రూ.121.25 కోట్లు మాత్రమే హెచ్ఎండీఏ బ్యాంక్ ఖాతాలో వేసింది. ఈసారి అడిగినన్ని నిధులు కేటాయించడంతో పాటు త్వరితగతిన విడుదల చేస్తే బాగుంటుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే, గతేడాది అర్థిక శాఖ విడుదల చేయాల్సిన జైకా రుణం 329.50 కోట్లతో పాటు ఈ ఏడాదికి రూ.146.72 కోట్లు, రాష్ట్ర వాటా రూ.71.43 కోట్లు అంటే మొత్తంగా రూ.547.65 కోట్లు జైకా రుణం కింద ఇవ్వాలనే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచింది. అలాగే 2019–20కి ఔటర్ రింగ్ రోడ్డు బీవోటీ అన్యూటీస్ కింద రూ.1300.14 కోట్లు కావాలంటూ హెచ్ఎండీఏ ప్రతిపాదన సిద్ధం చేసి ఇచ్చింది. 2014 నుంచి 17 వరకు రూ.600.26 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, 2019–20 ఏడాదికి రూ.332.58 కోట్లు కావాలని అడగడంతో పాటు ఐదు కొత్త రేడియల్ రోడ్లు, కొహెడ లేఅవుట్ కోసం రూ.367.30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో కేటాయించాలని అభ్యర్థనలు పంపింది. జలమండలి సంగతేంటి? సాక్షి,సిటీబ్యూరో: మహానగర దాహార్తిని తీరుస్తున్న జలమండలికి తాజా రాష్ట్ర బడ్జెట్లో నిధుల వరద పారుతుందని అధికారులు ఆశిస్తున్నారు. అయితే, ఈసారి బోర్డు వర్గాలు బడ్జెట్ రూ.2300 కోట్ల మేర ప్రతిపాదించిచాయి. ప్రధానంగా రోజూ నీళ్లు, కేశవాపూర్ భారీ స్టోరేజీ రిజర్వాయర్ నిర్మాణం, సీవరేజీ మాస్టర్‌ప్లాన్ అమలు, నగరం నలుమూలల 59 వికేంద్రీకృత మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న గ్రామాల దాహార్తిని తీర్చేందుకు ఓఆర్ఆర్ ఫేజ్–2 తాగునీటి పథకం, ఓర్ఆర్ఆర్ చుట్టూ వాటర్‌గ్రిడ్ ఏర్పాటు వంటి భారీ పథకాలు చేపట్టాల్సి ఉంది. జలమండలి ప్రస్తుతం గ్రేటర్లో రోజూ 9.85 లక్షల నల్లాలకు 460 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోంది. ఆశించిన మేర ప్రభుత్వం నిధులు ఇస్తే పాతనగరం, ప్రధాననగరం, శివార్లలో సరఫరా వ్యవస్థను విస్తరించి, నూతన రిజర్వాయర్లను నిర్మించి ప్రతి ఇంటికీ రోజూ నీళ్లందిచే అవకాశాలుంటాయని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ♦ ఇక శామీర్‌పేట్ సమీపంలోని కేశవాపూర్‌లో 10 టీఎంసీల గోదావరి జలాల నిల్వ సామర్థ్యంతో భారీ స్టోరేజీ రిజర్వాయర్‌ను నిర్మించాల్సి ఉంది. ప్రధానంగా బొమ్మరాస్పేట్ నీటిశుద్ధి కేంద్రం నిర్మాణానికి అవసరమైన దేవాదాయ భూముల సేకరణకు, కొండపోచమ్మ సాగర్ నుంచి కేశవాపూర్‌కు రావాటర్ పైపులైన్ ఏర్పాటుకు, బొమ్మరాస్పేట్ నుంచి గోదావరి రింగ్‌మెయిన్ వరకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసేందుకు భారీ పైపులైన్ల ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇక ఓఆర్ఆర్ పరిధి లోపల నిత్యం వెలువడుతోన్న 2133 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసేందుకు 59 ప్రాంతాల్లో శుద్ధి కేంద్రాలు, మురుగునీటి పారుదల పైప్లైన్ల ఏర్పాటు చేస్తే మురుగు అవస్థలు తీరతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ♦ కృష్ణా రెండు, మూడు దశలతో పాటు గోదావరి తాగునీటి పథకం, హడ్కో నుంచి గతంలో సేకరించిన రుణ వాయిదాలు, వడ్డీ చెల్లింపునకు రూ.800 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ♦ ఓఆర్ఆర్ చుట్టూ 158 కి.మీ మార్గంలో భారీ రింగ్‌మెయిన్ పైపులైన్ల ఏర్పాటు ద్వారా జలహారం ఏర్పాటుచేసే పథకానికి నిధులు సమకూరుతాయని అంచనా వేస్తున్నారు. ఈ పథకం పూర్తయితే మహానగర వ్యాప్తంగా ఒక చివరి నుంచి మరో చివరకు నిరంతరాయంగా కృష్ణా, గోదావరి జలాలను సరఫరా చేయవచ్చని చెబుతున్నారు. చికిత్స చేయాల్సిందే.. పెద్దాస్పత్రులకు రూ.700కోట్లకు పైగా అవసరం సాక్షి, సిటీబ్యూరో: ప్రజారోగ్యానికి నిధుల లేమి పెద్ద అడ్డంకిగా మారింది. ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్పటికీ.. విడుదల చేయకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఆస్పత్రుల పరిస్థితి ఉంది. శిథిలావస్థకు చేరిన ఉస్మానియా ఆస్పత్రిలో రూ.200 కోట్లతో రెండు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు పైసా కూడా విదల్చలేదు. నగరానికి నాలుగు వైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించినా ఒక్క ఆస్పత్రి కోసం కూడా అడుగు ముందుకు పడలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం2014–15 వార్షిక బడ్జెట్లో ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. ఆస్పత్రుల వారిగా బడ్జెట్ కేటాయించింది. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు రూ.100 కోట్ల చొప్పున కేటాయించింది. బడ్జెట్లో 60 శాతం నిధులను వైద్య పరికరాల కొనుగోలుకే కేటాయించింది. ఆ తర్వాత బడ్జెట్లో ఆశించిన స్థాయిలో కేటాయింపులు చేయకపోవడమే గాక ప్రజా వైద్యాన్ని గాలికొదిలేసింది. ప్రస్తుతం అనేక మంది నగర ప్రజలు ప్రమాదకరమైన వైరల్ జ్వరాలతో బాధపడుతూ ఆస్పత్రులకు చేరుకుంటున్నారు. వారికి మెరుగైన వైద్యం సంగతేమో కానీ పడకలు దొరకని పరిస్థితి. కొత్త భవనాలు నిర్మించాలన్నా.. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు ఏర్పాటు చేయాలన్నా నగరంలోని ఉస్మానియా, గాంధీ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రులకు వైద్య సిబ్బంది వేతనాలు, మందులు కొనుగోలు ఖర్చులు పోను బడ్జెట్లో అదనంగా కనీసం రూ.500 కోట్లు కేటాయించాల్సిన అవసరం ఉందని వైద్య వర్గాలు అభిప్రాయపడుతుయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత నిమ్స్‌కు నగదు చెల్లింపు రోగుల సంఖ్య భారీగా తగ్గింది. దీంతో ఆస్పత్రి ఆదాయం కూడా పడిపోయింది. వైద్య సిబ్బంది నెలవారి వేతనాలు చెల్లింపులు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఫలితంగా ఆస్పత్రి సేవలను ఇతర జిల్లాలకు విస్తరించలేని పరిస్థితి. నిమ్స్‌లో రోగులకు మెరుగైన వైద్యం అందాలంటే ఏటా రూ.200 కోట్లకు పైగా బడ్జెట్లో కేటాయించాలి. మరి ఈ బడ్జెట్లోనైనా ప్రభుత్వం నిధులిస్తే ప్రజారోగ్యం కదుటపడే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీని ఆదుకుంటారా! సాక్షి,సిటీబ్యూరో: విశ్వనగరం కల సాకారం కావాలంటే గ్రేటర్లో అభివృద్ధి పనులకు రూ.వేల కోట్ల నిధులు అవసరం. ఎస్సార్డీపీలో భాగంగా చేపట్టిన ఫ్లై ఓవర్లు వంటి అభివృద్ధి పనులు, ఇప్పటికే పూర్తయిన వాటితో సహా దాదాపు రూ.7 వేల కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి కోసం జీహెచ్ఎంసీ ఇప్పటికే రూ.495 కోట్లను బాండ్ల ద్వారా తీసుకుంది. మళ్లీ అప్పులు చేస్తే జీహెచ్ఎంసీ సిబ్బంది జీతాలు కూడా కష్టమేనని, ఈ పనులకు ప్రభుత్వమే నిధులు విడుదల చేయాలనే అభిప్రాయాలున్నాయి. ప్రారంభమైన పనులు.. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం ఈ పనులకు రూ.1000 కోట్లు అవసరం. ♦ లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం రూ.9,350 కోట్లు అవసరం కాగా ఇప్పటి వరకు రూ.4,350 కోట్లు చెల్లించారు. మిగతా రూ.5000 కోట్లు విడుదల చేయనేలేదు. ♦ నగరంలో వానొస్తే చెరువులయ్యే రోడ్ల దుస్థితి మారాలంటే కిర్లోస్కర్ కమిటీ, ఓయెంట్స్ సొల్యూషన్స్ నివేదికల మేరకు రూ.10 వేల కోట్లు అవసరం. దాని బదులు ఇటీవల జేఎన్టీయూ నిపుణుల నివేదిక మేరకే అయినా ప్రధాన మార్గాల్లో సమస్య పరిష్కారానికి రూ.4వేల కోట్లు కావాలి. రోడ్ల దుస్థితి మారాలంటే ప్రధాన మార్గాల్లోని దాదాపు 300 కి.మీ వైట్ టాపింగ్ రోడ్లు వేయాలి. డక్ట్‌లతో సహా వీటి కోసం దాదాపు రూ.900 కోట్లు అవసరం. ♦ చెరువుల ప్రక్షాళన, అభివృద్ధి పనులకు కూడా భారీగా నిధులు అవసరమైనప్పటికీ, ఆర్థిక సంవత్సరంలో చేయగలిగిన పనులకు కనీసం రూ.300 కోట్లు కావాలి. ♦ ఇవిగాక ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్పనకు జీహెచ్ఎంసీకి తగిన నిధులు అందితేనే నగర ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయి. జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో ప్రభుత్వంపైనే కోటి ఆశలున్నాయి. ♦ రాబోయే మూడేళ్లలో రూ.50 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తామని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో జీహెచ్ఎంసీకి, నగరానికి భారీ నిధులు కేటాయించగలదని ఆశిస్తున్నారు. ట్విన్ టవర్స్‌కు ఎంత? ప్రభుత్వం నగర పోలీసు విభాగానికి రాష్ట్ర బడ్జెట్లో పెద్దపీట వేస్తూ వస్తోంది. హోంశాఖకు ఇచ్చే దాంట్లో సింహభాగం సిటీకే దక్కుతోంది. బంజారాహిల్స్ ప్రాంతంలో ‘ట్విన్ టవర్స్’ పేరుతో నిర్మించనున్న అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) ఈ ఏడాది పూర్తి కావాల్సి ఉండటంతో పాటు దాని నిర్మాణ వ్యయం సైతం పెరడటంతో ఈ బడ్జెట్లో కేటాయింపులు కీలకంగా మారాయి. సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాజెక్టుకు, దానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవడానికి ఈ బడ్జెట్లో పోలీసు అధికారులు ప్రతిపాదనలు చేస్తున్నారు. బంజారాహిల్స్‌లోని ఏడెకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఐసీసీసీని ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంగా నిర్ణయించారు. ఈ భవనానికి 2015 నవంబర్ 22న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. నగర ప్రజల భద్రతే ప్రామాణికంగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా అందుబాటులోకి తేనున్న ఈ పోలీస్ ‘ట్విన్ గ్లాస్ టవర్స్’ నిర్మాణానికి మొత్తం రూ.1002 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. అది మరో రూ.400 కోట్ల వరకు పెరగడంతో ఈసారి కేటాయింపులు కీలకంగా మారాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో విస్తరించి ఉన్న నగరం మొత్తాన్ని సీసీ కెమెరా నిఘాలో ఉంచేందుకు ప్రభుత్వం, పోలీసు విభాగం ముమ్మర కసరత్తు చేస్తోంది. మూడు కమిషనరేట్లలోనూ కలిపి పది లక్ష సీసీ కెమెరాల ఏర్పాటును లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. శరవేగంగా నడుస్తున్న ఈ ప్రాజెక్టు కోసం భారీగానే కేటాయించాల్సి ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నగర పోలీసు అధికారులు సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్తున్నారు. దీనికోసం పోలీసుస్టేషన్ల స్వరూప, స్వభావాలను పూర్తిగా మార్చేస్తున్నారు. ఆధునిక హంగులతో ఠాణాల నిర్మాణం, ఉన్నవాటికి అదనపు సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి ఉంది. ట్రాఫిక్ నిర్వహణ కోసం ‘ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం’ (ఐటీఎంఎస్) పేరుతో అత్యాధునిక వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రధాన కూడళ్లలో క్షేత్రస్థాయి సిబ్బంది ప్రమేయం లేకుండా ట్రాఫిక్ నిర్వహణ, ఉల్లంఘనుల గుర్తింపు, సేఫ్ అండ్ ఫాస్ట్ జర్నీ లక్ష్యాలుగా ఉన్న ఈ ప్రాజెక్టుకు తుది దశకు చేరింది. దీంతో పాటు జీపీఎస్ టెక్నాలజీతో పనిచేసే డిజిటల్ కెమెరాలు, 3జీ కనెక్టివిటీతో పనిచేసే చెస్ట్ మౌంటెడ్ కెమెరాలు, ఇతర ఊపకరణాలకు నిధులు కేటాయించాలి. మెట్రోకు నిధులొచ్చేనా? తాజా రాష్ట్ర బడ్జెట్లో నగర మెట్రో ప్రాజెక్టుకు సైతం రూ.500 కోట్ల మేర కేటాయింపులు జరుగుతాయని మెట్రో రైలు వర్గాలు అంచనా వేస్తున్నాయి. మెట్రో కారిడార్లలో సుందరీకరణ పనులు, స్ట్రీట్ ఫర్నిచర్, ఫుట్‌పాత్‌లు, పాదచారుల దారులు, గార్డెనింగ్ తదితర పనులు చేపట్టడంతో పాటు మెట్రో ప్రాజెక్టు రెండోదశను రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు విస్తరించేదుకు అవసరమైన ఆస్తుల సేకరణకు ఈ బడ్జెట్లో ఆర్థికసాయం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాచకొండకు అండ దొరికేనా! సాక్షి,సిటీబ్యూరో: ఉమ్మడి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పునర్విభజనలో భాగంగా మూడేళ్ల క్రితం ఏర్పాటైన ‘రాచకొండ పోలీస్ కమిషనరేట్’కు ఇప్పటికీ శాశ్వత కార్యాలయం లేదు. రెండున్నరేళ్లుగా గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుంచే కార్యకలాపాలు సాగించినా ఎల్బీనగర్, మల్కాజ్గిరి, యాదాద్రి జోన్ల పోలీసు సిబ్బందికి దూరం కావడంతో తాత్కాలిక ప్రాతిపదికన ఆరు నెలల క్రితం నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మేడిపల్లిలో రాచకొండ పోలీసు కమిషనరేట్ శాశ్వత కార్యాలయ నిర్మాణం కోసం హెచ్ఎండీఏ గతేడాది 56 ఎకరాలు కేటాయించింది. అయితే కొందరు రైతులు ఆ భూమిని ప్రభుత్వం తమకు ఇచ్చిందంటూ హైకోర్టుకు వెళ్లినా ఆధారాలు చూపకపోవడంతో రైతులు వెనక్కి తగ్గారు. ఏడాది పాటు వివాదంలో ఉన్న భూమి ఎట్టకేలకు ఓ కొలిక్కి రావడంతో ఇటీవల రాచకొండ పోలీసులు ఆ భూమిలో మొక్కలు నాటారు. అర్బన్, గ్రామీణ ప్రాంతాల రాచకొండ పోలీస్ కమిషనరేట్ శాశ్వత కార్యాలయానికి ఈసారైనా ప్రభుత్వం నిధులు కేటాయిస్తే కష్టాలు తీరతాయి. శాంతిభద్రతలకు ప్రాధాన్యమిచ్చే రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో తప్పక శాశ్వత నిర్మాణం కోసం భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తుందని పోలీసు ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ముఖ్యమైన ఐటీకారిడార్‌లో మరింత భద్రత కోసం అవసరమయ్యే ఆధునిక సాంకేతికతకు నిధులు కేటాయించాలని పోలీసులు ప్రతిపాదించారు. -
15న రాష్ట్ర బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను 12 రోజులు నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 15న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. సోమవారం అసెంబ్లీ లో గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత.. స్పీకర్ ఎస్.మధుసూదనాచారి అధ్యక్షతన ఆయన కార్యాలయంలో బీఏసీ సమావేశం జరిగింది. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్, కడియం, ఈటల, పోచారం, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, భట్టివిక్రమార్క, ఎంఐఎం నేత అక్బరుద్దీన్, బీజేï ఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, టీడీఎల్పీ నేత సండ్ర వెంకటవీరయ్య, సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య ఈ భేటీలో పాల్గొన్నారు. మూడు రోజులు సెలవులు: గవర్నర్ ప్రసంగంతో సోమవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు.. ఈ నెల 27 దాకా జరుగుతాయి. 13, 14వ తేదీల్లో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, ప్రభుత్వ వివరణ ఉంటాయి. 15న బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 16, 17, 18 తేదీల్లో ఉగాది సెలవులు. 19న బడ్జెట్‌పై చర్చ, ఆర్థిక మంత్రి వివరణ, 20 నుంచి 25 వరకు డిమాండ్లు, పద్దుల మీద చర్చ, వివరణలు, ఓటింగ్ ఉంటాయి. 25న ఆదివారమైనా కూడా సభను నిర్వహించాలని నిర్ణయించారు. 26న శ్రీరామనవమి సందర్భంగా సెలవు. 27న ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదిస్తారు. -
నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో 2018–19 బడ్జెట్‌ను ఈ నెల 8న ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సోమవారం ఉదయం 9.30కు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడనుంది. ఇవి 14వ అసెంబ్లీ 11వ సమావేశాలు కాగా, శాసన మండలికి 13వ సమావేశాలు. ఈ సమావేశాలకు ప్రతిపక్షం వైఎస్సార్సీపీ హాజరవుతుందా, లేదా అన్నది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవడంపై ఆధారపడి ఉంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేవరకూ అసెంబ్లీకి హాజరు కాబోమని వైఎస్సార్సీపీ గతంలోనే ప్రకటించింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు ఆ పార్టీ సభ్యులు శాసనసభ, మండలి గత సమావేశాలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి, శాసన మండలిలో పార్టీ ఫ్లోర్ లీడర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆదివారం స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలసి వినతిపత్రం అందజేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు రెండున్నరేళ్ల జైలు శిక్ష పడినందున, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆయనను అనర్హుడిగా ప్రకటించాల్సి ఉన్నా స్పీకర్ ఇప్పటివరకూ చర్యలు చేపట్టలేదు. ఈ అంశాన్ని కూడా వైఎస్సార్సీపీ నేతలు స్పీకర్ వద్ద ప్రస్తావించారు. దెందులూరు స్థానం ఖాళీ అయినట్లుగా ప్రకటించాలని కోరారు. ఫిరాయింపుదార్లపై చర్యలు చేపడితే తమ సభ్యులంతా మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులపై స్పీకర్ చర్యలు తీసుకోకపోతే ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీ హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే జరిగితే రాష్ట్ర శాసనసభ, శాసన మండలి చరిత్రలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రధాన ప్రతిపక్షం లేకుండా నిర్వహించడం ఇదే తొలిసారి కానుంది. ఈ పరిణామం పట్ల రాజ్యాంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదని అంటున్నారు. ప్రతిపక్షం లేకపోతే సభలో అధికార పక్షం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మంచి పరిణామం కాదని చెబుతున్నారు. -
గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ..
-
గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ
⇒ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు ప్రసంగించేందుకు రావాల్సిందిగా ఆహ్వానం ⇒ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి,బడ్జెట్ ప్రాధాన్యాలపై చర్చ! ⇒ బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ జారీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 10న ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, మండలి సమావేశం కానున్నాయి. ఏడో విడత అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం శనివారం ఉత్తర్వులు జారీచేశారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. బడ్జెట్ సమావేశాల తొలి రోజు ప్రసంగానికి గవర్నర్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించే అంశాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వచ్చే వార్షిక బడ్జెట్ ప్రాధాన్యాలను గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించినట్లు తెలిసింది. దీంతో పాటు పెండింగ్‌లో ఉన్న విభజన వివాదాలపై ఈ నెల 9న గవర్నర్ సమక్షంలో జరిగే ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీ సమావేశంపై కూడా చర్చించినట్లు సమాచారం. నేడు రాజ్‌భవన్‌లో సిబ్బంది క్వార్టర్స్ ప్రారంభోత్సవం రాజ్‌భవన్‌లో కొత్తగా నిర్మించిన సిబ్బంది క్వార్టర్స్‌ను నేడు ప్రారంభించనున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ గృహ సముదాయాన్ని ప్రారంభించే ముహూర్తం ఖరారు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులతో పాటు రాజ్‌భవన్ సిబ్బంది పాల్గొననున్నారు. గతేడాది ఫిబ్రవరి 17న రాజ్‌భవన్ సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణానికి గవర్నర్ దంపతులు, సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. శిథిలావస్థలో ఉన్న క్వార్టర్ల స్థానంలోనే రూ.97.50 కోట్లతో కొత్త క్వార్టర్లు నిర్మించారు. 185 మంది సిబ్బంది ఉండేలా క్వార్టర్లతో పాటు పాఠశాల, కమ్యూనిటీ హాల్, సెక్యూరిటీ బ్యారెక్‌ను నిర్మించారు. -
13న బడ్జెట్!
9 లేదా 10 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 9 లేదా 10 నుంచి ప్రారంభం కాను న్నాయి. 13న అసెంబ్లీ బడ్జెట్‌ను ప్రవే శపెడతారు. అయితే సమావేశాల తేదీలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నుంచి ఇంకా గ్రీన్‌సిగ్నల్ రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 10 నాటికి బడ్జెట్ ముద్రణ ప్రతులను సిద్ధం చేయాలని సీఎం ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. మార్చి 8 నుంచి సమావేశాలు ప్రారంభించి, 10న బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రాథ మికంగా తేదీలను ఖరారు చేసింది. కానీ బడ్జెట్ తుది కసరత్తులో జాప్యం జరగడంతో సమావేశాలు ఒకట్రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. బడ్జెట్‌కు తుది కసరత్తు: శాఖలవారీగా తమకు అందిన ప్రతిపాదనలతో పాటు ఇటీ వల వరుసగా జరిగిన సమీక్షల్లో సీఎం చేసిన సూచనలకు అనుగుణంగా ఆర్థిక శాఖ అధికా రులు బడ్జెట్‌కు తుది రూపమిచ్చే పనిలో ఉన్నారు. శాఖలు, పథకాల వారీగా కేటా యింపులు కొలిక్కిరావటంతో సీలింగ్ బడ్జెట్ ను ఖరారు చేశారు. అన్ని శాఖలు, హెచ్‌వోడీ లకు బుధవారం సాయంత్రంలోగా సీలింగ్ బడ్జెట్ వివరాలను అందించాలని నిర్ణయించా రు. ఆ బడ్జెట్‌కు అనుగుణంగా శాఖలు ఇచ్చే సమాచారంతో తుది కేటాయింపులు, బడ్జెట్ పద్దులు రూపొందిస్తారు. అనంతరం బడ్జెట్ ప్రతుల ముద్రణకు కనీసం వారం పడుతుం దని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక శాఖకు పోలీస్ భద్రత... సచివాలయంలోని డీ బ్లాక్‌లోని ఆర్థిక శాఖకు ప్రభుత్వం పోలీస్ భద్రతను ఏర్పాటు చేసిం ది. మంగళవారం నుంచి గేట్లను మూయటం తోపాటు ప్రధాన ద్వారం వద్ద పోలీసులను కాపలాగా ఉంచింది. బడ్జెట్ తయారీ విభా గంలో పనిచేసే అధికారులు, సిబ్బంది విధు లకు ఆటంకం కలుగకుండా సందర్శకులు, మీడియా ప్రతినిధులపై ఆంక్షలు విధించింది. సంక్షేమానికే పెద్దపీట: మంత్రి ఈటల అణగారిన వర్గాలను ఆదుకునేలా బడ్జెట్ ఉం టుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ‘‘19–20 శాతం ఆర్థికవృద్ధి ఉంది. అదే స్థాయిలో బడ్జెట్ కూడా పెరుగుతుంది. జీఎస్టీ, నోట్ల రద్దు ప్రభావం ఉన్నా గత బడ్జెట్ కంటే ఈసారి బడ్జెట్ భారీగానే ఉంటుంది..’’ అని చెప్పారు. మంగళవారం సచివాలయంలో ట్రెజరీ ఉద్యోగుల సంఘం డైరీని ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘‘కొత్త రాష్ట్రంలో ప్రజలు చాలా ఆశలు, ఆకాంక్షలతో ఉన్నారు. వాటన్నింటినీ నెరవేర్చడానికి మనం కృషి చేయాలి. ఆర్థిక ప్రగతిలో దేశంలో నంబర్ వన్ స్థానం సంపా దించుకున్నాం. దీన్ని నిలబెట్టుకోవాలి. కష్టప డి పనిచేయాలి’’ అని పేర్కొన్నారు.