breaking news
Startup System
-
స్టార్టప్‌లకు ఫండింగ్ బూస్ట్
ముంబై: దేశీ స్టార్టప్ వ్యవస్థలోకి నిధుల ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రస్తుత క్యాలండర్ ఏడాది(2022) తొలి మూడు నెలల్లోనే ఏకంగా 14 యూనికార్న్‌లు ఆవిర్భవించాయి. వెరసి వరుసగా మూడో క్వార్టర్లోనూ యూనికార్న్‌ల స్పీడ్ కొనసాగింది. పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక ప్రకారం 334 లావాదేవీల ద్వారా 10 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 75,000 కోట్లు) తాజా పెట్టుబడులు లభించాయి. బిలియన్ డాలర్ల విలువను అందుకున్న స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా వ్యవహరించే సంగతి తెలిసిందే. కాగా.. మార్చిచివరికల్లా దేశీయంగా వీటి సంఖ్య 84ను తాకింది. ఒక త్రైమాసికంలో 10 బిలియన్ డాలర్ల నిధులు దేశీ స్టార్టప్ వ్యవస్థలోకి ప్రవహించడం వరుసగా ఇది మూడోసారికావడం విశేషం! వెరసి ఈ క్యూ1(జనవరి–మార్చి)లో స్టార్లప్‌లు మొత్తం 10.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. సాస్ హవా నివేదిక ప్రకారం సాఫ్ట్‌వేర్‌నే సర్వీసులుగా అందించే(సాస్) కంపెనీలు అత్యధికంగా పెట్టుబడులను అందుకున్నాయి. 3.5 బిలియన్ డాలర్లకు మించిన నిధులు ప్రవహించాయి. దీంతో క్యూ1లో ఐదు యూనికార్న్‌లు సాస్ విభాగంనుంచే ఆవిర్భవించాయి. ప్రపంచ ఆర్థిక వాతావరణం అనిశ్చితిగా ఉన్నప్పటికీ దేశీ స్టార్టప్ వ్యవస్థ పెట్టుబడులను ఆకట్టుకుంటున్నట్లు కన్సల్టెన్సీ స్టార్టప్స్ విభాగం చీఫ్ అమిత్ నాకా పేర్కొన్నారు. వృద్ధికి పెట్టుబడులు అవసరమైన స్థాయిలో నిధులు లభించడం ప్రస్తావించదగ్గ అంశమని తెలియజేశారు. సుపరిపాలన దేశీయంగా స్టార్టప్‌లు భారీ వృద్ధిని అందుకుంటున్న నేపథ్యంలో కార్పొరేట్ సుపరిపాలనకు ప్రాధాన్యత పెరుగుతున్నట్లు అమిత్ పేర్కొన్నారు. దీంతో స్టార్టప్‌లకు కార్పొరేట్ గవర్నెన్స్‌పై మార్గదర్శకాల రూపకల్పనపై చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. వ్యవస్థాగతంగా విస్తరణపై ఆశలున్న కంపెనీలు ఇందుకు తగిన విధంగా సన్నద్ధంకావలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. సాస్ ఎకోసిస్టమ్‌లోకి గత మూడేళ్లలోనే మూడు రెట్లు అధిక పెట్టుబడులు తరలిరాగా.. కరోనా మహమ్మారి ఇందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సాహాన్నిచ్చినట్లు వివరించారు. మారుమూల ప్రాంతాల నుంచీ పనిచేసే పరిస్థితులతోపాటు, ఉత్పాదకత పెరగడం, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రాధాన్యత ఇందుకు సహకరిస్తున్నాయి. 15 సంస్థలు సాస్ విభాగంలో గత మూడేళ్ల కాలంలో 15 యూనికార్న్‌లు పుట్టుకొచ్చాయి. ఈ జాబితాలో డార్విన్‌బాక్స్, ఫ్రాక్టల్, యూనిఫోర్, హసురా, అమగీ మీడియా ల్యాబ్స్ తదితరాలున్నాయి. 2021 చివర్లో ఫ్రెష్‌వర్క్స్ నాస్డాక్లో బంపర్ లిస్టింగ్‌ను సాధించడంతో సాస్ సంస్థలకు కొత్త జోష్ వచ్చినట్లు అమిత్ ప్రస్తావించారు. పలు కంపెనీలు పబ్లిక్ లిస్టింగ్‌పై దృష్టిపెడుతున్నట్లు పేర్కొన్నారు. విలీనాలు.. దేశీ స్టార్టప్ వ్యవస్థలో విలీనాలు, కొనుగోళ్ల(ఎంఅండ్ఏ) లావాదేవీలు క్యూ1లో ఈకామర్స్ విభాగంలో అధికంగా జరిగాయి. క్యూర్‌ఫుడ్స్, మెన్సా బ్రాండ్స్, గ్లోబల్బీస్, మైగ్లామ్ ఎంఅండ్ఏలో భాగమయ్యాయి. వీటి కీలక వ్యాపార వ్యూహాలకు ప్రాధాన్యత లభించగా.. అప్స్కాలియో, ఈవెన్‌ఫ్లో తదితర కంపెనీలు సైతం రేసులో చేరాయి. 38 శాతం ఎంఅండ్ఏలు ఈకామర్స్, డైరెక్ట్‌టు కన్జూమర్ విభాగంలో నమోదుకాగా.. 22 శాతం డీల్స్‌కు సాస్ రంగంలో తెరలేచింది. వృద్ధి, చివరి దశ స్టార్టప్‌లు విలువరీత్యా 89 శాతం పెట్టుబడులు అందుకోగా.. మొత్తం లావాదేవీల్లో 44 శాతం వాటాను ఆక్రమించాయి. గత మూడు త్రైమాసికాలలో వృద్ధిస్థాయి నిధులు 6.5–7 బిలియన్ డాలర్లకు చేరగా.. సగటు టికెట్ పరిమాణం 5.5–7 కోట్ల డాలర్లుగా నమోదైంది. తొలి దశ పెట్టుబడుల విషయానికివస్తే 4 మిలియన్ డాలర్ల సగటు టికెట్ పరిమాణంలో 76.1 కోట్ల డాలర్లు లభించాయి. లావాదేవీల పరిమాణంలో ఇవి 55 శాతంగా నివేదిక తెలియజేసింది. -
భారత్‌లో స్టార్టప్‌లకు జోష్..
నాస్కామ్ సదస్సులో ప్రధాని మోదీ - స్టార్టప్ వ్యవస్థలో సొంతముద్ర... - యువత శక్తిసామర్థ్యాలు, సృజనాత్మకతే దన్ను - కొత్త వెంచర్లకు సర్వత్రా ఆసక్తి... శాన్‌జోస్: భారత్‌లో స్టార్టప్‌ల వ్యవస్థ సొంతశైలిలో దూసుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో యువత శక్తిసామర్థ్యాలు, సృజనాత్మకత, ఔత్సాహిక ధోరణే స్టార్టప్‌లు పుట్టుకొచ్చేందుకు దన్నుగా నిలుస్తున్నాయన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా నాస్కామ్ నిర్వహించిన స్టార్టప్ సదస్సులో మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం లింక్డ్ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ కూడా పాల్గొన్నారు. ‘భారత్ భారీస్థాయి మార్కెట్‌తో వృద్ధిపథంలో పయనిస్తోంది. ప్రతిఒక్క రంగంలో కూడా అపారమైన అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. నవకల్పన, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి భారత్, అమెరికాల మధ్య ఎప్పటినుంచో సహజసిద్ధమైన భాగస్వామ్యం ఉంది. ఇక్కడ కొత్త వెంచర్ల ఏర్పాటుకు అన్నిరకాల ప్రోతాహకాలు, సంస్థలు, అన్నింటికంటే ముఖ్యంగా అమితమైన ఆసక్తి నెలకొంది. ఇన్వెస్టర్లు కూడా రిస్క్ తీసుకోవడానికి వెనుకాడటం లేదు. గడిచిన కొద్ది సంవత్సరాల్లో భారత్‌లో స్టారప్ వెంచర్లు భారీగా పుట్టుకొచ్చాయి. ఉద్యోగాల కల్పన, ఎంట్రప్రెన్యూర్షిప్తో పాటు దేశ ఆర్థికాభివృద్దికి ఈ స్టార్టప్ విప్లవం ఎంతగానో దోహదం చేస్తుందని భావిస్తున్నా’ అని మోదీ వ్యాఖ్యానించారు. భారీ మార్కెట్, అపార అవకాశాలు... ఈ కార్యక్రమానికి ముందు ఇండియా-యూఎస్ కనెక్ట్ 2015 అనే మరో సదస్సు జరిగింది. టీఐఈ సిలికాన్ వ్యాలీ, ఐఐఎం అహ్మదాబాద్‌కు చెందిన సీఐఐఈ ఇండియాలు దీన్ని నిర్వహించాయి. ఇందులో భారత్, అమెరికాలకు చెందిన చెరో 40 స్టార్టప్ సంస్థలు పాల్గొన్నాయి. ‘భారత్‌లోని అద్భుతమైన స్టార్టప్‌ల బృందం ఇక్కడ కొలువుదీరింది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పునరుత్పాదక ఇంధనం, భద్రత, సమ్మిళిత ఆర్థికాభివృద్ధి, అందరికీ పరిశుద్ధమైన తాగునీరు కల్పన వంటి అనేక అంశాల్లో టెక్నాలజీ వినియోగం ద్వారా సమూలు మార్పులకు ఈ సంస్థలు కృషిచేస్తున్నాయి. స్టార్టప్లంటే కేవలం వ్యాపార విజయాలకే పరిమితం కాదు. సామాజికంగా కూడా వినూత్న మార్పులకు ఇవి బలమైన ఉదాహరణలు గా నిలుస్తున్నాయి. భారత్‌లో ఇప్పుడు దాదాపు 100 కోట్ల మంది మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం కూడా దూసుకెళ్తోంది. డిజిటల్ ఇండియా ఆలోచన రూపుదిద్దుకోవడానికి ఇవే ప్రేరణ’ అని మోదీ వివరించారు. ఏడు స్టార్టప్ ఎంవోయూలు... భారత్‌లో స్టార్టప్‌లను మరింతగా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఇరు దేశాలకు చెందిన వివిధ సంస్థల మధ్య ఏడు అవగాహన ఒప్పందాలు(ఎంఓయూ) కుదిరాయి. వివరాలివీ... - సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ ప్లాట్‌ఫామ్స్, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఫర్ క్వాంటిటేటివ్ బయోసెన్సైస్ల మధ్య తొలి ఎంఓయూ కుదిరింది. సైన్స్ ఆధారిత ఎంట్రప్రెన్యూర్షిప్, రీసెర్చ్, విద్య, వ్యాపారాలను ప్రోత్సహించడమే దీని ప్రధానోద్దేశం. - ప్రకాశ్ ల్యాబ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలు కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి. - భారత్, సిలియాన్ వ్యాలీలలో టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్షిప్లకు తగిన పరిస్థితులను కల్పించే ఉద్దేశంతో నాస్కామ్, ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్లు కలిసి పనిచేయనున్నాయి. - ఐఐఎం అహ్మదాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్(సీఐఐఈ), కాలిఫోర్నియా యూని వర్సిటీ హాస్ బిజినెస్ స్కూల్‌కు చెందిన లెస్టర్ సెంటర్ ఫర్ ఎంట్రప్రెన్యూర్షిప్ల మధ్య కూడా ఒప్పందం కుదిరింది. స్టార్టప్స్ ఇంక్యుబేషన్, ఇతరత్రా అంశాల్లో సహకరించుకోవడం దీని లక్ష్యం. - లాస్ ఏంజెలిస్ క్లీన్టెక్ ఇంక్యుబేటర్‌తో కూడా సీఐఐఈ జట్టుకట్టింది. ఎంట్రప్రెన్యూర్లు, ఇన్నోవేటర్లకు క్లీన్టెక్ రంగంలో కాలిఫోర్నియా, భారత్ మార్కెట్లలో తగిన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వీలుగా ఒక ప్రోగ్రామ్‌ను ఈ సంస్థలు అందించనున్నాయి. - భారతీయ ఎంట్రప్రెన్యూర్లకు సీడ్ ఫండింగ్ కోసం టాటా ట్రస్ట్‌తో కూడా సీఐఐఈ ఎంఓయూ కుదర్చుకుంది. - టెక్నాలజీ రంగంలో ఎంట్రప్రెన్యూర్లకు వ్యూహాత్మక సహకారానికిగాను గూగుల్‌తోనూ సీఐఐఈ జట్టుకట్టింది. తొలినాళ్లలో మాదీ స్టార్టప్ సర్కారే... ప్రపంచంలో ఇప్పుడున్న మెగా కార్పొరేట్ సంస్థలన్నీ గతంలో స్టార్టప్‌లుగానే ప్రస్థానాన్ని ఆరంభించాయని మోదీ వ్యాఖ్యానించారు. ఆమాటకొస్తే, కేంద్రంలో అధికారాన్ని సాధించే సమయానికి తమది కూడా స్టార్టప్ ప్రభుత్వమేనని... అనేక ఎత్తుపల్లాలను, ఇక్కట్లను ఎదుర్కొని నిలదొక్కుకున్నామని చెప్పారు. అయితే, ఇప్పుడున్న డిజిటల్ యుగంలో గతంతో పోలిస్తే స్టార్టప్‌లకు అద్భుతమైన అవకాశాలు, తగిన సానుకూల పరిస్థితులు నెలకొన్నాయని మోదీ పేర్కొన్నారు. స్టార్టప్‌లకు కూడా కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ.. ఏదైనా కొత్త విషయాన్ని కనిపెట్టామనే గొప్ప అనుభూతి ఇక్కడ వాటిని ముందుకునడిపిస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘దేశాల ప్రగతి పథంలో స్టార్టప్‌లు ఇంజిన్లుగానే పనిచేస్తాయి. ఇప్పుడున్న ప్రపంచంలో అన్నిరకాల వనరులను ఉపయోగించుకొని ఎదిగే సంస్థలకంటే ఐడియాలను ఆచరణలో పెట్టిన సంస్థలే దూసుకెళ్లగలుగుతున్నాయి. వినియోగదారులే ఇప్పుడు అప్లికేషన్ల సృష్టికి మూలకేంద్రంగా నిలుస్తున్నారు కూడా. అంటే ఒకరి మదిలో మెదిలిన ఆలోచన... ఒక్క ఏడాదిలో ప్రపంచం మొత్తానికి తెలిసిపోతుంది’ అని మోదీ వివరించారు.