breaking news
Sperticals
-
ముఖ్యమంత్రి వాచ్ ఖరీదు అరకోటిపైనే !!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధరించే వాచ్, కళ్లద్దాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సీఎం సిద్ధరామయ్య రూ.50-70లక్షల విలువచేసే వాచ్‌ను, రెండు లక్షల రూపాయల విలువ చేసే కళ్లద్దాలు ధరిస్తారని మాజీ సీఎం హెచ్.డి.కుమారస్వామి ఆరోపించారు. ‘లోహియా’ ఆదర్శాలను పాలించే వ్యక్తిగా, అనుచరుడిగా సీఎం సిద్ధరామయ్య తనకు తాను చెప్పుకుంటూ ఉంటారు. అయితే సిద్ధరామయ్య లోహియా పేరును కేవలం ప్రచారానికి మాత్రమే ఉపయోగిస్తున్నారని, ఆయన నిజజీవితం పూర్తిగా విలాసవంతమైనదంటూ కుమారస్వామి ఆరోపించారు. ఈ విషయంపై సీఎం సిద్ధరామయ్య కూడా స్పందించారు. ‘కుమారస్వామి చెప్పేవన్నీ అబద్ధాలే, కావాలంటే నా కళ్లద్దాలను రూ.50వేలకు, నా వాచ్‌ను పది లక్షల రూపాయలకు ఇచ్చేస్తాను, తీసుకోమనండి’ అంటూ ప్రతిస్పందించారు. అయితే ఈ విషయానికి సంబంధించిన ఆధారాలను హెచ్.డి.కుమారస్వామి మంగళవారం మీడియాకు అందజేశారు. ‘సిద్ధరామయ్య ధరించే వాచ్ హ్యూబ్లోట్ బ్రాండ్‌కు చెందినది. ఈ వాచ్‌ను పూర్తిగా బంగారుపూతతో తయారుచేస్తారు. డయల్‌లోని నంబర్ల స్థానంలో వజ్రాలను పొదుగుతారు. అందువల్లే ఈ వాచ్ ధర రూ.50-70లక్షలుగా ఉంటుంది. సిద్ధరామయ్య ఓ పెళ్లికి హాజరైనపుడు ఆయన ఈ వాచ్‌ను ధరించారు. ఆ వీడియోను వాట్సాప్ ద్వారా తెప్పించుకొని ఆ వీడియోను దుబాయ్‌కి పంపించి, ఈ విషయాన్ని నిర్ధారించుకున్నాను’ అని తెలిపారు. ఈ విమర్శలతో కర్ణాటకలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. -
ముఖ్యమంత్రి కళ్లజోడు మిస్సింగ్
హన్మకొండ: వరంగల్ జిల్లాలో మూడు రోజులుగా అభివృద్ధిపై సమీక్షలు నిర్వహించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కళ్లజోడు మంగళవారం మాయమైంది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు నానా హైరానా పడ్డారు. చివరకు బుధవారం కళ్లజోడు దొరకడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే... మంగళవారం రాత్రి నక్కలగుట్టలోని నందనా గార్డెన్లో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. అనంతరం కెప్టెన్ లక్ష్మికాంతరావు ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి తన కళ్లద్దాల కోసం వాకబు చేశారు. భద్రతా అధికారులు ఆరా తీస్తే నందనా గార్డెన్‌లోనే వదిలి వెళ్లినట్లు తెలిసింది. దీంతో అధికారులు నందనా గార్డెన్‌లోని చెత్తడబ్బాలను వెతికారు. రాత్రి 11.30 వరకు వెదికినా ఫలితం లేదు. అయితే సహజంగా సీట్లోంచి సీఎం లేవగానే అక్కడున్న నాప్కిన్లు, ఇతర వస్తువులను సెక్యూరిటీ సిబ్బంది, లేదా అటెండర్ తీసుకెళ్లతారు. వాటిలో న్యాప్కిన్లు, ఇతర వస్తువులు తీసుకెవెళ్లినా... కళ్లద్దాలు వదిలి వేయడం ఏంటని నాయకులు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా మంగళవారం మాయమైన సీఎం కళ్లజోడు బుధవారం సాయంత్రం దొరికినట్లు అధికారులు చెపుతున్నారు. అయితే, ఎక్కడ దొరికిందనే విషయం మాత్రం చెప్పడం లేదు.