breaking news
small IT companies
-
జీసీసీల్లో హైరింగ్ జోరు
సాక్షి, బిజినెస్ డెస్క్: ఈ ఏడాది టెక్ నిపుణుల హైరింగ్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), మిడ్–స్మాల్ ఐటీ కంపెనీలు ముందువరుసలో ఉండనున్నాయి. బడా ఐటీ కంపెనీలు కాస్త ఆచి తూచి వ్యవహరించనున్నాయి. అలాగే మిడ్–సీనియర్ స్థాయిల్లో నియామకాలు మెరుగ్గానే ఉండనున్నప్పటికీ ఎంట్రీ లెవెల్ స్థాయిలో మాత్రం హైరింగ్ నెమ్మదించవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రాజెక్టులను అసైన్ చేయడానికి ముందు మళ్లీ ప్రత్యేకంగా శిక్షణనివ్వాల్సిన పరిస్థితి ఉండకూడదని కంపెనీలు భావిస్తుండటమే ఇందుకు కారణమని వివరించాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో పెద్ద ఎత్తున ఫ్రెషర్లను తీసుకోవడం కన్నా మిడ్ నుంచి సీనియర్ స్థాయి సిబ్బందిని తీసుకోవడానికే ప్రాధాన్యమివ్వొచ్చని పేర్కొన్నాయి.‘చాలా మంది ఫ్రెషర్లలో ఉద్యోగ నైపుణ్యాలు ప్రశ్నార్థకంగా ఉండటం వల్ల ఐటీ సర్వీసుల కంపెనీలు హైరింగ్ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి’ అని మైఖేల్ పేజ్ ఇండియా ప్రాంతీయ డైరెక్టర్ ప్రాంశు ఉపాధ్యాయ్ తెలిపారు. బహుళ జాతి సంస్థలు దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తుండటం, విస్తరిస్తుండటంతో టెక్నాలజీ లో అనుభవమున్న ఉద్యోగులకు జీసీసీల్లో డిమాండ్ బాగా ఉంటోంది. టీమ్‌లీజ్ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 55 లక్షలుగా ఉన్న ఐటీ ఉద్యోగుల సంఖ్య 2027 ఆర్థిక సంవత్సరం నాటికి 65 లక్షలకు చేరే అవకాశం ఉంది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్విసెస్, ఇన్ఫోసిస్ మొదలైన సంస్థల్లో నియామకాలు పెరిగినా, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, కాగ్నిజెంట్ తదితర సంస్థల్లో తగ్గాయి. 2024లో నియామకాలు 5–7 శాతం తగ్గినప్పటికీ, మొత్తం మీద 2025లో హైరింగ్ వృద్ధి కాస్త సానుకూలంగా 8–12 శాతం స్థాయిలో ఉండొచ్చని ఉపాధ్యాయ్ పేర్కొన్నారు.స్పెషలైజ్డ్ నైపుణ్యాలకు డిమాండ్సాధారణ విధులకు సంబంధించి వేరే సంస్థలకు వెళ్లిపోయిన ఉద్యోగుల స్థానాలను భర్తీ చేయడం లేదా కొత్తవారిని తీసుకోవడమనేది 2024లో 8–10 శాతం మేర తగ్గినట్లు రాండ్‌స్టాడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఐటీ కంపెనీలు ప్రత్యేక టెక్ నైపుణ్యాలున్న వారిని నియమించుకునే ధోరణి పెరుగుతోందని పేర్కొన్నాయి. 2025లో ఏఐ, ఎంఎల్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ టెక్నాలజీస్ తదితర విభాగాల్లో నిపుణులను దేశీ ఐటీ కంపెనీలు నియమించుకోవచ్చని వివరించాయి.ఉత్పాదకతపైనే ఫోకస్ కంపెనీలు ఉత్పాదకత, వ్యయాల నియంత్రణపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. అందుకే తక్కువ వేతనాలకే పెద్ద సంఖ్యలో ఫ్రెషర్లు దొరికే అవకాశం ఉన్నప్పటికీ నియామకాలపై సుముఖంగా లేవు. సాధారణంగా ఎంట్రీ లెవెల్ ఉద్యోగులు గరిష్ట స్థాయిలో ఉత్పాదకత సాధించాలంటే ఏడాది, రెండేళ్లు పట్టేస్తుందని, కంపెనీలు అంత కాలం నిరీక్షించే పరిస్థితి లేదని ఎగ్జిక్యూటివ్ సెర్చ్ సంస్థ ఏబీసీ కన్సల్టెంట్స్ వర్గాలు తెలిపాయి. ఉద్యోగులను నియమించుకున్న దగ్గర్నుంచే కంపెనీలు పనితీరు, ఉత్పాదకతను పరిశీలిస్తున్నాయని వివరించాయి. -
చిన్న కంపెనీలకు వరంగా మారిన ఇన్ఫోసిస్
ఇన్ఫోసిస్ నుంచి వలసలు చిన్న కంపెనీల పాలిట వరంగా మారాయి. ఇటీవలి కాలంలో ఈ ఐటీ దిగ్గజ కంపెనీ నుంచి చాలామంది వేరే వేరే కంపెనీలకు వలస వెళ్లిపోతున్నారు. ఇన్ఫీలంతా మంచి నైపుణ్యం గలవారు కావడం, వాళ్లు ఇప్పుడు ఇతర కంపెనీలకు అందుబాటులో ఉండటంతో ఆ కంపెనీలు ఇప్పుడు పండగ చేసుకుంటున్నాయి. ఇన్నాళ్లుగా ఇంత నైపుణ్యం ఉన్నవాళ్లు తమకు దొరక్కపోవడంతో దాదాపుగా అలాంటి కంపెనీలు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు ఒక్కొక్కరుగా వాళ్లు బయటకు రావడంతో వీళ్లకు కూడా అవకాశం వస్తోంది. ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ బి.జి. శ్రీనివాస్ బుధవారంనాడు రాజీనామా చేశారు. ఆయన హాంకాంగ్‌కు చెందిన టెలికం, ఇంటర్నెట్, ఐటీ సంస్థ పీసీసీడబ్ల్యులో చేరుతున్నారు. గత సంవత్సరం ఆగస్టులో రాజీనామా చేసిన మాజీ బోర్డు సభ్యుడు అశోక్ వేమూరి ఐగేట్ సీఈవోగా వెళ్లారు. గ్లోబల్ డెలివరీ అధినేతగా ఉండి ఏప్రిల్‌లో రాజీనామా చేసిన చంద్రశేఖర్ కకల్ ఇటీవలే ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ సంస్థకు సీఓఓగా చేరారు. గత ఆగస్టులో రాజీనామా చేసిన సుధీర్ చతుర్వేది ఎన్ఐఐటీ టెక్నాలజీస్ సీఓఓగా చేరారు. ఇంకా కొంతమంది మైండ్ ట్రీ, యాక్సెంచర్, క్యాప్ జెమిని లాంటి కంపెనీలకు కూడా వెళ్లారు. టాప్ ఎగ్జిక్యూటివ్‌లు మాత్రమే కాక.. ఇన్ఫోసిస్‌లో క్వాలిటీ లాంటి విభాగాల్లో సీనియర్, జూనియర్ స్థాయిల్లో ఉన్నవాళ్లు కూడా ఇటీవలి కాలంలో ఇతర కంపెనీల వైపు చూస్తున్నారు.