shipment
-
చైనాకు చేయందించిన బంగ్లా.. షిప్మెంట్ రద్దుతో భారత్ ప్రతీకారం?
న్యూఢ్లిల్లీ: భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు అందిస్తున్న కీలక ట్రాన్స్షిప్మెంట్ (Transshipment) సౌలభ్యాన్ని రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ సౌలభ్యాన్ని భారత్ 2020లో బంగ్లదేశ్‌కు కల్పించింది. దీని ద్వారా బంగ్లాదేశ్ తన ఎగుమతి సరుకులను భారత భూభాగంలోని ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ల ద్వారా భారతీయ ఓడరేవులు, విమానాశ్రయాలకు పంపి, అక్కడ నుండి మూడవ దేశాలకు రవాణా చేసేది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వచ్చింది.భారత ఎగుమతులకు ఆటంకంఈ ట్రాన్స్షిప్మెంట్ సౌలభ్యం ద్వారా బంగ్లాదేశ్ (Bangladesh) తన సరుకులను నేపాల్, భూటాన్ తదితర దేశాలకు సమర్థవంతంగా, తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో రవాణా చేయగలిగింది. భారతదేశం ఈ సౌలభ్యాన్ని రద్దు చేయడానికి వెనుక పలు కారణాలన్నాయి. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపిన వివరాల ప్రకారం ఈ సౌలభ్యం కారణంగా భారత విమానాశ్రయాలు, ఓడరేవులలో గణనీయమైన రద్దీ ఏర్పడుతోంది. దీని వల్ల లాజిస్టికల్ ఆలస్యం కావడానికి తోడు, భారతదేశ ఎగుమతులకు అధిక ఖర్చులు అవుతున్నాయి. ఈ రద్దీ భారత ఎగుమతులకు అడ్డంకిగా మారడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.అసలు కారణం ఇదే..అయితే భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని పలువురు విశ్లేషకులు అంటున్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్(Muhammad Yunus) ఇటీవల చైనాలో పర్యటించి, భారత ఈశాన్య ప్రాంతాన్ని ల్యాండ్లాక్డ్ (భూపరివేష్టిత) ప్రాంతంగా పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో చైనా ఆర్థిక ప్రభావాన్ని విస్తరించాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు భారతదేశంలో దౌత్యపరమైన అలజడిని రేపాయి. దీనికి ప్రతిగానే భారత్ ఈ సౌలభ్యాన్ని రద్దు చేసిందని అంటున్నారు.అమెరికా సుంకాలకు తోడుగా..భారత్ తీసుకున్న ఈ నిర్ణయం బంగ్లాదేశ్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా దాని రెడీమేడ్ గార్మెంట్ పరిశ్రమ (Readymade garment industry) దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపై ఈ సౌలభ్యం దూరం కావడంతో బంగ్లాదేశ్ ఎగుమతిదారులు లాజిస్టికల్ ఆలస్యాలు, అధిక రవాణా ఖర్చులు, అనిశ్చితిని ఎదుర్కోవలసిన పరిస్థితి ఎదురవుతుంది. ఫలితంగా నేపాల్, భూటాన్, మయన్మార్ తదితర దేశాలలో బంగ్లాదేశ్ సాగిస్తున్న వాణిజ్యంపై ప్రభావం పడనుంది. ఇప్పటికే అమెరికా విధించిన అధిక సుంకాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్‌కు ఇది మరో ఆర్థిక దెబ్బగా మారింది.బంగ్లాకు ఆర్థిక సవాళ్లుఅస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఇది ఈశాన్య ప్రాంత భద్రతను కాపాడటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిబద్ధతను సూచిస్తున్నదని పేర్కొన్నారు. భారత దుస్తుల ఎగుమతి పరిశ్రమ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. కాగా ఈ ట్రాన్స్షిప్మెంట్ సౌలభ్యం రద్దు భారత్- బంగ్లాదేశ్ మధ్య వాణిజ్య సంబంధాలపై గణనీయమైన ప్రభావం చూపనుంది. ఇది రెండు దేశాల మధ్య ఉన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలను ప్రతిబింబిస్తుంది. బంగ్లాదేశ్ ఇకపై తమ దేశ ఎగుమతుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాల్సిన అవసరం ఏర్పడింది, ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లను తెచ్చిపెట్టనుంది.ఇది కూడా చదవండి: లోకో పైలట్లకు పిడుగులాంటి వార్త.. ‘విరామం’ లేనట్లే! -
పీసీలకు ఫుల్ డిమాండ్
న్యూఢిల్లీ: పర్సనల్ కంప్యూటర్ల (పీసీ)కు 2024లోనూ బలమైన డిమాండ్ కొనసాగింది. వీటి షిప్మెంట్ (మార్కెట్‌కు రవాణా) 3.8 శాతం మేర పెరిగింది. మొత్తం 14.4 మిలియన్ యూనిట్ల పీసీల రవాణా జరిగినట్టు మార్కెట్ పరిశోధనా సంస్థ ఐడీసీ ప్రకటించింది. గేమింగ్, ఏఐ ఆధారిత పీసీలకు అధిక డిమాండ్ నెలకొన్నట్టు తెలిపింది. 2025లో పీసీ మార్కెట్ తక్కువ స్థాయి సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ఐడీసీ అంచనా వేసింది. ఈ మేరకు త్రైమాసిక వారీ పీసీ డివైజ్ ట్రాక్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ‘‘రూపాయి బలహీనపడడం పీసీల ధరలు పెరగడానికి దారితీసింది. ఇది చిన్న, మధ్యస్థాయి వ్యాపార సంస్థలతోపాటు, వినియోగ విభాగంపై ప్రభావం చూపించింది’’అని ఐడీసీ ఇండియా, దక్షిణాసియా అసోసియేస్ వైస్ ప్రెసిడెంట్ (డివైజెస్ రీసెర్చ్) నవకేందర్ సింగ్ ప్రకటించారు. అగ్రస్థానంలో హెచ్‌పీ ⇒ హెచ్‌పీ గతేడాది 30.1 శాతం పీసీల రవాణాతో (మార్కెట్‌కు) అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో ఈ సంస్థ మార్కెట్ వాటా 30 శాతంగా నమోదైంది. వార్షికంగా చూస్తే 1 శాతం, త్రైమాసికం వారీగా చూస్తే 1.8 శాతం చొప్పున రవాణా తగ్గింది. ⇒ లెనోవో సంస్థ 17.2 శాతం పీసీలను రవాణా చేసింది. అంతకుముందు ఏడాదితో పోలి్చతే 7.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. ⇒ డెల్ 16.1 శాతంతో తర్వాతి స్థానంలో ఉంది. 8.1 శాతం వృద్ధిని చూపించింది. . ⇒ ప్రీమియం నోట్‌బుక్‌ల షిప్మెంట్ (1,000 డా లర్లకు పైన ధరలోనివి) గతేడాది 13.8% పెరిగింది. ⇒ అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వ విభాగాల నుంచి పీసీలకు డిమాండ్ 10.6% మేర పెరిగింది. ⇒ 2024 చివరి మూడు నెలల కాలంలో (అక్టోబర్–డిసెంబర్) మొత్తం పీసీల మార్కెట్ 6.9 శాతం, నోట్‌బుక్ విభాగం 9.6 శాతం మేర వృద్ధి చెందాయి. ⇒ తైవాన్ కంపెనీ ఏసర్ 2024లో 27.7 శాతం మేర షిప్మెంట్లో వృద్ధిని చూపించింది. 15.1 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. ⇒ ఆసుస్ 38.4 శాతం వృద్ధిని డిసెంబర్ త్రైమాసికంలో సాధించింది. అదే కాలంలో లెనోవో 13.5 శాతం అధికంగా షిప్మెంట్ చేసి 18.5 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ⇒ డెల్ సంస్థ డిసెంబర్ త్రైమాసికంలో 18.1 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. 5.8 శాతం వృద్ధిని చూపించింది. ఏసర్ కూడా డిసెంబర్ క్వార్టర్లో 20% వృద్ధిని నమోదు చేసి, 15.7 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. వర్క్స్టేషన్లకు మరింత డిమాండ్. ‘‘సంప్రదాయ పీసీ మార్కెట్ (డెస్క్ టాప్‌లు, నోట్బుక్లు, వర్క్స్టేషన్లు) 2024లో 14.4 మిలియన్ యూనిట్లను షిప్మెంట్ చేసింది. వార్షికంగా 3.8 శాతం వృద్ధి నమోదైంది. విభాగాల వారీగా చూస్తే నోట్‌బుక్‌ల షిప్మెంట్ 4.5 శాతం మేర, డెస్క్ టాప్ల షిప్మెంట్ 1.8 శాతం మేర అధికంగా జరిగాయి. వర్క్స్టేషన్ల షిప్మెంట్ రికార్డు స్థాయిలో 10.9 శాతం పెరిగింది. నోట్‌బుక్‌లకు డిమాండ్ బలంగా ఉంది. వాణిజ్య పీసీ మార్కెట్ సైతం తాజా ఆర్డర్లతో పుంజుకుంది’’అని ఐడీసీ నివేదిక వెల్లడించింది. -
ఎగబడి మరీ కొంటున్నారు, మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే!
జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావాలు స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీంతో ఈ ఏడాది క్యూ1 ఫలితాల్లో మొబైల్ షిప్మెంట్ 11శాతం పడిపోయాయి. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ పరిణామాలు, కరోనా కేసులు పెరిగిపోతుండడం, రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షల కారణంగా మొబైల్ షిప్ మెంట్ పడిపోయిందంటూ ప్రముఖ రీసెర్చ్ సంస్థ కెనాలసిస్ తెలిపింది. షిప్మెంట్ పడిపోయిన సంస్థల్లో శాంసంగ్ తొలిస్థానంలో ఉండగా యాపిల్,షావోమీ వరుస స్థానాల్లో ఉన్నట్లు కెనాలసిస్ తన నివేదికలో పేర్కొంది. అదే సమయంలో ఐఫోన్ 13, ఐఫోన్ ఎస్ఈ ఫోన్లకు మార్కెట్లో డిమాండ్ విపరీతంగా ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత షావోమీకి చెందిన రెడ్ మీ నోట్ సిరీస్, ఒప్పో సంస్థకు చెందిన వన్ ప్లస్, వివో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జరిగినట్లు గుర్తు చేసింది. ఈ సందర్భంగా కెనాలసిస్ అనలిస్ట్ సన్యాం చౌరాసియా (Sanyam Chaurasia) మాట్లాడుతూ.. యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ 13 మార్కెట్లో డిమాండ్ ఉన్నట్లు తెలిపారు. మిడ్ రేంజ్ ఫోన్లలో ఇటీవల మార్చిలో విడుదలైన ఐఫోన్ ఎస్ఈ సైతం యూజర్లను ఆకట్టుకుందని చెప్పారు. ఇక చిప్ సెట్లను అప్‌గ్రేడ్ చేసి బ్యాటరీ పర్మామెన్స్ తో పాటు 5జీ స్మార్ట్ ఫోన్లు సైతం యూజర్లను ఆకర్షిస్తున్నాయని వెల్లడించారు. చదవండి: సూపర్ ఫీచర్స్‌తో షావోమీ నుంచి మరో బడ్జెట్ ఫోన్..! లాంచ్ ఎప్పుడంటే..? -
షిప్మెంట్లో దుమ్ము లేపుతుంది, షావోమీకి షాకిచ్చిన 5జీ స్మార్ట్ ఫోన్ ఇదే!
ఈ ఏడాది క్యూ3 ఫలితాల్లో 5జీ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు దుమ్మురేపుతున్నాయి. తాజాగా 5జీ స్మార్ట్ ఫోన్ షిప్‌మెంట్‌పై 'స్ట్రాటజీ అనలిటిక్స్' సంస్థ రిపోర్ట్‌ను విడుదల చేసింది. యాపిల్ సంస్థ ప్రపంచంలోనే షిప్మెంట్ విభాగంలో అగ్రస్థానంలో నిలవగా షియోమీ రెండో స్థానంలో, శాంసంగ్ మూడో స్థానంలో నిలిచినట్లు తెలిపింది. ప్రస్తుతం 5జీ మార్కెట్ వరల్డ్ వైడ్‌గా 25శాతం వాటాను కలిగి ఉన్నాయని నివేదికలో పేర్కొంది. ఐఫోన్ 12 ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ గతేడాది 5జీ టెక్నాలజీని సపోర్ట్ చేస్తూ ఐఫోన్ 12 సిరీస్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసిన రెండు వారాల్లోనే సేల్స్ జరిగి...ఐఫోన్ 12 ,ఐఫోన్ 12 ప్రో'లు ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన 5జీ ఫోన్లుగా నిలిచాయి. తాజాగా స్ట్రాటజీ అనలిటిక్స్ నివేదిక సైతం 5జీ మార్కెట్లో యాపిల్ తొలిస్థానంలో కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది 3వ త్రైమాసికంలో 5జీ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో యాపిల్ షావోమీని వెనక్కి నెట్టిందని స్ట్రాటజీ అనలిటిక్స్ డైరెక్టర్ కెన్ హైర్స్ తెలిపారు. ఐరోపాలో శాంసంగ్, చైనాలో ఒప్పో స్మార్ట్‌ఫోన్ సేల్స్ కారణంగా షావోమీ అమ్మకాలు తగ్గాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. షావోమీ హెడ్ క్వార్టర్స్ చైనాలో మాత్రం 5జీ స్మార్ట్‌ఫోన్ లపై ఆఫర్లు ప్రకటించడంతో డిమాండ్ పెరిగినట్లు వెల్లడించారు. శాంసంగ్ సైతం 3వ త్రైమాసికంలో గ్లోబల్ 5జీ ఫోన్ షిప్మెంట్లలో మూడవ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా ఒప్పోను వెనక్కి నెట్టింది. శాంసంగ్ 5జీ స్మార్ట్ ఫోన్ సౌలభ్యంతో పాటు ఫోల్డబుల్ ఫోన్ కారణంగా శాంసంగ్‌కు డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. 4వ స్థానంలో ఒప్పో తర్వాత వివో ఐదో స్థానాన్ని సంపాదించుకోగా...హానర్ తన మాతృ సంస్థ హువావే నుంచి విడిపోవడంతో ద్వారా హానర్ ఈ త్రైమాసికంలో 194శాతం వృద్ధిని సాధించినట్లైందని స్ట్రాటజీ అనలిటిక్స్ విడుదల చేసిన రిపోర్ట్‌లో పేర్కొంది. చదవండి: వెరైటీ టీవీ.. చూడడమే కాదు ఏకంగా నాకేయొచ్చు -
ఉసూరుమన్న యాపిల్
న్యూఢిల్లీ: మొబైల్ మార్కెట్ లో ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తున్న ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్ మరోసారి ఉసూరుమంది. భారత్ స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో అగ్రభాగాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్న సంస్థకు ఇక్కడ ఎదురు దెబ్బ తగిలింది. 2016 రెండో త్రైమాసికంలో భారతదేశం లో ఐ ఫోన్ ఎగుమతుల్లో క్షీణతను నమోదు చేసింది. స్ట్రాటజీ అనలిటిక్స్ అందించిన నివేదిక ప్రకారం ఐఫోన్ల అమ్మకాలు 35శాతం తగ్గాయి. ఈ ఏడాదిలో కేవలం 8లక్షల ఫోన్లు (0.8 మిలియన్ల) మాత్రమే విక్రయించింది. అయితే 2015లో ఇదే సమయంలో 12లక్షల ఫోన్లను పంపించింది. ఐఫోన్ల మార్కెట్ 4.5 శాతం నుంచి 2.4 శాతానికి పడిపోయిందని రిపోర్టు చేసింది. గూగుల్ కు చెందిన ఆండ్రాయిడ్ మార్కెట్ మాత్రం 97 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. 29.8 మిలియన్ యూనిట్లను ఎగుమతిచేసి తన స్థానాన్ని నిలుపుకుంది. క్రితం త్రైమాసికంలో 23.2 మిలియన్ యూనిట్ల ఎగుమతితో ఇది90 శాతంగా ఉంది. అయితే ఐఫోన్ల ధరల కారణంగా మార్కెట్ తగ్గుతోందని, ధరలను తగ్గించాల్సిన అవసరం ఉందని నివేదించింది. వినియోగ దారులకు అందుబాటులో ఉండేలా తక్కువ ధరల్లో ఫోన్లను విడుదల చేస్తే భవిష్యత్తులో భారత్‌లో మార్కెట్ గణనీయంగా పెరిగే అవకాశముంటుందని స్ట్రాటజీ ఎనలిటిక్స్ వద్ద డైరెక్టర్ వుడీ ఓహ్ అభిప్రాయపడ్డారు. మొబైల్ వినియోగంలో ప్రపంచంలో చైనా, అమెరికా తరువాత భారత్ మూడవ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా ఉందని స్ట్రాటజీ ఎనలిటిక్స్ సీనియర్ విశ్లేషకుడు రాజీవ్ నాయర్ తెలిపారు.