'ఏపీకి హోదాపై కేంద్రం సమాధానం చెప్పాలి'
సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేకపోతోందో సమాధానం చెప్పాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయకపోవడంపై ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. ఢిల్లీలో ఆదివారం సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఏపీ, తెలంగాణలకు బీజేపీ ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదు.
గతంలో ప్లానింగ్ కమిషన్ ముందు రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాదనలను వినిపించేవారు.. ఇప్పుడు ఆ సంస్థే లేకుండా చే శారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఏ కారణాలు చెప్పకుండా వెంకయ్యనాయుడు గతంలో పార్లమెంటులో హామీ ఇచ్చి ఇప్పుడెందుకు నెరవేర్చడం లేద’ని ఆయన ప్రశ్నించారు. కాగా, భూకంపం కారణంగా దెబ్బతిన్న నేపాల్‌కు ఆర్థిక సహాయార్థం సేకరించిన రూ. 2.84 కోట్లను అక్కడి ప్రభుత్వానికి పంపనున్నట్టు ఏచూరి తెలిపారు.