breaking news
Satyarthi
-
పిల్లలే ఫ్యూచర్
ఇవాళ సత్యార్థి బర్త్‌డే. బాలల ఆకాంక్షలకు స్వేచ్ఛనివ్వడమే ఆయనకు మనం పంపే బర్త్‌డే గ్రీటింగ్! మనిషి పరుగులు ఎవరి కోసం? సంపాదన కోసం. సంపాదన ఎవరి కోసం? పిల్లల కోసం. లోకం.. పిల్లల చుట్టూ తిరుగుతోంది. పిల్లలే లోకంగా అవిశ్రాంతంగా శ్రమిస్తోంది. సూక్ష్మంగా చూస్తే సైన్స్అండ్ టెక్నాలజీ, సోషియాలజీ, పాలనా నిర్ణయాలు.. అన్నీ.. పిల్లల కోసమే. పిల్లలే ప్రపంచ భవిష్యత్తు కాబట్టి. అయితే.. పిల్లల చుట్టూ పరిభ్రమిస్తున్న మనిషి గానీ, పాలనా యంత్రాంగాలు కానీ పిల్ల రక్షణను, సంరక్షణకు అవసరమైన శ్రద్ధను చూపడం లేదు. సమాలోచనలు చేయడం లేదు. పిల్లల కోసం చేసిన చట్టాలు సక్రమంగా అమలవుతున్నదీ లేనిదీ చూడడం లేదు! బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థి.. ట్రెయినీ కలెక్టర్లతో ముచ్చటించేందుకు ప్రత్యేక ఆహ్వానంపై మంగళవారం హైదరాబాద్ వచ్చినప్పుడు ఇదే విషయమై ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. బాలల కోసం కలెక్టర్లుగా వాళ్లేం చేయవలసిందీ చెప్పారు. సత్యార్థి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కూడా. స్కూల్‌కు వెళ్లడం కోసం ఉగ్రవాదుల ఆక్షలను సైతం ఉల్లంఘించిన మలాలాకు, సత్యార్థికి కలిపి 2014లో ఆ అవార్డు వచ్చింది. ప్రపంచ జనాభాలో ఆరు కోట్ల మంది బాలలకు చదువుకునే భాగ్యం లేదు. నాలుగు కోట్ల మంది బాలకార్మికులుగా నలిగిపోతున్నారు. నిమిషానికి ఒక చిన్నారి చొప్పున కనిపించకుండా పోతున్నారు! ఆ తర్వాత అక్రమ రవాణా అవుతున్నారు. ఇవన్నీ చెబుతూ, ‘కలెక్టర్లు దృష్టి పెడితే ఈ పరిస్థితి మారుతుందని సత్యార్థి అన్నారు.బాలల కోసం సత్యార్థి.. డ్రీమ్, డిస్కవరీ, డు.. అనే త్రీడీ ఫార్ములా ప్లాన్ చేశారు. భవిష్యత్తు గురించి కలలు కనడం, భవిష్యత్తు అవకాశాలను కనుగొనడం, అందుకు అనుగుణంగా ముందుకు సాగడం.. అనే ఈ తీడ్రీ ఫార్ములాతో పిల్లలు స్వేచ్ఛగా ఎదిగేలా చూడడం, వారికి చట్టపరంగా జరగవలసిన న్యాయాన్ని అందించడం కలెక్టర్ల ప్రధాన కర్తవ్యం కావాలని సత్యార్థి కోరారు. సత్యార్థి కూడా ఒక కల కంటున్నారు. పిల్లలంతా సంతోషంగా కళకళలాడుతూ ఉండే ప్రపంచాన్ని ఆయన ఆకాంక్షిస్తున్నారు. పిల్లలే పెద్దల ప్రపంచం కావడం ఒక్కటే కాదు, ఈ ప్రపంచం పిల్లలది అయ్యేలా చూడ్డం ప్రతి తల్లీ తండ్రీ బాధ్యత. అలాగే ప్రభుత్వాలదీ. గ్లోబల్ రిపోర్ట్ ►6 కోట్లు... బడి భాగ్యం లేని పిల్లల సంఖ్య ►4 కోట్లు... బాల కార్మికుల సంఖ్య ►నిమిషానికొకరు అదృశ్యం ►80 శాతం చిన్నారులపై పరిచయస్తుల లైంగిక అఘాయిత్యాలు -
ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే...
భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు విద్య ఎంతో సహకరిస్తుందని నోబుల్ శాంతి బహుమతి విజేత కైలాష్ సత్యార్థి అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యతో సామాజిక న్యాయం కూడా చేకూరుతుందని, స్థిరమైన ఆర్థిక వృద్ధి, అభివృద్ధి, సామాజిక న్యాయం ఒక్క విద్యవల్లే సాధ్యమౌతుందని సత్యార్థి తెలిపారు. వచ్చే పదేళ్ళలో భారత్ లోని ప్రతి ఒక్కరూ చదువుకునేలా చూస్తే... మన జీడీపీ వృద్ధి రేటు నాలుగు శాతం పెరుగుతుందని సత్యార్థి సూచించారు. రోటరీ ఇంటర్నేషనల్ లిటరసీ అండ్ ఏఎంపి ప్రెసిడెన్షియల్ కాన్ఫరెన్స్ లో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. పిల్లలను తరగతి గదుల్లోకి పంపగల్గితే అదే వారి అభివృద్ధికి మార్గదర్శకమౌతుందని, అనేక అవకాశాలను తెచ్చిపెడుతుందని అన్నారు. భారత ఆర్థిక అభివృద్ధికి అదే మార్గదర్శకమౌతుందని సత్యార్థి అన్నారు. ఉదాసీనత, భయం, అసహనం ప్రపంచానికి శత్రువులుగా మారాయని సత్యార్థి పునరుద్ఘాటించారు. -
'కావాలంటే నన్ను చంపండి'
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని పెషావర్ ఆర్మీ స్కూల్‌పై ఉగ్రవాద దాడి ఘటనను నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు కైలాస్ సత్యార్థి, యూసఫ్ జాయ్ మలాలా ఖండించారు. ఉగ్రవాదులు కావాలంటే తనను చంపి, పిల్లల్ని విడుదల చేయాలని కైలాస్ అన్నారు. ఇదో చీకటి దినమని కైలాస్ సత్యార్థి అభివర్ణించారు. ఉగ్రవాద దాడి పిరికిపందల చర్యని మలాలా ఖండించారు. చిన్నారులను చంపడం హేయమని అన్నారు. బాలల హక్కుల కోసం పోరాడిన కైలాస్, మలాలా ఇటీవల సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి స్వీకరించిన సంగతి తెలిసిందే. పెషావర్ ఆర్మీ స్కూల్లో ఉగ్రవాదుల దాడిలో విద్యార్థులతో సహా దాదాపు 126 మంది మరణించారు. ఉగ్రవాద దాడులు జరుగుతున్న సమయంలో కైలాస్, మలాలా స్పందించారు.