వరదతో యుద్ధానికి సిద్ధం..
సాక్షి, ముంబై: వర్షాకాలం కావడంతో నగరంలో వరద ముంపు ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటివరకు వర్షాలు పడకపోయినా మున్ముందు భారీవర్షాలు కురిస్తే ఆయా ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విషయమై పోలీసులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏడాది ఏఏ ప్రాంతాల్లో వర్షపు నీరు ఎక్కువగా రోడ్లపై నిలిచి ఉంటుందో, వాటి వివరాలతో పట్టిక తయారు చేశారు. మరో పక్క కొండ చరియలు విరిగి పడే అవకాశం ఉన్న ప్రదేశాలకు సంబంధించిన లిస్టును కూడా తయారుచేసి సిద్ధంగా ఉంచుకున్నారు. వరద సమయంలో ఎలా వ్యవహరించాలో నగర పోలీసులకు శిక్షణ ఇచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ బర్కుండ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏడాది వర్షాకాలంలో నగరంలోని కొన్ని లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తుతోందన్నారు. ఈ ఏడాది ముందుజాగ్రత్తగా ఆయా ప్రాంతాల ప్రజలకు తక్షణమే సహాయ సహకారాలు అందజేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. వర్షాలు ప్రారంభం అవగానే పోలీసులు ఆయా ప్రాంతాల్లో మోహరిస్తారని సంజయ్ చెప్పారు. వర్షాలు ప్రారంభమైన తర్వాత అత్యవసర సమయంలో ఎలా వ్యవహరించాలో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)తో కూడా పలు సమావేశాలు నిర్వహించామన్నారు. వరద నీరు ముంచెత్తినప్పుడు లోతట్టువాసులను తరలించి ఆశ్రయం కల్పించేందుకు వేరేచోట్ల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా పాఠశాలలు, కళాశాలల పట్టికను కూడా తయారు చేశామన్నారు.
వరద నీరు ముంచెత్తుతుందని అనుమానమున్న ప్రాంతాల్లో తాత్కాలికంగా సీసీటీవీ కెమెరాలు అమర్చనున్నట్లు సంజయ్ వివరించారు. అంబులెన్స్ యజమానుల వివరాలను కూడా తమ వద్ద పొందుపర్చామన్నారు. మంచి ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. కాగా, అత్యవసర సమయంలో ఎలా వ్యవహరించాలనే విషయమై పోలీసులకు బీఎంసీకి చెందిన సీనియర్ అధికారులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ అధికారులు శిక్షణ ఇచ్చారు. హైటైడ్ సమయంలో తీరం వద్దకు వెళ్లకుండా నివారించేందుకు నగర వాసులకు మొబైల్ల ద్వారా కూడా సమాచారాన్ని అందివ్వనున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రతి ఏడాది వరద నీరు ముంచెత్తే ప్రాంతాలివే...
సౌత్ ముంబై..
హింద్మాతా, నల్ బజార్, ఖేట్వాడి, గోల్ డియోల్, సీపీ ట్యాంక్, నానాచౌక్, మదన్పుర, కామాటిపుర, సాత్ రస్తా, శివ్డీ సెషన్కోర్ట్, ఫూల్ మార్కెట్, సెంచరీ బజార్, సేనాపతి బాపట్ మార్గ్.
మధ్య శివారు ప్రాంతాలు..
కుర్లా స్టేషన్ రోడ్, పైప్ రోడ్, పోస్టర్ కాలనీ, సుమన్ నగర్ జంక్షన్, ఆచార్య కాలేజ్, డియోనర్ మున్సిపల్ కాలనీ, చిరాగ్ నగర్ జంక్షన్, ఘాట్కోపర్ రైల్వే స్టేషన్, పంత్ నగర్, ఠాగూర్‌నగర్, విక్రోలి, సోనాపూర్
పశ్చిమ శివారు ప్రాంతాలు...
మాహిమ్, మిలన్ సబ్వే, గోలీబర్ సబ్వే, వకోలా జంక్షన్, కలీనా చౌకి, ఎయిర్ ఇండియా కాలనీ, అంధేరి కుర్లా రోడ్, మరోల్ నాకా, ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్, సహార్, హిల్ రోడ్, ఓల్డ్ ఖార్, ఎస్వీ రోడ్, సాంతాకృజ్ రైల్వే స్టేషన్, ఎస్వీ రోడ్, లింకింగ్ రోడ్, అంధేరి రైల్వే స్టేషన్, బెహర్బాగ్, ఓషివారా, ఫోర్ బంగ్లాస్, సీప్జ్, అసల్ప విలేజ్, కాజుపాడా పైప్‌లైన్, సఖి విహార్ రోడ్, సాయినాథ్ సబ్వే, చించోలి బందర్ రోడ్, దౌలత్ నగర్, దహిసర్ సబ్వే.
కొండచరియలు విరిగి పడేఅవకాశం ఉన్న ప్రాంతాలు...
వాల్కేశ్వర్, రామ్టేక్డీ, శివ్డీ, హనుమాన్ టేక్డీ, అంటాప్‌హిల్, హీరా పన్నా (హజి అలీ), సోనియాగాంధీ నగర్ (ఘాట్కోపర్), గోద్రేజ్ హిల్ (విక్రోలి), బాన్ డోంగ్రి (మలాడ్), శ్రీరామ్‌నగర్ (మలాడ్), కసైవాడా (కుర్లా), తంబి పాడా (భాన్దూప్), ఖాది నెం.03 (సాకినాకా), భరత్‌నగర్.