breaking news
Rits
-
రీట్స్ పెట్టుబడులొస్తున్నాయ్!
♦ 6-8 నెలల్లో రీట్స్‌లోకి ప్రెస్టిజ్ గ్రూప్ ప్రాజెక్ట్‌లు ♦ క్యూలో ఇతర దక్షిణాది నిర్మాణ సంస్థలు కూడా.. ♦ సుమారు 10-15 బిలియన్ డాలర్ల ♦ పెట్టుబడులొస్తాయని అంచనా ♦ స్థిరాస్తి రంగంలో తీరనున్న నగదు కొరత స్థిరాస్తి రంగానికి రీట్లు (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్) రూపంలో మంచి రోజులు రానున్నాయి. నిర్మాణ రంగ నగదు కొరతను మార్చగల సత్తా రీట్లకు ఉందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. సింగపూర్, హాంకాంగ్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సక్సెస్ అయిన రీట్ల విధానాన్ని మన దేశంలోనూ ఆరంభించాలని బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదించింది. ఇప్పటికే పలు దక్షిణాది నిర్మాణ సంస్థలు తమ ప్రాజెక్ట్‌లను రీట్ల రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్ : రీట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్లో నమోదవుతాయి. అక్కడే లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. కాబట్టి, పెట్టుబడిదారులకు మంచి లాభాలు గిట్టుబాటయ్యే అవకాశముంది. నిర్మాణం పూర్తయిన వాణిజ్య సముదాయాల్లో పెట్టుబడుల్ని పెట్టడం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెట్టుబడిదారులకు అందించడమే రీట్ల ప్రధాన కర్తవ్యం. అంటే అద్దెల రూపంలోనే ఆదాయం గిట్టుబాటవుతుందన్నమాట. రీట్ల నిబంధనలను సెబీ ఆమోదించినా.. కొన్ని నిర్మాణ సంస్థలు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నాయి. మొదటి లిస్టింగ్ అవ్వడానికి ఎంతలేదన్నా 6-8 నెలల సమయం పడుతుందని ప్రెస్టిజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, ఫైనాన్స్ అండ్ సీఎఫ్ఓ వెంకట్ కె. నారాయణ అభిప్రాయపడ్డారు. ► దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 376 మిలియన్ చ.అ. మొదటి రకం ఆఫీసు స్పేస్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. వీటిని రీట్లలోకి మళ్లిస్తే ఎంతలేదన్నా 10-20 బిలియన్ల డాలర్ల పెట్టుబడులొస్తాయని జోన్స్ లాంగ్లసాల్ చెబుతోంది. దేశ, విదేశీ సంస్థలకు చెందిన నిధుల ప్రవాహం పెరిగితే వాణిజ్య సముదాయాలకు భవిష్యత్తులో మంచి గిరాకీ ఉంటుంది. ► రీట్స్‌తో మ్యూచుఫల్ ఫండ్ల తరహాలోనే నిర్మాణ సముదాయాల్లోనూ పెట్టుబడులు పెట్టొచ్చు. వాణిజ్య, నివాస సముదాయాలు, కార్యాలయాలు, ఆసుపత్రులు, షాపింగ్ మాళ్లు, హోటళ్లు.. ఇలా అన్ని రకాల నిర్మాణాల్లో చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టే వీలుంటుంది. ప్రతి మ్యూచువల్ ఫండ్‌కు ఓ ట్రస్టు, స్పాన్సర్, మేనేజర్ ఉన్నట్టే.. దీనికీ ఉంటారు. ఇందులోని ఫండ్ మేనేజర్లకు స్థిరాస్తులకు సంబంధించిన పూర్తి స్థాయి పరిజ్ఞానం ఉండాలి. స్థానికులైనా, ప్రవాసులైనా కనీసం రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. యూనిట్ సైజు రూ.లక్షగా నిర్ణయించారు. ► రీట్స్‌లో పెట్టుబడులను నిర్మాణం జరిగే వాటిలో పెట్టడానికి ఒప్పుకోరు. 90 శాతం సొమ్మును నిర్మాణం పూర్తయిన వాటిలోనే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పైగా సొమ్మునంతా తీసుకెళ్లి ఒకే దాంట్లో మదుపు చేస్తానంటే కుదరదు. ఇలాంటి నిబంధనల వల్ల పెట్టుబడిదారులకు ఆదాయం త్వరగానే అందుతుంది. ప్రతి ప్రాజెక్ట్ విలువను ఏడాదికోసారి లెక్కిస్తారు. ఆరు నెలలకోసారి ఎన్ఏవీ (నెట్ అసెట్ వాల్యూ)ని ప్రకటిస్తారు. ఇక్కడ సెబీ ఒక నిబంధనను పొందుపర్చింది. ఒకవేళ కొనాల్సి వస్తే.. 110 శాతం కంటే ఎక్కువ సొమ్మును పెట్టకూడదు. అమ్మాల్సి వస్తే ఆస్తి విలువలో 90 శాతం కంటే తక్కువకు విక్రయించకూడదని తెలిపింది. ► మూడేళ్ల వరకూ పెట్టిన సొమ్మును కదపడానికి వీలుండని రీట్స్‌లో పెట్టుబడులు చేసేవారికి కార్పొరేట్ పన్ను వర్తించదు. అస్తవ్యస్తంగా ఉన్న స్థిరాస్తి రంగం ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి చెందుతుంది. ఇప్పటివరకూ మార్కెట్ విలువకు, రిజిస్ట్రేషన్ విలువకు మధ్య తేడా వల్ల కొంత సొమ్ము నల్లధనం రూపంలో నిర్మాణ సంస్థల ఖాతాలోకి వెళ్లేది. ఫలితంగా ప్రభుత్వాల ఆదాయానికి గండిపడేది. రీట్ల రాకతో పెట్టుబడులు పెట్టే ముందు ఆస్తి విలువలు పక్కాగా తెలిసే వీలుంటుంది. లావాదేవీల్లో, సొమ్ము చెల్లింపుల్లో పారదర్శకత ఉంటుంది. నిధుల కొరత పెద్దగా ఉండదు కాబట్టి నిర్మాణాలు ఆలస్యం కావు. ► బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వాణిజ్య సముదాయాల్లో పెట్టుబడి పెట్టడానికి అంగీకరించవు. కేవలం నివాస సముదాయాలకే ప్రాధాన్యమిస్తాయి. ఈ నేపథ్యంలో రీట్లకు ఆదరణ పెరుగుతుందనడంలో సందేహం లేదు. రీట్స్‌తో డెవపర్లకూ ప్రయోజనమే. అభివృద్ధి చేసిన ఆస్తులను రీట్లుగా సులువుగా బదీలి చేయవచ్చు. ప్రస్తుతం దేశంలో 6 కోట్ల చ.అ. వాణిజ్య స్థలం అందుబాటులో ఉంది. మరో ఐదేళ్లలో ఈ సంఖ్య రెట్టింపవుతుంది. లీజులకు ఇవ్వాల్సిన ఆఫీసు స్థలాన్ని త్వరగా సొమ్ము చేసుకోవచ్చు. దీనిపై ఎంతలేదన్నా 10 శాతం చొప్పున వడ్డీ గిట్టుబాటవుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మన వద్ద కేవలం ఆరు నుంచి ఏడు శాతం వడ్డీ లభిస్తుందని భావించే నిపుణులూ లేకపోలేరు. ఏదేమైనా నగదు కొరతతో అల్లాడుతున్న డెవలపర్లకు ఆర్థిక సమస్యలు తొలగిపోయే అవకాశముంది. ► మన పన్ను విధానం, స్టాంపు డ్యూటీ వంటి వాటిని మార్పు చేయకుండా.. రీట్లను ప్రవేశపెట్టడం ఎంత వరకూ సమంజసమనే సందేహమూ తలెత్తుతోంది. రీట్లను ప్రవేశపెట్టడమే కాదు.. నిబంధనల్ని సరళీతరం చేయాలి. చాలా దేశాల్లో దీనిపై పన్ను మినహాయింపునిచ్చారు. ఆసియా, ఐరోపాల్లోని పలు దేశాల్లో రీట్ల ఆదాయంపై మినహాయింపు లేకపోవడం వల్ల రీట్లకు అనుకున్నంత ఆదరణ లభించలేదు. అదే సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాలు పన్ను విషయంలో పారదర్శకంగా వ్యవహరించడం వల్ల గణనీయమైన అభివృద్ధిని సాధించాయి. 102.62 మిలియన్ చ.అ. డీఎల్ఎఫ్, రహేజా గ్రూప్, ఎంబసీ ప్రాపర్టీస్, ఆర్ఎంజెడ్ కార్పొ, యూనిటెక్, పంచశీల్, సలార్పూరియా గ్రూప్, అసెండస్, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్, దివ్యశ్రీ డెవలపర్స్ వంటి చాలా నిర్మాణ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. సుమారు 102.62 మిలియన్ చ.అ. వాణిజ్య సముదాయాల స్థలం అందుబాటులోకి తేనుంది. -
దీర్ఘకాలంలో రియల్ లాభాలు
కొద్దిరోజులుగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (రీట్స్) చర్చనీయాంశంగా ఉంటున్నాయి. వీటికి కేంద్రం ఆమోదముద్ర వేయడంతో రియల్టీ రం గంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారి కోసం మరో కొత్త సాధనం అందుబాటులోకి వచ్చినట్లయింది. అయితే, ఇలాంటి ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాటిల్లో సాధకబాధకాలు గురించి ముందుగా తెలుసుకోవడం అవసరం. వాటి గురించి తెలియజేసేదే ఈ కథనం. స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దగ్గర ట్రస్టుల కింద రీట్స్ నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇవి ఇనీషియల్ ఆఫర్ల ద్వారా నిధులు సమీకరిస్తాయి. నిధులకు ప్రతిగా యూనిట్లను కేటాయిస్తాయి. ఇవి స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టవుతాయి. ఇక ఇనీషియల్ ఆఫర్ల ద్వారా సమీకరించిన నిధులను ఉపయోగించి తక్షణమే అద్దెకు ఇచ్చేందుకు వీలున్న ప్రాపర్టీలను రీట్స్ కొంటాయి. సదరు ప్రాపర్టీలపై రీట్స్ అద్దె రూపంలో ఆదాయం పొందుతాయి. ఆ ప్రయోజనాలను ఇన్వెస్టర్లకు బదలాయిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ తరహాలోనే కనిపించినా.. రీట్స్, ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే సాధనాలు వేర్వేరుగా ఉంటాయి. ఫండ్స్ ప్రధానంగా స్టాక్స్, డెట్ మొదలైన వాటిలో ఇన్వెస్ట్ చేస్తే, రీట్స్ ప్రధానంగా కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఫండ్ విషయానికొస్తే.. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పోర్ట్‌ఫోలియోలో స్టాక్లను మార్చుకునే వెసులుబాటు ఫండ్ మేనేజర్లకు ఉంటుంది. అయితే, రీట్స్కి ఇలాంటి వెసులుబాటు ఉండదు. నిబంధనల ప్రకారం ఇవి కచ్చితంగా కమర్షియల్ రియల్ ఎస్టేట్‌పైనే ఇన్వెస్ట్ చేయాలి. ఇవి దీర్ఘకాలికమైనవి కావడంతో పాటు లావాదేవీల సంఖ్యపై పరిమితులు ఉంటాయి. అలాగే, సెబీ నిబంధనల ప్రకారం రీట్స్ సమీకరించిన మొత్తం నిధిలో దాదాపు 90 శాతాన్ని అప్పటికే నిర్మాణం పూర్తయిపోయి, ఆదాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్న ప్రాపర్టీల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. రీట్స్‌లో చేసే ఇన్వెస్ట్మెంట్కి లాకిన్ వ్యవధి ఉంటుంది. గడువు తీరిన తర్వాత .. వచ్చిన రాబడిని ఇన్వెస్టర్లకు రీట్స్ పంచుతాయి. ఉదాహరణకు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టు.. ఒక పదేళ్ల వ్యవధికి ఇన్వెస్ట్ చేసిందనుకుందాం. ఆ పదేళ్లు గడిచిన తర్వాత సదరు ప్రాపర్టీని విక్రయించి, వచ్చిన మొత్తాన్ని ఇన్వెస్టర్లకు అందజేస్తాయి. సాధారణంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీతో పోలిస్తే కమర్షియల్ ప్రాపర్టీపై వచ్చే అద్దె ఆదాయాలు ఎక్కువగానే ఉంటాయి. కనుక సక్రమమైన నిర్వహణ ఉంటే రీట్ ద్వారా మెరుగైన రాబడే అందుకోవచ్చు. అయితే, రీట్స్‌లో ఇన్వెస్ట్ చేయదల్చుకున్న వారు వీటిలో పెట్టుబడి దీర్ఘకాలం పాటు లాకిన్ అయి ఉంటుందని గుర్తుంచుకోవాలి. పెట్టుబడుల్లో వైవిధ్యం కోసం రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఈ రిస్క్‌కు సిద్ధపడితే ఈ సాధనాన్ని ఎంచుకోవచ్చు.